tsmagazine
తెలంగాణ నేలలో
ఎందరో వీరవనితలు, విదుషీమణులు జన్మించారు. సమ్మక్కసారలమ్మలు తమ భూములను గుంజుకునే కాకతీయుల సైన్యాన్ని కదనరంగంలో ఎదిరించి పోరాడారు. రాణిరుద్రమ శత్రువులనెదిరించి కత్తిసా ములు చేసి శత్రువులను పారదోలింది. తెలంగాణా సాయుధ పోరాటంలో తెలంగాణ స్త్రీలు కొడవళ్ళు, రోకళ్ళు, కారం పొడులతో దుండగుల నెదిరించి ధైర్య సాహసాలు చూపించారు. ఇక కవిత్వం అల్లడంలో ఏమీ వెనుకబడిలేమని తమ పదాలు పాటలతో నిరూపించారు. పలకాబలపం చేతికిరాని కాలంలో చదువు విజ్ఞానానికి దూరమైన దూరంగా వుంచబడిన స్త్రీలు తమ సృజనాత్మకతను చావనియ్యలేదు. ఏ పని చేస్తే ఆ పనికాడ కవిత్వం కట్టారు. తమ భావోద్వేగాన్ని వెళ్లగక్కుతూ తమ కథన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మౌఖికమైన కవిత్వాన్ని సృష్టించారు.

నాట్లు పెడ్తున్నా, కలుపు దీస్తున్నా తమ కవి చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పాటలు కట్టారు. విసుర్రాయి విసురుతూ, ధాన్యం దంచుతూ, పదాలు రచించారు. భక్తి పాటలు పాడారు. జోల పాటలు పాడారు. మంగళారతులు, పెండ్లి పాటలు సృష్టించి కమ్మని గొంతులతో పాడారు. బొడ్డెమ్మ పాటలు బతుకమ్మ పాటల సృష్టికి అంతే లేకుండా రచించారు. రామాయణం పురాణాల కథలను, మంచి కథనాత్మకతతో పాటలు, కావ్యాలు రచించారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకున్నా రాజా స్థానాల్లో వాళ్ళను గౌరవించకున్నా, సన్మానాలు చేయకున్నా స్త్రీలు తమ కవితాశక్తిని పదాలు, పాటల రూపంలో రచించి అనంతమైన సాహిత్యాన్ని సృష్టించారు. మౌఖికమైన సాహిత్యం ఆధునిక కాలంలో కొంత నశించినా పరిశోధకులు సేకరించిన స్త్రీల పాటలు పదాలు కొంతైనా మనకు లభిస్తున్నాయి. తెలంగాణ స్త్రీల సృజనాత్మక శక్తిని కవితా రచనా ప్రావీణ్యాన్ని తెలియజేస్తున్నాయి. వేదాలూ మౌఖికంగానే నిలిచిన సాహిత్యం. స్త్రీల కవిత్వం ఆ విధంగా మౌఖికంగా నిలిచిన సాహిత్యం. ఇక తాటాకులు ఘంటాలు రావడం అక్షర రచన కొనసాగినప్పుడు కూడా స్త్రీలు తమకు దొరికిన అవకాశాలను విడిచిపెట్టుకోకుండా రచనలు చేశారు. కావ్యాలు రచించారు.

అట్లా తెలుగులో మొదట పద్యరచన చేసిన కవయిత్రి విరియాల కామసాని కన్పిస్తున్నది. క్రీ.శ. 1000లో అంటే నన్నయ్య మహాభారత రచనకు 50 సంవత్సరాలు పూర్వం గూడూరు శాసనాన్ని విరియాల కామసాని వేయించింది. తన భర్త ఎర్రభూపతి వీరమరణం పొందగా తాను ముందుకు వచ్చి, చేతను చిన్నపల్లవాన్ని చేపట్టి కాకతి సింహా సనంమీద కూర్చోబెట్టి కాకతీయ వంశాన్ని నిలిపిన ధీర వనిత విరియాల కామసాని. ఆ విషయాన్నే కామసాని ఈ శాసనంలో చెప్పింది. మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు వున్న ఈశాసనాన్ని ఆమే రచించిందని చెప్పాలె. రూపకుత్ప్రేక్షాలంకారాలతో చక్కని పదాల కూర్పులోవున్న ఈ పద్యాలు కామసాని కవితా రచనా సామర్థ్యానికి నిదర్శనాలుగా నిలిచి వున్నాయి.

అద్దంకి శాసనం, బెజవాడ శాసనాలను తూర్పు చాళుక్యుల సేనాని పండ రంగు వేయించాడు. శాసనం వ్రాసినవాళ్ల పేర్లు లేవు. కాబట్టి ఆ శాసనాలను పండరంగుయే రచించాడని నిడదవోలు వేంకటరావు అన్నారు. అదేవిధంగా కవి పేరు లేని గూడూరు శాసనాన్ని విరియాల కామసాని రచించిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనాలి.

రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి కూతురు. కాకతీయ రాజుల సామంతులైన మల్యాల వారి కోడలు కుప్పాంబిక బూదపుర శాసనం వేయించింది. అయ్యరాజు తన పద్య సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్ని ఒకటి ఇచ్చాడు.

ఆమె కాలం క్రీ.శ. 1230-1300
వనజాతాంబకుడేయుసాయకములన్‌ వర్ణింపగా రాడునూ తన బాల్యాధిక యవ్వనంబు మదికిన్‌ ధైర్యంబు రానీయదత్యనురక్తిన్‌ మిముబోంట్లకున్‌ దెలుపనాహా సిగ్గుయై కాదుపా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలి! వాంఛల్‌తుదల్ముట్టునే

నేర్పుగల కవి వ్రాసిన పద్యం కన్నా తక్కువేం లేదు. కుప్పాంబిక పద్యం.ఇది కావ్యంలోని నాయికా విరహ తాపాన్ని వర్ణించే పద్యం.దీన్నిబట్టి కుప్పాంబిక ఏదైనా కావ్యం రచించిందే కావచ్చును.

కాకతీయ రెండో ప్రతాపరుద్రుని ప్రియురాలు మాచల్దేలి విదుషీమణి అని క్రీడాభిరామంనుబట్టి తెలుస్తున్నది. ఆమె తప్పక కవిత్వం వ్రాసి వుంటుంది. కవయిత్రి మొల్ల ఓరుగల్లు నివాసి రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో వున్నదని ”ప్రతాప చరిత్ర”చారిత్రక కావ్యం చెప్తున్నది. మొల్ల పోతనకు సమకాలికురాలు, కొంచెం తర్వాత వున్నదని చెప్పవచ్చును. ఆమె తన తండ్రి ”గురు లింగజంగమార్చన పరుడు” శివభక్తి నిరతుడని చెప్పుకున్నదాన్ని బట్టి ఆమె వీరశైవ కుటుంబంలో జన్మించిందని తెలుస్తున్నది. వీరశైవం తెలంగాణాలో ముఖ్యంగా ఓరుగల్లులో విస్తరించి వుండింది. వీరశైవురాలు కాబట్టే మొల్ల నిమ్నకులం కుమ్మరి కులంలో జన్మించినా పాండిత్యం సంపాదించగలిగింది. స్త్రీకి గౌరవం వుండే వీరశైవకుటుంబంలో జన్మించడం వల్లనే ఆమె చదువుకోగలిగింది. పోతనకు మొల్లకు కొన్ని పోలికలు కన్పిస్తున్నాయి.ఇద్దరు వీరశైవ కుటుంబంలో పుట్టి రామభక్తులైనారు. పోతన-‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట, ఇక నే పలికిన భవహరమగు..”నని చెప్పుకున్నట్లుగానే మొల్ల-”చెప్పమని రామచంద్రుడు సెప్పించిన పలుకుమీద చెప్పెద, నేనెల్లప్పుడు నిహపరసాధనమిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్‌”-అని నివేదించుకుంది. పోతన లాగానే- ”రామనరపాలకుని స్తుతి సేయు జిహ్వకున్‌ చిల్లర రాజలోకమును జేకొని మెచ్చగ నిచ్చబుట్టునే…” అని మొల్ల అన్నది. ‘చిల్లర’ దేశ్యపదం. తెలంగాణలోనే ప్రయోగంలో వుంది. ఉర్దూలోకి ప్రవేశించింది. ఒక్క రంగనాథ రామాయణంలో ఈ పద ప్రయోగం కన్పిస్తున్నది. పోతన మనుజేశ్వరాధముల..”అని ప్రయోగిస్తే మొల్ల” చిల్లర రాజలోకము..”అని అన్నది.

మొల్లకన్న ముందు తెలంగాణలో రెండు రామాయణాలు రచింప బడినాయి. కానీ మొల్ల మాత్రమే రామభక్తురాలుగా ప్రసిద్ధి చెందింది.శ్రీ కంద మల్లేశుని వరంచేత కవిత్వం చెప్పగలిగానని మొల్ల చెప్పుకుంది.మొల్ల రామాయణం సంగ్రహంగా వుంది.అయినా కాలం తాకిడులకు నిలిచిందంటె ఆమె ప్రతిభ సహజ కవిత్వం కారణాలని చెప్పాలె.

మొల్ల తన రామాయణాన్ని అయోధ్యాపుర వర్ణనలో ఆరంభించి కావ్య స్వరాన్నిచ్చింది. మొల్ల భావాలు సరళ సుందరంగా వుంటాయి. సీత హనుమంతునితో రామునికి సందేశం పంపే ఘట్టాన్ని రమ్యంగా రచించింది. గుహుడు రాముని పాదధూళి సోకి తన పడవ ఏమౌతుందో అని భయంతో కూడిన మూఢభక్తిని మొల్ల చక్కని పద్యంలో చెప్పింది-

సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయియే
ర్పడనొక కాంతయయ్యేనట పన్నుగ నీతిని పాదరేణుని
య్యెడవడినోడ సోకనిదియే మగునోయని సంశ యాత్ముడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయము పెంపునన్‌

మొల్ల సరళమైన కవిత్వం సరళ స్వభావం ఈ పద్యంలో ప్రతిబిం బించాయి.”మధురా విజయం” రచించిన గంగాదేవి తెలం గాణ కవయిత్రి.ఈమె ఓరుగల్లు నివాసి అగస్త్య పండితుని మేనల్లుడు విశ్వనాథుని శిష్యురాలు.సంస్కృతంలో మధురమైన ప్రౌఢమైన కవిత్వంతో కావ్యం రచించిన కవయిత్రి. బుక్కరాయల కొడుకు వీరకంపరాయలను వివాహమాడి విజయనగరం చేరుకున్న కవయిత్రి.

విశాలమైన సంస్కృత సాహిత్యంలో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి గంగాదేవి. ఆ తర్వాత విజయనగరం తంజావూరు ఆస్థానంలో వున్న మహిళలు రామాయణాది కావ్యాలు సంస్కృతంలో రచించారు.

తెలంగాణలో ప్రాచీనకాలంలో మౌఖికమైన సాహిత్య సృజన చేసిన పామర కవయిత్రులు కావ్యాలు రచించిన, పద్యరచన చేసిన కవయిత్రు లున్నారు. 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో స్త్రీలు చైతన్యవంతులై అయిలమ్మ, ఆరుట్ల కమలాదేవి, లలితాదేవి, మల్లు స్వరాజ్యం, ప్రియంవదవంటి ఎందరో స్త్రీలు తుపాకి పట్టారు. పోరాటాలు చేశారు. గళమెత్తి పాటలు కట్టి పాడారు. బుర్రకథలు చెప్పారు. నైజాం సర్కారుని ఎదిరించారు.

నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యం అన్నప్పుడు, దాన్ని సవాలుగా తీసుకొని ఆత్మగౌరవానికి పరీక్షగా గ్రహించి సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోలకొండ కవుల సంచిక’తో తెలంగాణ కవుల కవిత్వం ప్రచురించారు. ఆ సంపుటం 354 కవుల్లో దాదాపు 10మంది కవయిత్రుల కవితలున్నాయి. అన్నీ పద్య కవితలే. చదువు శూన్యమైన వాతావరణంలో పదిమంది స్త్రీలు కవిత్వం వ్రాయడం అదీ ఉత్తమ కవిత్వం వ్రాయడం చెప్పుకోదగిన విషయం. వాళ్ళల్లో రూపాఖాన్‌పేట రత్నమ్మ, పునిగోటి ఆనందమాంబ, ఆండాలమ్మ, జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీబాయి మొదలగు వాళ్ళు న్నారు. భక్తి, దేశభక్తి, స్త్రీ విద్యకు సంబంధించిన కవిత్వం వ్రాశారు. లక్ష్మీబాయి అనే కవయిత్రి తన తండ్రిమరణ దుఃఖంతో ”ఎలిజీ” పద్యాలు 5 రచించింది. ఇదొక విశేషం. సోమరాజు ఇందుమతీబాయి, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ రచించిన ”ఆంధ్ర రచయిత్రులు” గ్రంథంలో-”దక్కను సారస్వతమున బాగుగా ప్రసిద్ధురాలైన కవయిత్రిగా చెప్పబడింది. ఇందుమతిబాయి ‘గౌరి’ అనే ఖండకావ్యాన్ని రచించింది.

తెలంగాణలో 1910లో ఆరంభమైన గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు, కాంగ్రెస్‌, ఆర్య సమాజోద్యమం,కమ్యూనిస్టుల పోరాటం ఆధునికతను తెచ్చాయి.ప్రజల్లో చైతన్యాన్ని, జాగృతిని తెచ్చాయి.నాలుగు శాతం అక్షరాస్యత..అందులో స్త్రీల అక్షరాస్యత శూన్యమనే చెప్పాలె.అటువంటి పరిస్థితుల్లో పునరుజ్జీవనోద్యమంతో స్త్రీలల్లోనూ జాగృతి ప్రవేశించింది.స్వాతంత్య్రానంతరం స్త్రీ విద్య పెరిగింది. 1960లో స్త్రీలు నవలలు, కథలు అధిక సంఖ్యలో వ్రాస్తున్న కాలం తెలంగాణనుండి కూడా ఇల్లిందల సరస్వతిదేవి,యశోదారెడ్డి, నందగిరి ఇందిరాదేవి,మాదిరెడ్డి సులోచన, బొమ్మా హైమాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి కథలు, నవలలు వ్రాసి సాహిత్య సృజన చేశారు. అప్పుడు స్త్రీలు కవిత్వం జోలికి పోలేదు.1980,1990ల్లో స్త్రీవాదం ప్రవేశించిన తర్వాతనే స్త్రీలు కవిత్వం వ్రాయడం ముమ్మరంగా సాగింది. అరసం,విరసం కాలంలోనూ తెలుగులో స్త్రీలు కవిత్వం వ్రాయలేదు. అస్తిత్వ ఉద్యమాలతోనే స్త్రీలు విరివిగా కవిత్వం వ్రాయడం ఆరంభమైంది.స్త్రీవాదం,దళితవాదం,ముస్లిం వాదం,ప్రాంతీయ అస్తిత్వవాదం కాలంలో తెలంగాణనుంచి చాలామంది స్త్రీలు కవిత్వం రచించారు.మగవాళ్లతో ధీటుగా కవిత్వం రచించారు.స్త్రీవాదం ప్రతినిధిత్వ కవితా సంపుటి ”నీలి మేఘాలు” ప్రచురింపబడింది. దానిలో విమల తెలంగాణ కవయిత్రి ”వంటిల్లు” కవిత అందరి ప్రశంసలను పొందింది.ఈ కవితలో ప్రతీకాత్మకత,అన్యాపదేశం వున్నటువంటి ఉత్తర కవిత ”వంటిల్లు” స్త్రీ అణచివేతకు పురుషాధిక్యతకు ప్రతీకగా తీసుకోబడింది.

”మెల్లగా బాల్యపు ఛాయలు వదిలిపెడుతుండగానే
ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలైంది
”వంటింటితనాన్ని” ఇక్కడే నేర్పారు నాకు”-
‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా
మా నాన్న పేరు!”
వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం
మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను
ధ్వంసం చేద్దాం రండి!”

అంటుంది కవయిత్రి విమల.వంటింట్లో స్త్రీ ఇంటి చాకిరికి ప్రతీక. బయటి ప్రపంచం తెలియని తనానికి ప్రతీక.ఇంటికి బానిస బందీ అయిన దానికి ప్రతీక. ఆఖరికి స్త్రీ సంప్రదాయం పురుషాధిపత్యానికి గురయిన దానికి ప్రతీక.వంటిల్లును ఒక ప్రతీకగా చేసి స్త్రీ తరతరాల దాస్యాన్ని కవయిత్రి చాలా గాఢంగా భావ తీవ్రతతో వ్యక్తం చేసింది.

అరసం, విరసం కాలాలనుంచే వచన కవిత్వం ఆరంభమైంది.మొదట్లో వచన కవిత్వం అంటే వచనాన్ని వ్రాసి వాక్యాలుగా వ్రాసి పాదాలుగా పేర్చటం చేశారు. చాలామంది తర్వాత కొంత ప్రాస,అంత్యానుప్రాస చేర్చారు.ఆ తర్వాత కొంత తూగు వచ్చేట్లుగా పాదాలను పేర్చారు. కానీ రానురాను వచన కవిత్వం ప్రతీకలు, భావవైచిత్రులు, భావ చిత్రాలు, పద చిత్రాలు, మార్శికతలతో ఎదిగింది. ఇప్పుడు వచనంలా వచన కవిత లేదు. అర్థం చేసుకోవటానికి ఆలోచన, విషయావగహనశక్తి అవసరం. కవయిత్రులు కూడా అటువంటి భావ వైచిత్రులతో వచన కవిత్వం వ్రాస్తున్నారు. ”వంటిల్లు” కవితతోనే తెలంగాణ కవయిత్రులు వచన కవిత్వాన్ని చిక్కగా చెప్పడం నేర్చుకున్నారు. మేమెవరికి తీసిపోము అన్నట్లుగా కవిత్వం వ్రాస్తున్నారు. అప్పుడు స్త్రీ మీద జరిగే హింస, అత్యాచారాల గురించి ”సిద్ధార్థి” కవితలో షాజహనా ఇలా అంటుంది-

”నేనో చెట్టు కోసం చూశాను
అక్కడి కొమ్మలు నన్ను అత్యాచారం చేశాయి”.
స్త్రీల ఆంక్షలు ఇంటికి పరిమితం చేయడం కట్టుబాట్లను గురించి షాజహానా ఇట్లా అంటుంది-
ఊహ తెలియని వయస్సులో
గుమ్మానికి పరదా కడితే
రంగురంగుల కుచ్చులు చూసి మురిసిపోయేదాన్ని
అప్పుడే స్వేచ్ఛకు మొదటి బేడీ అని తెలుసుకో
లేని పసిదాన్ని.
ఎవరెస్టులేంటి చంద్రుడ్ని సైతం తాకొస్తున్న స్త్రీలను
సంసారాలనేంటి ఇంగ్లీషు ఛానల్‌ చూస్తూ తాను ఈదుతున్న
ఈ తరం స్త్రీలను చూస్తూ ఇంకాఇంకా మౌనంగా ఉండడం
నావల్ల కాదు!”

ముస్లిం స్త్రీల సంప్రదాయపు పర్దాలను, ముసుగులను ఎదరించడాన్ని వాళ్ళ ఆశయాలను ఆశలను ఈ కొద్ది మాటల్లోనే షాజహానా చాటి చెప్పింది. సీనియర్‌ కవయిత్రుల్లో అనిశెట్టి రజిత చెప్పుకోదగిన కవయిత్రి. ”గులాబీలు జ్వలిస్తున్నాయి”వంటి నాలుగు వరకు కవితా సంపుటాలను ప్రచురించింది. బహుజనుల స్త్రీలు, అస్తిత్వ వాదనను వ్యక్తీకరించిన కవయిత్రి. ”లచ్చవ్వ” అనే దీర్ఘ కవితను, నానీలను వ్రాసింది. తెలంగాణ కవయిత్రులు నానీలను కూడా చేపట్టి రచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో అమృతలత సంపాదకత్వంలో ”గాయాలే గేయాలై” అనే కవితా సంకలనం వచ్చింది. దీనిలో కవయిత్రులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో కవిత్వం వ్రాశారు. దీనిలో మేరీ మాదిగ వ్రాసిన కవిత చాలా భావ వైచిత్రిలో వున్నది. ఆమె ఇంకా కవిత్వం వ్రాసి కవితా సంపుటాలు తేవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా అనిశెట్టి రజిత, డా. లావణ్య సంపాదకత్వంలో ”జిగర్‌” పేరుతో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాద కవితల సంకలనం వచ్చింది. తెలంగాణ కవయిత్రులు కవితా సంకలనాలను తేవడం విశేషం.

కొండపల్లి నీహారిణి మంచి భావవ్యక్తీకరణ చేస్తున్న ప్రతిభగల కవయిత్రి. మూడు వరకు కవితా సంకలనాలు ప్రచురించింది.

ఈ మధ్య తెలంగాణ కవయిత్రులు మేర్సీ మార్గరేట్‌ కవిత్వానికి కొత్త వ్యాకరణాన్ని రచిస్తున్నది. కొత్త పదాలు మనకు తెలిసిన పదాలనే కొత్త అర్థంలో వాడడం, భావవ్యక్తీకరణలో నూతనత్వం కొత్త పదబంధాలతో వ్రాస్తున్నది. వివక్షకు, హింసకు గురయిన సమూహాలను దృష్టిలో పెట్టుకొని
”ఉలిక్కి పడుతున్న ఊరి తలుపులు”
కవితలో ఇట్లా వ్రాసింది-
అక్కడ/ప్రజాస్వామ్యం
పేరుకి కుర్చీలేసుకొని
కులం సినిమా టికెట్టులు అమ్మకుంటుంటే
కులగజ్జికి చికిత్స
ప్రభుత్వాసుపత్రులలో కూడా దొరక్కపోగా
చూసి అయ్యో అన్న వారి మీదికీ ఎగబడే
ఈ అశుద్ధ యంత్రాంగ వ్యవస్థ నిర్మాణాన్ని
మాటల్ని వ్యర్థం చేసుకోవడం దండుగే
గాయమయ్యి ఇన్ని రోజులైనా ఏది చికిత్స
స్రవిస్తున్న రక్తానికి ఏది ఆనకట్ట
రక్తంలో రంగు రుచి చిక్కదనం
వాసన చూసే శునకాలే చెప్పాలి!

అన్ని సమస్యలు, వివక్షలు, సమూహాలు, వర్ణాలు, అవమానాలు వీటన్నిటి మధ్య చీకటి! ”చీకటి దీపం” కవితలో మెర్సీ ఇట్లా అంటుంది-

చుట్టూ చీకటి/అడుగు తీసి అడుగేస్తే
ఇసుకలా తగిలే చీకటి
ఆ చీకట్లో గుజ్జనగూళ్ళు కట్టుకుందాంరా అని
ఆహ్వానిస్తుంది చీకటి.
చీకటంటే భయం కదా
చీకటంటే నిశ్శబ్దాన్ని నిలువునా నింపుకో
వడం కదా
చీకటంటె మనసు తలుపులకు గొళ్ళెం పెట్టి
ఎగిసి వచ్చే జ్ఞాపకాలతో గెలవడానికి చేసే
యుద్ధం కదా
కానీ ఈ చీకటేంటి ఇసుక రేణువులై వంటి కంటుకుంది
పాదాలను వేవేల చేతులై మర్దన చేస్తుంది..”
సమాజంలో చీకటి లాగానే ప్రశ్నలు
కుదిపేస్తుంటాయి-
చిక్కులు చిక్కులుగా ఉండలుచుట్టి పడేసిన
ఊలుదారాల్లాంటి ప్రశ్నలు…
జీవాన్ని ఆవిరి చేసుకుంటూ
శ్వాస పీల్చుకోలేక వేలాడుతున్న
క్యాలెండరులాంటి ప్రశ్నలు..
తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే
కుళ్ళిపోయిన కంపుకొడుతున్న ప్రశ్నలు..

-మరో కవితలో ఇట్లా అంటుంది-
”తడిమే ప్రతి చూపులో
వినే ప్రతి మాటలో నూత్న వెలుగుతో
నన్ను నేను కాల్చుకోవాలి”

”కాల్చుకోవాలి” అంటె నన్ను నేను దహించుకోవాలని అర్థం. కులం, రంగు, జెండరు-వీటన్నింటి వివక్షలను ఎదుర్కొంటున్న మెర్సీ మార్గరేట్‌ అస్తిత్వ వేదన ఆమె కవిత్వంలో కనిపిస్తుంది. కొత్త భాషలో కొత్త పదాలల్లో కొత్త వ్యక్తీకరణలతో, వైచిత్రులతో, ప్రతీకలతో వ్యక్తమౌతున్నది. తెలంగాణా కవయిత్రి కొత్త గొంతు విచ్చుకున్నది. ”మాటలమడుగు” అనే కవితా సంపుటిని ప్రచురించింది. తన సమూహాల వేదనను ఆమె ఇంకా వ్యక్తీకరించేది చాలా వున్నది. ఇంకా వ్రాస్తూనే వున్నది.

తెలంగాణానుంచి కవయిత్రులు ఎందరో కవిత్వం వ్రాస్తున్నారు. కవితా సంపుటాలు ప్రచురిస్తున్నారు. నెల్లుట్ల రమాదేవి’కందాళ శోభాదేవి, కొలిపాక శోభారాణి,షంషాద్‌ బేగం,రజియా బేగం,సూరేపల్లి సుజాత,కరణ బాల, లక్ష్మి, తుర్లపాటి ఎన్‌.అరుణ,భండారు విజయ,హన్మాండ్లు,శారద,అడువాల సుజాత, జ్వాలిత, హిమజ,సూర్య ధనంజయ్‌, గోగు శ్యామల, జాజుల గౌరి, సుభద్ర’ఇంకా ఎందరో కవిత్వం వ్రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు.

ముదిగంటి సుజాతారెడ్డి
tsmagazine

Other Updates