sc-st-aasaraరాష్ట్రంలో ఎస్‌.సి., ఎస్‌.టి.ల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై జనవరి 6న శాసనసభలో షెడ్యూల్డుకులాల అభివృద్ధి శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి ఓ ప్రకటన చేశారు.
సామాజికంగా, ఆర్థికంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీవర్గాల నిజమైన అభ్యున్నతికోసం వాస్తవిక దృక్పథంతో ఆలోచించి, కార్యాచరణకు పూనుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడమే కాకుండా, ఆ అభివృద్ధి ఫలాలను పొందే చైతన్యాన్ని కూడా ఆ వర్గాల్లో పెంపొందించాలి. తద్వారా ఎస్సీ, ఎస్టీల జీవితాలలో గుణాత్మకమైన మార్పును తీసుకురావాలి. ఇంతకాలంగా ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు రచించినా, ఎంతో ధనం వెచ్చించినా, దళితవాడలు, ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు ఇంకా పేదరికానికి, వెనుకబాటుతనానికి గుర్తులుగానే మిగిలున్నాయి. తరతరాల వెనుకబాటుతనం కేవలం పైపై పూతలతో సమసిపోయేదికాదు. దేశమూ, రాష్ట్రమనికాదు.. అన్ని వ్యవస్థలూ, అన్ని సమూహాలు పూనుకుని దళితవాడలనుండి దారిద్య్రాన్ని తరిమికొట్టాలి అనే దృఢసంకల్పంతో కదలినప్పుడే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో సమగ్ర వికాసం సాధ్యమవుతుంది.

తెలంగాణ బడుగు, బలహీనవర్గాల రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 85 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలే ఉన్నారు. వీరిలో ఎక్కువశాతంమంది నిరుపేదలే. సామాజిక అంతరాలలో ఎస్సీ, ఎస్టీవర్గాలు చిట్టచివరన ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన దారుణమైన వివక్ష, అన్నివర్గాల ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించింది. సమాజం చివరి అంచున ఉండే ఎస్సీ, ఎస్టీ బతుకులను ఈ వివక్ష మరింత అల్లకల్లోలం చేసింది. వారు పొట్టచేత పట్టుకుని చెట్టుకొకరు, పుట్టకొకరు అయి బతకాల్సిన దుస్థితి ఏర్పడ్డది. తెలంగాణ ఆవిర్భావంతోనే ఈ వర్గాల ప్రజల్లో తిరిగి ఆత్మవిశ్వాసం నెలకొల్పవచ్చని మేము ఉద్యమ సమయంనుంచి చెబుతూ వస్తున్నాం.

విచ్ఛిన్నమైన తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాల జీవిక పూర్తిగా చెదిరిపోయింది. కాబట్టి సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్నది. అందుకే రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ రంగానికే కేటాయించింది.

తెలంగాణ రావడానికి ముందు ఎస్సీ, ఎస్టీల విషయంలో అమలులో ఉన్న యాంత్రిక వైఖరికి భిన్నంగా మేము సృజనాత్మకమైన, ఆచరణయోగ్యమైన పంథాను అనుసరిస్తున్నాం. ఇదే ఉద్దేశ్యంతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిశాఖలుగా మార్చాం. సంక్షేమంపేరుతో అరకొర చర్యలు చేపట్టి, ఏదో చేశామనే పేరు పొందాలనే సంకుచిత వైఖరిని మేము అవలంభించదలుచుకోలేదు. రూపొందించిన ప్రతీ పథకం, ఇచ్చిన ప్రతీ పైసా వారి అవసరాలను నిజంగా తీర్చాలి. వారి కడుపు నింపాలి. వారి బతుకు నిలబెట్టాలి. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు మూడెకరాల పథకం ఈ స్ఫూర్తికొక మచ్చుతునక.

1983నుంచి దళితులకు భూపంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 32 ఏండ్లలో 16 ఏండ్లు కాంగ్రెస్‌ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పటినుంచి 2014 దాకా తెలంగాణలో 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచినట్లు రికార్డుల్లో ఉంది. ఒక్కొక్కరికి అర ఎకరం, ఎకరం, ఎకరంబావు చొప్పున భూమిని పంచారు. ఎక్కువ శాతం వ్యవసాయ యోగ్యంకాని భూమినే పంచిపెట్టారు. గుట్టల్లో, బోళ్లో, చెట్టున్నయో, పొదలున్నయో, చవుడో, బీడో, ఏదో ఒకటి అన్నట్టుగా ఈ భూముల పంపిణీ తంతు జరిగింది. వీరు పంచినట్టు, వారు పొందినట్టు అయిందికానీ, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇలా పంచిపెట్టిన భూమి చాలావరకు అయితే అక్కరకు రాకుండా పడిఉండడమో, లేదా అన్యాక్రాంతం అయిపోవడమో జరిగింది. మొత్తంమీద చూస్తే ఈ భూమి పంపిణీ ద్వారా దళితులు, రైతులయిందీ లేదు. వ్యవసాయం చేసిందీ లేదు. వారి జీవితాలు బాగుపడింది అంతకంటే లేదు.

సామాజికవేత్తల అంచనా ప్రకారం ఒక కుటుంబానికి మూడెకరాల భూ వసతి కల్పిస్తే, అది వారు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అనువైన వనరుగా ఉపయోగ పడుతుంది. అందుకే మా ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసా యాధారిత పేద దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే తెలంగాణలో ఈ రెండున్నరేళ్లలో 3671 మంది దళితులకు వ్యవసాయోగ్యమైన భూమి ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున 9663 ఎకరాలను పంపిణీ చేశాము. 32 సంవత్సరాల కాంగ్రెస్‌, టీడీపీ ఏలుబడిలో దళితులకు ఏడాదికి సగటున 1243 ఎకరాలు పంచితే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లకాలంలో ఏడాదికి సగటున 3865 ఎకరాలు పంపిణీ చేసింది. దళితుల భూపంపిణీ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం 16 ఏండ్లలో పెట్టిన ఖర్చు 2.65 కోట్లు. టీడీపీ ప్రభుత్వం 16 ఏండ్లలో పెట్టిన ఖర్చు 71.01 కోట్లు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో పెట్టిన ఖర్చు 405.66 కోట్లు. వ్యవసాయోగ్యమైన భూమి ఇవ్వడంతో సరిపుచ్చకుండా ఆ భూమిలో వారు వెంటనే వ్యవసాయం ప్రారంభించడానికి వీలుగా బోరు వేయించి, కరెంటు కనెక్షన్‌ ఇప్పించి, మోటారును కూడా బిగించి ఇస్తున్నాం. ఈ సదుపాయాలన్నిటితోపాటు మొదటి పంటకు అవసరమైన పెట్టుబడిని కూడా సమకూరుస్తున్నాం. దీన్ని బట్టి మేము అనుసరిస్తున్న దళితులకు భూమి పంపిణీ పథకం ఎంత సమగ్ర దృష్టితో కూడుకున్నదో ప్రజలు ఈ రోజు తమ అనుభవం ద్వారానే తెలుసుకుంటున్నారు. భూపంపిణీ దళిత కూలీలను నిజంగానే వ్యవసాయం చేసే రైతులను చేసింది. ఇది మాకెంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తున్నది. శ్రమజీవులైన దళిత మహిళలకు సాధికారి కతను కల్పించడంకోసం భూమి పట్టాను మహిళ పేరుతోనే అందిస్తున్నాం. దళితులకు భూ పంపిణీ నిర్ణీతకాల వ్యవ ధిలో ముగిసే కార్యక్రమం కాదు. ఇది ఒక నిరంతర కార్య క్రమం. రానున్న సంవత్సరాలలో కూడా భూమి లభ్యతకు అనుగుణంగా భూ పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల ఆర్థిక, సామాజిక ప్రగతికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్‌ పథకం అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు రాజకీయావకాశాలు పెంచేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌ విధానం ప్రవేశపెట్టాం. దీనివల్ల తెలంగాణలో 25మంది ఎస్సీ రైతులు, 10మంది ఎస్టీ రైతులు మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్లు కాగలిగారు. షెడ్యూల్డ్‌ ఏరియాలోని 13 వ్యవసాయ మార్కెట్లలో కూడా ఎస్టీలే మార్కెట్‌ ఛైర్‌పర్సన్లయ్యారు. ఎస్సీ, ఎస్టీ రైతులు నాయకులుగా ఎదగడానికి, మార్కెట్‌ వ్యవహారాల్లో ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం పెరిగేందుకు ఈ రిజర్వేషన్లు ఎంతగానో దోహదపడతాయి.

దళితులు విద్యావంతులైనప్పుడే సామాజిక పరివర్తన సాధ్యమని అంబేద్కర్‌ మహాశయుడు నిరంతరం బోధించాడు. ఈ రోజు తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీవర్గాలలో ఒక తరాన్ని కనుక పట్టుపట్టి విద్యావంతులుగా మార్చగలిగితే తెలంగాణ సామాజిక స్వరూపమే మారిపోతుందని మేం విశ్వసిస్తున్నాం. అనేక కారణాలవల్ల ఎస్సీ, ఎస్టీలు చదువుకు దూరమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలలో నేటికీ అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉంది. కొంతమంది చదువు ప్రారంభించినా పరిస్థితులు అనుకూలించక డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారు. నిజానికి వీరు డ్రాపవుట్స్‌ కాదు. సమాజం అండ దొరకక పోవడంవల్ల విద్యకు దూరమైపోతున్న పుషవుట్స్‌. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చి తీరాలని మేము ఉద్యమకాలంలోనే అనుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యావిధానం అమలు చేస్తామని ప్రకటించాం. ప్రభుత్వరంగంలోని విద్యాసంస్థలను బలోపేతం చేసినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు చదువుకునే అవకాశం కలుగుతుంది. తమ పిల్లలను చదివించేందుకు శక్తిచాలక చాలా మంది పిల్లల్ని బడిలో చేర్చడం లేదు. విద్యార్థుల సమగ్ర పోషణతోపాటు గ్లోబల్‌ ప్రమాణాలకు ధీటుగా ఇంగ్లీషు మీడియంలో విద్యను అందించాలంటే రెసిడెన్షియల్‌ విద్యావిధానాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ గురుకులాలతోనే కేజీ టూ పీజీ విద్యావిధానానికి తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో కొత్తగా ఎస్సీలకోసం 103, ఎస్టీలకోసం 51 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశాం.

ఉన్నత చదువులు చదవడానికి ఎస్సీ విద్యార్థినులు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ విద్యార్థినులకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 30 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు మంజూరు చేశాం. ఈ ఏడాది 23 ప్రారంభించాం. వచ్చే ఏడాది మిగతా ఏడు డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నాం. పీజీతోపాటు ఇతర కోర్సులు చదివే దళిత అమ్మాయిలకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హాస్టళ్లు నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాతవి, కొత్తవీ కలిపి మొత్తం 413 ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 2 లక్షల 58వేలమంది విద్యార్థులు చదువుకోగలుగుతారు.

ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్ళే ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఈ రెండున్నరేళ్లలో 283 మంది ఎస్సీ, 85మంది ఎస్టీ విద్యార్థులు ఒవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పొంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఒవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా తెలంగాణ వచ్చే నాటికి కేవలం 42మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీలకు మాత్రమే ఆర్థిక సహాయం అందింది. కానీ ఈ రెండేళ్లలో 283 మంది ఎస్సీలు, 63మంది ఎస్టీలు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. తెలంగాణ వచ్చే నాటికి ఒవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకంమీద పెట్టిన ఖర్చు 4.60 కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు 42.76 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉండేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా 9 స్టడీ సర్కిల్స్‌ మంజూరు చేసి, పాత పది జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎస్సీ స్టడీ సర్కిళ్లున్నాయి. ఎస్టీ జనాభా ఎక్కువున్న జిల్లాల్లో కొత్తగా ఎస్టీ స్టడీ సర్కిళ్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే విద్యా సంవత్సరంనుంచి కొత్తగా మరికొన్ని ఎస్టీ స్టడీ సర్కిళ్లు ప్రారంభమవుతాయని ఈ సభద్వారా ప్రకటిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకుని బాగా ఎదగాలని, భవిష్యత్‌ తెలంగాణ ప్రగతిరథ సారథులు వారే కావాలనే ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది.

సమాజంలో ఆడపిల్ల అంటేనే గుండెలమీద కుంపటి అనే భావన ఉంది. పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి ఒక ఆర్థిక భారంగా మారింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆడపిల్ల పెళ్లితో మోయలేనంత అప్పుల బరువుతో కుంగిపోతున్నాయి. ఆడపిల్లలను పురిట్లోనే చంపేయడం, పుట్టిన పిల్లలను అమ్మేసుకోవడంవంటి అమానవీయ సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. అందుకే పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలని ప్రభుత్వం భావించింది. కళ్యాణలక్ష్మి పథకం తెచ్చింది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయని ఆలోచన. ఇప్పటిదాకా 51,287 మంది ఎస్సీలకు, 28,839 మంది ఎస్టీలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి 51,000 రూపాయల చొప్పున మొత్తం 408.64 కోట్ల రూపాయలు అందించాం. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకానికి అర్హులనే ప్రభుత్వ నిబంధనవల్ల, బాల్యవివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల పెండ్లి భారం తగ్గడమేకాకుండా బాల్య వివాహాలు తగ్గిపోవడమనే సామాజిక ప్రయోజనం కూడా నెరవేరుతున్నది.

ఎస్సీ, ఎస్టీవర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ రాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఎంటర్‌??న్యువర్స్‌, అనే కొత్త కార్యక్రమం అమలు చేస్తున్నది. దీనిద్వారా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఇచ్చే పవర్‌ సబ్సిడీని రూపాయినుంచి రూపాయిన్నరకు పెంచాము. చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీలు రుణాలపై కేవలం పావలా వడ్డీ మాత్రమే చెల్లించే వెసులుబాటును కొనసాగిస్తున్నాం. ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ కార్యక్రమం ద్వారా పరిశ్రమల స్థాపనకు అయ్యే వ్యయంలో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కిచ్చే సబ్సిడీని ఐదుశాతం పెంచి 45 శాతం ఇస్తున్నది. సేల్స్‌టాక్స్‌ మినహాయింపును 50నుంచి వందశాతానికి పెంచాం. టీఎస్‌ ప్రైడ్‌ద్వారా 2,875మంది ఎస్సీలు, 1280 మంది ఎస్టీలు ప్రభుత్వం అందించే ప్రయోజనం పొందారు. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికరంగంలో ఎదుగుతుండడం మనందరికీ గర్వకారణం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రాయితీలవల్ల ఎస్సీలు 125.46 కోట్లు, ఎస్టీలు 66.41 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీలకు తగు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌ కల్పించబోతున్నాం. దీనికి సంబంధించిన విధివిధానాలు తయారవుతున్నాయి.

ఎస్సీ, ఎస్టీవర్గాల్లోని యువకులు స్వయం ఉపాధి పొందేందుకు అమలు చేస్తున్న ఎకనామికల్‌ సపోర్టు స్కీమ్‌లో కూడా సబ్సిడీలు గణనీయంగా పెంచాం. గతంలో గరిష్టంగా లక్ష రూపాయలు, 60 శాతానికి మించకుండా ఉండేది. ఇప్పుడు గరిష్ఠ పరిమితిని 5 లక్షలకు పెంచాం. ఈ రెండున్నరేళ్లలో 32,041 మంది ఎస్సీలకు, 14,732మంది ఎస్టీలకు స్వయం ఉపాధికోసం రూ. 380 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందించాం.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్‌ మాత్రమే లభించింది. తెలంగాణ ఏర్పడడంవల్ల ఎస్టీల జనాభా 9 శాతానికి పెరిగింది. రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని మేము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఎస్టీల రిజర్వేషన్‌ పెంచే విషయాన్ని పరిశీలించేందుకు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం చెల్లప్ప కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ రాష్ట్రమంతా పర్యటించింది. వివిధ వర్గాలను కలిసింది. అందరి అభిప్రాయాలు తీసుకుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్‌ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఎస్టీ రిజర్వేషన్‌ పెంపు బిల్లు సభలో ప్రవేశపెడతామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను.

ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా లేకపోవడంవల్ల గిరిజన తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయనే అభిప్రాయం ఎస్టీవర్గాల్లో ఉంది. ఇది వాస్తవం కూడా. తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలనే డిమాండ్‌ ఎన్నటినుంచో వస్తున్నది. అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. గతంలో పరిపాలించిన పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, తర్వాత ఆ విషయాన్ని మరచిపోయేవి. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే విషయంలో చిత్తుశుద్ధితో ఉంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నాటికి తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఈ సభద్వారా ఎస్టీ సోదరులకు తెలియజేస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులది గొప్ప పాత్ర. వారిలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాల వారే ఎక్కువున్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్రను గుర్తించి, గౌరవించేందుకు ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. అందులో మొత్తం 550 మంది కళాకారులకు ఉద్యోగాలు వస్తే, వారిలో 319మంది ఎస్సీలు, 38మంది ఎస్టీలున్నారు.

నేను ముందే చెప్పినట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దాదాపు 30వేల కోట్ల రూపాయలతో 33 సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదల సంక్షేమంకోసం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలద్వారా ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అంటే, పేదలకోసం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నేరుగా అందుతున్నది.

వివిధ సందర్భాల్లో ప్రత్యేకత చాటుకుంటున్న ఎస్సీ, ఎస్టీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన పూర్ణ, ఆనంద్‌ అనే విద్యార్థులను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఘనంగా సన్మానించడంతోపాటు చెరో 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహం అందించాం. వారిద్దరి కుటుంబాలకు చెరో ఐదెకరాల స్థలం కూడా కేటాయిస్తున్నాం. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అజ్మీరా బాబి పైలట్‌ శిక్షణ కోసం 25 లక్షల రూపాయల సహాయం అందించాం.

సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభాపరంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని మా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన నిధులనేకాకుండా, అంతకన్నా ఎక్కువ మొత్తాన్నే ఆయావర్గాల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నదని సగర్వంగా ప్రకటిస్తున్నాము. గతంతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలోనే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎక్కువ సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేశామనే వాస్తవాన్ని సభ దృష్టికి తెస్తున్నాము.మూడు నెలల్లో మరిన్ని నిధులు ఎస్సీ, ఎస్టీలకోసం ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఎస్సీ, ఎస్టీల స్థితిగతులు మార్చేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మిగతా వారితో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటివరకు చెప్పిన లెక్కలు, వివరాలు మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికోసం చేపట్టిన కార్యక్రమాలు గతంలోకన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ, ఇంకా చేయాల్సింది చాలానే ఉన్నదని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రెండువర్గాల పురోభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రచించి, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఈ సభద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సమాన అభివృద్ధి పొందినప్పుడే బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటుంది.

ఆసరా పెన్షన్లు అందుకుంటున్నవారిలో 4,66,167 మంది ఎస్సీలు, 2,34,817మంది ఎస్టీలున్నారు.

పెన్షన్‌ పొందుతున్న బీడీ కార్మికుల్లో ఎస్సీలు 27,034 మంది, ఎస్టీలు 3,909 మంది ఉన్నారు.

రుణమాఫీ పొందిన రైతుల్లో 6,01,024 మంది ఎస్సీలు, 4,57,474మంది ఎస్టీలున్నారు.

ఆరు కిలోల బియ్యం అందుకుంటున్న వారిలో 63,39,709 మంది ఎస్సీలు, 19,56,805 మంది ఎస్టీలున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్న విద్యార్థుల్లో 2,34,708 మంది ఎస్సీలు, 1,27,007మంది ఎస్టీలున్నారు.

హాస్టళ్లు, స్కూళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్న కారణంగా 6,56,509 మంది ఎస్సీ విద్యార్థులు, 2,03,205మంది ఎస్టీ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.

ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిలో 5,51,747మంది ఎస్సీలు, 3,87,190మంది ఎస్టీలున్నారు.

మిషన్‌ భగీరథద్వారా నల్లా ద్వారా మంచినీరందుకునే వారిలో ఎస్సీ కుటుంబాలు 1,68,281, ఎస్టీలు కుటుంబాలు 71,604.

పేద వృద్ధ కళాకారులకందించే పెన్షన్‌ పథకంలో 25 శాతం ఎస్సీ, ఎస్టీలు ప్రయోజనం పొందుతున్నారు.

2011-12లో ఎస్సీలకు 2,152 కోట్లు, ఎస్టీలకు 929 కోట్లు ఖర్చు పెట్టారు.

2012-13లో ఎస్సీలకు 2,127 కోట్లు, ఎస్టీలకు 1023 కోట్లు ఖర్చు పెట్టారు.

2013-14లో ఎస్సీలకు 2,042 కోట్లు, ఎస్టీలకు 833 కోట్లు ఖర్చు పెట్టారు.

తెలంగాణ వచ్చిన తర్వాత లెక్కలు గమనిస్తే ఎస్సీలు, ఎస్టీలకు మా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం అవుతుంది.

2014-15లో ఎస్సీలకు 2,913 కోట్లు, ఎస్టీలకు 1,728 కోట్లు ఖర్చు చేశాం.

2015-16లో ఎస్సీలకు 4,601 కోట్లు, ఎస్టీలకు 3,187 కోట్లు ఖర్చు చేశాం.

2016-17లో ఇప్పటిదాకా 4,515 కోట్లు, ఎస్టీలకు 2,907 కోట్లు ఖర్చు చేశాం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 2013-14లోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం చేసింది. దాని ప్రకారమే నిధులు కేటాయించి, ఖర్చు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరం ప్లాన్‌ బడ్జెట్‌లో ఖర్చు చేసింది 17,583 కోట్ల రూపాయలు. అందులో ఎస్సీలకోసం చేసిన ఖర్చు 2,042 కోట్లు, ఎస్టీల కోసం చేసిన ఖర్చు 833 కోట్లు. అంటే ప్రణాళికా వ్యయంలో ఎస్సీల కోసం 11.61 శాతం, ఎస్టీల కోసం 4.74 శాతం మాత్రమే ఖర్చు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత, 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయంలో ఎస్సీలకు 12.32 శాతం, ఎస్టీలకు 7.30 శాతం నిధులు ఖర్చు చేశాము.

2015-16 సంవత్సరంలో 11.52 ఎస్సీలకు, 7.98 ఎస్టీలకు ఖర్చు చేశాము.

2016-17లో ఇప్పటికే ఎస్సీలకు 13.20 శాతం, ఎస్టీలకు 9.18 శాతం ఖర్చు చేశాం.

మొత్తం బడ్జెట్‌ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలకోసం ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు సబ్‌ప్లాన్‌ కన్నా చాలా ఎక్కువగా ఉంది. 2016-17 సంవత్సరంలో సబ్‌ప్లాన్‌ ద్వారా ఎస్సీలకోసం చేసిన ఖర్చు 4,515 కోట్లు. ఎస్టీలకోసం చేసిన ఖర్చు 2,907 కోట్లు. అదే సమయంలో మొత్తం బడ్జెట్లో ఎస్సీల కోసం చేసిన ఖర్చు 6,347 కోట్లు, ఎస్టీలకోసం చేసిన ఖర్చు 3,942 కోట్లు. ఇదంతా 9 నెలల సమయంలో చేసిన ఖర్చు.

Other Updates