pushkaramతెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక చింతనతో ఆది పుష్కర కాలం పులకించిపోయింది. కృష్ణవేణి తరంగాలలో స్నానమాచరించి భక్తులు పునీతులయ్యారు. కృష్ణమ్మతల్లిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆగస్టు 12న కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శుభ ముహూర్తాన పుష్కరోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలు 23వ తేదీతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆయా ఘాట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నదీమతల్లికి హారతులు ఇచ్చి కన్నుల పండువగా పుష్కర వేడుకలను ముగించి, పుష్కరుడికి వీడ్కోలు పలికారు. నల్లగొండ జిల్లా వాడపల్లి ఘాట్‌లో ముగింపురోజు దేదీప్యమానంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు తెప్పోత్సవ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. ఈ పుష్కరాల్లో నల్లగొండ జిల్లాలో 29 ఘాట్లలో, పాలమూరు జిల్లాలో 52 ఘాట్‌లలో దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ. 825.16 కోట్ల వ్యయం చేసింది.

పుష్కరాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
తొలిరోజు ఆగస్టు 12న రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలమూరు జిల్లాలోని గొందిమళ్ల జోగులాంబ ఘాట్‌వద్ద సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించి పుష్కరాలను ప్రారం భించారు. పీఠాధిపతుల శుభాశీస్సులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5.38 గంటలకు ముఖ్య మంత్రి పుణ్యస్నానమాచరించారు. అనంతరం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు పూర్తికాగానే అందు బాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్లప్పుడు జాగరూకతతో, అప్ర మత్తంగా వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు. భక్తుల భద్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆ తరువాత హెలీకాప్టర్‌ ద్వారా అన్ని ఘాట్‌లను పరిశీలించారు.

భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి
ఈ పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రవాణా సౌకర్యం, ఘాట్‌ల నిర్మాణం, అన్నదాన సౌకర్యం, వైద్య సౌకర్యం, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఈ 12 రోజులు ఒక యజ్ఞంలా నిర్వహించింది. పాలమూరు, నల్లగొండ జిల్లాలలో ఉన్న పుష్కర ఘాట్‌లలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాల కల్పనపై సమీక్షలు నిర్వహిస్త్తూ, సమస్యలను పరిష్కరించారు. ప్రతిరోజు వివిధ ఘాట్‌లను సందర్శిస్తు అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కరాల నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధవహించారు. పుష్కరఘాట్‌ల సమీపంలో ఉన్న అన్ని దేవాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఆయా దేవాలయాల్లో దైవదర్శనం త్వరగా కావడానికి చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న చోట్ల అదనపు వసతి సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకున్నారు.

సీఎం ముందుచూపుతో పుష్కరాలు ప్రశాంతం
సీఎం కెసిఆర్‌ ముందు చూపుతో కృష్ణా పుష్కరాల నిర్వహణ విషయంలో ఆరు మాసాల ముందునుంచే సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తుండడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తులకు సౌకర్యాల కల్పనలో అంకిత భావంతో పనిచేశారు. పాలమూరు జిల్లాలోని 52 ఘాట్లు, నల్గొండ జిల్లాలో 29 ఘాట్లు మొత్తం 81 ఘాట్లల్లోనూ దాదాపు మూడు కోట్ల ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించారు. రూ.825 కోట్లు వెచ్చించి ఘాట్లు, రోడ్లు, టాయిలెట్స్‌, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రవాణా సదుపాయాలు, భద్రత, పార్కింగ్‌, ప్రజల సదుపాయార్థం అదనంగా ఘాట్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్ళే విధంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అహర్నిశలు చేసిన కృషి ఫలితంగానే కృష్ణా పుష్కరాలు విజయవంతమయ్యాయి . భారీ కుంభ మేళా తరహాలో కృష్ణవేణి పుష్కరాలకు కూడా కోట్ల మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంత గొప్పగా పుష్కరాలను నిర్వహించడంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది.

Other Updates