ts24

తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ సమగ్రాభివృద్ధికోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి కరీంనగర్‌ గేట్‌ వేగా ఉంటున్నదని సీఎం అన్నారు. ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ పునరుద్దరణతో పాటు కొత్తగా వస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో 4,300 మెగావాట్లు ఉత్పత్తి చేసే అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌గా రామగుండం ఎన్‌.టి.పి.సి. మారుతుందని అలాంటి రామగుండానికి కూడా కరీంనగర్‌ ముఖద్వారంగా ఉందని సీఎం అన్నారు.

అటవీ అందాలు, ప్రకృతి సౌందర్యాలు, గోదావరి నదిని చూడాలంటే కూడా కరీంనగర్‌ నుంచే వెళ్లాలని, ఇంతటి ప్రాముఖ్యం, ప్రాధాన్యం కలిగిన కరీంనగర్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ సుందరీకరణ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 506 కోట్లలో రూ. 25 కోట్లను విడుదల చేశారు.

కరీంనగర్‌ అభివృద్ధిపై ప్రగతి భవన్లో మే 17న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, ఎంపి బి. వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ శ్రీమతి తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి. సింగ్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, మున్సిపల్‌ కమీషనర్‌ శశాంక్‌, నగర పోలీస్‌ కమీషనర్‌ కమలాసన్‌ రెడ్డి, సిఎంఓ అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కరీంనగర్‌ నగరాన్ని సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తతం గా చర్చించారు. అంతకుముందు మానేరు డ్యామ్‌, మానేరు రివర్‌ ఫ్రంట్‌ను అందంగా తీర్చిదిద్దడంపై నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి మరిన్ని నిర్ణయాలు ప్రకటించారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

శ్రీ కరీంనగర్‌కు అభివృద్ధి ప్రణాళిక రచించి, అమలు చేసేందుకు శాతవాహన అర్బన్‌ డెవలంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తారు. కరీంనగర్‌తో పాటు అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీస్‌ కమీషనరేట్లున్న అన్ని పట్టణాల్లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేస్తారు

శ్రీ నగరంలో ఏఏ రంగంలో పరిస్థితి ఎలా ఉంది? ఏమి చేయాలనే విషయంలో అధ్యయనం చేయాలని మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌కు ఆదేశం. కరీంనగర్‌ నగరాన్ని మొత్తంగా మ్యాప్‌ చేసి, ఎక్కడేమి ఉండాలనే విషయంలో బ్లూ ప్రింట్‌ తయారు చేయాలి.

శ్రీ 90 కిలోమీటర్ల పొడవుండే మానేరు రివర్‌ ఫ్రంట్‌ను ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌ నగరానికి మరో సుందర ప్రదేశాన్ని జతచేస్తాం. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్‌ స్పోర్స్ట్‌ , బోటింగ్‌ ఏర్పాటు చేస్తాం. నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండే నివాస గహాలను నిర్మిస్తాం. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. దీనికోసం బడ్జెట్లో రూ.506 కోట్లు కేటాయించాం. ప్రాథమిక పనుల కోసం ఇవాళే రూ.25 కోట్లు విడుదల చేస్తున్నాం. పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. రివర్‌ ఫ్రంట్‌ను మొదట చేగుర్తి లింగాపూర్‌ వరకు, రెండో దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిస్తాం. నదికి ఇరువైపులా అందమైన చెట్లు పెంచాలి. సిల్వర్‌ ఓక్‌, పగోడా, మహాగని లాంటి పొడవుగా పెరిగే మొక్కలు నాటాలి.

శ్రీ పదిన్నర కిలోమీటర్ల పొడవున్న ఎల్‌ఎండి కట్టపై కూడా విరివిగా చెట్లు పెంచుతాం. డ్యామ్‌ మీద టూరిస్టు స్పాట్‌, వ్యూ పాయింట్‌, రెస్టారెంట్‌, బోటింగ్‌ ఏర్పాటు చేస్తాం. కాటేజీలు నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 25 కోట్ల రూపాయలు జత చేసి మొత్తం 40 కోట్ల వ్యయంతో మానేరుడ్యామ్‌ సుందరీకరణపనులు చేస్తాం.

శ్రీ కరీంనగర్‌ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చాలి. మానేరు నుంచి అలుగునూరు బ్రిడ్జి వరకు సర్కారు తుమ్మ చెట్లను, లొట్టపీసు చెట్లను వెంటనే తొలగించాలి. నగరంలో మొత్తం పిచ్చిచెట్లను తొలగించాలి

శ్రీ నగరంలో పచ్చదనం పెంచేందుకు విరివిగా మ్కొలు పెంచుతాం. స్పెషల్‌ డ్రైవ్‌ కింద నగరంలో దాదాపు నాలుగైదు లక్షల మొక్కలు పెంచుతాం. ఈసారి హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కరీంనగర్‌లో ప్రారంభిస్తారు. అదే రోజు నగర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతారు. దీనికోసం కరీంనగర్‌ గ్రీన్‌ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తారు. నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం ఐఎఫ్‌ఎస్‌ అధికారి వి. ఆంజనేయులును ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నాం. నగరంలో హరితహారం కార్యక్రమానికి రూ.10 కోట్లు ఖర్చు చేస్తాం. పండ్ల చెట్లు, నీడ చెట్లు, పూల చెట్లు, అలంకరణ చెట్లు… అన్నింటిని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. కరీంనగర్‌కు అవసరమైన మొక్కలను అటవీశాఖ సిద్ధం చేయాలి. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ఏ మొక్కలు అవసరమో అభిప్రాయం సేకరించాలి.

శ్రీ కరీంనగర్‌ హరితహారం కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.10 కోట్లకు అదనంగా తాము కూడా నిధులు ఇస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చారు. ఎంపి వినోద్‌ కుమార్‌ రూ.50 లక్షలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్మ్షణ్‌ రావు రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మండలి ఛైౖర్మన్‌ స్వామిగౌడ్‌, చీఫ్‌ విప్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులు కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఖర్చు చేస్తామని చెప్పారు

శ్రీ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నగరంలో మరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట రోడ్ల వెడల్పు కార్యక్రమం నిర్వహించాలి. బస్సులు ఆగే చోట బస్‌ బేలు నిర్మించాలి. రోడ్లపై బస్సుల నిలిపే పద్దతికి స్వస్తి పలకాలి. దీనివల్ల ట్రాఫిక్‌ నియంత్రణ సులభమవుతుంది. బస్‌ బేల నిర్మాణంలో కార్పొరేట్‌ సంస్థలు, వ్యాపార సంస్థలను భాగస్వాములను చేయాలి.

శ్రీ నగరంలో కొత్తగా పోలీస్‌ కమీషనరేట్‌ ఏర్పాటు చేసినందున దానికోసం ప్రస్తుత పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా కార్యాలయం నిర్మిస్తాం. హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లే కరీనంగర్‌లో కూడా దానికి స్థాయికి తగిన విధంగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మిస్తాం. నగరంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్లు, పోలీసు కార్యాలయాలు నిర్మించాలి. దీనికోసం అవసరమైన స్థలాలను రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించాలి.

శ్రీ కరీంనగర్‌ను ఆనుకుని జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. ఇంకా మూడున్నర కిలోమీటర్ల లింక్‌ జతచేస్తే ఓఆర్‌ఆర్‌ ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలి.

శ్రీ మల్టి పర్పస్‌ స్కూల్‌ ప్రాంతంలో

విశాలమైన పార్కు నిర్మిస్తాం.

శ్రీ సర్కస్‌ గ్రౌండ్‌ను యధాతధంగా ఉంచి దాని చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు పెంచుతాం.

శ్రీ సిటిజన్‌ క్లబ్‌ను యధావిధిగా కొనసాగిస్తాం.

శ్రీ ప్రస్తుతం ఉన్న కళాభారతి ప్రదర్శనలకు అంత అనువుగా లేదు. హెలిప్యాడ్‌ కోసం వినియోగిస్తున్న పదె కరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్‌ కళాభారతి నిర్మిస్తాం. 500,1200 మంది సామర్థ్యంతో పట్టే విధంగా రెండు వేర్వేరు హాల్స్‌ నిర్మిస్తాం.

శ్రీ నగరంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం నాలుగు 33/11 కెవి సబ్‌ స్టేషన్లు మంజూరు చేశాం. వాటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ టవర్లు, స్తంభాలు తొలగించాలి. ఇండ్లపై నుంచి వెళ్లే లైన్లను సరిచేయాలి.

శ్రీ నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మించాలి. గజ్వేల్‌లో నిర్మించిన మాదిరిగా ఎసి సౌకర్యంతో పాటు పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో ఈ మార్కెట్లు నిర్వహించాలి. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించే ఐదు మార్కెట్ల కోసం మార్కెటింగ్‌ శాఖ రూ.5 కోట్లు, ఎస్డిఎఫ్‌ నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తారు.

శ్రీ నగరంలో నాలుగు చోట్ల ఖనన వాటికలు (బరేల్‌ గ్రౌండ్స్‌), మరో నాలుగు చోట్ల దహన వాటికలు (క్రెమెటోరియమ్స్‌) నిర్మించాలి. దీని కోసం వెంటనే స్థల సేకరణ జరపాలి.

శ్రీ నగరంలో చాలా చోట్ల పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మిస్తాం. దీనికోసం అనువైన స్థలాలను వెంటనే సేకరించాలి.

ts25

 

మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి

కరీంనగర్‌ ప్రత్యేకతను దృష్టిలో వుంచుకుని, నగరం సమీపంలోని మానేరు డ్యాం రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని, ఇది అత్యద్భుతంగా వుందని పర్యాటకులు భావించాలంటే అక్కడ రూపొందించాల్సిన వివిధ అంశాలపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్‌ సమీపంలోని వివిధ ప్రాంతాలకు పోవాల్సివచ్చినప్పుడు తప్పకుండా కరీంనగర్‌ను, సమీపంలోని రివర్‌ ఫ్రంటును చూసి పోయే విధంగా అక్కడ సదుపాయాలు, ఆకర్షణలు వుండాలని కూడా సీఎం అన్నారు. ”కరీంనగర్‌లో హైదరాబాద్‌ నగరంలోని పర్యాటక స్థలాల్లో కూడా లేని ఆకర్షణలుండాలి. హైదరాబాద్‌ వాసులు కూడా కరీంనగర్‌కు పోవాలన్న ఆసక్తి కలగాలి” అని ఆయన చెప్పారు.

ప్రగతిభవన్‌లో, మానేరు రివర్‌ ఫ్రంటు అభివృద్ధి మీద టాటా బృందానికి చెందిన షనేష్‌, సూర్యప్రకాష్‌లు సీఎంకు ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ఇతర అధికారులు ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. మానేర్‌ డ్యాంను ఒక పర్యాటక కేంద్రంగా, కరీంనగర్‌ పట్టణాన్ని ఒక టూరిస్ట్‌ హబ్‌ గా రూపొందించే ఉద్దేశంతో తామీ ప్రాజెక్టును రూపొందించామని టాటా గ్రూప్‌ ప్రతినిధులన్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌లో సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాలు చేపట్టవచ్చని వారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని వారన్నారు.

ప్రెజెంటేషన్‌ను చూసిన సీఎం, దేశంలోనే ప్రప్రథమ రివర్‌ ఫ్రంటుగా గుర్తింపు తెచ్చుకున్న సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడున్న ఆకర్షణలను, సదుపాయాలను మానేర్‌ డ్యాం వద్ద కూడా ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. ఈ నేపథ్యంలో మరొక్కసారి ప్రాజెక్టును పునః పరిశీలించి మరింత లోతుగా అధ్యయనం చేయమని సీఎం సూచించారు. కరీంనగర్‌కు వున్న పురాతన చరిత్ర, చెరగని తరగని ఆకర్షణలకు మానేర్‌ డ్యాం రివర్‌ ఫ్రంట్‌ అద్దం పట్టాలని సీఎం సూచించారు.

Other Updates