కొత్త ఏడాదిలో వర్షాలు కురుస్తాయా, కురవవా, పాడిపంటల పరిస్థితి ఏమిటి, ఆదాయవ్యయాలు ఎలావున్నాయని పంచాంగ శ్రవణం కోసం ఎదురు చూసిన వారికి శ్రవణానందకరమైన శుభఫలితాలు ఆనందాన్ని కల్గించాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సముదాయంలోని జనహితలో మార్చి 29 ఉదయం శ్రీ హేవళంబి నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది తెలంగాణకు అన్నీ మంచి శకునాలే గోచరిస్తున్నాయని పంచాంగ శ్రవణంలో వెల్లడి కావడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సహా సభికులంతా హర్షధ్వానాలు చేశారు.

తెలంగాణలో ఈసారి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పంచాంగ పఠనంచేసిన సిద్ధాంతి బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి తెలిపారు. రాష్ట్రంపై శుభగ్రహాల చల్లనిచూపు ఉందని, పరిపాలకులపై దైవానుగ్రహం వుందని, అందువల్ల రాష్ట్రం అన్నిరంగాలలో గతంలోకంటే మరింత ప్రగతిపథంలో దూసుకుపోతుందని చెప్పారు.

ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీర్చి దిద్దుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు విజయవంతం అవుతాయని, ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకూ మంచి వర్షాలు వుంటాయని చెప్పారు. ఆషాఢ మాసంలో తుపాన్లు వచ్చే ప్రమాదం వుంది. అయితే, హైదరాబాద్‌లో మాత్రం వాతావరణం బాగానే వుంటుందని, తుపాన్లు రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ప్రభావం చూపుతాయన్నారు.

సైన్యాధిపతి గురుడు అయినందున తీవ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం వున్నదని, శాంతిభద్రతలకు కొంత విఘాతం కలుగుతుందని, పోలీసు శాఖ అప్రమత్తంగా వుండాలని సిద్ధాంతి పేర్కొన్నారు. సాఫ్ట్‌ వేర్‌ రంగంలో, వైద్యరంగంలో ఒడిదుడుకులు వుంటాయన్నారు. అయితే, రాజులు మంచిపాలన సాగిస్తారన్నారు.

శని తృతీయ స్థానంలో ఉన్నాడని, ఫలితంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, చంద్రుని కృపవల్ల మాగాణి పంటలు బాగా పండుతాయని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని తెలిపారు.

ఆషాఢమాస ప్రారంభంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రతీ ఆలయంలో వరుణ జపం, విరాటపర్వ పారాయణాలు చేయిస్తే, వర్షాలకు సంబంధించి ఇంకా మంచి ఫలితాలుంటాయన్నారు. మొత్తంమీద చూస్తే తెలంగాణకు శుభ శకునాలే వున్నాయని, శుక్రుడు మంత్రి స్థానంలో వున్నందున ప్రజలు విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారని సిద్ధాంతి తెలిపారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాశి ప్రకారం కూడా ఆదాయం 14, ఖర్చు 11 గా వున్నదని చెప్పారు. దీనినిబట్టి రాష్ట్ర ఆదాయం కూడా బాగుంటుందని, ముఖ్యమంత్రి ఖ్యాతి, రాష్ట్ర వైభవం ఈ ఏడాది మరింతగా ఇనుమడిస్తాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులను, వివిధ ఆలయాలలోని అర్చక ప్రముఖులను ముఖ్యమంత్రి, వేదికనలంకరించిన మంత్రులు, తదితరులు ఘనంగా సన్మానించారు.

తొలుత ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి స్వాగత వచనాలు పలుకగా, చివరిలో భాషా, సౌస్కృతిక శాఖ సంచాల కులు మామిడి హరికృష్ణ వందన సమర్పణ చేశారు.

Other Updates