kcrమిన్ను విరిగి మన్ను మీదేం పడలేదు.

దన్ను లేక జనం చిన్నబోలేదు.

కారు చీకట్లు అసలే కమ్ముకోలేదు.

కారణ జన్ముల కాలజ్ఞానాలు ఫలించలేదు.

కరెంటు లేక రాష్ట్రం కష్టమేమీ పడలేదు.

కాసులు లేక ఎన్నడూ గోసపడలేదు.

అన్నల బూచి అస్సలు నిజం కాలేదు.

అశాంతి అభద్రత అగుపించ లేదు.

ఉగ్రవాదుల ఉనికి ఉత్పన్నవమలేదు.

పాత బస్తీకి స్థావరం ముద్రపడలేదు.

ప్రాంతీయ యుద్ధాలు ప్రభవించలేదు.

భాగ్యనగరిని వీడి వలసలు పోలేదు.

ప్రముఖ కంపెనీలేవీ పక్కదోవన పోలేదు.

ఉపాధి సమస్యలు ఉబికిరాలేదు.

జల యుద్ధాలు ఎక్కడా జరగ లేదు.

సజల నయనాలు కూడా కనిపించలేదు.

పాలన రాక మనం పరిహాసమవలేదు!

ప్రజా బాహుళ్యమేమీ పరితాపపడలేదు!!

కొందరు అనుకున్నట్టు, మరికొందరు అనుమానించినట్టు, అవ్వాలని ఇంకొందరు ఆకాంక్షించినట్టు ఏదీ జరగలేదు. భారతదేశంలో సరికొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్లు దిగ్విజయంగా గడుస్తున్నాయి.

ఆపదలేవీ రాలేదు. ఉత్పాతాలేవీ ఉద్భవించలేదు. పేద్ద సంక్షోభాలేవీ సవాల్‌ విసరలేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించేవారు ఆశించినట్లు కొత్త రాష్ట్రంలో ఉద్యమ అరాచకత్వమేదీ ఊపిరి పోసుకోలేదు. ఉద్యోగ ధిక్కారాలు వినిపించలేదు.

అవినీతి లేదు. అవకతవక పని అస్సలు లేదు. అక్రమాలు ఆనుపాను లేదు. పైరవీకారుల పరేషాన్‌ లేదు. కుంభకోణాల జాడే లేదు. పాపం! కొందరు కోరుకున్నట్టు, మనసారా మననం చేసుకున్నట్టు, తెలంగాణ మాయమైపోలేదు. అన్యాయమైపోలేదు. ఆగమైపోలేదు. కొత్త రాష్ట్రం కోటి కష్టాల్లో కూరుకుపోలేదు. సరికదా…

రెండేళ్ల పసి కూన.. పలు వినూత్న పథకాలతో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమైంది. దేశానికే ఆదర్శంగా మారింది. రాష్ట్రపతి మొదలు ప్రధాని వరకు ప్రశంసలు పొందుతోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఆసక్తి రేకెత్తించి, ఆహ్వానాల పరంపర అందుకుంటోంది. నవ యువ రాష్ట్రం తెలంగాణను చూసి ఇవాళ యావద్దేశం ఆశ్చర్యపోతోందంటే అతిశయోక్తి కాదు. కారణం… ఉద్యమ పార్టీయే పాలనకు ఊపిరిగా మారడం.. ఉద్దండపిండాలైన ఉద్యమ నిబద్ధులైన నేతలే ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం… అన్నింటికీ మించి, తెలంగాణలోని అణువణువూ, కణకణమూ, జన గణమూ, ప్రతి మనమూ తెలిసిన ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం!!

ఈ రెండేళ్ల తెలంగాణ పయనం.. ప్రస్థాన త్రయంతో సమానం. నిశితంగా పరిశీలిస్తే ‘తెలంగాణ రీ డిజైనింగ్‌ (పునర్నిర్మాణం)’ మూడు మార్గాల్లో సాగుతున్నట్టు గుర్తించవచ్చు. 1. దశాబ్దాల వలస పాలన వారసత్వంగా వచ్చిన లోపాలను సరిదిద్దడం 2. తెలంగాణ అవసరాల మేరకు ప్రత్యేక దృష్టితో కొత్త పథకాలు, కార్యక్రమాలను రూపొందించుకోవడం. 3. ప్రభుత్వ దృక్పథాన్ని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలుగా వింగడించడం.

1. లోపాల దిద్దుబాటు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు స్థలాల ఎంపిక మొదలుకొని, నిర్మాణ శైలిదాకా ఉమ్మడి రాష్ట్రంలో అనేక పొరపాట్లు జరిగాయి. వీటిలో అనేకం ఉద్దేశపూర్వకంగానూ, మరికొన్ని అనాలోచితంగానూ జరిగినవి. గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణలో, నీళ్లు, నీటి వాటాలు అధికంగా లేని, భవిష్యత్తులో అసలే నీళ్లు రాని కృష్ణానదికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాజకీయ అవసరాలు, స్థానిక నేతల డిమాండ్లు, ముడుపులపై ఆశలతో పలు పేరుగొప్ప ప్రాజెక్టులను ప్రారంభించారు. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే వీటన్నింటిపై పునస్సమీక్ష మొదలుపెట్టారు. జీవ నది గోదావరియే తెలంగాణ జీవనాడి అని గుర్తించి, దాన్ని కేంద్రకంగా చేసుకుని ప్రాజెక్టుల్ని రీ డిజైన్‌ చేశారు. తెలంగాణ నేలలోని ప్రతి చోటునీ కనీసం ఒకటికంటే ఎక్కువసార్లు సందర్శించిన కేసీఆర్‌కు ఎక్కడేముందో, ఎక్కడేం చేయాలో స్పష్టంగా అవగాహన ఏర్పడింది. ఉద్యమంలో భాగంగా తెలంగాణకు జరిగిన నష్టాలపై ఆయన ఔపోసన పట్టారు. ఇది రీ డిజైనింగ్‌కి ఎంతో ఉపయోగపడింది. అందువల్లే ఆయన ఒక నిపుణుడైన టెక్నీషియన్‌ మాదిరిగా అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వగలిగారు. ప్రాజెక్టు స్థలాలను మార్చారు. రిజర్వాయర్ల పరిమాణాలను పెంచారు. భూ సేకరణ వల్ల ఇబ్బంది కలగకుండా కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. రైతులకు నష్టం జరగకుండా పరిహారాలను పెంచారు. లోపభూయిష్టమైన ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిని తీసివేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్దిష్ట కాలపరిమితి విధించారు. కొత్తగా ఇంజనీర్లను నియమించారు. సమర్థుడైన మంత్రికి, సలహాదారుకి, అధికారులకు బాధ్యతలు అప్పగించారు. మొదట్లో విమర్శలు చేసిన విపక్షాల వారు కేసీఆర్‌ రీ డిజైనింగ్‌కి ప్రత్యామ్నాయం చూపించలేక పోవడానికి కారణం ఇదే. ఒక్క సాగునీటి ప్రాజెక్టులే కాదు; ఇతరత్రా కూడా తెలంగాణకు అక్కర్లేని అనేక పథకాలను కేసీఆర్‌ తొలగించారు. ఇక్కడి ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలను ప్రభుత్వ ప్రాధాన్యాల జాబితాకు జోడించారు. తద్వారా పాలనకు తెలంగాణ రూపం, భావం ఏర్పడింది.

2. మన పథకాల రూపకల్పన

దాదాపు 20 ఏళ్ల క్రితం మన వాగుల్లో చెలమ తోడితే నీళ్లు ఊరేవి. అంటే అడుగు, అడుగున్నర లోతులో నీళ్లుండేవి. 20 ఏళ్లలో భూగర్భ జలం వందల అడుగుల లోతుకు పోయింది. సాగునీటికి కాదు; తాగు నీటికే కటకటలాడాల్సిన పరిస్థితి. దాదాపు ప్రతి ఊర్లో వాటర్‌ప్లాంట్లు ఏర్పాటై తాగునీటి వ్యాపారాలు మొదలయ్యాయి. ప్రైవేటు గుప్పిట్లో కోట్ల రూపాయల బిజినెస్‌. అయినా జనానికి కష్టాలు, కలుషిత నీరే! కృష్ణా నది పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌తో వంకర్లు తిరిగిపోగా… మున్ముందు మొత్తం తెలంగాణకు అదే ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కేసీఆర్‌, వాటర్‌గ్రిడ్‌ పేరుతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మరోవైపు భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్‌ కాకతీయను చేపట్టారు. వన్‌టైం ఇన్వెస్ట్‌మెంట్‌తో దీర్ఘకాలిక, శాశ్వత ఫలితాలను అందించే ఈ రెండు ప్రాజెక్టులు యావద్దేశానికి ఆదర్శప్రాయంగా మారాయి. పలు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాయి. షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు, పింఛన్ల పెంపు, అన్ని వర్గాలకూ సన్న బియ్యం, రేషన్‌ బియ్యం పెంపు, పాఠశాల విద్యా వ్యవస్థ ప్రక్షాళన, ఉపాధి తో కూడిన విద్యనందించే పథకాలు, బహుజన విద్యార్థులకు ఉచిత విద్య, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం పెంపు, కొత్తగా గురుకులాల ఏర్పాటు, ఇంజనీరింగ్‌ విద్యకు నైపుణ్యాల జోడింపు, భారీ ఖర్చుతో కూడుకున్న ప్రైవేటు విద్యకన్నా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను సంస్కరించడం, కేన్సర్‌ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, డయాలిసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. ఇలా ఎన్నో పథకాలను పేర్కొనవచ్చు. ఇవన్నీ కేవలం తెలంగాణ ప్రజల అవసరాలు, డిమాండ్ల మేరకు చేపట్టినవే. ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, విద్యా ఉపాధితో అభివృద్ధి చెందినప్పుడే అది రాజ్యాంగం ప్రవచించిన శ్రేయోరాజ్యమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన పథకాలన్నీ శ్రేయోరాజ్య స్థాపనకు ఉపకరించేవే.

3. ద్వివిధ లక్ష్యాలు

ప్రభుత్వ ప్రాథమ్యాలను నిర్దేశించుకోవడంలో కేసీఆర్‌ ప్రధానంగా మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకున్నట్టు కనిపిస్తుంది. 1. స్వల్పకాలిక, తక్షణ ప్రయోజనం 2. మధ్యకాలిక ఉపయోగాలు. 3. దీర్ఘకాలిక ప్రయోజనాలు. పింఛన్లు, ఉపకార వేతనాల పెంపు, ఆర్థిక ప్రయోజనాల కల్పన వంటి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలను వెంటనే ఆదుకోవడానికి పనికివస్తున్నాయి. తమ రాష్ట్రంలో తమను పట్టించుకునే ప్రభుత్వం ఏర్పడిందనే భరోసాను కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఇది జరిగిపోయింది. ఇక ఇంటింటికీ తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్‌, భూగర్భ జలాలను పెంచే చెరువుల పూడిక తీత, విద్యా వ్యవస్థ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలను నిరోధించడం, కొత్త జిల్లాల, మండలాల ఏర్పాటు, అన్ని ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి వంటివి మధ్యకాలిక (కొన్నేళ్లలోనే) ప్రయోజనాలను అందించబోతున్నాయి. తొలి ఐదేళ్లలోనే ఈ పథకాల ఫలితాలను ప్రజలు రుచిచూడనున్నారు. ప్రభుత్వ పనితీరులో వేగానికి, కచ్చితత్వానికి, లోటుపాట్ల సవరణకు కూడా ఈ పథకాలు దర్పణంలా నిలవనున్నాయి. సర్కారు పరిపాలన తీరుతెన్నులపై ప్రజలు ఒక అవగాహనకు, అంచనాకు రావడానికి ఇవి ప్రాతిపదికల్లా ఉపయోగపడనున్నాయి. ఇక ప్రాజెక్టుల రీడిజైనింగ్‌, తెలంగాణ ఆయకట్టును పెంచడం, భూ కమతాలను పెంచడం ద్వారా వ్యవసాయాన్ని ఆధునికీకరించడం, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడం వంటివి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న దీర్ఘకాలిక పనులు. రైతు ఆత్మహత్యల కేంద్రంగా మారిన తెలంగాణను వాటి నుంచి విముక్తం చేయాలంటే వ్యవసాయాన్ని లాభసాటి చేయడం మినహా మరో మార్గం లేదు. చదువుకున్న యువత పెరుగుతున్న సమయంలో అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలంటే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచి, విశ్వనగరంగా మార్చి పరిశ్రమలను ఆకర్షించక తప్పదు. అయితే ఇవన్నీ వెన్వెంటనే చేయడానికి అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లేదు. అందుకే దీర్ఘకాలిక వ్యూహంతో కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు.

అర్థం చేసుకోరు!

ఎంతసేపూ రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ధ్యాసే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టని విపక్ష నేతలు, కేసీఆర్‌ వేసుకున్న ఈ ప్రణాళికను అర్థం చేసుకోలేక, తాము గందరగోళపడుతూ, తెలంగాణ ప్రజానీకాన్ని కూడా అయోమయంలో ముంచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే ఉద్యమ చైతన్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుకురికిన ప్రజానీకంలో తెలంగాణ అనుకూలతలు, అవసరాల పట్ల పూర్తిస్థాయి అవగాహన ఏర్పడింది. అందుకే వారు కేసీఆర్‌ అభివృద్ధి ప్రణాళికలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలో కంటే గత రెండేళ్లలో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో సానుకూలత బాగా పెరిగింది. ఈ రెండేళ్లలో జరిగిన అనేక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. పంచాయతీ ఎన్నికలు మొదలుకొని హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలదాకా, అసెంబ్లీ ఉప ఎన్నికలు మొదలుకుని పార్లమెంటు ఉప ఎన్నికల దాకా ఏది జరిగినా టీఆర్‌ఎస్‌దే విజయం. కేవలం గెలుపే కాదు; ఎక్కడ చూసినా సగానికిపైగా ఓట్లు సాధిస్తోంది. చివరికి గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు, సీట్లు వచ్చిన ఖమ్మం జిల్లాలో కూడా కేసీఆర్‌కు 55 శాతం మంది మద్దతు పలకడం గమనార్హం. దేశంలోనే ఇంతటి మద్దతు పొందుతున్న ముఖ్యమంత్రి మరొకరు లేరు. అందువల్లే తెలంగాణ అంతటా ఇప్పుడు ఒక నిబద్ధత. అద్భుతాలను వీక్షిస్తున్న ఆసక్తత. తప్పక మంచి జరుగుతుందన్న ఆశతో కూడి నిశ్శబ్దం. హడావుడి కనిపించని క్రమశిక్షణ.కనుసైగతోనే కట్టడిలో ఉంచగల, భయభక్తుల శ్రద్ధ!!

నా తెలంగాణ కోటి రతనాల వీణ..

కుట్రలను కుమ్మిపారేసే దమ్మున్న జాణ..

యువ మంత్రి హరీశ్‌ అభివర్ణించినట్టు…

నా తెలంగాణ

కోటి ఎకరాల మాగాణ..

Other Updates