ennilaeluguఇయ్యరమయ్యర ఎండలు దంచుతాంటే పెయ్యంత శిటపట పెడుతది. ఇంట్ల ఉండనియ్యది, బయటికి ఎల్లనియ్యది. ఎవ్వలకైనా ఈ దినం తాతీలే అన్నట్టు. బడిపోరగాండ్లకు బడి ఉండది. ఇగ వాల్ల ఆటలకు రికాము వుండది. అమ్మమ్మల ఇండ్లకు పోతరు. వేరే ఊర్లల్ల ఉన్నోల్లు నాయినమ్మ ఊర్లకు పోతరు. అయితే ఇయ్యాలరేపు ఎండలకు పోరలు తట్టుకుంటరో లేదో, అక్కడ నీళ్ళు దొరుకతయో లేదో, కరెంట్‌ ఉంటదో లేదోనని ఎక్కడికి పంపక వాళ్ల తాన్నే ఉంచుకొని బాయిలర్‌ కోళ్ళోలె పెంచుతండ్రు. అది వేరే సంగతిగని. పల్లెటూల్లల్ల ఎండాకాలం వచ్చిందంటే ఎవసం చేసికునేటోల్లకు తెల్లారి లేస్తేనే పెంట జారగొట్టుకుంటరు. రెండు ఎడ్లను బండిని ముందురోజు రాత్రే సై చేసికొని తెల్లారకముందే బండిల పొరుక పెట్టుకొని ఇంటిముందు వాకిట్ల పెంటకాడికిపోయి పార, తట్టపట్టుకొని నింపుతరు. ఆలుమగలిద్దరు కష్టపడి పెంటను పొలం మడికట్లట్ల పోసుకొచ్చుకుంటరు. ఎందుకంటే ఆయిటి పూనే దాక ఏం పని ఉండది. వాల్ల పెంట జారకొట్టుకున్నంక కుంటల మన్ను జారగొట్టుకుంటరు. మనం అనుకుంటంగానీ ఎన్కట ఊరోల్లకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి ఉండేది. అందుకే ఎట్లాంటి రసాయనిక ఎరువులు వాడకపోయేది.

వరికోసినంక వెంటనే అండ్ల గొర్ల మంద పెట్టిస్తరు. మందపెట్టిచ్చుడు అంటే గొర్లమందను తీసికచ్చి మడికట్లల్ల రాత్రిల్లు ఉంచుతరు. తెల్లారెవరకు అవి ఆ భూమిలోనే విసర్జించేవన్ని ఆ నేలకు జవ. ఆట్లనే నాలుగైదు రోజులు పొలంల అంతట మంద పండ పెడతరు. ఆ తర్వాత పెంట జారగొట్టుడు, ఇంకా ఆ తర్వాత ఊర్లె ఊరచెరువు ర్యాగడె మన్ను జారగొట్టి మడికట్లల్ల పోస్తరు. ఇవ్వి మూడు కుష్కిల, తరిల పోస్తరు అప్పుడు అండ్ల పెట్టిన మక్కజొన్న అయినా వరి అయినా అవ్వల్‌ దర్జాగా పెరుగుతయి. ఇవన్నీ ఎండా కాలం పురుసత్‌గ-చేసుకుంటరు. ఎండలు ముదిరినయి అంటే ఇసోంటి ఎవుసం పనులన్ని చేసుకుంటరు. కమ్మరోల్ల ఇంటికిపోయి కర్రులు మొనపెట్టిచ్చుకునుడు, వడ్లోల్ల ఇంటికిపోయి నాగలి అమిరిచ్చుకునుడు, బండి కమ్ములు మంచిగచేసికునుడు. ఎండకాలంల చేసికునే పని. అట్లనే ఎల్గటి నాగండ్లతోని ఖుష్కి దున్నుతరు. దున్ని నంక భూమిల ఉన్న పురుగులు ఎండకు సచ్చిపోతయి. తర్వాత వానపడంగనే మెత్తగ అయి మల్లా ఇరువాలు మూడుసార్లు దున్ని ఇత్తనాలు ఏస్తరు.

పురుసత్‌ పనులేగాని తాతిపరంగ చేసుకుంటరు. ఇవి ఇట్ల ఉండంగనే ఇంటికాడ ఆడోల్లు చింతకాయ దులుపు కచ్చి చింతపండు ఎండబెడుతరు. చింతపండు కొట్టుకొని యాడాది ఎల్ల కాపాడుకుంటరు. చిన్నపోరగాండ్లు చింత గింజలు ఏరుకొని బస్తాలకు బస్తాలు దాపెట్టుకుంటరు. ఎప్పుడో కొనుక్కపోయే టోల్లు వస్తే అగ్గువకో సగ్గువకో అమ్ముకుంటరు. అట్లనే ఎండుగలు ఎండపోసు కుంటరు. పల్లికాయ కొట్టి ఇత్తనాలు తీస్తరు. ఇంకా ఏం దొరకనోల్లు, యాపచెట్లకిందికి పోయి యాపపండ్లు ఏరుకొస్తరు. యాపపండ్లు సుత ఎరువుగ వాడుతరు. కొందరు యాపకాయ కొనుక్కపోయేవాల్లు వస్తే అమ్ముతరు. చిన్న పోరగాండ్లు అయితె బడి అయిపోయిందనే సంబురంతోని చింతచెట్లకింద, యాపచెట్లకింద ఆటలాడుతరు. ఎన్కట చిర్ర గోనె ఆడేది కాని ఇప్పుడు క్రికెట్‌ ఆడుతరు. కొందరు ఊర్లల్ల ఈతకు పోతరు. ఈత నేర్చుకుంటరు. పట్నాలల్ల సుత పిల్లలకు ఈత నేర్పుతండ్రు. కొత్తకొత్త ఆటలు నేర్సుకుంటండ్రు మల్ల జూన్‌ నెల వచ్చిందంటే బడిలల్లకు పోయే పని ఉంటది. అట్లనే సరిగ్గా అదే సమయానికి ఎవుసం చేసుకునేవాల్లకు కూడా ఇత్తనాలు ఏసే యాల్ల వస్తది. వీల్లు పిండి బస్తాలకు పట్నంబాట పట్టినట్టు పిల్లలు సుత పుస్తకాలకు, పెన్నులకు పట్నం బాట పడుతరు. రెండు నెలలు ఎండకాలం వచ్చిందంటే ఎడ్లకు సుత జరంత పురుసతే దొరుకతది. నీడపట్టున ఉంటయి. అయితె ఇదే ఎండాకాలంల పెండ్లిల్లు సుత అయితయి. పెండ్లిల్లకు, పేరంటాల్లకు పోవుడు వచ్చుడు సుత ఇదే ఎర్రటి ఎండాకాలంల ఉంటయి. ఎంతైనా ఎండకాలం జర పురుసత్‌ కాలం. పనులు చేసికునేటోల్లకు ఇది రిఫ్రెష్‌ అయ్యే కాలం.

అన్నవరం దేవేందర్‌

Other Updates