ఆవిర్భవించిన తర్వాత సాగునీరు త్రాగునీరు మొదలుకొని అన్నిరంగాలలో అభివృద్ధి నిరంతరా యంగా సాగుతున్నది. దీనితోపాటు తెలంగాణ చరిత్ర లో మరుగున పడి పరిశోధనకు నోచుకోని సాంస్కస్కృ తిక, సాహిత్య, కళా, విజ్ఞాన శాస్త్ర రంగాలలోని విశేషాలను వెలికితీసే ప్రయత్నాలు కూడ జరగటం ముదావహం. ఈ పరిశోధనలలో ఆదిమానవుల కాలం నుండి వివిధ విషయాలకు సంబంధించిన ఎన్నో చారిత్రిక ఆధారాలు బయటపడుతున్నవి. ప్రజల ఆరోగ్యం, రోగాలు, చికిత్సలు, మందులు అవి చేసే విధి విధానాలు బాగా విస్తరిల్లి ఉంటాయనటంలో సందేహం లేదు. ఇంకా పరిశోధించి తెలిసికొన వలసినదెంతో ఉన్నది.స్థాలీపులాకంగా కొన్ని వైద్య విషయాలు.

భారతదేశంలోను తెలంగాణలోను ప్రజలరోగాలను పోగొట్టి ఆరోగ్యాన్ని కాపాడుతున్నది ఆయుర్వేద శాస్త్రమే.అనాదిగా నున్నప్పటికి చారిత్రికమైన ఆధారాలు క్రీస్తుకు పూర్వం తెలంగాణలో తక్కువ.సిద్ధనాగార్జునుడు పేరెన్నికగన్న రసశాస్త్రాచార్యుడు. నాగార్జునరచిత

ములైనవిగా చెప్పబడిన గ్రంథాలలో కొన్ని లభించినవి. ఇతడు రససిద్ధిని సాధించి ప్రపంచాన్ని దారిద్య్రం నుండి రోగాలనుండి విముక్తం చేస్తానని ప్రతిన పూనినవాడు. బుక్కరాయల కాలం నాటి మాధవాచార్యులు సర్వదర్శనసంగ్రహమనే తన గ్రంథంలో రసవాదాన్ని వివరించినాడు. అలంపురంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరాలయం ఒకప్పుడు రసశాస్త్రప్రయోగశాల యని కొందరు పరిశోధకుల అభిప్రాయం. శ్రీశైలం పాతాళగంగ సమీపంలో సిద్ధనాగార్జునుని శిష్యుడు ఆత్రేయుడనే వైద్యాచార్యుడు ఒక వైద్యశాలను నెలకొల్పి మూలికావైద్యం చేసినాడు.

కరీంనగర్‌ వెలిగందల దగ్గరి రామగిరిలో గ్రాదిత్యాచార్యుడనే జైనుడు కల్యాణకారకమనే వైద్యవృత్తివారికి చాల ఉపయోగకరమైన గ్రంథాన్ని రచించినాడు. జైనుడైనందున ఇందులో తేనె వాడ కాన్నిపేర్కొనలేదు. తెలంగాణలో వ్రాయబడి లభించిన మొదటి ఆధికారిక ఆయుర్వేద పుస్తకం ఇదేనేమో.

తెలంగాణలో స్వర్ణయుగమైన కాకతీయుల ఏలుబడిలో వైద్యం మంచి ఆదరణను పొందింది. మల్కాపురం శాసనం అక్కడ ఒక ప్రసూతిశాల, ఆరోగ్యశాల ఉన్నట్లు తెలుపుతున్నది. అట్లే రాజధాని ఓరుగల్లులోను మంత్రకూటం, చంద్రవల్లి, కొమ్మూరు, అలంపురం మొదలైన చోట్ల నెలకొల్పినట్లు ఆధారాలున్నవి. గన్నయమంత్రి కుమారుడైన గణపనా రాధ్యుడు స్వరశాస్త్రమంజరి అనే యోగశాస్త్ర గ్రంథాన్ని రచించినాడు. ఇందులో ప్రాణాయామ పద్ధతులద్వారా ఆరోగ్యరక్షణ చేయటంతో బాటు రోగనిదానం చికిత్సలుకూడ వివరించినాడు. వైద్యశాలలలో మూలికా వైద్యులతోబాటు శస్త్ర చికిత్సకులుగూడ ఉండేవారని తెలుస్తున్నది. కాకతీయుల పరిపాలనా పద్ధతులలో బాహత్తర(72) నియోగాధి పతులుండేవారు. అందులో నరవైద్య, గజవైద్య, పశువైద్య, అశ్వవైద్యులున్నారు. నరవైద్య అనే వ్యవహారం కొన్ని శాసనాలలో

ఉన్నందున అశ్వగజపశువైద్యులు అందరికీ అందుబాటులో నున్నట్లు ఊహించవచ్చు. అందుకే నరవైద్యులనే వ్యవహారం వచ్చింది. తెలుగుసాహిత్యంలో వివిధ జ్వరాలు, మందులు, చికిత్సలు మొదలైన ఎన్నో విశేషాలు ఉన్నవి.

మధ్యయుగంలో యుద్ధాలు తరుచుగా జరుగుతుండేవి. సైన్యంతో యుద్ధ విద్యలోను శస్త్రవైద్యంలోను నిష్ణాతులు ఉండేవారు.1034 నాటి సైదాపురశాసనంలో అగ్గళయ్య అనే వైద్యుడు పేర్కొనబడినాడు. ఇతడు ప్రాణాచార్యుడు, శస్త్రచికిత్సలోను రసాయన శాస్త్రంలోను దిట్ట. పొట్లకెరె అనగా నేటి పటాన్‌చెరువు నుండి హన్మకొండవరకు వైద్యం చేసేవాడు. ఇతడు వైద్య రత్నాకరుడని, ఉమాతంత్రం మొదలైనవాటిలో నిష్ణాతుడని ప్రశంసింపబడినాడు. పరమయోగివిలాసంలో ఆనాటి వైద్యుల వేష భూషలు వర్ణింపబడినవి. ఓరుగల్లులో మందులను అలంకార ద్రవ్యా లను సౌందర్యసాధనాలను ఆడవారు తిరుగుతు అమ్మేవారు. అందులో సుసరభేత్తు అనే రోమసంహారిణిని అమ్ముతున్నట్లు క్రీడాభిరామం పేర్కొన్నది.

మధ్యయుగంలో పరహితవైద్యులనే సంప్రదాయమో, వంశాలో ఉన్నట్లు మూడునాలుగు శాసనాల ద్వారా తెలియవచ్చింది. వీరు బహుశః విషవైద్యంలో నిష్ణాతులై ఉంటారు. ఒక వైద్యుడు అడవిలోపోతూ పామొకటి కప్పను మ్రింగుతూ దాని ఎముక గ్రుచ్చుకొని బాధపడటం చూస్తాడు. ఎముకను తీసి పాముకు చికిత్సచేసినందున అతనికి పరహితుడనే పేరు సార్థక మైనదని మండూకశల్య వ్యథితసర్పప్రాణా భిరక్షణాత్‌ అని శాసనం తెలుపుతున్నది. కె.బి.మ్యూజియం అనే శాసనం ఒక కుటుంబంలోని ఐదుగురు వైద్యులను ప్రస్తావించింది. మొదటి త్రివిక్రముడు రసశాస్త్రంలో భరతుడు, చికిత్సాశాస్త్రంలో ధన్వంతరి సమానుడు, గజాయుర్వేదం ఆయుర్వేదంలో వత్సరాజు, కత్తిసాములో మాద్రేయుడు అని ఉన్నది. దీనినిబట్టి ఇతడు సైన్యం వెంట వెళ్ళేవాడని తెలుస్తున్నది.ఇతని కొడుకు మేడయ పరహితుడు. అతని కొడుకు గుండయ పరహితుడు వైద్యవిద్యావిలాస బిరుదు గలవాడు. తరువాతితరం భీముడు జైనవైద్యసంప్రదాయంలో నిష్ణాతుడు వైద్యవిద్యాధర బిరుదాంకితుడు. ప్రసూతివైద్యంలోను కుశలుడు. ఇంకొక విశేషం ఈ కుటుంబం చతుర్థకులం కావటం.కాకతీయ శాసనాలనుబట్టి ఆనాడు గ్రామాలలో ఆలయాన్ని సత్రాన్ని నిర్మించి తగినట్లుగా విద్యా, వైద్య, నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటుచేసేవారని తెలుస్తున్నది.

పదకొండవ శతాబ్దంలో నారాయణుడనే వైద్యవంశీయుడు జైనాల యాన్ని పునరుద్ధరించి జలయంత్రరాటాన్ని దానం చేసినట్లు శాసన సమాచారం. ఇతడు రాజ వైద్యుడైన బేతరస ప్రెగ్గడ కొడుకు. క్రీ.శ.1117 నాటి శాసనం వైజదండనాథుడు రెండవ బేతరాజు వద్ద మంత్రిగా, సైనికవైద్యాధికారిగా నున్నట్లు తెలుపుతున్నది. స్వర్ణయుగమైన విజయ నగర సామ్రాజ్య కాలంలోని వైద్య ఆరోగ్య విషయాలేమీ తెలియరాలేదు. బుక్కరాయలనాటి లక్ష్మణపండితుడు వైద్యరాజవల్లభమనే ఉగ్ద్రంథాన్ని రచించినాడు. దీని పీఠికలో ఆనాటి రాజ్యవిశేషాలు సంగ్రామాలు మొదలైనవి వివరించినాడు. దాని ఒక తాళపత్రప్రతి మైసూరులో నుండి ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదు.

పాలమూరు అమరాబాదు దగ్గరి మాచారంలో చెంచుబీసన్న అనే గతశతాబ్దప్రారంభపు వైద్యునికి తెలియని మూలిలు లేవని ప్రతీతి. అతని గుడిసె ఒక వైద్యశాలగా నుండెడిదట. కొల్లాపురం రాణీకేదో వ్యాధి సోకి ఎందరు చికిత్స చేసినా తగ్గలేదట. బీసన్నను పిలిపించి వైద్యము చేయించగా తగ్గినది. అలంపురంలోని వెల్లాల పరశురామ శర్మ వారి పూర్వీకులు వైద్యవృత్తిలో పేరెన్నికగన్నవారు. పానుగంటివారు, చక్రవర్తుల వారు, విక్రాలవారు కొన్నితరాలుగా సంస్థానపాలకులకు రాజవైద్యులు. వనపర్తి దగ్గరి రామకృష్ణాపురం వాస్తవ్యులు హకీం బుక్కా లక్ష్మయ్య ప్రసిద్ధ వైద్యుడే గాక కవికూడ. అతని కొడుకు సిద్ధాంతి గూడ వైద్యుడు కవి. సిద్ధాంతి వ్రాసిన అశ్వశాస్త్రం 80 సంవత్స రాలక్రితం ప్రకటింపబడిన

ఉత్తమమైన గ్రంథం. అష్టాంగహృదయం ఆధారంగా తెలుగు పద్యాలలో వ్రాసిన బాహటం చుండి లింగనార్యకృతం. ఇతడు సుప్రసిద్ధ ఎలకూచి బాలసరస్వతి శిష్యుడు. హైదరాబాదు సమీపంలోని వేంకటరాజు వేంకటరాజీయమనే వైద్య గ్రంథాన్ని రచించినాడు. దీనిని ప్రఖ్యాత కవి వైద్యుడు చెర్విరాల భాగయ్యకవి ముద్రించి నారు. పాలమూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతంవాడైన రాఘవాచారి ఇరువది ఐదు శ్లోకాల చమత్కార నిఘంటువును రచించినాడు. సంస్కృత విద్యార్థులు అమరకోశాన్ని వల్లె వేసినట్టు వైద్యులీ చమత్కార నిఘంటువును కంఠస్థం చేసేవారని లోకా లక్ష్మయ్య అన్నారు. కాని ఎందుకో ఇది ఇతర ప్రాంతాలలో ప్రచారానికి నోచుకోలేదు. ఇక్కడ కూడ మరుగున పడింది.

లోకావంశంవారు పాలమూరులో చాలచోట్ల చికిత్సకులుగా పేరుపొందినారు. వీరి పూర్వులు లోకాయపల్లి సంస్థానంనుండి వచ్చినందున ఇంటిపేరు లోకా అయింది. నాడీవైద్యంలో వీరికి సాటి నిజాం రాజ్యంలోనే లేరని ప్రసిద్ధి. లోకా బాపుగారు ఎందరో జమీందారులకు నవాబులకు చికిత్సకులుగానున్నారు. ఒకసారి ఒక జమీందారు గర్భవతియైనభార్యకు కడుపులో ఏదో వ్యాధి సోకింది. అపుడు ఇంగ్లీషువైద్యాన్ని వ్యాప్తిచేయటానికి నిజాంచే పిలిపించబడిన డాక్టర్‌ లారీని సంప్రదించగా శస్త్రచికిత్స తప్పమార్గం లేదని ఫలితం గూడ సందేహమేనని అన్నాడు. అపుడు లోకా బాపు మందులతో పిల్లది సందేహంగాని తల్లిని మాత్రం బ్రతికిస్తానని మందులతో తల్లిని బిడ్డను ఆరోగ్యవంతులుగా చేసినారు. వీరివద్దకు, లోకా లక్ష్మయ్య వద్దకు చుట్టుప్రక్కలవారే గాక రాయలసీమ, కర్ణాటకవంటి సుదూర స్రాంతాల నుండి రోగులు వచ్చేవారు. వైద్యం జగ్గయ్య అతని తండ్రి కిష్టయ్య నరేంద్ర బహదూరుకు వైద్యులుగా నున్నారు.

పాలమూరుతోబాటు తెలంగాణలో నాయకులుగా ప్రసిద్ధులైన పండిత సురభి వేంకటశేషశర్మ మంచి వైద్యులు.నాడీ విధానంలో దిట్టలు.విజయవాడలోని నోరి రామశాస్త్రివద్ద ఆయుర్వేదాన్ని అభ్య సించి వైద్యులుగా స్థిరపడినారు.కాని రజాకార్ల దురాగతాలు ప్రబలిన తర్వాత రజాకార్ల వ్యతిరేక ఉద్యమాలలోను పోలీసుచర్య తర్వాత రాజకీయాలలోను పాల్గొని రాణించినారు. ఆత్మకూరులోని ధన్వంతరి రాఘవాచార్యులు రాజవైద్యులు. వీరిని అపర ధన్వంతరిగా తిరుపతి వేంకటకవులు తమ శ్రీనివాసవిలాసపీఠికలో ప్రశంసించి నారు. ముదిగొండ కోటిలింగశాస్త్రి మూలికావైద్యమనే వైద్యులకు నిత్యోపయోగకరమైన చిన్న పుస్తకాన్ని ప్రచురించినారు.ఆలేటి వాసులైన వైద్యుల రామచంద్రయ్య చికిత్సలోని వైదుష్యంతో తెలకపల్లె అనే ఇంటిపేరు వైద్యులుగా మారిపోయింది. తోటపల్లి నారాయణ జ్యోతిషం సంగీతంతోబాటు వైద్యంలోనుఎంతో పేరు గడించినవారు.

తాళపత్రాలలో మ్రగ్గుతున్న గ్రంథాలను వెలికితెచ్చి పరిశోధన సలిపితే ఎన్నో విశేషాలు తెలిసే అవకాశమున్నది. పదిహేను పద హారు శతాబ్దాల నుండి ద్రవ్యరత్నావళి, దక్షిణామూర్తి నిఘంటువు, ద్రవ్యరత్నాకరం మొదలైన వైద్యనిఘంటువులు వైద్యచింతామణి బసవరాజీయం వంటి సంగ్రహ గ్రంథాలు ఎన్నో రచింప బడినట్లు తాళపత్ర గ్రంథాల పరిశీలనతో తెలుస్తున్నది ద్రవ్యరత్నావళి మొదలైన వాటి నుండి ఆకాలపు ఆహారం, బట్టలు, పిండివంటలు, మందులు ఇంకా నిత్యంవాడే ఎన్నో వస్తువుల వివరాలు తెలుస్తున్నవి.భోజుడు సంకలనం చేసిన చారుచర్యలో దినచర్య, ఋతు చర్యలు వివరంగా వర్ణింపబడినవి. రేవణసిద్ధుడు వ్రాసిన వీరభట్టీయమనే గ్రంథం బహుళ ప్రచారంలో ఉండింది.

ఆధునిక కాలంలోని వైద్యవిశేషాలు సేకరించి భద్రపరచంలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నల్లగొండ మండలం చందుపట్ల శ్రీపెరుంబుదూరు రాఘవాచార్యులు తమ ఊరిలో పదిహేడుగురు వైద్యులుండేవారని వారి పేర్లను సీసపద్యంలో రచించినారు.చివరగా ఆధునికులైన అనగా గత రెండు శతాబ్దాలలో ప్రసిద్ధులైన కొందరి పేర్లు. శ్రీపెరుంబుదూరు రాఘవాచార్యులు- చందుపట్ల.హకీం నారాయణ దాసు-బేగంబజారు.ప్రతివాదిభయంకర శఠగోపా చార్యులు-ఓరుగల్లు. మందుల గౌరీశంకర్‌-హైదరాబాదు. రాజవైద్య గుళ్ళపల్లి రాధా కృష్ణమూర్తి- హైదరాబాదు.హకీం బసవయ్య- వరంగల్లు.హకీం హరిగోవింద్‌-హైదరాబాదు.వైద్యరత్న ఆయుర్వేద భూషణ పేర్ల భద్రయ్య. హకీం ఎస్‌.నర్సప్ప-మైలారం. వి.టి.వి. రామానుజస్వామి-హైదరాబాదు. ఇంకా ఎందరోమహనీయులు ఉన్నారు.ఇంతేగాక ఎన్నో పుస్తకాలు పత్రికలు కూడ గత రెండు శతాబ్దులలో ప్రకటింపబడినవి.

భాగవతము రామారావు
tsmagazine
tsmagazine

Other Updates