kcr– సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ 

దేశంలోని ప్రజలందరికీ సత్వర న్యాయం లభించే విధంగా మనమందరం అంకితభావంతో కృషి చేయాలని సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి న్యాయసేవ ప్రాధికార సంస్థల 14వ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఆపన్నులకు న్యాయసేవతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలతో కేసుల సత్వర పరిష్కారం ఎజెండాతో న్యాయ సేవాధికార సంస్థలు ముందుకు వెళుతున్నాయన్నారు. దేశంలో సుమారు 30శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, వారికి తమ హక్కులు తెలిపేందుకు, ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలు అందేందుకు న్యాయ సేవా సంస్థలు శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న న్యాయాన్ని అన్ని వర్గాలకు అందించేందుకు న్యాయ సేవా సంస్థలు శ్రద్ధ చూపుతున్నాయన్నారు.

అయితే ఉచిత న్యాయసేవల నాణ్యతపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పారా లీగల్‌ వాలంటీర్లు, న్యాయవాదులకు శిక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మహిళల అక్రమ రవాణా, వికలాంగుల హక్కులు, చిన్నారుల హక్కులతో పాటు ఇతర పలు అంశాల పరిష్కారానికై న్యాయ సేవాధికార సంస్థలు తమ దృష్టి సారించడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రస్థుతం 46కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, అందులో 14కోట్ల మంది మహిళలు ఉన్నారని జస్టిస్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. వీరిలో అధికశాతం మంది హక్కులపై అవగాహన లేని వారేనని అన్నారు. వీరి హక్కుల సాధనకు న్యాయసేవాధికార సంస్థలు దృష్టి సారించాలన్నారు.

లోక్‌ అదాలత్‌లో 2.23 కోట్ల కేసులు పరిష్కారం 
దేశవ్యాప్తంగా గత ఏడాది లోక్‌ అదాలత్‌లలో 62 లక్షల పెండింగ్‌ కేసులు, 1.61 కోట్ల ప్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కారమైనట్లు జస్టిస్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ కేసులను న్యాయసేవాధికార సంస్థలు పరిష్కరించకుంటే ఆ భారం న్యాయస్థానాలపై పడేదన్నారు. ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

న్యాయ సేవాధికార కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు చేపడుతున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమన్నారు. వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంతో వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. రాజీమార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. రెగ్యులర్‌ కోర్టులు కాకుండా ప్రత్యామ్నాయంగా వివాదాల పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌లను ఎంచుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతాయని ఆయన హితవు పలికారు. పూర్వకాలంలో వివాదాలను పెద్దలు, మధ్యవర్తులే పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఆ దిశగా లోక్‌ అదాలత్‌ల వైపు ప్రజలు మొగ్గు చూపాలని కోరారు. 14వ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ జాతీయ సదస్సు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినందుకు చీఫ్‌ జస్టిస్‌ టీ.ఎస్‌.ఠాకూర్‌, జస్టిస్‌ దవేకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలపై దృష్టి సారించాలి: సదానందగౌడ 
న్యాయసేవా సంస్థలు జైళ్ళలో మగ్గుతున్న ట్రయల్‌, అండర్‌ ట్రయల్‌ ఖైదీలపై దృష్టి సారించాలని కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానందగౌడ అన్నారు. సరైన న్యాయ సేవలు అందకపోవడంతో మూడింట రెండొంతుల మంది అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా మగ్గిపోతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 1382 జైళ్ళలో ఖైదీలు అమానవీయ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. గత ఏడాదిలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ల ద్వారా 3.64 లక్షల బ్యాంకింగ్‌ కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.

న్యాయ సేవాధికార సంస్థల నిమిత్తం ఈ ఏడాది రూ. 140 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భోంస్లే తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వెబ్‌సైట్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీల మొబైల్‌ యాప్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ప్రారంభించారు. న్యాయ సేవాధికార సంస్థలు ప్రచురించిన ప్రచురణలను ముఖ్యమంత్రి కేసీఆర్‌, జస్టిస్‌ ఏఆర్‌ దవే, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ దిలీప్‌ బీ భోస్లే ఆవిష్కరించారు.

Other Updates