tsmagazine
‘ఒగ్గు కథ’
విలువైన, అరుదైన ప్రాచీన తెలంగాణ జానపద కళా స్వరూపం. దేశీయ మౌఖిక జానపద కళకు ప్రతీక. వందేళ్ళ క్రితం వరకు దేశ విజ్ఞానమంతా జానపద సాహిత్యం, కళల ద్వారా వ్యాపించింది. రాజుల కాలంలో జమీందార్ల హయాంలో జానపద కళా సాహిత్యాలు కొడిగట్టి పోలేదు. కులవృత్తులు వర్థిల్లాయి. పరాయిరాజుల పాలనలో సైతం పరిఢవిల్లాయి. కానీ, స్వాతంత్య్రానంతరకాలంలో పారిశ్రామికీకరణ, ప్రపం చీకరణ ప్రభావంతో కులవృత్తులు కూలారి పోయాయి. అలాగే కుల సాహిత్యం కూడా నిరాదరణకు గురై చివరికి అపహాస్యం పాలయింది. ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళలెన్నో కాలగర్భంలో కలిసి పోయినాయి. జానపదులకు రసానుభూతిని ఆత్మానం దాన్ని అందించేది శుద్ధ దేశీయ సాహిత్యమంటే అతిశయోక్తి కాదేమో! కళలు మన జాతికి జీవనాడులు. ఆ నాడుల్లో ప్రవహిస్తున్నదంతా శుద్ధ దేశీ సాహిత్య రక్తమే. దానివల్లే మౌఖిక, దృశ్య సంప్రదాయం నిత్య నూతనంగా జీవిస్తూ వచ్చింది.

‘ఒగ్గు కథ’ను కథాగాన కళ అనవచ్చు. ఏదో ఒక కథను ఆలంబనగా చేసుకొని సంగీత అభినయాలతో ఈ కళా రూపం సాగుతుంది. భిన్న భిన్నమైన కథాగాన కళారూపాల్లో ఉన్న ‘ఒగ్గు’కథ ఒక్క తెలంగాణలో తప్ప మరో ప్రాంతంలో లేదు. వరంగల్‌, నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాల్లో బహుళ ప్రచారంలోను, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలుచగాను ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాల్లోనూ సుమారు యాభై ఒగ్గు కథా బృందాలు మనుగడలో వున్నాయి.

పోషిత కులమైన కురువల ఆశ్రిత కులమైన బీర్లవాళ్లు ఒగ్గు కథా కళాకారులు. ఈ కథాగానమే తమ జీవికగా మలచుకొన్న కళాకారులు. ఈ జానపద కళారూప నిక్షిప్త పేటికలు. బీర్ల వాళ్ళూ కురువలే, కానీ కురువ కులస్థుల పూజారి స్థానం వీరిది. బ్రాహ్మణులతో నిమిత్తం లేకుండా తరతరాలనుండి సంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ‘పెళ్లితంతు’ను వీరే జరిపిస్తారు. కురువలు నిర్వహించే బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ జాతర్లలో కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక వీళ్ళదే.

ఆయా గ్రామ దేవతలకు సంబంధించిన ఒగ్గు కథలను మూడు, నాలుగు, ఏడు రాత్రులు రాగ, తాళ, నాట్యయుక్తంగా ప్రదర్శిస్తారు. విద్యాగంధ శూన్యులైన వీళ్ళు ప్రధాన కథ. ఉప కథలతో కూడిన ‘ఒగ్గుకథ’ను కేవలం మౌఖిక కథన పటుత్వంతో ప్రదర్శిస్తుంటే ప్రేక్షకులు వీరి ప్రతిభకు ఆశ్చర్యపోకమానరు! ఇలా ఒగ్గు కథ శిల్పపరంగా, శబ్దపరంగా, దృశ్యపరంగా విశిష్టమయింది. కాలానుగతంగా ఒగ్గుకథలో నాటకీయత ప్రవేశించడానికి యక్షగానం కారణం కావచ్చునంటారు.

ఒగ్గుజాతి కులోత్పత్తి గురించి ‘మల్లన్న కథ’ ఇలా వివరిస్తుంది. ”మల్లన్న భ్రమరాంబను ప్రేమించి పెళ్ళాడలనుకుంటాడు, ఆమె తల్లిదండ్రులైన సిద్ధమ్మ వరదరాజులు తమను జూదంలో గెలిచినవారికి భ్రమరాంబనిచ్చి పెండ్లి చేస్తామంటారు. మల్లన్న జూదంలో ఆమె తల్లిదండ్రులను ఓడించి భ్రమరాంబను తీసుకుపోతాడు. అప్పుడు వరదరాజులు తన ఏడుగురు కుమారులను పిలిచి, మల్లన్నను యుద్ధంలో ఓడించి, మీ సోదరి భ్రమరాంబను తీసుకురమ్మంటాడు. తండ్రి ఆన ప్రకారం మల్లన్న మీదికి యుద్ధానికి వెళ్ళిన ఆమె అన్నలు ఏడుగురిని మల్లన్న తన మంత్రశక్తితో ఏడుకుక్కలు కమ్మని శపిస్తాడు. వారు భయపడి, మల్లన్నను శరణువేడి శాపవిమోచనం అనుగ్రహించమంటారు. మల్లన్న కరుణించి ”నేను ఊరూరా వెలసినప్పుడు మీరు నాకు తలలు ‘ఒగ్గి’ దాసులై పూజలు చేస్తూ, నా కథ చెప్తూ జీవించ”మని అంటాడు. వారు అంతకంటే భాగ్యమేముందని శివుని అంశతో పుట్టిన మల్లన్నకు ‘ఒగ్గి’న వారైనారు కాబట్టి ‘ఒగ్గు’లౌతారు. అలా ఆ సంతతి వారే నేడు మల్లన్న కథాగానం చేసేవారే ‘ఒగ్గు’లని రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గ్రామస్థుడు ‘ఒగ్గు’ మల్లయ్య వివరించాడు. ఆ ఏడ్గురు ఏడు గవ్వలట! మల్లన్న కొలుపులప్పుడు ఆ ‘ఏడు గవ్వల హారాన్ని’ ఒగ్గులు తమ మెడలో వేసుకొని పట్నాలు (పటాలు) వేయించుకుంటారు. ఒగ్గులు దాన్నే ‘గవ్వల దర్శన’మని అంటారు.

‘ఒగ్గుకుల ఉత్పత్తిని గురించి ఇంకొకవాదం జనంలో ప్రచారంలో వుంది. శైవ సంప్రదాయంలో చేతిలోని ఢమరుకాన్ని ‘ఒగ్గు’ అంటారని, ఈ ఒగ్గును వాయిస్తూ కథ చెప్తారు కాబట్టి వాటికి ఒగ్గు కథలని, చెప్పే వారిని ‘ఒగ్గులు’ అంటారని, అదీ కురుమలే ఈ కథలు చెప్పే వారని, బీరప్ప, మల్లన్నలు వీరి కుల దేవతలనీ డా|| బిట్టు వెంకటేశ్వర్లు కరీంనగర్‌ రాష్ట్రీయ జానపద కళోత్సవాల సంచికలో వివరించారు. ఈ ఒగ్గు వాద్యాన్ని జెగ్గు, జగ్గు, బగ్గు అని కూడా వ్యవహరిస్తారు. ఒగ్గుల్లో రెండు గోత్రాల వారున్నారు. శివుని తొలి చెమట బీరప్పగాను, మలి చెమట మల్లప్పగాను పుట్టినట్లు కురుమల కథలు చెపుతున్నాయి. అవి పత్తి కంకణ గోత్రం, ఉన్ని కంకణ గోత్రం, పత్తి కంకణగోత్రం వారు భూములు, పశువులు చూసుకుంటారు. ఉన్ని కంకణ గోత్రంవారు గొఱ్ఱెలను కాస్తుంటారు.

ఒగ్గు వాళ్ళు కురుమల పురోహితులు. కురువల వివాహ సందర్భంలో మల్లన్న కథ చెప్పిన తర్వాతే వివాహం జరిపిస్తారు వీరికి కూడా గ్రామాలు, తాలూకాలు మిరాశీ హక్కులతో హక్కులుంటాయి. ఆ మధ్య పత్రికలో వచ్చిన సమాచారం ”నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన బీర్ల బుచ్చయ్య తమ హక్కులను పొందుపరచిన క్రీ.శ. 1597 నాటి రాగి శాసనాన్ని పురావస్తుశాఖ సంచాలకులకు చూపాడు. అందులో బీరప్ప పండుగలు చేసే హక్కుకు సంబంధించిన వివరాలున్నాయి. దీన్నిబట్టి ఒగ్గు కథ ప్రాచుర్యాన్ని గమనించవచ్చు. ఒకరి హద్దులోకి వచ్చి మరొకరు వివాహాలు చేయకూడదు. దీన్ని అతిక్రమిస్తే కుల బహిష్కారం వుంటుంది. కురుమల పురోహితులైన బీర్లవాళ్ళ వంశాలకు చెందని వారు ఒగ్గు కథలు నేర్చుకుని ప్రదర్శిస్తే కుల బహిష్కారం శిక్ష విధిస్తారు. ప్రసిద్ధ ఒగ్గు కథకుడు చుక్క సత్తయ్య ఒకప్పుడు కుల బహిష్కార శిక్షకు గురయ్యాడట.

‘ఒగ్గు కథలు’ ఈనాటి ఒగ్గు కళాకారు కానీ, ఇతర రచయితలు కానీ వ్రాసినవి కావు. వీరి తాత తండ్రులు పరంపరగా కథల్లో నాటి సంస్కృతి, జన జీవితం, మానవ సంబంధాలు ప్రధానంగా భాషాపరంగా మరుగునపడిన మాండలికాలు. సామెతలు, జాతీయాలు నుడికారం మార్పులేకుండా అమూల్యమైన భాషా విశేషాలను గమనించవచ్చు. భాషా పరిశోధకులకీ కథలు తరగని భాషా విశేష భాండాగారాలు.

ఒగ్గు కథా బృందంలో అయిదునుంచి పదిమంది వరకుంటారు. ఇంతమందే వుండాలనే నియమం లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం అయిదు మందన్నా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రథాన కథకుడు. మరొకరు సహాయకుడు. వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు కంచు తాళాలు, ఇంకొకరు కంజీరా ధరిస్తారు. వీరంతా ఒక వంశ వాద్యాలు వాయిస్తూనే వంతగానాన్ని కూడా అందుకుంటారు.

వీరి వృత్తికథ బీరప్ప (వీరభద్రుని) కథ. అలాగే మల్లికార్జున, మావురాల రేణుక ఎల్లమ్మ, అట్కరన్‌కథ, హరిశ్చంద్ర, మాంధాతకథలే కాక చారిత్రక గాధలకు సంబంధించిన ఇరవై, ముప్పై కథల వరకు చెప్తారు.

బీరప్ప జననమే ఒక అద్భుతం. ఆయన అందచందాలను ఒగ్గు జానపదకవి మనోహరంగా వర్ణించాడు.

”సుక్కలకు సక్కనా సూరమ్మ కొడుకూ
బ్రమ్మ దేవుని సృష్టి బాలుడూ బీరప్పా
అక్కలకు తమ్ముడు అవివేశమంతుడు
చిక్కులు పెట్టేటి చిచ్చు కన్నులవాడూ-అంటూ ఆయన రూపాన్ని వర్ణించి, ఆయన వీరత్వాన్ని
”వీరులకు వీరుడూ శూరులకు శూరుడూ
సాదువో వీర్‌, ముసల్మానోంకే పీర్‌
ధనదోంకే బీర్‌, బల్వీకే వీర్‌,
రావరుడు బీరయ్యా, రణకోవిందుడూ,
అని వర్ణిస్తాడు. ఈయన అక్క ఎవరోకాదు, మహంకాళే.

ఒగ్గు కథలో డోలూ, తాళాల ధ్వనులు లయాత్మకంగా సాగి ఎదుటి వారిని ఉద్రిక్త పరుస్తాయి. ఒగ్గు కథలో వచనాలు, ధాటీలు, మంగళశాసనాలు, ప్రార్థనలు, సంవాదరూపాల్లో సాగుతాయి. ఒగ్గు గాన కళారూపంలోని ‘చల్తీ’, ధాటి ప్రధానంగా సాగినప్పటికీ సందర్భాను సారంగా శృంగార హాస్యరసాలు శ్రోతల్ని మైమరిపిస్తాయి.

ఒగ్గు కథలకు వాద్యపరికరాలు
ఒగ్గుడోలు-ఒగ్గు కథలో ఎక్కువ ప్రాధాన్యం వహించేది ఒగ్గుడోలు. దీన్ని కురువడోలు, కంచురణభేరి అంటారు. ఇది ఒక మీటరు పొడవుండి, గుండ్రంగా డ్రమ్ములా వుండే ఇత్తడి వాద్యం. ఇది గంభీరమైన ధ్వనిని యిస్తుంది. వివాహ సమయాల్లో కురువలు యీ డోలును మంగళకరమైన వాద్యంగా భావిస్తారు. ఈ వాద్యాన్ని ‘వీరప్ప డోల్ల’ అని కూడా పిలుస్తారు.

కంచుతాళాలు
కంచుతో చేసిన ఆ తాళాలు చాలా పెద్దవిగా వుంటాయి. వీటి ధ్వని తాళాలు అదురుతున్నట్లుగా వస్తుంది. డోలు ధ్వనితో కలసిన ఈ తాళాలు చప్పుడు శ్రవణపేయంగా వుంటుంది.

ఒగ్గు
ఇది శివుడు వాయించే ఢమరుకం. దీన్ని జగ్గు, బగ్గు అని కూడా అంటారు. దీని ధ్వని కూడా గంభీరంగా వుంటుంది.

నపీర
ఇది ఇత్తడి, ఇనుముతో చేసిన బూర. ఒగ్గు కథా ప్రారంభంలో బీర్ల వాళ్ళు శిగాలు వూగేటప్పుడు నపీరను వూదుతారు. దీని ధ్వని ఉత్తేజపూరితంగా వుంటుంది.

అందెలు
ఒగ్గు కథకులు కుడి చేతి బొటన వ్రేలికి తగిలించుకునే పెద్ద వుంగరాలలాంటి వాద్య పరికరాలు. వీటి ధ్వని డోలు, కంచు తాళాలతో కలసి వినసొంపుగా ఉంటుంది. బుర్రకథల్లోనూ వీటిని ఉపయోగిస్తారు.

కాళ్ళగజ్జెలు
రెండు మూడు వరుసల కాలిగజ్జెలను ఉపయోగించి ఒగ్గు కథలు చెప్తారు. కథా గమనాన్ని ‘ఛల్తీ’ ధాటీలకు అనుగుణంగా అడుగులు వేసేటప్పుడు అని వాద్యాలను సమన్వయం చేసుకునే వాద్యం యిది. గజ్జెల ధ్వని మనోహరంగా వుంటుంది.

కంజరీ
ఇటీవలికాలంలో ఒగ్గు కథలో ‘కంజరి’ వాద్యపరికరాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. దీనితోపాటే శంఖాన్ని కూడా ఒగ్గులాగానే మధ్యమధ్య ఉపయోగిస్తారు.

కురుమల సంప్రదాయంగా ఏర్పడిన ఒగ్గుకథ నేడు సామాజిక కళారూపంగా మారింది. అనేక ప్రయోగాలకు వేదికైంది. ఈ ప్రయోగాలు ఇటు కథపరంగానూ, అటు ప్రదర్శన పరంగానూ పరిణామం చెందాయి.

ఒగ్గు వాళ్ళే వంశపారంపర్యంగా ఒగ్గు కథ చెప్పాలె అనే హద్దును అతిక్రమించి, ఉత్సాహవంతులు, ప్రయోగశీలురు ఇతర కులాలవారు కూడా ఒగ్గుకథను అభ్యసించి ప్రదర్శనలు ఇస్తున్నారు. బృందాలుగా కూడా ఏర్పడినారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌ హరిజన కులానికి చెందిన సాహు, హైదరాబాద్‌ కాపు కులానికి చెందిన సి. భగవాన్‌రావు, కరీంనగర్‌ గౌడ్‌ కులానికి చెందిన ప్రసిద్ధ ఒగ్గు కథకుడు మిద్దె రాములును చెప్పుకుంటారు.

పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం తెలంగాణలో దాదాపు 30కిపైగా ఒగ్గు కథా బృందాలున్నట్లుగా విదితమౌతుంది.

tsmagazineతెలంగాణ ఒగ్గు కథా దిగ్గజాలు : చుక్కా సత్తయ్య
ఒగ్గు కథా పితామహుడుగా ప్రసిద్ధుడైన చుక్క సత్తయ్య జనగామ జిల్లా (పూర్వ వరంగల్‌ జిల్లా) మాణిక్యపురం గ్రామంలో, కురుమకులంలో, సాయమ్మ ఆగయ్య దంపతులకు మార్చి 29, 1935న జన్మించాడు. భార్యచంద్రమ్మ, ఇరువురు కుమారులు ఆంజనేయులు, శ్రీశైలం; కూతురు: పుష్పమ్మ.

19 సంవత్సరాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళలశాఖలో ఒగ్గు కథా శిక్షకునిగా పనిచేసి 2010 సంవత్సరంలో పదవీ విరమణ అనంతరం కొన్ని ఒగ్గు కళా బృందాలకు శిక్షణ యిస్తూ సొంత వూళ్ళో ఉండేవారు. సుమారు వీరికి 8, 9వేలమంది ఒగ్గు కథా బృందాల శిష్యపరంపర వుంది. ఆయన స్వయంగా ఒక్క ఒగ్గు కళాపీఠం. వీరి మనుమడు గుంటి రవి తెలుగు విశ్వవిద్యాలయంలోనే ఒగ్గు కథల్లో శిక్షణ పొంది ప్రస్తుతం విరామం లేకుండా ప్రదర్శనలు ఇస్తున్నారు.
కురువుల పురోహితులైన బీర్ల వాళ్లుతప్ప వేరే వాళ్ళు ఒగ్గుకథ చెప్పడానికి అనర్హులు. కుల బహిష్కరణ ఉంటుందనే ఆచారం వున్నా, దానిపై అభినివేశంతో ఒగ్గు సత్తయ్య స్వతంత్రించి కథలు నేర్చుకొని ప్రదర్శించి బహిష్కరణకు గురయ్యాడు. కానీ ఆయన ఒగ్గు కథను అద్భుత కళారూపంగా మలచి ప్రచారంలోకి తెచ్చి, డబ్బుతోపాటు పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన అనంతరం కురుమల కుల గురువులు అతన్నే ఆశ్రయించి ఆ నియమాలకు స్వస్తి చెప్పారట!

నేడు ఒగ్గుకథకు జానపద కళల్లో మంచి ప్రాచుర్యాన్ని, గౌరవాన్నీ సమకూర్చినవారు చుక్క సత్తయ్య. ఆయన వీరభద్రుడు, మల్లికార్జున, రేణుక ఎల్లమ్మ, అల్కరన్‌ కథ, హరిశ్చంద్ర, మాంధాత, ఆదిగా ఒగ్గు కథలేకాక ఇరువై, ముప్పై చారిత్రక గాధలను కూడా ఒగ్గు కథలుగా మలచి ప్రదర్శించారు. వీరి ఒగ్గు కళా బృందానికి చాలా పేరు వచ్చింది. ఒగ్గు కథాగానంలో ఆయన ప్రదర్శించే నైపుణ్యం అపూర్వం! గానానికి అనుగుణంగా అభినయం, గానబాణీ, గళ గాంభీర్యం, కథాక్రమంలో ప్రవేశించి పాత్రానుగుణ నటన ప్రేక్షకులకు కనబడుతుంది.

ప్రదర్శనపరంగా ఒగ్గు కథలో నూతన ప్రయోగాల గురించి చెప్పాలంటే చుక్క సత్తయ్యనే పేర్కొంటారు. ఒగ్గు కథకు ఆయన దిద్దిన ఒరవడి నవీనతకు నాంది పలికింది.స్త్రీ పాత్ర ధరించిన ప్రధాన కథకుడు. కథాగమనంలో బీరప్పవంటి కథానాయకుడు వస్తే, కథా సూత్రానికి భంగం కలుగకుండా, కొద్ది సమయంలోనే కొద్ది మార్పులతో పురుషవేషంతో ప్రేక్షకులు చూస్తుండగానే మార్చుకొని పాత్రలో లీనమౌతాడు. వేషధారణ తెరచాటుగా జరగాలనే నియమానికిది విరుద్ధమే అయినా, ఈ నూతన ప్రయోగం చుక్క సత్తయ్య బీరప్ప కథకు ఆకర్షణగా నిలిచింది. ఇది తరువాతి తరంవారికి మార్గదర్శకమయింది. మరే కళారూపంలో కనిపించని ఈ మార్పు అతని ఒగ్గు కథకు విశిష్టతనుకూర్చింది. ఇంతేకాక కథకులు స్త్రీ వేషంలో రంగంపైకి వచ్చే ప్రక్రియకు చుక్క సత్తయ్యే శ్రీకారం చుట్టాడు.

అయితే చుక్క సత్తయ్య ఒగ్గు కథా ప్రదర్శనల్లో ప్రవేశపెట్టిన ప్రక్రియ ‘నాటకీయత’. బీరప్ప కథలో గుర్రపుస్వారి, గంగకు రక్తాన్ని బలివ్వడమనే సన్నివేశాలు బహుళ ప్రచారం పొందాయి. ఒక కుర్చీపై కూర్చొని, దాన్ని గుర్రపుడెక్కల శబ్దం వచ్చేలా కదిలిస్తూ, ఆ ధ్వనికి అనుగుణంగా దరువును పాడుతూ, చేతిలో కళ్ళెం పట్టుకున్నట్లుగా సెల్లాను పట్టుకు గుర్రపుస్వారీ అభినయం ఆయన చాతుర్యానికి అద్దం పట్టాయి. అలాగే బీరప్ప ప్రయాణాన్ని గంగ అడ్డగించినపుడు రక్తాన్ని చిందించే సన్నివేశంలో కత్తితో పొట్టమీద పొడుచుకునే హస్త విన్యాసం ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తుంది. ఇలా చుక్క సత్తయ్య నూతన ప్రయోగాలు నాటక సన్నివేశాలకు నెలవై మొత్తం ఒగ్గు కథల్లోనే ప్రత్యేకతను సంతరించుకుని ఒగ్గు కథ మొన్నటి వరకు నిత్యనూతనంగా సాగిపోయింది. ఒగ్గు కథా ప్రదర్శనలో చుక్క సత్తయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తన జవసత్తువలన్నింటిని ఒగ్గు కథకు పరిపూర్ణంగా అందించిన ఈ ఒగ్గుకథా దిగ్గజం 2017 నవంబర్‌ 9నాడు అమరుడయ్యాడు.

tsmagazineఅంతర్జాతీయ ఒగ్గు కథా కళాకారుడు మిద్దె రాములు

విఖ్యాత ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు కరీంనగర్‌ జిల్లా వేముల వాడ మండలం హన్మాజీపేటలో తీగల లస్మయ్య ఎల్లవ్వ దంపతులకు జూన్‌ 16, 1942లో గౌడ కులంలో జన్మించాడు. ఇంటిపేరు మిద్దె. కల్లుగీత కులవృత్తి. కూలిపని ఉపవృత్తి. ఒగ్గుకథ ప్రవృత్తి.

హనుమాజీపేట ఇద్దరి పేర్లతో చరిత్ర ప్రసిద్ధమైంది. మొదటిది జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ కవి సి. నారాయణరెడ్డి, రెండవది ఒగ్గు కథా దిగ్గజం మిద్దె రాములు. కురువ బీరన్నల సొంతమైన ఒగ్గు కథ గౌండ్ల కులానికి చెందిన మిద్దె రాములు అభ్యసించడం వెనుక ఆయనకు దానిపై ఉన్న అభినివేశం, కఠోర పరిశ్రమ ఉన్నాయి. కాళ్ళకు తుమ్మకాయల గజ్జెలు కట్టుకొని, ఇంటి తలుపులుమూసి, ఆముదం దీపం వెలుతురులో తన కదలికలు గమనిస్తూ, నిగ్గుదీస్తూ ఒగ్గు కథలో రాములు తనదైన సొంత ముద్ర సృష్టించాడు.

చిరు గజ్జెల సవ్వడితో, హుషారైన నాట్య భంగిమలతో అద్భుతంగా అనేక ఒగ్గు కథలను చెప్పి, ప్రేక్షక శ్రోతలను మైమరిపించే మిద్దె రాములుకు చదువడం, వ్రాయడం రాదు. సంతకం పెట్టడం రాదు. కానీ లెక్కలేనన్ని కథలను పుక్కిటపట్టి, యాభైఏండ్లనుంచి జనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించాడు. ఒగ్గు కథకు మారుపేరు మిద్దె రాములుగా ప్రఖ్యాతి చెందాడు. అక్షరాలు రాని రాములుకు 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం యిచ్చి గౌరవించింది. సంప్రదాయ గ్రామీణ జానపద కళలు కనుమరుగవుతున్న తరుణంలో తెలంగాణ గ్రామీణులను తన్మయపరిచే ”ఒగ్గుకథా” ప్రక్రియకు ప్రాణం పోసిన మహా కళాకారుడు మిద్దె రాములు.

రాములు ఎల్లమ్మబోనంఎత్తుకొని, వేప మండలు చేత బట్టుకొని, బోనంకుండ కదలకుండా బొక్కబోర్లా పడుకొని, ఎడమ కాలిని ఎత్తి, బోనం కుండమీదుగా కుడి చేతితో అందుకొని, పడగెత్తిన పాములాగా మెలికలు తిరుగడం ఆయన శరీరంలో జీర్ణించుకుపోయింది. దృశ్యాన్ని జనం వూపిరి బిగబట్టి చూసి కరతాళధ్వనులతో సభాస్థలిని అల్లకల్లోలంచేసేవారు. అలాగే తలపై కుండకింద పడకుండా నేలపై నాణేలను నొసటితో అందుకునే దృశ్యం ఆయన కల్పనే! ఆయన చెప్పే కథలు ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, సారంగ ధర, అయిదు మల్లెపూలు, గంగా గౌరీ సంవాదం, దేశింగురాజు కథ, బాలనాగమ్మ కథ, నల చక్రవర్తి, నల్ల పోచమ్మ కథ, ఇందులో కొన్ని సాంప్రదాయకమైనవేతే, కొన్ని స్వకలపోల కల్పితాలు!

హనుమాజీపేటనుంచి రాములు ఒగ్గుకథను హస్తినాపురందాకా తీసుపోయ్యిండు.

ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌లతో ‘భళా’ అనిపించుకున్నాడు. యాభై ఏళ్లుగా సుమారు ముప్పైవేల ప్రదర్శనలిచ్చాడు. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో రాములు శిష్యప్రశిష్యులు రెండువేలమంది వరకున్నారట! ఆకాశవాణి, దూరదర్శన్‌లలో దాదాపు రెండు వందల ప్రదర్శనలిచ్చాడట! 1990లో మారిషస్‌ ప్రధాని అనిరుధ్‌ జగన్నాథ్‌, గవర్నర్‌ రంగస్వామి రంగడు ప్రశంసలు అందుకున్నాడు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాష్ట్రపతి జైల్‌సింగ్‌, ముఖ్యమంత్రి అంజయ్య, చంద్రబాబునాయుడు దాకా అందరిముందు ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందాడు.

ఆయనను ఎన్నోసన్మానాలు, బిరుదులు, అవార్డులు, పురస్కారాలు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళా మండలి సభ్యునిగా నియమించింది. 2010 మే 23న పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం ఆయనకు ”ఒగ్గు దిగ్గజం” బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించింది. వివిధ కళా సంస్థలనుంచి జానపద కళాబ్రహ్మ, ఒగ్గు కథా చక్రవర్తి, ఒగ్గు కళా బ్రహ్మ, ఒగ్గు కథాగాన సమ్మాన్‌, గౌడకుల రత్న, కళా పురస్కార్‌ బిరుదులు పొందాడు. త్యాగరాజ పురస్కార్‌, ఉగాది పురస్కార్‌వంటివి ఆయన సొంతమైనాయి.

తెలంగాణ ఒగ్గు కథకు వన్నె తెచ్చిన రాములు, ఒగ్గు కథ నేర్పడానికి ఒక బడి పెట్టాలనే ఆయన గుండెలనిండా పెట్టుకొన్న కోరిక తీరకుండానే మూడు నెలలు క్యాన్సర్‌తోపోరాడి 68 ఏండ్ల వయస్సులో నవంబర్‌ 23, 2010నాడు న్నుమూశారు.

జి.యాదగిరి

Other Updates