mbcసమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎం.బి.సి.) అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. బిసి కార్పొరేషన్‌ ను కొనసాగిస్తూనే రాష్ట్రంలో మోస్ట్‌ బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంబిసిడిసి) ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంబిసిలకు బడ్జెట్లోనే నిధులు కేటాయించి, ఎంబిసిడిసి ద్వారా ఖర్చు చేస్తామని సిఎం వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా, ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చినప్పటికీ బిసి కులాల్లోని అత్యంత వెనుకబడిన కులాలు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నాయని, ఎంబిసి కులాల్లోని కుటుంబాలకు వెలుగు రావాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. ఇతర బిసి కులాల అభివృద్ధికోసం కార్యక్రమాలు అమలు చేస్తూనే, ఎంబిసిల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఎంబిసిల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఫిబ్రవరి 20న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్‌, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌, ఎంబిసి సంఘం జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు, వైస్‌ ప్రసిడెంట్‌ నేతికార్‌ ప్రేమ్‌ లాల్‌, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింగ సాగర్‌, వడ్డెర సంఘం అధ్యక్షుడు ఎత్తడి అంతయ్య, వడ్డెర సంఘం సలహాదారు డాక్టర్‌ ఒర్సు కృష్ణయ్య, వంశరాజు (పిచ్చకుంట్ల) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సత్యం, ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రవిశంకర్‌, సగర సంఘం నాయకుడు జె. రాములు, కుమ్మరి సంఘం నాయకుడు శంకర్‌, జల్ల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ఎం.బి.సి. ప్రతినిధులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.

”ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం ఉద్యమ సమయంలోనే చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో బతకాలి. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ సాయం లేక, కుల వృత్తులు క్షీణించి కొన్ని కులాలు, కుటుంబాలు చితికిపోయాయి. వారికి ఆర్థికంగా, రాజకీయంగా చేయూత అందలేదు. వారింకా చీకట్లోనే మగ్గుతున్నారు. ముఖ్యంగా బిసిలలో భాగంగానే ఉన్న ప్పటికీ పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టకపోవడంతో కొన్ని కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలో అలాంటి కులాలను గుర్తించి, అందులోని ప్రతీ కుటుంబం ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని, వారి అవసరాల మేరకు ప్రభుత్వం చేయూత నిస్తుంది. వీరికోసం ప్రత్యేకంగా ఎంబిసి డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, నేరుగా ఈ కార్పొరేషన్‌కే నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తుంది. ఈ డబ్బులు ఎలా ఖర్చు చేయాలనే విషయంలో కూడా ఎంబిసి ప్రతినిధులే కలిసి కూర్చుని నిర్ణయించుకునే విధంగా విధానం ఉంటుంది. ఎంబిసి డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ను కూడా ఎంబిసి ప్రతినిధులతోనే ఏర్పాటుచేస్తాం. రాజకీయ జోక్యం లేకుండా ఎంబిసిల అభ్యున్నతికే కార్పొరేషన్‌ పనిచేసేలా చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

”కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతీ జిల్లాలో ప్రతీ కుటుంబం ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వస్తున్నాం. దీనిలో భాగంగా అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన కుటుంబాల పరిస్థితి కూడా తెలుస్తుంది. ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో గుర్తించి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏమి చేయగలుగుతుందో నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఎం.బి.సి.లలో కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారున్నారు. కుల వృత్తులు కూలిపోవడం వల్ల ఉపాధి కోల్పోయిన వారున్నారు. అసలు కులవృత్తే లేని వారున్నారు. వీరందరికోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలో కూడా నిర్ణయించాలి. ఇంకా మనుగడ సాగిస్తున్న కుల వృత్తులను ప్రోత్సహిస్తాం. అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తాం. వారి కులవృత్తిని ఆధునీకరించడానికి, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తాం. కులవృత్తి నశించి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషిస్తాం. వారు ఏ పనిచేసుకుని జీవిస్తామంటే దానికి సహకారం అందిస్తాం. ఇక వృత్తులే లేని కులాలు కొన్ని ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అవసరాలను బట్టి వారికి ఉపాధి మార్గం చూపెడతాం. ప్రభుత్వమే కొన్ని పనులు కల్పిస్తుంది. ప్రభుత్వ నిర్మాణాలు, కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేస్తుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”ఇంతకాలం తమను పట్టించుకోండని ఎంబిసిలు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాయి. తమనెవరూ పట్టించుకోలేదని ఆ కులాలకు చెందిన వారు ఆందోళన చెందారు. తమను ఎవరూ పట్టించుకోరని నిరాశలో మునిగిపోయారు. తమపై ఫోకస్‌ లేదని చింతించారు. ఇకపై ఆ అవసరం ఉండదు. ప్రభుత్వం ఎంబిసిలకు నేరుగా నిధులు విడుదల చేస్తుంది. మీ కులాలను మీరే అభివృద్ధి చేసుకోండి. ఏ కులానికి ఏ అవసరం ఉందో, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో, వారి కుల వృత్తని ప్రోత్సహించడానికి ఏమి చేయాలో కూడా మీరే నిర్ణయించండి. ప్రభుత్వం కేవలం కావాల్సిన డబ్బులు ఇస్తుంది. మీరే పథకాలు, కార్యక్రమాలు నిర్ణయించు కోండి. ఆచరణాత్మక ధోరణిలో, వాస్తవిక పరిస్థితులను బట్టి ధైర్యంగా ముందుకు పోండి. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ వెంట ఉన్నాడనే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి” అని సిఎం కేసీఆర్‌ ఎంబిసి ప్రతినిధులకు చెప్పారు.

”ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నెలకొల్పిన రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఎంబిసి పిల్లలను చేర్పించండి. వారికి మంచి విద్యను అందించండి. భావితరాలు బాగుపడతాయి. మీరు కూడా ఏ పనిచేస్తే సమాజంలో బతకగలమో, ఏ పనికి డిమాండ్‌ ఉందో అదే ఎంచుకోండి. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ పైసాను వినియోగించుకుని పైకి రండి. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తాం. బ్యాంకుతో లింకు పెట్టకుండానే ఆర్థిక చేయూత అందిస్తాం. వాటితో ఉపాధి పొందండి. తెలంగాణలో ఎంబిసిలు బాగు పడాలి. దేశానికి ఆదర్శం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో మా బతుకు బాగుపడిందని ఎంబిసి కుటుంబాలు సంతృప్తి చెందినప్పుడే నాకు తృప్తి” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.

మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది: కాళప్ప, సూర్యారావు

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తమ గోడు వినలేదని, ఇన్ని గంటల పాటు తమతో మాట్లాడి తమ సమస్యలకు పరిష్కారం చూపిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎంబిసి నాయకులు కాళప్ప, సూర్యారావు తదితరులు అన్నారు. ఎంబిసిల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నేరుగా నిధులివ్వడం చారిత్రిక నిర్ణయమన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎంబిసిల రాత మారుతుందని వారు అన్నారు. ఎంబిసిల కోసం మంచి పథకాలు రూపొందిస్తామని, కేసీఆర్‌ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా చూస్తామని, సమాజంలో తమ కుటుంబాలు ముందడుగు వేయడం ఖాయమని వారన్నారు. సిఎం ఇంట్లో భోజనం చేసి, స్వయంగా సిఎంకే తమ బాధలు, సమస్యలు చెప్పుకోవడంతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇకపై ధైర్యంతో ముందుకుపోతామని వారు ప్రకటించారు. ఎంబిసిలకు కేసీఆరే స్వయంగా ప్రతినిధిగా ఉండి చొరవ చూపడంతో తమలో కొత్త ఉత్సాహం వచ్చిందని వారన్నారు.

Other Updates