sunkikumarసాధారణంగా ‘బాంబు’లు వేస్తే పచ్చటి చెట్లు, పంట పొలాలు మాడి మసై పోతాయి. కానీ, ఈ ‘బాంబు’ లు వేస్తే మాత్రం పచ్చపచ్చని మొక్కలు భూమిని చీల్చుకొని పైకి వస్తాయి. కొంచెం ఆశ్చర్యంగా వున్నా ఇది వాస్తవం. ఈ బాంబుల పేరు ‘ సీడ్‌ బాంబ్స్‌’ .

తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి విస్తరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ హరితహారం ‘ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. రానున్న వర్షాకాలంలో వినూత్నపద్ధతిలో ఈ హరితహారం కార్యక్రమాన్ని అమలుచేసేందుకు అటవీశాఖ కార్యక్రమాలు రూపొందిస్తోంది. అందులో భాగమే ఈ సీడ్‌ బాంబింగ్‌.

రాష్ట్రంలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంచేందుకు దోహదపడే విధంగా అటవీశాఖ ఈ సీడ్‌ బాంబింగ్‌ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎరువు, ఎర్రమట్టితో చిన్నచిన్న బంతుల వంటి మట్టి వుండలు తయారుచేసి, ఆ గుండ్రటి వుండలలో విత్తనాలను ఉంచి, వాటిని ఎండలో ఎండపెడతారు. ఆ మట్టివుండలు ఎండి, గట్టిపడి చూడటానికి బంతుల్లాగా వుంటాయి. వర్షానికి ముందు ఈ మట్టి వుండలను మనం మొక్కలు నాటాలనుకున్న ప్రదేశంలో విసురుతారు. దీన్నే సీడ్‌ బాంబింగ్‌ అంటారు. అలా విసిరిన మట్టి బంతులు సరిపడినంత వర్షం పడగానే తడిసి, అందులోని విత్తనం మొక్కగా అంకురిస్తుంది. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో కొన్ని ఏజెన్సీలు ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.

మన రాష్ట్రంలో కూడా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో ఈ సీడ్‌ బాంబింగ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ విత్తనాల బంతులను తయారు చేయడంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.

230 కోట్ల మొక్కలు లక్ష్యం

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అటవీశాఖ రేంజి పరిధిలోని ములుగు మండల అటవీ పరిశోధనా కేంద్రంలో మే 10 న ‘ సీడ్‌ బాల్‌’ ద్వారా విత్తనాలు నాటే నూతన ప్రక్రియపై 31 జిల్లాల డి.ఎఫ్‌.ఓ లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, కన్జర్వేటర్లకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో అటవీశాఖా మంత్రి జోగురామన్న పాల్గొని మాట్లాడారు.ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మానస పుత్రిక ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమాన్ని గత రెండు విడతలుగా విజయవంతం చేసినట్లు మూడో విడత కూడా విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ సంవత్సరం రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు, ఇందులో అడవులు క్షీణించిన ప్రాంతంలో వంద కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు,

‘సీడ్‌ బాంబింగ్‌ ‘ నూతన విధానం ద్వారా, జీవామతం కలిపిన ఎర్ర మట్టిలో విత్తనం పెట్టి బాల్‌ లాగా తయారు చేసి ఆరబెట్టిన తర్వాత గట్టి పడుతుందని, ఈ సీడ్‌ బాల్‌ విధానం ద్వారా విత్తనం ఏ విధంగా తయారు చేస్తారో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అమర నారాయణ కర్ణాటకలో బాగా ప్రచారం కల్పిస్తున్నారన్నారు. అదే విధంగా నవ చైతన్య ట్రస్ట్‌ ఎన్‌.జి.ఓ శ్రీనివాస్‌ రాజ్‌ కూడా ఈ ప్రక్రియపై అవగాహన కలిపిస్తున్నారని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయ ఓ.ఎస్‌.డి ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ, సీడ్‌ బాల్‌ విత్తన తయారీ ఫై గ్రామాలలో స్వయం సహాయక మహిళా సంఘాలు, జైళ్ల లోని ఖైదీలకు అవగాహన కలిగించి విత్తనాలను తయారు చేసి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు

తొలుత రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అమర్‌ నారాయణ జీవామతం కల్పిన ఎర్ర మట్టిలో విత్తనం వేసి బాల్‌లాగా తయారు చేసి చూపించారు. కర్ణాటకలో ఎన్‌.జి.ఓల సహకారంతో విస్త తంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు .

అనంతరం మంత్రి జోగు రామన్న ములుగులో నిర్మాణంలో ఉన్న వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు

ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఆర్‌.ఎం.డోబ్రీయాల మెదక్‌ జిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎ.కె.సిన్హా ,సిద్ధిపేట డి.ఎఫ్‌.ఓ శ్రీధర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Other Updates