Nagunur-FORTకొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత వైభవాలకు ప్రతీకలుగా నిలుస్తున్న ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు మనకు కానవస్తాయి. అలాంటి కట్టడాల్లో నాటి శిల్ప కళావైభవానికి ప్రత్యక్ష సాక్షీభూతంగా నిలువెత్తు తార్కాణంగా ఎన్నెన్నో దేవాలయాలు, అద్భుతమైన కోటలు, మరెన్నో నిర్మాణాలు ఇంకా ఎన్నెన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటిలో దాగి వున్న అద్భుత శిల్ప కళావైభవాలతో పాటు వాటి నిర్మాణాలలో నిక్షిప్తమైన అలనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యం, వారి జ్ఞానం, విజ్ఞానం, వికాసం మనలను అబ్బురపరుస్తాయి. నాటి రాజులు కాలగతిలో కలిసిపోయినా ఆనాటి రాజ్యాలు అంతరించినా, ఆ ఘన చరిత్ర మాత్రం నేటికీ అలాగే మిగిలి వుంది.

నాగబాల సురేష్‌ కుమార్‌

చరిత్ర అంటే కాలంతోపాటు కాల గతిలో కలిసిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. కాలానికి ఎదురొడ్డి నిలిచి దాని విలువలను, ఆ వైభవాలను భవిష్యత్‌ తరాలకు మానవాళికి నూతనంగా తెలియజేసేది. అలాంటి గొప్ప చరిత్రను నిక్షిప్తం చేసుకున్న వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో గల ‘నగునూరు కోట’ కూడా అగ్ర భాగంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నగునూరు కోటలోని ప్రతి ప్రాకారంలోనూ ఆనాటి కాకతీయ రాజుల పాలనలోని మహా వైభవంతో పాటు వారి రాజసం, దర్పం ఆనాటి ప్రజల సంగతులు మనకు కళ్ళకు కట్టినట్టుగా నేటికీ కనిపిస్తాయి. శిథిలమైన ఇక్కడి కోట గోడలు, అలాగే నాటి ప్రాభవానికి సాక్ష్యంగా నిలిచిన రాతి నిర్మాణాలు కాకతీయ రాజుల సామ్రాజ్య వైభవాన్ని, శక్తిని మనకు తెలియజేస్తాయి. సుమారు 400 దేవాలయాలతో వేలాది భక్తుల జయజయ ధ్వానాలతో, వేద పండితుల వేదఘోషలతో శతాబ్దాల పాటు అలరారిన ‘నగునూరు’ కోట ప్రాభవం ఊహించుకున్నప్పుడు ఎంతటివారికైనా గుండె ఉప్పొంగక మానదు. అంతటి వైభవాన్ని, ప్రాభవాన్ని చవిచూసిన ఈ కోట పరిస్థితి నేడు కడు దయనీయంగా మారింది. వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహమనీయులు, కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, అసఫ్‌ జాహీలేగాక మరెందరో రాజుల పరిపాలనను చవిచూసిన ఈ కోట ఆయా కాలంలో, ఆయా రాజుల కోరికలకు అనుగుణంగా మార్పు చెంది నేడు శిథిల నిర్మాణంగా నాటి చరిత్రకు మౌనస్సాక్షిగా నిలబడింది.

ఒకనాడు రాజధానిగా సబ్బినాడులో ప్రాచుర్యం పొందిన ‘నగరూరు’ నేడు ‘నగునూరు’గా పిలువబడుతోంది. ఇది ఒకానొక అద్భుత శిల్పకళా సంపదను తనలో ఇముడ్చుకున్న గొప్ప కోట. ఈనాటి తరానికి సైతం నాటి గొప్పదనాన్ని తెలియజేస్తూ నేటి ఇంజనీరింగ్‌ మేధకు సవాలు విసురుతూ మన కళ్ళముందే ఠీవీగా నిల్చున్న గొప్ప కోట నగునూరు కోట. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి ఉత్తరాన 8 కి.మీ. దూరంలో వున్న నగునూరు కోట ఎన్నో చారిత్రకమైన అంశాలకు, శిల్ప కళా సంపదకు నెలవుగా నిలుస్తుంది. క్రీీ.శ. 946 నాటి నగనూరులో లభించిన శిలాశాసనం ప్రస్తుతం కరీంనగర్‌ మ్యూజియంలో భద్రపరచబడింది. వేములవాడ రాజ్య పాలకుడు ‘రెండవ అరికేసరి’ దొరపయ్య అనే అరిసపల్లి గ్రామస్తునికి భూమిని దానం ఇచ్చిన దాన శాసనం అది. అందులో ‘నగరూరు’గా ‘నగనూరు’ను పేర్కొన్నారు.

కోటలోని దేవాలయాల్లో మొదటగా చెప్పాల్సింది పరమేశ్వరుని ఆలయం. కాకతీయులు సంస్క ృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడంతోబాటు వాటి విలువలను భావి తరాలకు తెలియజేయడానికి ఈ మందిర నిర్మాణాలను వారధిగా ఎంచుకున్నారు. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలిని పోలిన ఈ పరమేశ్వరుని ఆలయం 12 – 13 శతాబ్ధాల మధ్య కాలంలో కాకతీయులు నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే నగునూరు కోట కాకతీయ రాజుల శిల్ప కళావైభవాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా గొప్ప చిహ్నంగా నిలుస్తుంది. అయితే మొగలాయిల దండయాత్రల సమయంలో కోటలోని అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. విలువైన శిల్ప సంపద చిన్నాభిన్నమయిపోయింది. ఇక్కడ బీరన్న గుడి వద్ద లభించిన శిలా శాసనాలను అనుసరించి నగునూరును పండరాజు పాలించాడని ఆయన కాలంలో రవీశ్వర దేవాలయం నిర్మించారని తెలుస్తోంది. నక్కల గుడి వద్ద లభించిన వీరగుళ్ళుల అడుగు భాగంలోని చిన్న శాసనాలు నగునూరును దొమ్మరాజు పాలించాడని ఆయన పక్షాన కెలన్‌, నారప్పతి, సంగమ మొదలగు యోధులు పోరాడి శత్రువులను సంహరించారని తెలుపుతోంది. 1159 ప్రాంతంలో నగునూరును పాలించిన దొమ్మరాజు, పొలవాస పాలకుడు మేడరాజు, కళ్యాణి సేనాని మైలిగి దేవుడు ముగ్గురు మంచి మిత్రులు. లేబెల్‌ శాసనాన్ని అనుసరించి ఈ మిత్ర కూటమి మొదటగా జరిగిన యుద్ధంలో కాకతి రుద్ర దేవుడ్ని ఓడించిన అనంతరం జరిగిన మరో యుద్ధంలో ఈ కూటమితో పాటు సబ్బినాడులోని అన్ని ప్రాంతాలని కాకతి రుద్రదేవుడు గెలుచుకున్నాడని వేయిస్తంభాల గుడిలోని శాసనం తెలియజేస్తోంది.

నగునూరు కోట అనేక శిల్పకళా నైపుణ్య విలువలతో కూడిన కోట. కానీ నేడు అనేక శిథిల సముదాయాలుగా గత కాలపు వైభవపు ఆనవాలుగా మాత్రమే ప్రస్తుతం మిగిలి వుంది. ఎటు చూసినా శిథిల శిల్పాలు, కూలిన గోడలు, బీటలు వారిన కోట గోడలు, దుండగుల చేతిలో ధ్వంసమైన అందమైన రాతి శిల్పాలు. వాటిని చూసినపుడు మనసు బాధతో మూలుగుతుంది. ఆ బాధ ఎలా వున్నా నాటి అసమాన శిల్పకళకు సంబంధించిన విజ్ఞానం ఇప్పటికీ కొంత మిగిలి ఉందని మాత్రం మనం సంతోషించాలి. ఇక్కడి కోటలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాతి మందిర నిర్మాణంతోబాటు శివాలయ నిర్మాణం అద్భుతం అని చెప్పవచ్చు. కాకతి రుద్రదేవుని మంత్రి నగునూరు పాలకుడు వెల్లకి గంగాధరుడు నగునూరులో త్రికూట దేవాలయాన్ని కట్టించినట్లు కరీంనగర్‌ కలెక్టర్‌ బంగ్లాలో ఉన్న శాసనాన్ని అనుసరించి తెలుస్తోంది. శివాలయం చుట్టూ వుండే స్తంభాలు, ఆలయంపై చెక్కబడిన శిలా విగ్రహాల తీరు ఆనాటి శిల్పకళాకారుల అద్భుత నైపుణ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపడమేగాక మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శిలలను తొలిచి అందమైన రాతి శిల్పాలుగా మలచడానికి వారు పడిన కఠిన శ్రమ మనకు కళ్లకు కనబడుతుంది.

ఈ శివాలయంలో మూడు విగ్రహాలుంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ముఖ్య ప్రధాన ప్రవేశ ద్వారం ఉత్తర దిశలో వుండి, మిగతా మూడు ప్రవేశ ద్వారాలు ఒకదానితో మరొకటి ఎదురవుతూ వుంటాయి. అలాగే సూర్య కిరణాలు నేరుగా గర్భాలయంలోకి పడే విధంగా చేపట్టిన మందిర నిర్మాణం మనలను అబ్బురపరుస్తుంది. సూర్య కిరణాలు గర్భాలయంలోని శివలింగంపై పడే సమయంలో ఆ పరమేశ్వరుని లింగాన్ని చూడటం గొప్ప భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాగే ఈ విగ్రహం చుట్టూ శిల్పకళాకారులు రాతి శిలలపై చెక్కిన వివిధ భంగిమల శిల్ప చిత్రాలు, సంగీత విధ్వాంసులు సంగీత వాయిద్యాలని వాయిస్తున్నట్టుగా వుంటాయి. ఆలయంలోని గోడలపై వివిధ నృత్య భంగిమలతో చెక్కబడిన నృత్యాంగనల శిల్పాలు భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలా చేయడమేగాకుండా మన మనసులను ఉత్సాహ పరుస్తుంది. మందిర ప్రాంగణంలో ఎటు చూసినా అద్భుత సౌందర్యం కానవస్తుంది. అవన్నీ ఎంతో నైపుణ్యంతో చెక్కబడ్డా యి. నాటి శిల్పుల అసమాన ప్రతిభతో పాటు అకుంఠిత శ్రమ మనకు గుర్తుకు వస్తుంది.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ నగునూరు కోట మన రాజధానికి కేవలం 170 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్‌ జిల్లా అనగానే మనందరికీ గుర్తొచ్చే విషయాలలో ఎలగందుల ఖిల్లా కూడా ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో ఎన్నో కోటలలో ఒకటైన నగునూరు కోట గొప్ప కోటలలో ముందు వరుసలో వుంటుందనటంలో సందేహం లేదు.

ఆనవాళ్ళు అనే మాటకు అర్థం ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థలో వున్నాయని చెబుతోంది. అలాంటి చరిత్ర కలిగింది ఈ నగునూరు కోట. ఒకనాడు ఎంతో వైభవాన్ని చవి చూసిన కోట పూర్తిగా ధ్వంసమయింది. కోట చుట్టూ శతృదుర్భేద్యంగా నిర్మించిన రాతిగోడ, మట్టిగోడ, కందకం, బురుజులు, ఇతర కట్టడాలు నామరూపాలు లేకుండా పోయాయి. కోటకు సంబంధించిన గోడలలోని రాళ్ళను చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఇతర కట్టడాలకు వాడటానికి ఉపయోగించడం వల్ల రాళ్ళు సైతం మాయం అయ్యాయి. వీటన్నింటిలోకి రెడ్‌ స్టోన్‌తో చేయబడ్డ ‘త్రీ స్రైన్‌ శివ టెంపుల్‌’ ఒక గొప్ప కళాఖండం. వీటి నిర్మాణ తీరు తెన్నులే వీటి వయసును నిర్ధారిస్తాయి. వీటిలోని కళాత్మక విశేషమేంటంటే సంగీత వాయిద్య కళాకారులు దేవుని దేవత శిలారూపాల చుట్టూ వుండి, సంగీతాన్ని వినిపిస్తూ వుంటాయి. వీటిలో ఒకటి మృదంగాన్ని వాయిస్తూ విశేషంగా ఆకట్టుకోవడం మనకు కనిపిస్తుంది. సాలేశ్వర, గణపతీశ్వర, సకలేశ్వర, రామనాథ, వైష్ణవ, రామలింగాది అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా కోట ఆవరణలోనే వుంటాయి. అదే ఈ కోట ప్రత్యేకత. నగునూరు కోట ప్రాంతం. కాకతీయ గణపతి దేవుని, సామంతుడు అక్షయ చంద్రదేవుడు ‘నగునూరు’ రాజధానిగా సబ్బిమండలాన్ని పాలించాడు. కొంత కాలం ఇది జైన మత కేంద్రంగా కూడా విలసిల్లింది. కోటలో లభించిన కొన్ని శాసనాలు, కొన్ని విగ్రహాలు ప్రస్తుతం కరీంనగర్‌ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.

Other Updates