magaపీరీల పండుగ వచ్చిందంటే ఊరందరికీ పండుగే. పీరీల పండుగ ముస్లీంలదన్నట్టేగాని పీరీలను పట్టుకొని దేవుడచ్చినట్లు ఎగురుడు దునుకుడు, ఇతర కుల మతస్తులే ఎక్కువ చేస్తరు. పీరీల పండుగ అంటే అదొక సాంస్కృతిక వాతావరణం వెల్లివిరిసినట్టు ఉంటది.

పీరీల లాల్చావులు అని అంటరు. తల్లి పీరి పెద్ద పీరి అని పేర్లు సుత ఉంటయి. ఊల్లె పెద్ద పెద్దోల్ల పేర్లతోని కూడా పీరీలు ఉంటయి. పీరీలు ఆఖరు రోజు ఊరేగుతాయి. పీరీలకు సాంబ్రాణి ఊదు పొగవేస్తారు. ఆ వాసనకే ఎత్తుకున్న వాల్లకు పూనకం వస్తది. పీరీల ఊరేగింపు ఊర్లల్ల అందరి ఇంటిముందు నుంచే పోతే వాటిని కుడుకలదండలు ఏస్తరు. మొక్కులు మొక్కుతరు. పీరీల పండుగ కూడా చాలా ఊర్లల్ల పెద్ద పండుగలా జరుపుతరు. ముస్లింలు తక్కువ ఉన్న ఊర్లల్ల సుత హిందువులే జరుపుతరు. మనుషుల మధ్య సాంస్కృతిక పండుగ ఆధ్యాత్మిక అనుబంధమే అంతటా కన్పిస్తది గానీ నీదో మతం నాదో మతం అనే రీతి ఆదినుంచి కన్పించదు. పల్లెలనుంచి వలసపోయినోల్లు కూడా ఈ పండుగకు ఇంటికి వస్తరు.

పీరీల పండుగ ఆఖరు రోజు అగ్గి గుండం ఉంటది. ఆ గుండం చుట్టూ అసోయ్‌ ధూలా.. అంటూ చేతులు కలుపుకుని లయబద్ధంగా ఆటలు ఆడుతాడుతరు. ఆ ఆటల పాటలు చూడడానికి ఊరోల్లు అక్కడికి వస్తరు. ఆ పాట ఎట్లా ఉంటదంటే..

”వాని పేరు గన్నెగాడు

లంబాడోడు గన్నేగాడు

వాడి పల్లె దోచినాడు

ఓడపైన ఎక్కెవాడు

కొండలాగ ఎదిగినాడు

మీర్సాలం చూసినాడు

మీసమే దువ్వినాడు

గూడెంలో పేల్చినాడు

గూడెంలో చేసినాడు

వాని పేరు గన్నేగాడు

పల్లెల్లో తిరిగినాడు

ప్రజల బాధ తెల్సినోడు

బందూకు పట్టినాడు బరిగీసి

నిల్చినాడు”

ఈ పాటలను ప్రజలు ఊర్లల్ల తరతరాలుగా పాడుకుంటున్నరు. ఈ పాటలకు రచయితలు ఎవరో తెలియదు. ఊర్లల్లకు వారసత్వంగనే పాటలు, కైతలు, సామెతలు, శాస్త్రాలు వస్తుంటాయి. అవి తాతనుంచి తండ్రికి, తండ్రినుంచి కొడుక్కు మౌఖికంగానే వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో వారసత్వగా కథలు, శాస్త్రాలు వస్తలేవు. పాతవి అన్నీ మోటు కిందికిపోయి కొత్తపోలగండ్లు వీటిని నేర్చుకుంటలేరు.

ఇంగ్లీష్‌ మీడియా చందువులవల్ల ఆ ట్వింకిల్‌ ట్వింకిల్‌ పాటల సందడి ఊరు నిండింది. దాంతో తెలంగాణ సాంస్కృతిక వికాసన పెంపొందించే ఆట పాటలు అందడం లేదు. ఇట్లనే పీరీల గుండం సుట్టు ‘అసోయ్‌ ధూలా.. అసోయ్‌ ధూలా..’ అనే ఆటపాట లయబద్ధంగా అద్భుతంగా ఆడుతారు.

ముందే చెప్పినట్లు ఇది మనదికాని పండుగ., ఇది మనది కానీ దేవుడు అనే ఆలోచనే రాదు. అసలు ఊర్లల్ల మస్తానయ్య, యాకూబ్‌రెడ్డి అనే పేర్లుకూడా ఉంటయి. అందరు తెలుగే మాట్లాడుతరు. కులవృత్తులు వేరు వేరుగా ఉంటాయి. పీరీల గుండంగల ఆట అద్దమ రాత్రి దాకా సాగుతది. అప్పటిదాకా డప్పుల మోత ఉంటది. పీరీల పండుగనే మొహర్రం అంటరు. ఇది ఒక నెల అరబ్బీల నెల పేరు. కర్బలా మైదానంలో అమరత్వం పొందిన రోజు.

తెలంగాణ పల్లెల్లో పీరీల పండుగ ఒక గంగాజమున తహజీబ్‌లా నడుస్తది.

అన్నవరం దేవేందర్‌

Other Updates