harishraoరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌ వద్ద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజీ-2 ఫేజ్‌-1 పథకాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌ రావు నవంబర్‌ 8న ప్రారంభించి, ఫాజుల్‌నగర్‌ చెరువు నుంచి నర్సింగపూర్‌ చెరువుకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో హరీష్‌ రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేస్తున్నదని, వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు ఎల్లంపల్లికి పైపులు, మోటార్లు, మొబిలైజేషన్‌ బిల్లులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో ప్రారంభించిన జలయజ్ఞంలో గాలేరు నగరి, గుండ్లకమ్మ, పుష్కర ప్రాజెక్టులను పూర్తి చేశారని, తెలుగుగంగ కింద 1.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణలో జరిగిన పనులను చూసి నత్తలు సైతం సిగ్గుపడ్డాయని, ఎల్లంపల్లి నిర్మాణంలో అదే జరిగిందని ఎద్దేవాచేశారు. ఆంధ్రా ప్రాజెక్టులతో పాటే ఎల్లంపల్లి పూర్తయితే ఇప్పటికే నాలుగైదు పంటలు పండేవన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే మేడారం, వేంనూర్‌, గంగాధర పంపుహౌస్‌ను నిర్మిస్తూ నీటిని తరలిస్తున్నామని హరీశ్‌ రావు తెలిపారు.

2008లో తెచ్చి పడేసిన పంపులు, మోటార్లను మరమ్మతులు చేసి ఇప్పుడు వాడుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్‌ పాలకులవల్లేనని, కాళేశ్వరం ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ప్రాజెక్టును అనుసంధానం చేస్తామని, ఇదే జరిగితే ఫాజుల్‌నగర్‌ వంటి అనేక చెరువుల్లో ఏడాది పొడవునా పుష్కలంగా నీరుంటుందన్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల కింద 57 వేల ఎకరాలకు నీళ్లందించే ప్యాకేజీ-2 పనులను త్వరలోనే చేపడుతామన్నారు. ఎల్లంపల్లి నీటిని వేములవాడ బీడు భూములకు తరలించాలని దివంగత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు 30 ఏండ్లుగా కలగన్నారని, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు హయాంలో నెరవేరిందని తెలిపారు. మిడ్‌మానేరు నిర్వాసితుల ఫ్యామిలీ ప్యాకేజీకి సీఎం ఆమోదించడంతో 4 వేల మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌, ఆర్టీసీ ఛైైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, విద్యసాగర్‌రావు పాల్గొన్నారు.

ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీ) లోలెవల్‌ కెనాల్‌ పంప్‌ హౌస్‌ ప్రారంభం

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. నవంబర్‌ 9న నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పుల్యాతండా వద్ద 84 వేల ఎకరాలకు సాగునీరందించే ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీ) లోలెవల్‌ కెనాల్‌ పంప్‌ హౌస్‌ను విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి ఇంజనీర్లే ఆశ్యర్యపోతున్నారన్నారు. ఈపీసీ విధానంతోనే గత ప్రభుత్వాల హయాంలో ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతోనే ఎల్లెల్సీతో పాటు పాలమూరు ప్రాంతంలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వర్షాలు సరిగా పడకున్నా ఆ జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా నీటిని నింపడంతో చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. ఈ ఏడాది లోలెవల్‌ కాల్వ ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, వచ్చే ఏడాదికి పూర్తిగా 80 వేల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉన్నదని, టెండర్లు పూర్తయిన డిండి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గంధమల్ల, బస్వాపూర్‌ ద్వారా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని వివరించారు.మూసీ కాల్వలకు నిధులు అగిడిన రోజే రూ. 284 కోట్లు విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. వైఎస్‌ హయాంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞంలో 33 ప్రాజెక్టులను చేర్చినా తెలంగాణలో శంకుస్థాపనలు మాత్రమే చేస్తూ ఆంధ్రా, రాయలసీమల్లో పూర్తి చేసిందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Other Updates