అతి ప్రాచీన కాలంనుండి నేడు లలిత కళలుగా పిలువబడుతున్న కళారూపాలు ప్రజా కళలుగా వర్థిల్లాయి. శిల్పకళ మాత్రం రాజుల పోషణలో జీవం పోసుకున్నది. మిగిలిన నాలుగు లలితకళలు, కవిత్వం, సంగీతం, నాట్యం. చిత్రలేఖనం ప్రజల సామాజిక జీవితానికి దర్పణం పడుతూ ఉద్యమ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని కళలైన ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి (1) గిరిజన-జానపద కళలు (2) సాంప్రదాయ కళలు. తెలుగునాట గిరిజన-జానపద కళారూపాల పుట్టుక వికాసానికి సంబంధించిన విషయంలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దృష్ట్యానే తెలుగు విశ్వవిద్యాలయం వారు వరంగల్‌లో గిరిజన-జానపద పీఠాన్ని ఏర్పాటు చేశారు.

సాధారణంగా ఈ కళారూపాలు శ్రమనుండి పుడుతాయి. శ్రమజీవన సౌందర్యంలో ఆరాటం పోరాటం అనే అంశాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. డార్విన్‌ అన్నట్లు జీవన పోరాటంవల్లనే నాగరికత ఉనికి, మనుగడ ఉంటుంది. మిగతా తెలుగు ప్రాంతాలతో పోలిస్తే, తెలంగాణ ప్రాంతంలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ బతుకు-ఆరాటం-పోరాటం అనే సంఘర్షణ చారిత్రక యుగంనుండి కనిపిస్తుంది. ఇదే ఇక్కడి జానపద కళా రూపాల్లో ప్రతిఫలించింది. దీని ప్రభావం సంప్రదాయ కళలపై కూడా ప్రబలంగా ఉంది. ఈ కారణం చేతనే ఇక్కడి కళారూపాలన్నీ ప్రజా కళారూపాలుగానే వర్థిల్లినాయి అన్నది చారిత్రక సత్యం.

భారతీయులు 64 కళలను గురించి చెప్పినా అందులో ఐదింటిని మాత్రం లలిత కళలుగా పేర్కొన్నారు. అవి (1) కవిత్వం (2) సంగీతం (3) నాట్యం (4) శిల్పం (5) చిత్రలేఖనం. ఈ కళలకు మూలాలు మనకు ప్రకృతిలో కనిపిస్తాయి. కాబట్టి అరిస్టాటిల్‌ ”ప్రకృతి అనుకరణ రూపాలు కళలు” అన్నారు. ఈ నిర్వచనం ఆదిమ సమాజానికి మాత్రమే వర్తిస్తుంది. మనిషి జీవనయానం అక్కడితో ఆగిపోలేదు. మనిషి ప్రకృతిలో భాగంగా జీవిస్తూనే ప్రకృతిని అన్వేషించాడు. ఆలోచించాడు. సృష్టికి ప్రతిసృష్టి చేశాడు. అంటే కాలగమనంలో తన అనుభవాలను, ఆలోచనలను, శ్రమను సమ్మిళితం చేసి, ప్రకృతిలో సహజసిద్ధంగా పుట్టిగిట్టుతున్న జీవరాసులను కృత్రిమంగా సృష్టించి, ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూ ప్రకృతిని వశపరచుకున్నాడు. ఫలితంగా సంచార జీవితంనుండి గ్రామీణ, పట్టణ, నగర జీవితాలను నిర్మించుకున్నాడు. అదే వ్యవసాయం, పరిశ్రమలు, మార్కెటింగ్‌ దిశగా సమాజం విస్తరించింది. ఇవ్వాళ ప్రపంచీకరణ మూలంగా ప్రాంత, దేశ సరిహద్దులు చెదరిపోయి, ఆయా ప్రాంతాల్లో ఉన్న కళలు సంస్కృతి ఒకవైపు ఉనికిని కోల్పోతుంటే, మరోవైపు వీటి మూలాలను అన్వేషించి, ప్రజా ఉద్యమ చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా వాటిని పరిరక్షించి ప్రాచుర్యంలోనికి తెస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పునరుజ్జీవనం పొందిన బతుకమ్మ, బోనాల పండుగలను అందుకు తార్కాణాలుగా పేర్కొనవచ్చును. ఇక ధూంధాం పాట ఆట నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. అలాగే భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం సాగిన నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ పోరాటంనుండి అనేక ప్రజా ఉద్యమాల్లో, జానపద లలిత కళలు పోషించిన పాత్ర అమూల్యమైనది. ఇంకా చరిత్రలోకి వెళ్తే క్రీ.శ. 13వ శతాబ్దంనుండి మన తెలంగాణలో ఈ కళారూపాలు నిర్వహించిన పాత్రకు సంబంధించిన ఆనవాళ్లు పాల్కురి సోమనాథుని రచనల్లోనూ, జాయపసేనాని నృత్త రత్నావళి, విద్యానాధుని ప్రతాపరుద్రయశోభూషణం అలంకార గ్రంథంలోనూ, క్రీడాభిరామం రూపకం, సుగ్రీవ విజయం యక్షగానం-ఇత్యాది గ్రంథాల్లో కనిపిస్తాయి. వీటిని చారిత్రక పరిణామక్రమంలో లోతుగా పరిశీలిస్తే ఒకప్పుడు ప్రకృతి అనుకరణరూపాలుగా పురుడు పోసుకున్న ఈ కళారూపాలు సామాజిక జీవిత ప్రతిఫలన రూపాలుగా ప్రజా చేతనకు చేసిన దోహదం ఎంత అమూల్యమైందో వ్యక్తమవుతోంది.

ఈ విషయాన్నే ”నేను చిందు ఎల్లమ్మను” గ్రంథంలో డా|| కె. ముత్యం ఇలా వ్యక్తం చేశారు.

”ఏ కళారూపమైనా సమాజ ఆమోదాన్ని గుర్తింపునూ సంతరించుకోవాలంటే దానికి ఓ సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక నేపథ్యాలు కారణంగా ఉండాలి. ఇలా ఏ కళారూపమైనా తలెత్తడానికి భౌతిక పరిస్థితులు, పరిసరాల నేపథ్యాలతోబాటు వ్యక్తీకరణ అవసరాలేవో బలంగా ముందుకు రావాలి. ఆనాటి ప్రజల సాహిత్య, కళారంగాల అవసరంగా కళారూపం రూపొందుతుంది” అన్నారు.

అదేవిధంగా ”సాహిత్య, కళారంగాల్లో కొత్తరూపం తలెత్తిందంటే పునాదిగావున్న సమాజం ఉత్పత్తిరంగంలో కొత్త మార్పులేవో వచ్చాయనడానికి సూచిక. నిదర్శనం అన్నారు” జార్ట్‌లూకార్స్‌.

ఈ దృష్టి కోణంలో తెలంగాణ కళలను పరిశీలించవలసి ఉంది. అయితే ఈనాడు లలిత కళలుగా చెప్పుకుంటున్న వాటి ఆవిర్భావ వికాసాల వెనుక సామాజిక పరిణామాల నేపథ్యం ఉంది. అయితే చారిత్రక వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇవ్వాల సామాజిక అనుకరణ రూపాలుగా వుంటున్న కళలన్నింటికి మూలం అరిస్టాటిల్‌ అన్నట్లు ప్రకృతి అనుకరణ రూపాలైన కళలే. కాబట్టి ఈనాటి నాగరిక కళారూపాలన్నీ ఆదిమ సమాజంలో గిరిజన కళారూపాలుగా ఆవిర్భవించి, మనిషి గ్రామ జీవితాన్ని రూపొందించుకున్న తరువాత శ్రమలో భాగంగా జానపద కళారూపాలుగా రూపాంతరం చెంది, ఇవ్వాళ విశ్రాంతవర్గ కళా రూపాలుగా విస్తరించాయని చెప్పవచ్చును. తెలంగాణ ప్రాంతంలోని కళారూపాలను సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఈ పరిణామ క్రమం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ అలంకారికులు కళల పరమావధి ఆనందం, ఆలోచన” అని నిర్వచించడానికి కారణం ఇదే.

అయితే ఈ విధమైన పరిశీలనకు ఈ వ్యాస పరిధి సరిపోదు. పరిశోధనాంశంగా కృషి చేయవలసి ఉంది. అందుకు ఉపాధేయంగా ప్రధానాంశాలను మాత్రమే ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.

(1) గిరిజన కళలు:
ఆదిమ సమాజ జీవన విధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవి తల్లినే దేవతగా కొలిసే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. ప్రధానంగా వీరి కళారూపాలు గుస్సాడి, బంజారా నృత్యాలు. జాతరలు పండుగలు, పబ్బాల సందర్భంగా వీరు ఈ కళారూపాలను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శనలకు సంబంధించిన వీరి ఆహార్యం అడవిలో దొరికే వస్తువులతో ఆ కళాకారులే రూపొందించుకున్నవన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే వాళ్ల మధ్య విశేషాలుకూడా. జానపద సాహిత్యం కళలపై జరిగినంత పరిశోధన గిరిజన సాహిత్యం కళలపై జరుగలేదు. గిరిజనుల కళలను కూడా జానపద కళల్లో అంతర్భాగంగా చూసేవారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత వరంగల్లులో ఈ కళలపై కొంత కృషి జరుగుతుంది.

అయితే గిరిజనుల సంస్కృతిని, వారి జీవితంలో ప్రధానమైన వేట-ఇత్యాది అంశాలతో నాగరికులు రూపొందించుకున్న కళారూపాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కోయదొర, చెంచుల వేషం, బంజారావేషం ఇత్యాదులను పేర్కొనవచ్చును. ప్రధానంగా తెలంగాణా రైతాంగ పోరాటంలో ఈ కళారూపాలను ఉద్యమ చైతన్యానికి వీలుగా మలచుకున్నారు. గద్దర్‌లాంటి ప్రజా గాయకుడు పాడే ”రేలా.. రేలా” అనే పాటలకు మూలం గిరిజన కళారూపాలే అన్నది వాస్తవం. గోండు పురాణం భాట్స్‌ కథలు ఇత్యాదులు వీళ్ళ కళారూపాలే.

(2) జానపద కళలు:
వరంగల్లులోని గిరిజన జానపద విజ్ఞాన పీఠంవారు తెలంగాణలోని అప్పటి వరంగల్లు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో చేసిన సర్వేలో కేవలం ఈ నాలుగు జిల్లాల్లోనే 70కిపైగా కళారూపాలు వున్నట్లు” తెలంగాణా జానపద కళారూపాలు-విహంగ వీక్షణం” అనే వ్యాసంలో ఆచార్య ఎన్‌. భక్తవత్సలరెడ్డి వ్యక్తం చేశారు. ఈ కళారూపాలను ప్రదర్శించేవారు ఎక్కువకెక్కువగా సంచారజాతులకు చెందిన వృత్తి కళాకారులు, ఉపకులాలకు చెందిన ఆశ్రిత వృత్తి కళాకారులు. వీటిల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చిన కళాకారుల కళారూపాలను మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరుగుతోంది.

తెలంగాణలోని జనగామ జిల్లాకు (ప్రస్తుతం) చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎలమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. ఈయన కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు. గడ్డం సారయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. ఈయన వరంగల్లు జిల్లాకు చెందినవారు. ఒకప్పటి ఉమ్మడి వరంగల్లు జిల్లా చిందు యక్షగానాలకు, డప్పు, శారద, పటంకథవంటి ఎన్నో జానపద కళారూపాల కాణాచిగా ఉండేది. ఇక్కడ ఆకాశవాణి వరంగల్లు ఎఫ్‌యం కేంద్రం ప్రతివారం సాయంత్రం 6.30గం.లకు అర్థగంటపాటు ‘జానపద సంగీతం’ శీర్షికన జానపద గీతాలను-జానపద కథా గేయాలను ప్రసారం చేస్తుందంటే ఆ కళారూపాలకు ఉండే ప్రాచుర్యం, ప్రాశస్త్యం ఎంతటి గొప్పదో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గంగిరెద్దు కళారూప ప్రదర్శనను చూసి స్ఫూర్తి పొందిన ఆచార్య పల్లా దుర్గయ్య ”గంగిరెద్దు” కావ్యాన్ని రాసాడంటే తెలంగాణ గ్రామాల్లో ఈ కళారూపం విశిష్టత ఎంత గొప్పదో గుర్తించాలి.

ఇకపోతే చిందు భాగవతం ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కళాకారిణి చిందుల ఎల్లమ్మ. ఈమె నిజామాబాద్‌కు చెందిన కళాకారిణి.

”ఆటవిక గేదె జాతిని మచ్చిక చేసి, దున్నగజేసి,
బంజర్లను దున్నిండ్రు, అట్లా భూమీ, నాగలీ,
గేదే వాళ్లప్రాణమైనై, వాళ్ళే ఈ దేశంలో
అంటరాని వాళ్లు-డెక్కలి-మాష్టి-చిందు.. మాదిగ.. మాలోళ్లు
వాళ్ళు ఈ మూడు ప్రాణాలని వేరుచేసి, సొంతం
చేసుకున్న వాళ్ళపై ఎక్కుపెట్టిన కళాపోరాట రూపమే
చిందు… చిందు భాగోతం…
ఈ చిందును జీవితకాలంపాటు జీవించిన
చిందుల ఎల్లమ్మ ఆర్తీ, ఆర్తనాదమే ఈ పుస్తకం”

అంటూ డా||కె. ముత్యం కూర్పరి సంపాదకుడుగా వెలువరించిన ”నేను చిందుల ఎల్లమ్మను” పుస్తకమే ఈ కళారూప ఔన్నత్యానికి ఒక మచ్చుతునక. తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన యక్షగాన కళాకారుడేకాక కవి కూడా. వందదాకా యక్షగానాలు, నూటా ఇరవైనాలుగుదాకా చిరుతల సాహిత్యం సృజించిన భాగయ్య చిరస్మరణీయుడు.

గిరిజన-జానపద కళారూపాలను ప్రజా ఉద్యమ చేతనకు ఊపిరిగా వాడుకున్న ప్రజాకళాకారులు, రచయితలు, కవులు తెలంగాణ ప్రాంతంలో ఎందరో ఉన్నారు. ఈ కళాకారుల జీవితం, పోరాటం, సృజన వేర్వేరుగా ఉండవు. త్రివేణి సంగమ స్వరూపంగా ఉంటాయి. అలాంటి కళాకారులను కొందరిని మాత్రమే మీ దృష్టికి తెస్తాను. ‘పల్లెటూరి పిల్లగాడ’ అంటూ పాటరాసిన సుద్దాల హనుమంతు ప్రదర్శించిన జానపద కళారూపాలు ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎంత స్ఫూర్తినిచ్చాయో మనందరికీ తెలుసు. అలాగే ‘బండెన్క బండిగట్టి’ అంటూ అక్షరజ్ఞానం లేని యాదగిరి, నేటి గద్దర్‌, గూడ అంజయ్య, జయరాజ్‌, పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ప్రపంచీకరణ గుట్టును విప్పిన గోరటి వెంకన్న, ‘కొమ్మ చెక్కితె బొమ్మరా, కొలిచి మొక్కితె అమ్మరా’ అంటూ జానపద సంస్కృతిని ఆవిష్కరించడమేకాకుండా ”జయజయహే తెలంగాణ” అంటూ రచించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన అందెశ్రీ, ధూంధాంకు జీవంపోసిన రసమయి బాలకిషన్‌, విమలక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కళాకారుని మీద ఒక్కో పుస్తకం రాసేంత చరిత్ర ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశీలించి నట్లయితే ప్రజా కవులు, ప్రజా వాగ్గేయకారుల సంస్కృతి తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నదన్న విషయం స్పష్టమైంది. ఇది చారిత్రక సత్యం.

(3) లలితకళలు:
తెలంగాణ ప్రాంతంలో గిరిజన, జానపద, లలితకళలు సంకీర్ణంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళల విషయంలో గీసినంత స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో విభజన రేఖను గీయలేము. సాహిత్యపరంగా పరిశీలిస్తే నాటి పాల్కురికి నుండి నేటి కాళోజీ వరకు ఉద్యమ సంస్కృతే కనిపిస్తుంది. ప్రక్రియ పురాణ ఇతిహాస కావ్య, ఖండకావ్య, వచన గేయం ఏదైనా కావచ్చు. అదే విధంగా ఇక్కడి సంగీత సాహిత్యాల్లో ఉర్దూ ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. చాళుక్య, కాకతీయ, శిల్పకళతో పాటు గ్రీకు, పారసీ శిల్పకళారీతులుకూడా సమ్మిళితంగా ఇక్కడ కనిపిస్తాయి. చక్రవర్తులు, రాజులు, సామంతుల ఆశ్రయంలో జీవం పోసుకున్న శిల్పకళారూపాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. రామప్పలోని ఒక్క నాగిని శిల్పం చాలు మన శిల్పుల కళానైపుణ్యాన్ని ప్రస్ఫుటం చేయడానికి. ఈ దృష్ట్యానే ఆచార్య సి. నారాయణరెడ్డి ‘ఆకాశవాణి’ కోసం రాసిన రామప్ప రేడియోసంగీత రూపకంలో ”ఈ నల్లని రాలలో” అనే అద్భుతమైన పాటను రాశారు. ఇక లలిత సంగీతంలో మన చిరత్తరంజన్‌దాసులాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. జానపదుల పాటలకు వాళ్ల జీవకళను తమ గళాలద్వారా అద్దిన వరంగల్లు శంకర్‌, సారంగపాణివంటి కళాకారులు మన తెలంగాణా వారు కావడం మనకు ఎంతో గర్వకారణం.

జానపద చిత్రకళాకారుడు కాపు రాజయ్య,చిత్రకారుడు ఆర్ట్‌ఫిల్మ్స్‌ దర్శకులు బి. నరసింగరావు, సాంప్రదాయ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు, దారుశిల్ప కళాకారులు పి.టి. రెడ్డి, మర్రి గోపాల్‌రెడ్డి, నాటక, సినీ రచయిత చందాల కేశవదాసు, దెంచనాల శ్రీనివాసు, జానపద చిత్రాల నటుడు కాంతారావులాంటి ఎందరో కళాకారులు ఈ గడ్డపై పుట్టినవారే. సృజనాత్మక-పరిశోధనాత్మక సాహిత్యరంగంలో నాటి పాల్కురికినుండి నేటి ప్రజా కవి కాళోజీదాకా ఎందరో ఉన్నారు. తెలంగాణా పౌరులుగా, ఆంధ్రుల సాంఘిక చరిత్రను తవ్విగంపలకెత్తిన సురవరం ప్రతాపరెడ్డిలాగా మనం స్వచ్ఛంధంగా కృషి చేయవలసి

ఉంది. ఈగా ఇల్లు అలుకుతూ తన పేరును మరిచిపోయి; తిరిగి తన పేరును తెలుసుకోవడానికి అన్వేషణ చేసినట్లుగా, ఏపీ భావనలో మన ఉనికిని కోల్పోయిన మనం తిరిగి మన ఉనికికోసం అన్వేషణ చేయవలసి ఉంది. డిసెంబర్‌ 15నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజులపాటు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు అందుకునాంది కావాలని ఆశిస్తున్నాను. కవులు, రచయితలు, కళాకారులం అయిన మనం తెలంగాణ తల్లిని, స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రతీకగా నిలుపుకున్నట్లే, స్వభాష సాహిత్య సంస్కృతుల శోధన, సాధన పరిరక్షణ ఉద్యమానికి తెలంగాణా సాహిత్య అకాడమీకి వెన్నుదన్నుగా నిలుపుకొని ముందుకు సాగుదాం.

డా|| వి. వీరాచారి
tsmagazine

Other Updates