kcrపేద మైనారిటీ వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి సామాజిక, ఆర్ధికాభివృధ్ధికి, విద్యాభివృధ్ధికి ప్రభుత్వం చేయవలసినదంతా చేస్తోంది. మైనారిటీ వర్గాల అభివధ్ధికి ప్రభుత్వం చిత్తశుధ్ధితో కషి చేస్తోంది. 2016-17 బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి 1204 కోట్ల రూపాయలు కేటాయించారు.

గురుకుల పాఠశాలలు :

తెలంగాణలోని పేద అల్పసంఖ్యాక కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్య నందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. పేద మైనారిటీ వర్గాల బాలలకు చదువు చెప్పించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 71 గురుకుల పాఠశాలలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరు గురుకుల ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 39 గురుకుల పాఠశాలలు బాలురకు, 32 బాలికల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ”ప్రతి చిన్నారి చదువుకోవాలి, ప్రతి ఇల్లు ప్రగతి సాధించాలి” నినాదంతో ఈ పాఠశాలలు పని చేస్తున్నాయి. ఇందులో మైనారిటీ వర్గాల చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యనందిస్తున్నారు. గురుకులాల్లో చదువు తున్న ఒక్కో విద్యార్ధికి ఉచిత విద్య, వసతి, ఆహారం, వైద్య సేవలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్ధికి ప్రతి ఏటా 80 వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. మైనారిటీ బాలికలకు ప్రత్యేక శ్రధ్ధతో సురక్షిత వాతావరణంతో కూడిన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఉర్దూ భాషా బోధన తో పాటు నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య (దీనియాత్‌) బోధిస్తున్నారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గత ఏడాది 140 కోట్ల రూపాయలతో 10 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృధ్ధికి తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టి.ఏం.ఆర్‌.ఇ.ఐ.ఎస్‌)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వయం ప్రతిపత్తి గల ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రం లోని ప్రతి శాసనసభ నియోజక వర్గం పరిధిలో ఒకటి చొప్పున 120 పాఠశాలలు నెలకొల్పనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబాటు తనంతో వున్న అల్ప సంఖ్యాక వర్గాల బాలబాలికలు ప్రభుత్వ వుద్యోగాల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు వీలుగా వారికి వత్తి విద్యా కోర్సు లలో నాణ్యమైన ఉచిత విద్య నందించాలనే లక్ష్యంతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. అయిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యనందించే ఒక్కో మైనారిటీ గురుకుల పాఠశాలలో 640 మంది విద్యార్థులకు ఉచిత విద్య లభిస్తోంది. ఇందులో 75శాతం సీట్లు అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు, 25శాతం సీట్లు ఇతరులకు కేటాయిస్తున్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో 5, 6, 7 తరగతులలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులనుంచి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించి చేర్చుకుంటున్నారు. మైనారిటీ విద్యార్థులకు గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గత బడ్జెట్‌ లో 91 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఉపాధి అవకాశాలు

తెలంగాణలో మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆర్థికంగా వారి పరిస్థితులు మెరుగుపరచి, జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ, రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీల) ఆర్థిక సంస్థ ద్వారా బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందుకు అవసరమైన రాయితీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యాభివద్ధికి ఉచితంగా పారిశ్రామిక శిక్షణనిప్పించి చిన్న పరిశ్రమలు, వివిధ రకాల సేవలు, వ్యాపారాలను వారు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఐ సి ఐ సి ఐ అకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నందిస్తున్నారు. సాఫ్ట్‌ స్కిల్స్‌, పారా మెడికల్‌ కోర్సులు, ప్రీ-ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణా కాలంలో స్టైపెండ్‌ నందిస్తున్నారు. వారు స్థాపించిన చిన్న పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేలా తోడ్పాటు నందిస్తున్నారు. మైనారిటీ వర్గాల ప్రజలు తమ సొంత కాళ్ళపై నిలబడి దేశాభివధ్ధి లో భాగస్వాములయ్యేలా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొం దించడానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎంతో దోహద పడుతున్నాయి.

షాదీ ముబారక్‌

రాష్ట్రం లో నిరుపేద ముస్లింలు, క్రైస్తవుల కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఉచితంగా రూ.51,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. ”షాదీ ముబారక్‌” పథకం కింద అమలు చేస్తున్న ఈ కార్యక్రమం తో పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాష్ట్రంలో ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వేలాది మంది నిరుపేద మైనార్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోంది.

విదేశాల్లో ఉన్నత విద్యకు

మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆర్థిక స్తోమత లేని కారణంగా విదేశాల్లో ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ”మైనారిటీలకు విదేశాల్లో విద్య” పథకం కింద ప్రభుత్వం గత ఏడాది రూ. 25 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో 250 మంది ప్రతిభావంతులయిన పేద మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్‌, ఎంబిఏ, పిహెచ్‌డి వంటి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డాక్టరేట్‌ డిగ్రీలు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్ధికి ఉచితంగా 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మరో 5 లక్షల రూపాయలు బ్యాంకుల నుండి రుణం పొందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.

ఫాస్ట్‌ పథకం

ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల్లో ఇంజినీరింగ్‌, ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఎంబిఏ తదితర ఉన్నత చదువులు అభ్యసించేలా మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ”ఫాస్ట్‌” పథకం ఆర్‌టీఎఫ్‌ కింద ప్రభుత్వం ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని వారికి రీఇంబర్స్‌ మెంటు చేస్తున్నది. ఈ పథకం కింద గత ఏడాది బడ్జెట్‌లో 425 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో లక్షా 50 వేల మంది విద్యార్థులకు 164 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజుల నిర్వహణ పథకం ఎం టీ ఎఫ్‌ కింద బడ్జెట్‌ లో వంద కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 36 కోట్ల 54 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఈ ఏడాది ఆర్‌టీఎఫ్‌, ఎంటీఎఫ్‌ పథకాల కింద సుమారు లక్ష మంది మైనారిటీ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

మైనారిటీ విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ 1, గ్రూప్‌2, సర్వీసుల్లో ఉద్యోగాలు సాధించడానికి పోటీ పరీక్షలకు సన్నధ్ధమయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం స్టడీ సర్కిళ్ళలో శిక్షణ కోసం ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది.

ఉర్దూఘర్‌ /షాదీఖానాల నిర్మాణం:

ముస్లిం మైనారిటీల భాషా, సంస్కృతుల పరిరక్షణ వాటి అభివృధ్ధికి ప్రభుత్వం చిత్తశుధ్ధితో కృషి చేస్తోంది. ఉర్దూ భాషాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రాముఖ్యతనిచ్చి అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ భాషను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా వున్న ఉర్దూ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉర్దూ అకాడమీ ద్వారా కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మైనారిటీ విద్యార్థులకు శిక్షణ నిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉర్దూ ఘర్‌/ షాదీ ఖానాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌ లో 10కోట్ల రూపాయలు కేటాయించింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయం ‘జామియా నిజామియా’ ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం 9 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించింది. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం లో ఇస్లాంకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాల పై విద్యార్థులకు బోధిస్తున్నారు.

వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ

రాష్ట్రం లో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వక్ఫ్‌ సంస్థల రెండవ సర్వే కోసం ప్రభుత్వం కమిషనర్‌ను నియమించింది. ముస్లింలకు చెందిన వక్ఫ్‌సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌ లో 53 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 32 కోట్ల 12 లక్షల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రం లోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మవుజమ్‌లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం అందిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని 550 మసీదులకు చెందిన ఇమామ్‌లు, మవుజమ్‌లు ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన 9 జిల్లాల్లో అన్నీ మసీదులకు కూడా దశల వారీగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదును ప్రభుత్వం కోటి రూపాయల వ్యయంతో పునర్నిర్మించనున్నది. రాష్ట్రం లో వివిధ మసీదులు, ఈద్గాల మరమ్మతులకు ప్రభుత్వం జిల్లాకు 50 లక్షల రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయలు కేటాయించింది. అరబ్బీ భాషలో వున్న ప్రాచీన, పురాతన గ్రంధాలు శిధిలావస్థకు చేరడంతో ప్రభుత్వం వాటి పునరుధ్ధరణ, పరిరక్షణపై దృష్టి సారించింది. ”దాయిరాతుల్‌ మారిఫ్‌” కార్యక్రమం కింద రెండు కోట్ల రూపాయలు కేటాయించారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు ‘ఇఫ్తార్‌’ విందు ఏర్పాటు చేస్తున్నారు. పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు, పండుగకు కొత్త దుస్తులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. హజ్‌ యాత్రకు వెళ్ళే ముస్లింల సౌకర్యాల కోసం రాష్ట్ర హజ్‌ కమిటీకి గత ఏడాది రెండు కోట్ల రూపాయలు కేటాయించారు.

ఉపకార వేతనాలు:

మైనారిటీ విద్యార్థులకు కేంద్రం అమలు చేస్తున్న ఉపకార వేతనాల పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్నారు. ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌ ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నారు. 6నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఏడాదికి రూ.600 చొప్పున, 9,10 తరగతుల వారికి ఏడాదికి రూ.8 వందల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రి-మెట్రిక్‌ ఉపకార వేతనాలకు గత ఏడాది రూ. 255 కోట్లు కేటాయించారు. పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు వంద కోట్ల రూపాయలు కేటాయించారు. పోస్ట్‌ మెట్రిక్‌, ఉపకార వేతనాల కింద పేద విద్యార్థులకు ఉన్నత విద్య, సాంకేతిక విద్యనభ్యసించేలా ప్రోత్సహించడానికి వారికి ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందిస్తోంది. దీనికి తోడు, మెరిట్‌-కం-మీన్స్‌ ఆధారిత ఉపకార వేతనాల పంపిణీ పథకం కింద ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి వంటి జాతీయ స్థాయి వున్నత విద్యా సంస్థల్లో చదువుతున్న పేద మైనారిటీ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు మొత్తం రీ ఇంబర్స్‌ మెంటు చేస్తున్నారు. ఇలా, హాస్టల్‌ విద్యార్థులకు నిర్వహణ ఖర్చులు, ట్యూషన్‌ ఫీజు కింద ఏడాదికి 30 వేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం కింద మైనారిటీల సంక్షేమానికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోంది.

కమీషన్‌ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల సామాజిక, ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమీషన్‌ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జి.సుధీర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమీషన్‌ను వివిధ జిల్లాలలో పర్యటించి ముస్లింల పరిస్థితులపై అధ్యయనం చేస్తోంది. ఇందు కోసం బడ్జెట్‌లో 3 కోట్ల 78 లక్షల రూపాయలు కేటాయించారు.

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీల ఆర్థిక సంస్థ

తెలంగాణ రాష్ట్రంలో క్రిష్టియన్‌ మైనారిటీల సామాజిక, ఆర్ధికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీల ఆర్థిక సంస్థ’ ను ఏర్పాటు చేసింది. నిరుపేద క్రైస్తవుల సామాజిక ఆర్ధికాభివృధ్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, వారికి శిక్షణనిప్పించి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యాపారాలు నిర్వహించడానికి రాయితీ పై ఆర్థిక సహకారం అందిస్తున్నారు. స్వయం ఉపాధి పొందేలా ప్రోత్స హిస్తున్నారు. వివిధ చర్చిల ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు, హాస్టళ్లు, అనాధాశ్రమాలు, ఆసుపత్రులు,సామాజిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. న్యాయ శాస్త్రంలో పట్టభద్రులై నిరుద్యోగులుగా వున్న వారికి ”అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌” పథకం కింద సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందు కోసం గత ఏడాది బడ్జెట్‌లో 3 కోట్ల రూపాయలు కేటాయించారు. క్రైస్తవులకు చెందిన శ్మశానాల పరిరక్షణ, వాటి మరమ్మతులకు ప్రాధాన్యతనిస్తున్నారు.

క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం

రాష్ట్రంలో క్రైస్తవుల సామాజిక, ఆర్థిక, సాంస్కతిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందుకోసం హైద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లిలో ‘క్రిస్టియన్‌ భవన్‌’ నిర్మాణానికి ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు పవిత్ర జెరూసలెం పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి రాయితీ కల్పిస్తున్నారు. ప్రతి ఏటా క్రిస్ట్‌మస్‌ సందర్భంగా ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు క్రిస్ట్‌మస్‌ విందు ‘ఫీస్ట్‌’ ఏర్పాటు చేస్తోంది. విశిష్ట సేవలందించిన క్రైస్తవ ప్రముఖులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా సత్కరిస్తున్నది. రాష్ట్రంలోని ఆంగ్లో ఇండియన్‌ ల సంక్షేమం కోసం ప్రతి ఏటా ‘ఆంగ్లో ఇండియన్‌ డే’ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధులు జైనులు పార్శీలు తదితర మైనారిటీ వర్గాల ప్రజల సంక్షేమం, ఆర్ధికాభివృధ్ధికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మైనారిటీలు సద్వినియోగం చేసు కొని అన్ని రంగాల్లో అభివృధ్ధి చెందుతున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీ, సామాజిక పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాల ఫలాలు మైనారిటీలకు కూడా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృధ్ధికి ప్రభుత్వం కృషి చేస్తూ బంగారు తెలంగాణ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Other Updates