magaభూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. భూమి రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌ విధానం అత్యంత పారదర్శకంగా, సరళంగా ఉండాలని సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు, భూ రికార్డుల నిర్వహణ, సమగ్ర భూ సర్వే నిర్వహణ తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

సమగ్ర భూ సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి నేపథ్యాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ”వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్నరైతులు అప్పులలో కూరుకుపోతున్నారు. ఏ మాత్రం గిట్టుబాటు ఉండడం లేదు. బతకడమే కష్టంగా ఉంది. భార్యకు కనీసం చీర కూడా కొనలేడు. పిల్లలకు స్కూల్‌ ఫీజు కూడా కట్టలేడు. ఇతర పనులేమి లేకుండా కేవలం వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులది ఈ దురవస్థ. పరువు కోసం తెల్లబట్టలేసుకుని తిరుగుతారు కానీ పరిస్థితి ఏమి బాగుండదు. పంట సీజన్‌ వస్తే అప్పుల కోసం తిరగని చోటుండదు. బ్యాంకుల చుట్టూ, మిత్తీ వ్యాపారుల చుట్టూ తిరిగి అప్పు పుట్టించుకొంటారు. తీరా అనేక కారణాల వల్ల పంట నష్టపోతే పెట్టిన పెట్టుబడి పోయి అప్పు మిగులుతుంది. అప్పుకు వడ్డీ పెరుగుతుంది. బతుకు భారమవుతుంది. ఈ పరిస్థితి నుండి రైతును గట్టెక్కియ్యాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా. రైతుల కోసం ఏమి చేయాలని చాలా మందితో మాట్లాడాను. చివరికి వ్యవసాయానికి పెట్టుబడి ప్రభుత్వమే సమకూరిస్తే రైతులకు అప్పుల తిప్పలు తప్పుతాయని నిర్ణయించాము. కాలం కలిసిరాక పంటలు పండకపోయినా రైతులు పెట్టుబడి కోల్పోయే ప్రమాదం ఉండదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోరు. అందుకోసమే ప్రభుత్వం ఎంత వ్యయమైనా భరించి ప్రతీ ఎకరాకు ఏడాదికి రూ.8వేల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించుకుంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.

సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రైతుల ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములతో పాటు గ్రామంలో అటవీభూమి, ప్రభుత్వ భూమి, దేవాదాయ భూమి, ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న భూమి, ప్రభుత్వ భవనాల కింద ఉన్న భూమి, చెరువులు, కుంటల కింద ఉన్న భూమి తదితర అన్ని వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాల కోసం బదలాయింపు జరిగితే ఆ వివరాలు, ప్రభుత్వం సేకరించిన భూ వివరాలు, ప్రభుత్వం అసైన్‌ చేసిన భూ వివరాలు కూడా నమోదు చేయాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయం చేసుకునే పేదలకు కూడా పెట్టుబడి పథకం అందివ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామ కంఠాన్ని కూడా నిర్ధారించాలన్నారు. మొదటి దశలో వివాదాలు లేని భూముల రికార్డులను సరిచేయాలని, రెవెన్యూ గ్రామం పరిధిలోని ప్రతీ భూమి వివరాలను నమోదు చేయాలని చెప్పారు. రెండో దశలో మొత్తం తెలంగాణ భూభాగాన్ని సర్వే చేయించి, కొత్త మ్యాపులు రూపొందిస్తామన్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ భూభాగంలో జరిగే మార్పులు కూడా వెంటనే నమోదయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.

”1932-36 మధ్య నిజాం రాజ్యంలో భూ సర్వే జరిగింది. తిరిగి మళ్లీ భూ సర్వే జరగలేదు. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో అనేక మార్పులు సంభవించాయి. కానీ అవన్నీ సరిగ్గా నమోదు కాలేదు. అందుకే భూ రికార్డుల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వివాదాలకు కూడా కారణమవుతోంది. వ్యవసాయ శాఖ వద్ద వివరాలకు, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతన లేదు. దీంతో ప్రభుత్వం అందించాలనుకునే పెట్టుబడి ఏ ప్రాతిపదికన అందించాలో తెలియని పరిస్థితి నెలకొంది. పొరపాట్లు జరిగితే వేల కోట్ల రూపాయల కుంభకోణం అయ్యే అవకాశం ఉంది. మంచి చేయబోతే చెడు అవుతుంది. అందుకే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, పెట్టుబడి ఎవరికి అందాలో ఖచ్చితంగా తెలియాలి. అందుకే భూ రికార్డులు ప్రక్షాళన కార్యక్రమం తీసుకుంటున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.

”భూ రికార్డులన్నింటినీ సరిచేసిన తర్వాత ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలి. మళ్లీ భూ రికార్డులకు సంబంధించి ఏ చిన్న మార్పు జరిగినా అంతా ఆన్‌లైన్‌లో తెలిసిపోవాలి. బ్యాంకులు అవలంభిస్తున్న కోర్‌ బ్యాంకింగ్‌ విధానం లాంటిది భూ రికార్డుల నిర్వహణలో అనుసరించాలి. ఎటిఎం ద్వారా ఏ బ్యాంకులో, ఏ ప్రదేశంలో డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నా వెంటనే ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. వినియోగదారుడికి మెస్సేజ్‌ వస్తుంది. అలాగే భూ రికార్డులు కూడా ఉండాలి. పాస్‌ పుస్తకాల్లో ఎక్కడ మార్పు జరిగినా అంతటా తెలిసిపోవాలి. ప్రతీదీ పారదర్శకంగా జరగాలి. భూ రికార్డులను సరిచేయడానికి, ఆ తర్వాత వాటిని నిర్వహించడానికి, కోర్‌ బ్యాంకింగ్‌ లాంటి వ్యవస్థను నడపడానికి ప్రతీ రెవెన్యూ కార్యాలయంలో ఒక ఐటి అధికారిని నియమించాలి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెవెన్యూ శాఖలో వెయ్యి మందిని నియమించాలి. ఎక్కువ సామర్థ్యం కలిగిన కంప్యూటర్లు, ఎక్కువ బ్రాండ్‌ విడ్త్‌ కలిగిన నెట్‌ కనెక్షన్‌ కల్పిస్తాం. రెవెన్యూ కార్యాలయాలన్నీ ఒకదానికొకటి అనుసంధానం అవుతాయి” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

”రిజిస్ట్రేషన్లు కూడా పారదర్శకంగా జరగాలి. క్రయ విక్రయాలు జరిపే రైతులిద్దరూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి. రిజిస్ట్రార్‌ వద్ద ఇద్దరి పాసు పుస్తకాలు ఇవ్వాలి. రిజిస్ట్రార్‌ రెండు పాస్‌ పుస్తకాలను తీసుకుని అమ్మేవారి పాస్‌ పుస్తకం నుంచి భూమిని తొలగించాలి. కొన్నవారి పాస్‌ పుస్తకంలో ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రారే ఈ రెండు పాస్‌ పుస్తకాలను కొరియర్‌ ద్వారా ఎమ్మార్వోకు పంపాలి. నాలుగు పనిదినాల్లో ఎమ్మార్వో క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. పాస్‌ పుస్తకాలపై అటెస్ట్‌ చేయాలి. పేరు మార్పిడి చేయాలి. తిరిగి రిజిస్ట్రార్‌కు పంపాలి. రిజిస్ట్రార్‌ తన రికార్డుల్లో నమోదు చేసుకుని కొరియర్‌ ద్వారా రైతులకు పంపాలి. అమ్మే వారు, కొనే వారు కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రార్‌ ఆఫీసుకు రావాలి. మళ్లీ మళ్లీ తిరగడం, పైరవీలు చేయడం ఇక ముందు ఉండకూడదు. పాస్‌ పుస్తకాలు, పహాణీల నిర్వహణనకు కూడా మరింత సరళం చేయాలి. అవసరం లేని కాలమ్స్‌ తీసేయాలి. పాస్‌ పుస్తకాలు కూడా కొత్తవి ఇవ్వాలి. ప్రత్యేకమైన పెన్నులు మాత్రమే పడే విధంగా పాస్‌ పుస్తకాలు తయారు కావాలి. నీటిలో పడినా తడవకుండా, పాడవకుండా ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పాస్‌ పుస్తకాల సైజు కూడా తగ్గించాలి. స్టాంపుల చట్టాలను, రిజిస్ట్రేషన్‌ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసవరమైన మార్పులు చేయాలి. భవిష్యత్తులో ప్రతీ మండలానికి ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే ఎమ్మార్వోకే రిజిస్ట్రేషన్‌ కూడా చేసే అధికారం ఇచ్చే అవకాశాలు పరిశీలించాలి. రెవెన్యూ కోర్టులు కూడా ఇన్ని ఉండాలా? కేవలం కలెక్టర్‌ వద్ద ఒక్క కోర్టు మాత్రమే నిర్వహించాలా? అనే విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిషేధిత జాబితా కూడా తయారు చేయాలి. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించని విధంగా సాఫ్ట్‌ వేర్‌ అభివద్ధి చేయాలి” అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

”భూ రికార్డులను ప్రక్షాళన చేయడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ భూమి పరిస్థితి ఏమిటో తెలియడం వల్ల వివాదాలు, ఘర్షణలకు తావుండదు. ఇది నిజానికి పెద్ద సవాల్‌. చాలా పీటముళ్లుంటాయి. కానీ చిత్తశుద్ది ఉంటే చేయడం అసాధ్యం కాదు. అధికారులకు సముద్రం అంత ఓపిక ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మనమంతా పట్టుపడితే గుడుంబా మహమ్మారి పారిపోయింది. పేకాట బంద్‌ అయింది. ఇప్పుడు రికార్డుల ప్రక్షాళన జరిగితే భూ దందాలు కూడా బంద్‌ అవుతాయి” అని సీఎం అభిప్రాయపడ్డారు.

”రైతులకు కావాల్సింది సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధర. ఇప్పటికే రాష్ట్రంలో సాగునీరు అందివ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. అవసరమున్నంత ఉచిత విద్యుత్‌ అందడం వల్ల రైతులు భూగర్భజలాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకో గలుగుతున్నారు. తర్వాత దశలో గిట్టుబాటు ధర కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులను సంఘటితం చేసే పనికి ప్రభుత్వమే పూనుకుంది. రైతులు సంఘటితమై గిట్టుబాటు ధర పొందే ప్రణాళిక కూడా అమలు చేస్తున్నాం” అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

”భూ రికార్డులను సరిచేసే కార్యక్రమం సెప్టెంబర్‌ 15న పెద్ద ఎత్తున ప్రారంభం కావాలి. అన్ని మండలాల్లో ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా తలా మూడు గ్రామాలను తీసుకుని ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలి. నేను కూడా మూడు గ్రామాలు ఎంపిక చేసుకుంటా. వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు, రైతు సంఘాలు చురుకైన పాత్ర నిర్వహించాలి. సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా క్రియాశీల పాత్ర పోషించాలి. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి కొంత మంది ఉద్యోగులను కూడా తాత్కాలిక పద్ధతిపై తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జోగు రామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, కార్పొరేషన్ల చైర్మన్లు భూమ్‌ రెడ్డి, కిషన్‌రావు, సుభాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, రమణా చారి, సీనియర్‌ అధికారులు బిఆర్‌ మీనా, బిపి ఆచార్య, పార్థసారథి, జగన్‌ మోహన్‌, ఎస్‌ నర్సింగ్‌రావు, శాంతికుమారి, వెంకట్రాం రెడ్డి, స్మితా సభర్వాల్‌, వాకాటి కరుణ, ప్రియదర్శిని, నదీమ్‌ అహ్మద్‌, భూపాల్‌ రెడ్డి, కలెక్టర్లు రఘునందన్‌, శ్రీధర్‌, లోకేశ్‌ కుమార్‌, పిసిసిఎఫ్‌ జా, జయేశ్‌ రంజన్‌, దేవదాసు, జాయింట్‌ కలెక్టర్లు సుందర్‌ అప్న్బార్‌, ధర్మారెడ్డి, రిటైర్డు అధికారులు ఎన్‌.శ్రీనివాస రావు, బి. మధుసూధన్‌, డి వెంకట్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనకు అవలంభించాల్సిన పద్ధతులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘనందన్‌ రావు నేతృత్వంలో ఏర్పడిన కమిటీ చేసిన అధ్యయనంపై చర్చ జరిగింది. భూ రికార్డులు సక్రమంగా, సమగ్రంగా ఉంటే రైతులకు పెట్టుబడి పథకం విజయవంతమవుతుందని సీఎం చెప్పారు. రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాల ఏర్పాటు, రైతు సదస్సుల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు.

సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితిలు ఏర్పాటు అవుతాయి. గ్రామంలో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరూ సభ్యులుగా ఉంటారు. 11 మందితో సమన్వయ సమితిలు ఏర్పాటు అవుతాయి

సెప్టెంబర్‌ 10 నుంచి 15 వరకు రైతు సమన్వయ సమితిల సదస్సులు మండల స్థాయిలో నిర్వహిస్తారు

సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌ గా భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది

సెప్టెంబర్‌ 15న రాష్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది

ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌ గా పరిగణిస్తారు. రాష్ట్రం మొత్తాన్ని 1100 యూనిట్లుగా నిర్ణయించారు. 3,600 బృందాలను ఎంపిక చేస్తారు. రెవెన్యూ అధికారి, వ్యవసాయాధికారి, గ్రామ రైతు సంఘం సమన్వయంతో ఒక్కో గ్రామంలో ఒక్కో బృందం నెల రోజుల పాటు ఉండి గ్రామ సభలు నిర్వహించి, రైతులందరి సహకారం, అంగీకారంతో భూ రికార్డులను సరిచేస్తారు. ఒక్కో బృందం ఒక్కో గ్రామంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇలా ఒక్కో బృందం మూడు నెలల్లో మూడు గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహిస్తుంది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో యూనిట్‌ కు బాధ్యత తీసుకుని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు

ఎలాంటి వివాదాలు లేని భూములు దాదాపు 85 నుంచి 95 శాతం వరకు ఉంటాయని అంచనా. వివాదాలు లేని భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ ముందుగా ప్రక్షాళన చేస్తారు. పేరు మార్పిడీలు, క్రయ విక్రయాలు జరిగిన వివరాలన్నీ తీసుకుంటారు. రికార్డులకు తుదిరూపం ఇస్తారు. ఆ రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. రెండో దశలో వివాదాస్పద భూములకు సంబంధించిన పరిష్కార మార్గాలు చూస్తారు. కోర్టు వివాదాలుంటే, కోర్టు తీర్పులననుసరించి యాజమాన్య హక్కులను నిర్ణయిస్తారు

డిసెంబర్‌ నెలాఖరు నాటికి రికార్డులన్నీ సరిచేసి ఆన్‌ లైన్‌ లో పొందుపరుస్తారు. దీని ఆధారంగానే రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తారు

Other Updates