ts22

ఆశ వర్కర్లకు సీఎం వరాలు.. ఊహించనిరీతిలో వేతనం పెంపు

నెలకు కేవలం వెయ్యి, పదిహేను వందల రూపాయలు మాత్రమే పొందుతూ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు ఇకపై ప్రతీ నెలా రూ.6000 చెల్లిస్తామని, పెరిగిన పారితోషికం మే నెల నుంచే అందిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. ఇది మొదటి దశ పెంపు మాత్రమేనని, వచ్చే బడ్జెట్‌ సందర్భంగా మరోసారి ఆశ వర్కర్ల పారితోషికం పెంచి, వారిని అంగన్‌ వాడీ వర్కర్ల స్థాయికి తీసుకుపోతామని వెల్లడించారు..

విద్యార్హతలుండి, శిక్షణ పొందిన వారికి ఎ.ఎన్‌.ఎం. ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని , తెలంగాణ రాష్టంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆశ వర్కర్లను భాగస్వాములను చేస్తామని, వారికి కడుపునిండా జీతం ఇచ్చి ఆరోగ్య పరిరక్షకులుగా మారుస్తామని సిఎం స్పష్టం చేశారు. ఆశ వర్కర్లకు ఆరోగ్య సంబంధ విధులు తప్ప మరో పని చెప్పకుండా అధికారులను ఆదేశిస్తామన్నారు. ఆశ వర్కర్లను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసి, వారు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూస్తామన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు ప్రగతి భవన్‌కి వచ్చారు. వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, జనహితలో వారితో సమావేశమై,. వారి సాధక బాధకాలు స్వయంగా తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని రకాల వైద్య సేవల్లో తాము తలమునకలై పనిచేస్తున్నామని ఆశ వర్కర్లు చెప్పారు. కేవలం ఆరోగ్య సంబంధమైన పనులే కాకుండా, ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగస్వాములం అవుతున్నామని, అయినప్పటికీ తమకు నెలకు వెయ్యి, పదిహేను వందలు మాత్రమే వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి గత ప్రభుత్వాలకు తమ మొర వినిపించినా వారు తమ సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు.

అనంతరం ముఖ్యమంత్రి ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ”ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వారికో జాబ్‌ చార్ట్‌ కూడా లేదు. ఏ పని పడితే ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి వారి పనులు చేసుకుంటూ రోజులో గంటో రెండు గంటలో మాత్రమే పనిచేయడానికి ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో రోజంతా వారితో పనిచేయిస్తున్నారు. అయినా సరే వారికి కడుపు నిండా జీతం ఇవ్వడం లేదు. వారికి కేటాయించిన పని మాత్రమే కాకుండా ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. అలా చేసిన పనికి అదనపు పారితోషికం కూడా ఇవ్వడం లేదు. గత పాలకులు వీరి గురించి ఆలోచించలేదు. అంగన్‌ వాడీ వర్కర్ల విషయంలో కూడా ఇలాగే జరిగింది. వారికి రెండు దఫాలుగా జీతాలు పెంచి న్యాయం చేశాం. ఇప్పుడు ఆశ వర్కర్లకు కూడా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరిగే విధంగా జీతాలు పెంచుతాం. మొదటి దశలో ప్రతీ ఆశ వర్కర్‌ కు నెలకు రూ.6 వేలు అందేలా చేస్తాం. రెండో దశలో మరోసారి జీతాలు పెంచి అంగన్‌ వాడీ టీచర్ల స్థాయికి ఆశ వర్కర్లను తీసుకువస్తాం.” అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ts23
”ఆశ వర్కర్లలో విద్యార్హతలుండి, శిక్షణ పూర్తి చేసుకుని ఉన్న వారికి ఎ.ఎన్‌.ఎం. నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తాం. ఇతర కోర్సులు చేసిన వారుంటే వైద్య ఆరోగ్య శాఖలో దానికి సంబంధించిన ఉద్యోగాలిస్తాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ”ఆరోగ్య విషయాలపై ప్రజలకు అవగాహన లేదు. అనేక రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మిషన్‌ భగీరథ కార్యక్రమం అమలు చేస్తున్నం. తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం కేసీఆర్‌ కిట్స్‌ అందిస్తున్నాం. పేదరికం కారణంగా నిండు గర్భిణీలు కూడా కూలీ పనులకు వెళుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ బాధలు పోవాలనే ప్రసవానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

ఈ కార్యక్రమాలన్నింటిలో ఆశ వర్కర్లు భాగస్వాములు కావాలి. క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు ఆరోగ్య పరిరక్షులుగా మారాలి. సైనికులుగా పనిచేయాలి, ప్రతీ ఒక్కరు ఒక కేసీఆర్‌ కావాలి. మీ అందరి కడుపునిండా జీతం ఇచ్చే బాధ్యత నాది. ప్రజల ఆరోగ్యం బాధ్యత మీది” అని కేసీఆర్‌ చెప్పారు.

ఆశ వర్కర్లు ఏమి పనిచేయాలి? ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎవరెవరు ఏ పనిచేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సి. లక్ష్మారెడ్డి, టి. హరీష్‌ రావు, ఎంపి కవిత, ప్రభుత్వ సలహాదారు వివేకానంద, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌, ఎమ్మెల్సీ సలీమ్‌, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, కమిషనర్‌ వాకాటి కరుణ, సందీప్‌ సుల్తానియా, స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఆశ వర్కర్ల కృతజ్ఞతలు

తమకు అందించే పారితోషికాన్ని భారీ ఎత్తున పెంచడంతో ఆశ వర్కర్లు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయం ప్రకటించగానే, జనహిత జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. కేసీఆర్‌ తమ కష్టాలను చూసి తమ బాధలు పోగొట్టడానికి నిర్ణయం తీసుకున్నారని పలువురు ఆశ వర్కర్లు అన్నారు. టిఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌, అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. రాజేందర్‌ సిఎంకు కతజ్ఞతలు తెలిపారు.

Other Updates