tsmagazine

”కైతకు వ్యాకరణమే పరమావధికాదు అసలే కాదు”

అన్నాడు దాశరథి; మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు. మీ రచనంతా వ్యాకరణం తప్ప మరేవీకాదు, వ్యాకరణ సూత్రాలు పెడితే భట్టి, కాదెప్పుడూ కైత పాకం గట్టి, పాత బాటల బట్టియే నడవగలరు మీరు. మా నడకలో పడుతుంది కొత్త తోవలకు తీరు….. మా నోట రాలిన మాట ఆనోటా ఆనోటా వినవిందై, మనసుకు పసందై, జపించి జపించి, సూత్రాలలో బిగించి సరస్వత పూజాద్రవ్యంగా, భద్రపరచుకున్నారు, మీ వైయాకరణులు, అప్పుడప్పుడు మేమన్నదే అయింది మీ అప్పకవీయం, కౌముది, సరస్వతీ భక్తుల్లారా, బ్రహ్మనే వెక్కిరిస్తారా మెరుపువలె పరుగిడు మా ఊహా తరంగాలకు బక్కెద్దులనాపే పగ్గాలు పనికొస్తాయా… చిత్రకారుడు గీసిన జీవితముట్టిపడే చిత్తరువులో

అవయవాల సొంపును జూపే ఎత్తువంపులకాధార ణమైన గీతలు వంకరటింకరగా ఉన్నాయన్న లేఖకుడు మా రచనల్లో తప్పులున్నాయనే వైయాకరణి”, అని సరస్వతీభక్తుల్లారా అనే గేయంలో 1952లో అన్నాడు

కాళోజీ, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్యవహార భాష విమర్శకు ప్రతి విమర్శగా, కాళోజీ మొదటినుంచి గ్రాంధికభాషకు వ్యతిరేకి. అంతేకాదు ప్రామాణిక శిష్టవ్యవహారికమనబడే దానికి కూడా వ్యతిరేకే. మన వ్యావహారానికి లేని శిష్టత భాషకెక్కడినుంచి వస్తది అన్నాడు. 2002లో తెలంగాణ రచయితల వేదిక మహాసభలో అధ్యక్షో పన్యాసం చేస్తూ, తెలంగాణ యాసను, భాషను వెక్కిరించే వాళ్ళకు చాలా ఘాటుగా సమాధా నమిచ్చిండు. ఇంకా-నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో అక్కడక్కడ సభ్యత లేదనే సంగతి నాకు ఎర్కే, కాని నా భాష విషయంలో, నా యాస విషయంలో సభ్యత పాటించని వాని విషయంలో నాకేం సభ్యత అనీ అన్నాడు.

ఇట్లా కాళోజీ, ఏ ప్రాంతంవాళ్ళు ఆ ప్రాంతం భాష యాస రాయాలని అనేవాడు. ఇంకా ఏమన్నాడంటే, మనం మన యాసలో రాస్తే తెలుస్తదా అంటే, అందరి దస్తూరీలు ఒక్క తరీఖ ఉండవు గదా. కాని అక్షరజ్ఞానం ఉంటే అవతలవాడు ఏం రాసిండో తెలుసుకోవాలనే సహృదయత, జిజ్ఞాస ఉంటే దస్తూరి ఎట్లావున్నా విషయం అర్థమైతది గదా, అట్లనే శబ్దం జ్ఞానం, సహృదయత వుంటే ఏ యాసయినా అర్థం అయితది అని.

భాష, భావ వినిమయానికి ఒక వాహికగదా. భాష, లిపి లేని రోజుల్లో సైగలతో మాట్లాడుకోలేదా. గ్రాంథికం, లేదా శిష్ట వ్యావహారికం మాట్లాడాలనే వాళ్ళకు కాళోజీ ఏమంటడంటే శిష్ట వ్యావహారికం, అశిష్ట వ్యావహారికం రెండుంటయా, ఎవని వ్యవహారం వానిది. నోట నోటమాటమ్మ, ఏ మాటకు ఆ మాటే, కాని దాని ఆట కోటితీర్లు. మనం బడిలో నేర్చుకునే భాషలో మాట్లాడ్డం సరియైందికాదు. బడి పుస్తకాలల్లో ఒకేరకమైన భాషపెట్టి, ఒక ప్రాంతానికే అదీ రెండున్నర జిల్లాల, రెండున్నర సామాజిక వర్గాల భాషను పెట్టి మిగతా ప్రాంతం వాళ్ళందరినీ ఇక్కట్లకు గురి చేసిన్రు. తెలంగాణ ప్రత్యేకం కావాలనే కోరిక వెనుక భాష కూడా ప్రధాన పాత్ర పోషించింది.

తెలంగాణ భాషను, యాసను అనాగరికమైందిగానూ, ”తౌరక్యాం ధ్రంగానూ” పండితులనడమూ, సినిమాల్లో విలన్లకూ, పని మనుషులకు పరిమితమైన భాషగా మాత్రమే తెలంగాణా భాషనుపయోగించడమూ, వల్లనే ”రెండున్నర జిల్లాలదె దండి భాష ఐనప్పుడు, తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కిపెట్టబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు” అన్నాడు.

నేను మార్నింగ్‌ గోదావరిలో హైడరాబాడ్‌ వెళ్ళి మా సన్నును మీటవాలి అంటే తెలుగయి, రేపు, దఫ్తర్‌లో దరఖాస్త్‌ పేష్‌ చేస్త అంటే తెలుగు కాదంటే తెలంగాణ వారి మనోభావాలు దెబ్బతినవా? అందుకని భాష విషయంలో కాళోజీ బడిపలుకుల భాష కాదు, పలుకుబళ్ళ భాష కావాలన్నడు. వీలయినంత వరకు ఆయన, తన కవిత్వంలో సామాన్య జనాలకు అర్థమయ్యే సరళమైన భాష, జనాల్లో ఉన్న వాడుక భాషనే వాడిండు. న్యాయంగా పరిపాలనలో ఉండే అధికారుల భాష, తప్పనిసరిగా ప్రజలు వాడుతరు వారి దైనందిన జీవితంలో, బ్రిటిష్‌వాళ్ళ పరిపాలనలో ఇంగ్లీషు పదాలు ఆంధ్రప్రజలు వాడితే, తెలంగాణ ప్రజలు నిజాం పాలనలో ఉర్దూ పదాలు కలిపి మాట్లాడిండ్రు. అంతమాత్రాన ఇక్కడి ప్రజలది భాషే కాదంటే ఎట్లా ‘చా’యంటే తప్పంటివి, టీయే రైటంటివి. సడకంటే ఏవగింపా, రోడ్డు మాత్రం సరియైందా, దర్జీ అంటేనే రైటు మేరాయన అంటే తప్పా. ”నా గొడవ”లో వాణీ విలాసం”, ”తెలుగు బాస ఎన్నితీర్లు” అన్న రెండు గేయాల్లో వివరంగా చర్చ చేసిండు.

ఆయన కవిత్వంలో-”ఆకలికి అన్నంబు దొరకవలెగాని అత్త పెడ్తేనేమి, అడుక్కతింటేమి”, అరువు సొమ్మైతేమి అప్పుదైతేమి, ”అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట”, ”కమ్మని చకిలాలొక చోట గట్టి దవడలింకొక చోట”, ”కడుపుమంటకు కబళమేదైననేమి తిట్ట దలచిన దివసమేదేతేనేమి”, ”దండెగొట్టు తెలివుండిన చాలు, జోకవచ్చు గింజలుగ తాలు”, ”గేగు కొరికినా, కేకు నమిలినా ఆకలి మంటను ఆర్పుటకే కద”, ”ఆకు చుట్టినా, కోక కట్టినా, తోచినకాడికి దాచుటకే కద”, నమ్ముకొని పెత్తనము ఇస్తే నమ్మకము పోగొట్టుకొంటివి, కుప్ప కావలి ఉండి, కట్టలు తప్పదీస్తివి ముద్దెరేస్తివి, సాటి వాడని చేరదీస్తే నోటి నిండా మన్ను గొడ్తివి, సాటివాడని చేరదీస్తే పదిలముగా తలబోడి చేస్తివి.

”కట్టలు తప్పదీయడం, నోటిలో మన్ను గొట్టడం
తలబోడి చేయడం, తెలంగాణ పలుకుబడులే
”జాజిరి జాజిరిజాజిరి జాజా” అన్న గేయం అయితే అచ్చం
తెలంగాణ జానపదాల్తో ఉన్న కవిత
పీకులాట, తెగదెంపు మొదలైన పదాలు అచ్చ తెలంగాణవి
దగడు, పల్లేరై తిరగడం, రిమ్మ, ప్రాంతంలోనే పాతర వేయడం
వంటివి ఎన్నో తెలంగాణ పలుకుబడులు

ఎన్నో ఆయన తెలంగాణ పలుకుబడులకు ఉదాహరణలుగా చూపవచ్చు. అసలు వేమన కవిత్వం ఎంత సరళమో, అల్కనో, కాళోజీ కవిత్వం అంత అల్కన. ఒకప్పుడు విశ్వవిద్యాలయాలలో సాహిత్య విద్యార్థులకు, కాళోజీ కవిత్వం పాఠ్య ప్రణాళికలో పెడ్తామంటే ఒక పండితమ్మన్యుడు కాళోజీ కవిత్వంలో మనం చెప్పేదేముంటది అన్నడట, కాళోజీకి ప్రామాణిక భాష విషయంలో కూడా అభ్యంతరాలున్నాయి. ప్రామాణిక భాష పేర మళ్ళ ఒక నవ గ్రాంధికాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అసలు ఎవరి యాసలో వాళ్ళు మాట్లాడాలె. ఎవరి యాసలో వాళ్ళు రాయాలె. అవతలి వాడు తెలుసుకోవాలె అన్ని సహృదయంతో, కోరికతో చదువాలె తప్పనిసరిగా తెలుస్తది. ”నామిని’ రాస్తే చదువుకుని పైగా చాలా గొప్పగా ఉన్నదని మెచ్చుకున్నాం గూడా. రంధి సోమరాజు రాస్తే చదవలేదా, రావిశాస్త్రిని చదవలేదా. అయినా బాగుంది అన్నం, టంగుటూరి అంజయ్య మాట్లాడిన భాష బాగలేదని, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య రాస్తే తెలుస్తలేదంటే ఎట్ల, ఇక్కడ ఇంకో మాట రాయనీయండి. మిమ్మల్ని మా భాషలో రాయమనడం లేదు. (కొందరు తెలంగాణ వాండ్లం అని క్లేమ్‌ చేసుకుంటానికి తెచ్చి పెట్టుకున్న తెలంగాణ భాష కాని తెలుగు రాస్తున్నారనుకోండి). కానీ మాదే అసలైన భాష, మీదికాదు అనకండి, మీరు మీ యాసల రాయండి. మేం బాసల రాస్తం. మీ పలుకుబళ్ళు మీయి, మావి మావే. మీరు, మీ పిల్లలను అత్తింటి నుంచి తీసుకొనిపొండి, మేము మా ఆడబిడ్డలను ఇండ్లకు తోలుకొచ్చుకుంటం.

మీరు దీపావళికి తీసుకపోతే మేం బతుకమ్మ పండుగకు తోలుకొస్తం. సంస్కృతి కూడా వేరే ఉన్నది కొంత వరకు. మీకు తరవాణి మాకు కూరాడుగా అంటున్నం. ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు వేరువేరుగా ఉన్నాయి. ఎవని వ్యవహారం వానిది. ఎవని వాడుక వానిది, ఎవని వేడుక వానిది. ఎవరి వ్యవహారంపట్ల వానికి గౌరవం ప్రేమ ఉండవలసిందే కాని అవతలివాని భాష,సంస్కృతిపట్ల ద్వేషం ఉండవద్దు. తెలంగాణ వాళ్ళకు భాషే లేదు, నాగరికతే లేదనే ప్రచారం చేయడం పనికిరాదు. ఇవ్వే ఇరు ప్రాంతాల మధ్య అనుమానాల్ని పెంచి ప్రత్యేక రాష్ట్రం వైపు నడిపించినయి. వాటివల్ల ఇంకా మనం పాఠం నేర్చుకోకపోతే కష్టమే. అందుకే ఎవని పలుకుబడి వానిది. అయితే తమకున్న పలుకుబడి (పత్యార)తో మీరు డామినేట్‌ చేసే ప్రయత్నం చేయవద్దు. అదే కాళోజీ కోరుకున్నప్పుడు ఆయన కవిత్వం అంతా, తెలంగాణ పలుకుబడులు పుష్కలం. పొల్లు పొల్లుగున్నయి.

అవ్వన్నీ మీకిష్టం లేకున్నా ఒక్కసారి చదవండి. మీ పలుకుబడిని మీరెంత ఖాయిష్‌ చేస్తరో తెలుస్తది. మీరు ఇట్లనే చేయాలనే నిర్ణయించే పలుకుబడి నాకు లేదు మరి.

నాగిళ్ళ రామశాస్త్రి

Other Updates