magaగత కొద్ది సంవత్సరాలుగా శ్రీరాంసాగర్‌ , నిజాంసాగర్‌, సింగూరు జలాశయాలకు తగినంత నీరు రావడం లేదు. కారణాన్ని గూగుల్‌ ఎర్త్‌ సహాయంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా శోధించినప్పుడు తేలిన విషయం ఏమిటంటే, ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు గోదావరిపై, మంజీరా తదితర ఉపనదులపై 450 కి పైగా ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్‌ డ్యాంలు నిర్మించినట్లు బయటపడింది. కనుక సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో ఈ మూడు జలాశయాల్లోకి నీరు పై నుంచి వచ్చే అవకాశాలు తగ్గినాయని తెలుస్తున్నది. కొద్దిపాటి నీరు చేరినా అవి ఆయకట్టు అవసరాలకు సరిపోవు.

అదే సమయంలో దిగువన ప్రాణహిత , ఇంద్రావతి సంగమం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నదని సి. డబ్ల్యూ. సి వారి లెక్కలు చెపుతున్నాయి. సగటున ప్రతీఏడు దాదాపు 1650 టి. ఎం.సి. ల నీరు దిగువ గోదావరిలో లభ్యమవుతుందని తేలింది. ఇంతటి కరువు కాలంలో కూడా ఈ వర్షాకాలం మొదలైన కాడి నుంచి దిగువ గోదావరిలోనుంచి సముద్రంలోకి వృధాగా ప్రవహించిన నీరు 250 టి.ఎం.సిలు. గత ఎండాకాలం ఎప్రిల్‌ , మే నెలల్లో కూడా దిగువ గోదావరిలో 5 నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఈ నీటిని మనం వినియోగించు కోలేకపోతే వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని రీ డిజైన్‌ చేసేటప్పుడు వృధాగా సముద్రంలోనికి పోయే నీటిని వాడుకుని ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్‌ , నిజాంసాగర్‌, సింగూర్‌ జలాశయాలని స్థిరీకరించుకోవడం ఒక ప్రధాన అంశంగా ముందుకువచ్చింది.

కాళేశ్వరం- వరద కాలువ శ్రీరాంసాగర్‌ ఎత్తిపోతల పథకం:

తొలుత రీ ఇంజనీరింగ్‌ ప్రతిపాదనలకు రూపకల్పన చేస్తున్న దశలో సింగూరు, నిజాంసాగర్‌ లోకి నీటిని మల్లన్నసాగర్‌ నుండి ఒక లింక్‌ కాలువ ద్వారా హల్దివాగులో జారవిడిచి మంజీరానది నుండి నిజాంసాగర్‌ని నింపడం , అవసరమైన పక్షంలో నిజాంసాగర్‌ నుంచి ఎస్సారెస్సీలోకి కూడా నదీ మార్గం ద్వారా తరలించాలన్న ఆలోచన చేసినారు. అయితే ఆనాడు ప్రముఖ ఇంజనీరు స్వర్గీయ టి. హనుమంత రావు , ఇతరులు ఎల్లంపల్లి నుంచి నేరుగా నదీ మార్గం ద్వారా గోదావరిపై వరుస బ్యారేజీలు నిర్మించి ఎస్సారెస్సీకి నీటిని తక్కువ లిఫ్ట్‌తో మళ్లించే అవకాశం ఉన్నా ప్రభుత్వం మల్లన్న సాగర్‌ ద్వారానే ఎస్సారెస్సీకి నీటిని మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ఎల్లంపల్లి నుంచి నదీ మార్గం ద్వారా తక్కువ లిఫ్ట్‌తో ఎస్సారెస్సీకి పంపు చెయ్యవచ్చుననే వాదన పట్ల ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం లేకుండింది. అయితే ఎస్సారెస్సీ నుంచి ఎల్లంపల్లి దాకా గోదావరి బెడ్‌ లెవెల్‌ వాలు ఎక్కువగా ఉన్నందున గోదావరి ఒడ్డున ముంపు లేకుండా దాదాపు 12 వరుస బ్యారేజీలు , 12 పంపు హౌజ్‌లను నిర్మించవలసి ఉంటుంది. దాదాపు 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల సొమ్మును వీటి నిర్మాణం కోసం వెచ్చించాల్సి ఉంటుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటి నిర్మాణానికి చర్యలు తీసుకొనవచ్చును. లేదంటే గోదావరిపై అంతర్గత జల రవాణా (Inland Navigation) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరిస్తే ఆ బ్యారేజీల నిర్మాణం వెంటనే చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ దాకా నీటిని తీసుకువస్తాం కనుక ప్రస్తుతానికి హల్దివాగు , మంజీరా నదుల ద్వారా ఎటువంటి కట్టడాల అవసరం లేకుండానే నదీ మార్గం ద్వారా నీటిని ఎస్సారెస్సీకి తరలించే ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇది సాంకేతికంగా హేతుబద్దమైన నిర్ణయమే అని నిపుణులు భావించినారు. అదే సమయంలో తక్కువ ఖర్చుతో, తక్కువ ఎత్తుతో , తక్కువ విద్యుత్‌ వినియోగంతో

ఎస్సారెస్పీకి నీటిని తరలించే ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించమని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించినారు. ఆ అన్వేషణలో మన ఇంజనీర్లకు స్పురించిన పథకమే కాళేశ్వరం- వరదకాలువ ఎస్సారెస్పీ ఎత్తిపోతల పథకం.

ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో అత్యంత కీలకమైనది. శ్రీరాంసాగర్‌ జలాశయానికి కరువు కాలంలో రోజుకు ఒక టి ఎం సి నీటిని ఎత్తిపోయడానికి శ్రీరాంసాగర్‌ వరద కాలువ ద్వారా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. అత్యంత తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఎత్తుతో, అతితక్కువ విద్యుత్‌ వినియోగంతో, అతి తక్కువ భూసేకరణతో 22000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన వరద కాలువనే జలాశయంగా మలచి నీటిని శ్రీరాం సాగర్‌ జలాశయానికి తరలించే అద్భుత పథకాన్ని తెలంగాణా ఇంజనీర్లు ముఖ్యమంత్రికి నివేదించినారు. ప్రభుత్వం మరింత విస్తృత అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఉప సంఘం నాలుగు సమావేశాలు నిర్వహించి పథకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఐ ఐ టి హైదరాబాద్‌ వారు నిర్వహించిన స్టిములేషన్‌ స్టడీస్‌ కూడా ఈ పథకం వంద శాతం విజయవంతం అవుతుందని నిర్ధారించిన అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని ఆమోదించింది. కేవలం1067 కోట్ల రూపా యల ఖర్చుతో రోజుకు ఒక టి ఎం సి నీటిని శ్రీరాంసాగర్‌ జలాశయానికి తరలించే వీలు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కలుగుతుంది.

కాలువ/ఎత్తిపోతల పథకం ఆయకట్టు నీటి వినియోగం

(ఎకరాలు)  (టి.ఎం.సి)

కి మీ 146.00 వరకు కాకతీయ కాలువ 1,78,000 18

సరస్వతి కాలువ 36,000 3.5

ప్యాకేజీ 27 డ 28 (నిర్మల్‌ జిల్లా ) 1,00,000 7

లక్ష్మి కాలువ డ చౌటుపల్లి హన్మంత రెడ్డి పథకం 36,000 4

ఆలీసాగర్‌ డ గుత్ప పథకాలు 93,000 7.3

ప్యాకేజీ 21 డ 22 ( నిజామాబాద్‌ జిల్లా ) 3,50,000 25

ఎస్సారెస్సీ ద్వారా తాగునీరు (11.437)

మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ( 3.1) 14.537

ఐ.డి.సి పథకాలు 80,000 7.76

ఎస్సారెస్సీ వరద కాలువకు మధ్యన మెట్‌ పల్లి,

జగిత్యాల ఎగువ భూములకు సాగునీరు 1,00,000 8

మొత్తం 9,73,000 95.097

ఈ పథకం ఆవశ్యకతని తెలుసుకోవాలంటే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చరిత్రని మననం చేసుకోవాలి. 1951 లో హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై పోచంపాడు వద్ద డ్యాం , ఆదిలాబాద్‌ జిల్లా కడెం నదిపై డ్యాం , మానేరు నదిపై దిగువ మానేరు డ్యాం నిర్మాణానికి సమీకృత ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి , ప్రణాళికా సంఘానికి సమర్పించింది.

కేంద్ర ప్రభుత్వం 112 టి ఎం సి ల నిల్వ సామర్థ్యంతో, 75 శాతం విశ్వసనీయతతో 196 టి ఎం సిల నీటి వినియోగం కోసం శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుని నిర్మించడానికి అనుమతి నిచ్చింది. ప్రాజెక్టు దక్షిణ కాలువ (కాకతీయ కాలువ) ద్వారా దిగువ మానేరు డ్యాం దాకా 2.31 లక్షల హెక్టార్లకు (5.86 లక్షల ఎకరాలు) సాగునీరు అందించాలని ప్రతిపాదించినారు. ఆ తర్వాతి కాలంలో శ్రీరాంసాగర్‌ మొదటి దశలో భాగంగా దిగువ మానేరు ద్వారా కాకతీయ కాలువను 284 కిలోమీటర్ల వరకు పొడిగించి ఆయకట్టును 3.92 లక్షల హెక్టార్లకు (9.95 లక్షల ఎకరాలు) పెంచినారు. రెండో దశలో కాకతీయ కాలువను 346 కిలోమీటర్లకు పొడిగించి ఆయకట్టును మరో 4 లక్షల ఎకరాలకు పెంచడం జరిగింది. అదే విధంగా ఉత్తర కాలువ (సరస్వతి కాలువ) ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 45 వేల ఎకరాలకు, నిజామాబాద్‌ జిల్లాలో లక్ష్మి కాలువ ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించినారు.

ఈ సమీకృత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ , నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో మొత్తం14 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 1963 జూలై 26 న ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసినారు. అయితే 1969 తెలంగాణా ఉద్య్యమం తర్వాత గానీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. 1983 లో ప్రాజెక్టు నుంచి మొదటిసారి నీటిని విడుదల చేసినారు. ప్రాజెక్టు రెండో దశ కాలువల నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం. మొదటి దశ కాలువల నిర్వహణకు పైసా విదల్చక పోవడంతో కాలువల వ్యవస్థ శిథిలావస్థకు చేరుకున్నది.

1990 లో పి వి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ వరద కాలువ నిర్మాణానికి అనుమతినిచ్చింది. ఎ ఐ బి పి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. 22000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువని తవ్వటం , 25 టి.ఎం.సి నిల్వ సామర్థ్యంతో మిడ్‌ మానేరు జలాశయాన్ని నిర్మించడం, ఈ జలాశయం నుంచి కాలువల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు. వరద కాలువ తవ్వకం పూర్తి అయినా భూసేకరణ, గ్రామాల పునరావాసం పూర్తి చెయ్యలేక పోవడంతో మిడ్‌ మానేరు జలాశయాన్ని పూర్తి చేయలేక పోయినాయి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు. వరద కాలువ ద్వారా ఎన్నడూ ఎస్సారెస్పీ వరదని తరలించింది లేదు. ఇప్పడు జలాశయానికి భూసేకరణ, పునరావాసం ప్రక్రియలని పూర్తి చేసి మిడ్‌ మానేరు జలాశయాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ ఏడు 10 టి.ఎం.సి ల నీటిని నిల్వ చేయడానికి మిడ్‌ మానేరు సిద్ధంగా ఉన్నది. ఈ డిసెంబరు నాటికి స్పిల్‌ వే గేట్లు బిగించడం పూర్తి అవుతుంది. వచ్చే వర్షాకాలానికి మిడ్‌ మానేరు 25 టి.ఎం.సి ల నీటిని నిల్వ చేసుకో గలుగుతుంది.

ఆ తర్వాత శ్రీరాంసాగర్‌ జలాశయంపై ఆధారపడి మరికొన్ని కొత్త ప్రాజెక్టులు మంజూరు అయినాయి. 93 వేల ఎకరాల నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఆలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాలు, లక్ష్మి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకం , కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టుకు నీరందించే ప్యాకేజీ 20,21,22 పనులు, ఆదిలాబాద్‌ జిల్లాలోఆయకట్టుకు నీరందించే ప్యాకేజీ 27,28 పనులు, ఐ డి సి వారి చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకం మిషన్‌ భగీరథ .. ఇవన్నీ శ్రీరాంసాగర్‌ పై ఆధారపడినవే.

అయితే కాలక్రమేణ ఎగువన మహారాష్ట్ర అనేక బ్యారేజీలని నిర్మించడంతో శ్రీరాం సాగర్‌ వద్ద నీటి లభ్యత 54 టి ఎం సి లకు పడిపోయినట్లుగా 25 సంవత్సరాల గోదావరీ ప్రవాహ లెక్కలు తెలుపుతున్నాయి. పూడిక వలన జలాశయం నిల్వ సామర్థ్యం కూడా 80 టి ఎం సి లకు పడిపోయింది. దానితో శ్రీరాంసాగర్‌ పై ఆధారపడిన వివిధ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరందించడం దుర్లభంగా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి జలాశయం నుండి మిడ్‌ మానేరుకు తరలించే రోజుకు 2 టిఎంసి నీటిని మార్గమధ్యంలో కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామం కి.మీ. 102 వద్ద వరద కాలువలో వదులుతారు. అక్కడ క్రాస్‌ రెగ్యులేటర్‌ని నిర్మించి ఒక టిఎంసిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోయడం , మరో టిఎంసిని వరద కాలువ ద్వారా దిగువన మిడ్‌ మానేరు జలాశయానికి పంపుతారు. 60 రోజుల అనంతరం శ్రీరాంసాగర్‌ కి 60 టిఎంసిలను ఎత్తిపోసిన తర్వాత పంపులను ఆపివేస్తారు. ఆ తర్వాత 2 టిఎంసిలు మిడ్‌ మానేరుకు తరలుతాయి. మూడు దశల్లో 33 మీటర్ల ఎత్తుకు పంపు చేసే ఈ పథకంలో 156 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. మూడు పంపు హౌజ్‌ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్క పంపు హౌజ్‌ లో 6.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పంపులను అమరుస్తారు. కేవలం పంపు హౌజ్‌ల నిర్మాణం కోసం 70 ఎకరాల భూమి మాత్రమే సేకరిస్తారు. 1067 కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా అనుమతిని జారీ చేసింది. పథకం అమలుకు టెండర్లు కూడా ఖరారు అయినాయి. ఆగస్టు 10 న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాజెక్టు పనులకు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం, ముప్కాల్‌ గ్రామం వద్ద ఉన్న వరద కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద శంకుస్థాపన కూడా చేసినారు.

ఒక సంవత్సర కాలంలో ప్రాజెక్టు పూర్తి అయి ఎస్సారెస్పీ నీటి కొరత తీరనున్నది.ఎస్సారెస్పీపై ఆధారపడిన ప్రాజెక్టు ఎస్సారెస్పీలన్నిటికీ నికరంగా గోదావరీ జలాలను అందించడానికి వీలవుతుంది. ఇక ఆయకట్టు రైతులు నీటి కోసం మొగులు దిక్కు చూడవలసిన అగత్యం లేదు. ఒకవేళ మహారాష్ట్ర నుండి శ్రీరాంసాగర్‌కు వరద వస్తే వరద కాలువ ద్వారానే మిడ్‌ మానేరుకు నీరు చేరుతుంది. కాళేశ్వరం వరద కాలువ – శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకం ఉత్తర తెలంగాణాకు వరదాయినిగా మారబోతున్నది.

రీ ఇంజనీరింగ్‌తో గోదావరి నది సజీవం:

ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజనీరింగ్‌ ప్రతిపాదనల వల్ల గోదావరి నదిపై కొత్త బ్యారేజిల నిర్మాణం జరుగుతోంది. శ్రీరాంసాగర్‌ ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ఆనకట్ట జలాశయాలను కలుపుకుంటే నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి నుంచి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం ఆనకట్ట దాకా మొత్తం 500 కిలోమీటర్ల పొడవున్న గోదావరి నది 274 కిలోమీటర్ల పొడవునా 365 రోజులు సజీవంగా ఉంటుంది.

జలాశయం నీటి నిల్వ బ్యాక్‌ వాటర్‌

(టి ఎం సి ) (కి మీ)

శ్రీరాం సాగర్‌ 80 74

సదర్‌ మాటు బ్యారేజీ 1.58 17

ఎల్లంపల్లి బ్యారేజీ 20 36

అన్నారం బ్యారేజీ 10.87 32

సుందిళ్ళ బ్యారేజీ 7.24. 31

మేడిగడ్డ బ్యారేజీ 16.17 42

తుపాకులగూడెం బ్యారేజీ 6.94 30

దుమ్ముగూడెం ఆనకట్ట 1.3 12

మొత్తం 144.10 274

నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి నుంచి భద్ర్రాద్రి జిల్లా దుమ్ముగూడెం దాకా గోదావరి నది పొడవు 500 కిలో మీటర్లు . అందులో ఈ బ్యారేజీల కారణంగా 274 కిలోమీటర్ల పొడవున 365 రోజులు నీరు నిలువ
ఉంటుంది. గోదావరి నదిపై 144.10 టిఎంసి నిల్వ సాధ్యపడుతున్నది. గోదావరి నది సజీవం అవుతున్నందున ఉత్తర తెలంగాణ రూపు రేఖలు మారబోతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, టూరిజం, జలరవాణా వంటి రంగాలలో అనూహ్యమైన ఆర్ధిక ప్రగతి జరగనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో జీవ వైవిధ్యం పెంపొందనున్నది.

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

Other Updates