pragathi-bhavanనూతనంగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికార నివాస గృహంలోకి నవంబరు 24న ఉదయం 5.22 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేశారు. వేదమంత్రాల నడుమ చిన్న జీయర్‌ స్వామి పర్యవేక్షణలో సతీసమేతంగా నూతన గృహంలోకి అడుగుపెట్టారు. దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గోవు ప్రవేశం, నివసించేవారి ప్రవేశం తదితర సాంప్రదాయ ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వాస్తు హోమం, సుదర్శన హోమం, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌, పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

అభివృద్ధికి దిక్సూచి ప్రగతి భవన్‌

తాను గృహప్రవేశం చేసిన ఇంటికి ‘ప్రగతిభవన్‌’ అని నామకరణం చేసినట్లు సీఎం తెలిపారు. గృహంలో ఉన్న సమావేశ మందిరానికి ‘జనహిత’ మందిరం అని పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, విధానాల రూపకల్పనకు, కార్యక్రమాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయడానికి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ‘జనహిత’ సమావేశ మందిరం ఉపయోగపడుతుందన్నారు.

గృహ ప్రవేశం అనంతరం జనహిత మందిరంలో మొట్టమొదటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన తొలి ఫైలుపై సంతకం చేశారు. సీఎం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శనం చేసే వేదికగా ప్రగతిభవన్‌ నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చలు నిర్వహించడానికి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ ఖర్చుతో వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానించి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నారు. కలెక్టర్ల సదస్సు లాంటి వాటికోసం ఇంతకాలం హోటళ్ళను ఆశ్రయించామని, ఇప్పుడు ఆ అవస్థలు లేకుండా జనహితలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇఫ్తార్‌ విందులు, క్రిస్మస్‌ డిన్నర్లు, ఉగాది పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు తదితర అధికార కార్యక్రమాలన్నీ ఇకపై ‘జనహిత’లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎం.పీ. కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates