sc-st-committeeస్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఎస్సీ, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ.. ఇంకా ఆ వర్గాలలో పేదరికం పోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీలే అత్యంత నిరుపేదరికం అనుభవిస్తున్నారని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి వుందన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంకోసం అందరం కలిసి ఆలోచించి విధానం రూపొందించుకోవాలని, దీనిని పకడ్బందీగా అమలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనుకున్న విధంగా ముందుకు పోతున్నదని, రాష్ట్ర ప్రగతి కూడా బాగుందని సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు దేశంలోనే అత్యధికంగా వుందని, ఈ ఫలితం రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకోసం ఉపయోగపడాలన్నది తమ లక్ష్యమని సీఎం అన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రగతిభన్‌లో జనవరి 27న వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అజ్మీర చందూ లాల్‌, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, జీఆర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, రసమయి బాలకిషన్‌, పిడమర్తి రవి, నల్లాల ఓదెలు, మల్లు భట్టివిక్రమార్క, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, సండ్ర వెంకటవీరయ్య, ఎస్‌. నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్‌, సీతారాం నాయక్‌, పసునూరి దయాకర్‌, నగేశ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

”ఏ వయసు వారికి ఏం చేయాలి? వృద్ధులు, యువకులు, విద్యార్థులకోసం అనుసరించాల్సిన వ్యూహంపై అధ్యయనం చేయాలి. 10-25, 25-50, 50-75 వయస్సులవారీగా వ్యూహం రూపొందించాలి. భావితరానికి మంచి విద్య అందించడం ద్వారా వారికి మంచి జీవితం అందించాలి. అందుకోసం రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రారంభిస్తున్నాం. డిగ్రీ రెసిడెన్షియల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలకోసం రెసిడెన్షియల్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణాల్లో ఇతర కోర్సులు చదివే అమ్మాయిలకు కూడా వసతి కల్పించాలి” అని సీఎం వివరించారు.

‘ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమం ఎప్పటినుంచో అమలులో వుంది. అయినా అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయం జరుగడంలేదు. అవి ఆర్థిక వనరుగా మారలేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అసైన్డ్‌ భూములు ఉపయోగంలోకి రావాలి. ఏ ఊరిలో ఎవరి పేరుపై భూమి వుంది? అది సాగులో వుందా? లేదా? సాగులోకి రావాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలి’ అని సీఎం చెప్పారు.

‘ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీ వేసుకుందాం. ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలి. క్షేత్ర పర్యటన చేయాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకోసం ఏం చేయాలో వారే నిర్ణయించాలి. అన్ని పార్టీల సభ్యులుండే ఈ కమిటీ సిఫారసులు ప్రభుత్వం అమలు చేస్తుంది’ అని సీఎం చెప్పారు.

‘వందశాతం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. నేను చాలా చిత్తశుద్ధితో వున్నాను. మనం తలచుకుంటే తప్పక ఈ వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తీసుకురావడం ఓ మంచి పరిణామం. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది. మంచి ప్రగతిలో ఉన్నాం. గతం అనవసరం. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా ఎస్సీ వర్గాలకు నిజంగా ఏం అవసరమో, ప్రభుత్వం ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దాం. పారదర్శక వ్యూహం వుండాలి. చిత్తశుద్ధితో అమలు చేయాలి. మేము చాలా చిత్తశుద్ధితో వున్నాం. అంకితభావంతో పనిచేసి ఆ వర్గాల్లో మార్పు తెద్దాం. అప్పుడే ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా మనకు సంతృప్తి కలుగుతుంది’ అని సీఎం అభిప్రాయపడ్డారు.

‘పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీలకోసం ఒక ప్రణాళిక, సెమీ అర్బన్‌లోఉండే ఎస్సీ, ఎస్టీలకోసం ఏం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో వుండే వారికోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి. అనే విషయంపై ఆలోచించాలి. మూడు ప్రాంతాల్లో నివసించే వారి జీవన స్థితిగతులు వేర్వేరుగా వుంటాయి. కాబట్టి ఈ మూడు ప్రాంతాల వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి’ అని సీఎం సూచించారు.

‘దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం మంచి ఆలోచనలతో అమలు చేస్తున్నాం. ఇది నిరంతర కార్యక్రమం. వ్యవసాయాధారిత కుటుంబానికి కనీసం మూడు ఎకరాల భూమి వుంటేనే మంచి ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుందని భావించాం. భూమి ఇవ్వడమేకాక, కరెంట్‌, నీళ్లు, ఇతర వసతులు కూడా కల్పిస్తున్నాం. ఇదేవిధంగా గతంలో ఇచ్చిన భూమి కూడా ఉపయోగంలోకి రావాలి. కమతాల ఏకీకరణ జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ వల్ల సాగునీరు అందుతుంది. కాబట్టి వ్యవసాయం కూడా బాగుపడుతుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు కాకుండా, రెవిన్యూ కేపిటల్‌ పేరుతో బడ్జెట్‌ చూపించాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఈ విధానం అనుసరించాలి. మన రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ రూపకల్పన జరగాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మార్పులు రావాలి. మొత్తం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన, వారి నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలి. వారి జనాభా శాతం కంటే కొంచెం అధికంగానే ఖర్చు పెట్టాలి. ఆయా వర్గాలకు నిధులు కేటాయించడం, ఖర్చు చేయడానికి అవసరమైన విధానం ఎస్సీ, ఎస్టీ కమిటీ రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలో పేదరికం పోవాలి. అదే లక్ష్యం కావాలి’ అని సీఎం చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసే విషయంపైనా, చేయాల్సిన మార్పు చేర్పులపైనా ప్రతినిధులు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌పై కార్యాచరణ రూపొందించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చూపిన చొరవను తాము అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు.

‘సాధారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం నిధులు కేటాయించడమేకాక, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి, ప్రత్యేక నిధులు ఇవ్వాలి, ఆ నిధులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాకుంటే, వాటిని మరుసటి ఏడాదికి బదలాయించే (క్యారీ ఫార్‌వర్డ్‌) పద్ధతి అవలంబించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూల్స్‌కూడా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సవరణలు చేయాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం గ్రోత్‌ ఇంజిన్‌ రూపొందించాలి. దీనికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కమిటీ ప్రభుత్వానికి సూచలను చేయాలి’ అని సీఎం కోరారు.

‘ఎస్సీ, ఎస్టీలకోసం కేటాయించిన నిధులు వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఎస్సీ, ఎస్టీల శాఖలద్వారా ఖర్చు చేయాలి. ఈ నిధులు ఎలా ఖర్చు చేయాలి, ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమై కమిటీ సూచనలు చేయాలి. ఈ వర్గాలకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో అవసరం వుంటుంది. దానికి అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన జరగాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘ఎస్సీ, ఎస్టీవర్గాల జీవన ప్రమాణాలను పెంచడానికి రెసి డెన్షియల్‌ స్కూల్స్‌ పెట్టడం మంచి నిర్ణయమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందించారు. ఎస్సీ, ఎస్టీవర్గాల అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఈ సమావేశం నిర్వహించడం, కూలంశంగా చర్చించడం విప్లవాత్మక చర్య అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బదులిస్తూ, అప్పుడే ప్రభుత్వాన్ని అభినందించవద్దని, ఎంతో కొంత మార్పు వచ్చాక అభినందించాలని చెప్పారు. ఓ మంచి అడుగు పడిందని అందుకు అభినందనలు అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కడియం శ్రీహరి, నంది ఎల్లయ్య, కిశోర్‌, రెడ్యానాయక్‌, డా|| రాజయ్య, గీతారెడ్డి, సంపత్‌ తదితరులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు తెలంగాణ అఖిలపక్షంను ఢిల్లీకి పంపుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్‌ ఎస్టీలకు సంబంధించిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవను అభినందించారు. ‘ఇంతకాలం ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఇతరులు నిర్ణయించే వారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఏమి కావాలో ఆ వర్గాలనుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులే నిర్ణయించాలి. అందుకే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కార్యక్ర మాలు ప్రజాప్రతినిధులతో చేసిన కమిటీయే రూపొంది స్తుంది. ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సమావేశంలోనే ఎస్సీ, ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఎస్సీ కమిటీ: అధ్యక్షుడు: కడియం శ్రీహరి, సభ్యులు: నంది ఎల్లయ్య, బాల్క సుమన్‌, ఎం.ఎస్‌. ప్రభాకర్‌, సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సంపత్‌కుమార్‌, నల్లాల ఓదెలు, రసమయి బాలకిషన్‌, కిశోర్‌, సంజీవరావు, ప్రత్యేక ఆహ్వానితులు: కొప్పుల ఈశ్వర్‌.

ఎస్టీ కమిటీ: అధ్యక్షుడు: మంత్రి చందూలాల్‌, సభ్యులు: డీఎస్‌ రెడ్యానాయక్‌, సీతారాం నాయక్‌, నగేష్‌, రామునాయక్‌, కోవ లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు

Other Updates