erkodeపెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లరో రామచంద్రా! అని గగ్గోలు పెడుతున్నారు. మనీ డిపాజిట్‌ కోసం బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు. క్యాష్‌ విత్‌ డ్రా కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అన్ని పనులు మానేసి కేవలం చిల్లర కోసమే రోజంతా నరకయాతన పడుతున్నారు. అయినా చేతికి వందనోట్లు రావడం లేదు. పట్టణాలు, పల్లెలు అని తేడా లేదు. ఇప్పుడందరి సమస్య ఇదొక్కటే.

కానీ ఆ పల్లె ప్రజలకు మాత్రం చిల్లర టెన్షన్‌ లేదు. నోట్లు మార్చాలన్న ఆందోళన అవసరం లేదు. అసలు వందనోటు అవసరమే రావడం లేదు. ఎప్పటిలాగే కూరగా యలు కొనుక్కుంటున్నారు. ఎప్పటిలాగే నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. ఎప్పటిలాగే బిజినెస్‌ నడుస్తున్నది. అదెలాగో.. ఎందుకో.. ఈ కథనం చదవండి..!

ఇర్కోడ్‌..! తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి మరో పేరొచ్చింది. అదే డిజిటల్‌ విలేజ్‌. క్యాష్‌ లెస్‌, కాంప్రహెన్సివ్‌, కనెక్టెడ్‌.. ఈ మూడు అంశాల ఆధారంగా డిజిటల్‌ విలేజ్‌ గా రూపాంతరం చెందింది. గ్రామానికీ-పట్టణానికి సరిహద్దు గోడల్ని చెరిపేసినట్టుగా ఉండే ఈ గ్రామంలో ప్రతి వ్యక్తికీ బ్యాంకు అకౌంట్‌ ఉంది. ఎలాంటి క్యాష్‌ డీల్‌ ఉన్నా ఆన్‌ లైనులోనే జరుపుతారు. ఒక్క ఎస్‌ ఎంఎస్‌ ద్వారా మొబైల్‌ రిచార్జీ నుంచి బ్యాలెన్సు ఎంక్వైరీ మీదుగా మినీ స్టేట్‌ మెంట్‌ దాకా అన్ని పనులు చక్కబెడతారు. పాలు కొనాలన్నా.., పప్పులు- ఉప్పలు.. ఇతరత్రా నిత్యావసర సరుకులు తేవాలన్నా., కరెంటు బిల్లు కట్టాలన్నా.., అంతా ఈ బ్యాంకింగే. చేతిలో ఫోన్‌ మాత్రమే ఉంటుంది.. పర్సు, పైసలు అన్న మాటే లేదు.

2450 మంది ఉండే ఈ గ్రామాన్ని ఆంధ్రాబ్యాంకు దత్తత తీసుకున్నది. ఇర్కోడులో 18 ఏళ్ల పై బడిన వారు 1877 మందికి గానూ 1873 మందికి బ్యాంకు ఖాతాలు అందించారు. అలాగే గ్రామంలోని 25 మంది వ్యాపార వర్గాలకు స్వైపింగ్‌ యంత్రాలను అందించారు. ఈ క్రమంలో గ్రామస్తుల సహకారంతో అన్ని రకాల మోడ్రన్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నది. 682 గహాలు ఉన్న.. ఈ గ్రామానికి ఇంతకు ముందు నుంచే.. కొన్ని ప్రత్యేక తలు ఉన్నాయి. వంద శాతం అక్షరాస్యత, వంద శాతం ఇంటిం టికీ ఎల్‌ ఈడీ బల్బులు, అలాగే వీధి దీపాలు, వంద శాతం ఇంటింటికీ ఇంకుడు గుంతలు, వంద శాతం (టాక్స్‌-పే) ద్వారా ప్రభుత్వ పన్ను కట్టే ప్రజలు. ప్రత్యేకించి ఈ గ్రామంలో వినండహో.. అనే డప్పు చప్పుడు లేకుండా.. గ్రామంలో ఏం చేస్తున్నామో.. గ్రామస్తులకు తెలిపేలా.. పంచాయతీలో మైకు సౌండ్‌ కూత పెడుతుంది. ఇలాంటి ఇర్కోడ్‌ గ్రామం.. ఇవాళ నగదు రహిత లావాదేవీల మంత్రాన్ని జపిస్తూ.. ముందుకు సాగుతున్నది.

ఇర్కోడ్‌ గ్రామంలోని 17 ఆటోలకు క్యూ ఆర్‌ కోడ్‌ కార్డులు వచ్చాయి. మొబైల్‌ తో స్కాన్‌ చేసి వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు వెళ్లే ప్రక్రియను స్వయంగా మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ వెంకట్రామా రెడ్డితో కలిసి ఆటోలో ప్రధాన దారి నుంచి పంచాయతీ భవనం వరకు ప్రయాణం చేసి ఆటో యజమానికి క్యూ ఆర్‌ కోడ్‌ విధానంలో రూ.50 చెల్లింపులు చేశారు. ఆ తర్వాత హేర్‌ కటింగ్‌ సెలూన్‌ షాపులో క్షవరం చేసుకున్న తర్వాత డబ్బులిచ్చిన విధానాన్ని, అలాగే ఫర్టిలైజర్స్‌ షాపులో రైతులకు క్రయ విక్రయాలు జరిపే విధానం, చౌక ధరల దుకాణంలో నిత్యావసర సరుకుల పంపిణీ, కిరాణ షాపులో నగదు బదిలీ చేస్తున్న విధానాన్ని మంత్రి హరీశ్‌ రావు, కలెక్టర్‌ వెంకట్రామా రెడ్డిలు ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఆ తర్వాత మహిళా సంఘాల వారి పొదుపు డబ్బులను మొబైల్‌ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్నిప్రత్యక్షంగా పరిశీలించి.. ఈ విధానం చాలా బాగుందని.. క్యాష్‌ లెస్‌ లావాదేవీలు చేస్తున్న మహిళా గ్రూపు సభ్యులుగా.. దేశంలోనే మొట్ట మొదటి గ్రామైక్య సంఘమని మంత్రి కితాబిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమేనంటూ.. వచ్చే రోజుల్లో నియోజక వర్గంలోనే అత్యధికంగా కార్డులు వినియోగించే వారికి రూ.5వేలు ప్రోత్సాహకంగా నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు నియోజక వర్గంలోనే ఇర్కోడ్‌ గ్రామంలో అత్యధికంగా 47 సార్లు రూ.1.18లక్షల మేర ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ జరిపిన సాయి శ్రీనివాసుకు ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రీ-పెయిడ్‌ కార్డును నగదు బహుమతి ప్రొత్సాహకంగా అందించారు. ఇలా ఇర్కోడ్‌.. డిజిటల్‌ గ్రామం కావడం వల్లనే ఇవాళ దేశ వ్యాప్తంగా జనం పడుతున్న చిల్లర పాట్లు ఈ గ్రామస్తులకు తప్పాయి. వందనోటు కోసం ఆరాటం లేదు. వెయ్యి నోటు డిపాజిట్‌ కోసం రోజంతా క్యూ లైన్లో పడిగాపులు పడటం లేదు. అసలు వీళ్లకు కరెన్సీ నోట్ల టెన్షనే లేదు. గ్రామస్తుల సహకారం, అధికారుల చిత్తశుద్ధి ఫలించి.. ఇవాళ ఇర్కోడ్‌ గ్రామం.. చైతన్యానికీ ప్రతీకగా నిలిచింది. పట్టణానికి ఏ మాత్రం తీసిపోని ” ఈ-పల్లె ఇర్కోడ్‌”.. కు నిజంగా హ్యాట్సాఫ్‌..!

Other Updates