waterDreamతెలంగాణ సాగునీటి రంగం సమైక్య రాష్ట్రంలో వివక్షకు, నిర్లక్ష్యానికి గురైందనేది అందరికీ తెలిసిందే. 2014కు ముందున్న స్థితిని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తే… 1956లో రాష్ట్రం ఏర్పడగానే పూర్వం నిజాం ప్రభుత్వం, వెల్లోడీ, బూర్గుల ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతానికి సాగు నీరందించడానికి నిర్మించ తలపెట్టిన ఏడు ప్రాజెక్టులను (కృష్ణా పరీవాహక ప్రాంతంలో… (1) అప్పర్‌ క్రిష్ణా (2) బీమా (3) తుంగభద్ర లో-లెవెల్‌ కెనాల్‌. గోదావరీ పరీవాహక ప్రాంతంలో (4) దేవునూరు (5) పెన్‌గంగ (6) ప్రాణహిత (7) ఇచ్చంపల్లి పూర్తిగా రద్దు చేశారు. ఆనాటి తెలంగాణ ప్రాంత నాయకులకు సాగునీటి రంగంపై, ప్రాజెక్టులపై పెద్దగా అవగాహన లేకపోవడంవల్ల రద్దుకు ఆంధ్రా నాయకులు చెప్పిన అసత్యాలను, అబద్దాలను నమ్మినారు. ఆంధ్రతో తెలంగాణను కలిపితే సాగునీటిలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆనాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్‌ (ఎస్సార్సీ) ముందు తెలంగాణ నేతలు భయాందోళనలు వ్యక్తం చేసినా, ‘ఆంధ్ర-తెలంగాణ కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పడితే ఇరుప్రాంతాల నేతలు చేసుకున్న ఏ ఒప్పందాలు కూడా తెలంగాణకు అన్యాయం జరుగకుండా ఆపజాలవని’ ఎస్సార్సీ నివేదిక స్పష్టం చేసినా, ఈ ఏడు ప్రాజెక్టులు రద్దు గురించి ఆనాటి నేతలు, మేధావులు, ఇంజనీర్లు పెద్దగా ప్రశ్నించకపోవడం చారిత్రక తప్పిదం.

సమైక్య రాష్ట్రం ఏర్పడాలని ‘విశాలాంధ్ర’ ఉద్యమాన్ని నడిపిన కమ్యూనిస్టులు కూడా సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలపై నోరెత్తలేదు. నిజాం పాలనలో చీఫ్‌ ఇంజనీర్‌గా, ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన మహనీయుడు నవాబ్‌-అలీ నవాజ్‌ జంగ్‌ బహద్దూర్‌ ఎంతో దూరదృష్టితో డిజైన్‌ చేసిన ఏలేశ్వరం ప్రాజెక్టును దిగువనగల నందికొండకు మార్చి, తెలంగాణ ఆయకట్టును తగ్గించి, ఆంధ్ర ఆయకట్టును రెండు రెట్లు పెంచి నాగార్జునసాగర్‌ నిర్మించారు. తెలంగాణలోని అప్పటి తొమ్మిది జిల్లాల్లో ఆరు జిల్లాలకు చెందిన 28 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి నిజాం నిర్మించతలపెట్టిన గోదావరి బహుళార్థసాధక ప్రాజెక్టు డిజైన్‌ మార్చి ఆయకట్టును కేవలం మూడున్నర లక్షల ఎకరాలకు పరిమితం చేసి పోచంపాడు పేరుతో 1963లో నెహ్రూ శంకుస్థాపన చేశారు. కేవలం 3 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా సుమారు 9వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో కాకతీయ కాల్వను నిర్మించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఈ ప్రాజెక్టులో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించడంతో ఇదే కాల్వద్వారా శ్రీరాంసాగర్‌ (పేరు మార్చినారు) మొదటి, రెండో దశల క్రింద పదమూడున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. 9వేల క్యూసెక్కుల కాకతీయ కాల్వద్వారా ఎన్ని మరమ్మతులు చేసినా ఏడున్నరవేల క్యూసెక్కుల నీరు కూడా పారకపోవడంతో కాల్వల నిర్మాణం పూర్తయినా ఏనాడూ ఈ ఆయకట్టులో కనీసం సగానికైనా నీరందలేదు.

జలయజ్ఞం పేరుతో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తెలంగాణకు సాగునీరందించాలనే లక్ష్యంతో కాకుండా ప్రజలను వంచించి కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ పెద్ద ఎత్తున ధనార్జనకు పాల్పడినారు.

కాకతీయ కాల్వ ద్వారా మొదటిదశకే నీరందించలేమని స్పష్టమైనా అదే కాల్వతో వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరో నాలుగు లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్తూ శ్రీరాంసాగర్‌ రెండో దశ పనులు చేపట్టారు. ఈ పనులు తొంభైశాతం వై.ఎస్‌. పాలనలోనే పూర్తయినా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏనాడూ రెండోదశ ఆయట్టుకు నీరందలేదు.

‘జలయజ్ఞం’ పేరుతో వై.ఎస్‌. కృష్ణా నీటిని రాయలసీమకు, గోదావరి జలాలను కోస్తాకు మళ్ళించాలని కుట్ర చేశారు. రోజుకు నాలుగు టి.ఎం.సి.ల నీటిని రాయలసీమ అక్రమ ప్రాజెక్టులకు మళ్ళించడానికి పోతిరెడ్డిపాడువద్ద మరో (సుమారు 33వేలకుపైగా క్యూసెక్కుల సామర్థ్యంతో) హెడ్‌ రెగ్యులేటర్‌ని నిర్మించాడు. తెలుగుగంగతోసహా, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, వెలిగోడువంటి సీమ ప్రాజెక్టులకు దేనికీ కేంద్ర జల సంఘం అనుమతులుగానీ, ఇతర శాఖల అనుమతులుగానీ లేవు.

గోదావరి నీటిని మూడువందల టి.ఎం.సి.లకుపైగా తూర్పు, పశ్చిమ గోదావరి డెల్టా ఆయకట్టుకు అందించడానికి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రకాశం బ్యారేజీ ద్వారా డెల్టాలో కృష్ణానదీ జలాలతో సాగవుతున్న సుమారు పది లక్షల ఎకరాల ఆయట్టుకు గోదావరి జలాలను సప్లిమెంట్‌ చేయడానికి పోలవరం ప్రాజెక్టును తలపెట్టారు.

సమైక్య రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ డ్యాం తర్వాత ధవళేశ్వరం ఆనకట్టదాకా ఒక్క డ్యాం నిర్మాణాన్ని కూడా గోదావరిపై నిర్మించే ఆలోచన చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత సాగునీటిరంగంలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలను కేసీఆర్‌ ప్రశ్నించడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దిగువన కంతనపెల్లి బ్యారేజీకి శంకుస్థాపన (2009 ఎన్నికలకు ముందు) చేసినా తట్టెడు మన్ను తీయలేదు.

1956-57లో చెరువుల ద్వారా తెలంగాణలో 11-12 లక్షల ఎకరాలకు నీరందగా సమైక్య రాష్ట్రంలో ఈ ఆయకట్టు మూడవవంతుకు పడిపోయింది. నిజాం పాలనలో, ఆ తర్వాత నిర్మించి నిజాంసాగర్‌, రాజోలిబండ, మూసీ, కడెం, ఇతర మధ్య తరహా నీటి ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు కూడా మూడవవంతుకు పడిపోయింది.

తెలంగాణలో ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సాగు నీరందిన భూమి 1956లో ఎంత వున్నదో 2014 నాటికి అంతే వున్నది. (16 లక్షల ఎకరాలు).

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంనుండే టంకశాల (ట్రెజరీ)కు అత్యధిక ఆదాయం సమకూరినా ఆ డబ్బు వేలాదికోట్లు ప్రతి ఏటా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాజెక్టులకు తరలించారు. తెలంగాణ యెడ సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన వివక్ష, నిర్లక్ష్యం, కుట్రల కారణంగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పాలనలో సుమారు 40వేల మంది రైతులు ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు పాల్పడినారు. సుమారు 30 లక్షలమంది యువతీ, యువకులు గల్ఫ్‌ దేశాలకు, బొంబాయి, షోలాపూర్‌కు, హైదరాబాద్‌కు, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ తదితర జిల్లాలనుండి వలసపోయారు. వ్యవసాయంలో ఉపాధి కరువై సుమారు 50 లక్షలమందికిపైగా నిరుద్యోగులుగా వుండిపోయారు.

ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, 14 ఏళ్ళు అనేక త్యాగాలుచేసి, వందలాదిమంది ఆత్మార్పణలకు పాల్పడి ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించారు.

కోటి ఎకరాలకు సాగునీరందించే కేసీఆర్‌ విజన్‌
kcr1
2014 జూన్‌2న టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే పరిపాలనపై పట్టుసాధించి తెలంగాణలో విధ్వసంమైన సంస్కృతిని, ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకొన్నారు. తెలంగాణ పల్లెలకు, పట్టణాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, బలోపేతం చేయాలని భావించారు. గ్రామాల్లో అంతరించిపోతున్న చేతివృత్తులను ఆధునీకరించడానికి, పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో భాగంగానే అనేక పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలముందుకు తెచ్చింది. మిషన్‌ కాకతీయ పథకం వాటిలో ముఖ్యమైనది.

రాష్ట్రంలో సుమారు 46వేలకుపైగా చెరువులు, కుంటలు వున్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వీటిలో సుమారు 5000 చెరువులు వంద ఎకరాలకు మించి ఆయకట్టు వున్నవి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చెరువులో, కుంటలో కూడా మనిషి నిలువు లేదా అంతకుమించి పూడిక చేరింది. చెరువులు తుమ్మ, పిచ్చి మొక్కలతో నిండి తూములు, మత్తళ్ళు శిథిలావస్థకు చేరినవి. చాలా చెరువుల కట్టలకు వర్షాకాలంలో పడిన గండ్లవల్ల కట్టలు శిథిలమైనవి. మిషన్‌ కాకతీయ లక్ష్యం చెరువుల పునరుద్ధరణ-దీనిలో భాగంగా ఫీడర్‌ ఛానెల్స్‌ బాగు చేయడం, కట్టలను దృఢపర్చడం, తూములు, మత్తళ్ళు పునరుద్ధరించడం, ఒక మీటరు లోతు పూడిక తీయడం, తీసిన పూడిక మట్టిని పొలాల్లో వేసుకోడానికి రైతులకివ్వడం… వంటి పనులు చేపట్టినారు. మిషన్‌ కాకతీయ పనులను 5 దశలుగా చేపట్టాలని, ఒక్కో దశలో సుమారు 9వేల చెరువులను చేపట్టి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్ళలో 17వేల చెరువుల మరమ్మతులను పూర్తి చేసి మూడోదశ పనులను మొదలుపెట్టింది.

గత సంవత్సరం విస్తారంగా వర్షాలు కురవడం గోదావరి మిగులు జలాల వరదతో శ్రీరాంసాగర్‌ కాల్వలద్వారా వేలాది చెరువులను నింపడంతో మే నెల నాటికి కూడా జలాశయాల్లో చాలా వరకు నీరు అలాగే వున్నది. మిషన్‌ కాకతీయ పనులవల్ల 17వేల చెరువుల్లో పూడిక తీసినందున వాటి పరిసరాల్లో భూగర్భ జలాలు సుమారు 5 మీ. నుండి 15 మీ. వరకు పెరిగినాయి. గడిచిన 6 దశాబ్దాల్లో మునుపెన్నడూ లేనివిధంగా చెరువులు, కుంటల క్రింద సుమారు 16 లక్షల ఎకరాల్లో రబీలో (2017) పంటలు పండినవి. మిగిలిన 3 దశలు కూడా పూర్తయితే తెలంగాణ చెరువుల క్రింద 26 లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం వుంటుంది. అవసరమైన సమయాల్లో మాత్రమే ఈ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావులపై ఆధారపడవలసి వస్తుంది.

ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌
kcr2
వై.ఎస్‌. ప్రభుత్వం తెలంగాణలో ప్రజల ఆకాంక్షల, ఉద్యమాల ఫలితంగా నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశ్యం ఆ ప్రభుత్వానికి లేకుండె. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే, ప్రతిపాదిత స్థలం

అనువైనదో, కాదో పరిశీలించకుండానే, మహారాష్ట్రతో చర్చించకుండానే చేవెళ్ళ దగ్గర కాల్వల తవ్వకం మొదలు పెట్టిండు, అప్పటి సీఎం వై.ఎస్‌.

ప్రాణహిత ప్రాజెక్టు తీరుతెన్నులను, మహారాష్ట్ర ప్రభుత్వ కేంద్ర జల సంఘం అభ్యంతరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టుకు రీ-ఇంజనీరింగ్‌ అవసరమని భావించారు. తెలంగాణ సాగునీటిరంగం ఎలా వున్నది, భవిష్యత్తులో కోటి ఎకరాలకు సాగునీరందించాలంటే ఏమి చేయాలో రాష్ట్ర శాసనసభలో 2016 మార్చి 31న కేసీఆర్‌ (గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో) పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తన విజన్‌ను ఆవిష్కరించారు.

2008లో వై.ఎస్‌. ప్రభుత్వం తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల అభ్యర్థన మేరకు ప్రతిపాదించిన ”ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి” పథకం ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో తుమ్మిడిహట్టివద్ద ప్రాణహిత నదిపై 152 మీ. ఎత్తులో బ్యారేజీ నిర్మించి 160 టి.ఎం.సి.ల నీటితో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, జంట నగరాలకు త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందించాలని నిర్ణయించింది. 152 మీ. ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడం, 160 టి.ఎం.సి.ల నీటిని వినియోగించడానికి అవసరమైన రిజర్వాయర్లు లేవని కేంద్ర జలసంఘం అభ్యంతరాలు వ్యక్తం చేయడంవంటి కారణాలవల్ల ప్రాణహిత ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థ అయిన వ్యాప్కోస్‌కు ఈ బాధ్యతలప్పగించారు. పలుమార్లు నిపుణులతో, వ్యాప్కోస్‌ ప్రతినిధులతో మాట్లాడి ఈ ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేశారు కేసీఆర్‌. తెలంగాణ ప్రాంత భౌగోళిక స్థితిపై, జలవనరుల లభ్యతపై సమగ్ర అవగాహనవున్న ముఖ్యమంత్రి ప్రాణహిత-కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలు తీర్చే విధంగా రూపొందించారు. మహారాష్ట్రతో అంగీకారానికి వచ్చి పెన్‌గంగ, ప్రాణహిత, కాళేశ్వరంలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ప్రాణహితపై 148 మీ. ఎత్తులో బ్యారేజీ నిర్మించి గత ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన కాల్వల వ్యవస్థను ఉపయో గించుకుంటూ, అవసరమైన అదనపు కాల్వలను, లిఫ్టులను ఏర్పాటు చేసుకొని ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించింది కేసీఆర్‌ ప్రభుత్వం.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను నిర్మించి ఎత్తిపోతల ద్వారా మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్ల తదితర రిజర్వాయర్లను నిర్మించి తెలంగాణలోని అత్యంత కరువుపీడిత ప్రాంతాలలోని సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రీ-డిజైనింగ్‌ చేశారు. ఇప్పటికే నిర్మించిన సింగూరు, ఘణపూర్‌ ఆనికట్‌, నిజాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌, శ్రీరాంసాగర్‌ రెండుదశలు, వరదకాల్వ, ఎల్లంపల్లి మొదలైన ప్రాజెక్టుల క్రింద సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోబాటు మెదక్‌, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం (పాత జిల్లాల ప్రాంతాలు) జిల్లాల్లో కొత్తగా మరో 20 లక్షల ఎకరాలకుపైగా ఆయట్టుకు సాగునీరందించాలని ప్రభుత్వం నిర్ణయించి నిర్మాణ పనులు, భూసేకరణ ప్రారంభించింది. భూసేకరణను వేగవంతం చేయడానికి జీవో 123ను జారీ చేసింది.

ప్రతిపక్ష పార్టీలు భూసేకరణకు అడ్డు తగులుతూ ప్రాణహిత-కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టులను ఆపాలని లేదా జాప్యం జరగాలని హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు ఫైల్‌ చేస్తున్నారు. ప్రతిపక్షాల దురుద్దేశాలను అర్థం చేసుకున్న న్యాయమూర్తులు ”ప్రాజెక్టులను అడ్డుకోవడం మంచిది కాదం”టూ మందలించిన సందర్భాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సగం తెలంగాణ సస్యశ్యామలమవుతుంది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
kcr3
టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్ళి పాలమూరు జిల్లాకు సాగునీటిరంగంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పడంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెట్టింది. చాలాకాలంగా బడ్జెట్‌లో వీటి ప్రస్తావన వుంటున్నా వీటికి కేటాయించిన ఐదారుకోట్లు కూడా ఖర్చు చేయలేదు. 2003 నుంచి వీటికి మోక్షం వచ్చింది. ఈ ప్రాజెక్టుల క్రింది ఆయట్టు 7 లక్షల ఎకరాలలోపే. తెలంగాణలోనే అత్యధికశాతం సాగుకు యోగ్యమైన భూమి వున్న జిల్లా పాలమూరు. ఏటా 15 లక్షల మంది ఈ ఒక్కజిల్లానుండే వలసపోతున్నారు. ఈ దుస్థితినుంచి పాలమూరును గట్టెక్కించాలని భావించిన తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్లు 2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు ఇస్తే ఆయన దాన్ని బుట్టదాఖలు చేశారు. 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆగస్టులో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వే పనులకోసం జీవో విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకోసం ప్రజలు, ఇంజనీర్లు పెద్దఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆగస్టు, 1, 2014న కేసీఆర్‌ ప్రభుత్వం జీవో 69 జారీచేస్తూ 3 నెలలలోపు ఈ ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు అంటే మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల, జంటనగరాల ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా తీరుతాయని ప్రభుత్వం భావించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని జూరాల జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు రూ. 32,200 కోట్లుగా 2015-16 రేట్ల ప్రకారం వ్యయమవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. 47 గ్రామాలు ముంపుకు గురవుతాయని భావించారు. ఈ గ్రామాల జనాభా 84,444మంది.

ప్రాజెక్టు నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేయాలని సంకల్పించింది. అనేక సవాళ్ళు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. అప్పటికే నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టుల అవసరాలకు నీటిని జూరాలనుంచి ఎత్తిపోతల ద్వారా అందించాలని నిర్ణయించినందున ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యతపై ప్రశ్నలు తలెత్తినవి. రీ-డిజైన్‌ చేయడంవల్ల ఈ ప్రాజెక్టు ముంపును గణనీయంగా తగ్గించే అవకాశమూ కనిపించింది. జూరాలనుండి తొలి ప్రతిపాదన ప్రకారం 1.5 టి.ఎం.సి.ల నీటిని మాత్రమే పంపింగ్‌ చేయాలనుకున్నారు. రీ-డిజైన్‌ తర్వాత జూరాలనుండి కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుండి రోజుకు 2 టి.ఎం.సి.లు ఈ ప్రాజెక్టుకు పంపింగ్‌ చేయాలని మార్పులు చేశారు. ఆయకట్టును 10 లక్షల ఎకరాలనుండి 12.30 లక్షల ఎకరాలకు పెంచారు. పూర్వం నిర్ణయించిన 3 జలాశయాల స్థానంలో ముంపు తగ్గిస్తూ 8 జలాశయాలను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌ వల్ల రంగారెడ్డి జిల్లా ఆయట్టును 2.70 లక్షల ఎకరాలకు బదులు 5 లక్షల ఎకరాలకు పెంచారు.

గత ప్రభుత్వం బీమాకు కేటాయించిన 20 టి.ఎం.సి.లను 12.5 టి.ఎం.సిలకు తగ్గించి 7.5 టి.ఎం.సిలను నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌కు ప్రతిపాదించగా కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను రద్దుచేసి నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌ క్రింది ఆయకట్టును పాలమూరు ఎత్తిపోతలలో చేర్చారు.

ఈ ప్రాజెక్టును కూడా అడ్డుకోడానికి బీజేపీనేత నాగం జనార్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నాగం పిటీషన్‌ను త్రోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టుకు 10.6.2016న రూ. 35,200కోట్లకు పరిపాలనా అనుమతి లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మరో మూడేళ్ళలో పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల దశాబ్దాలుగా కరువు కాటకాలతో అలమటిస్తున్న పాలమూరు-రంగారెడ్డిజిల్లా ప్రజల జీవితాల్లో సౌభాగ్యాన్ని నింపవచ్చు. లక్షలాది ఎకరాల్లో బంగరు పంటలు పండించవచ్చు.

మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకం

నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా అందించాలనే ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, ఇంజినీర్లు, తెలంగాణ మేధావుల సంకల్పంలోనుంచి 2005లో రూపొందిన ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకం. నవంబర్‌ 2005లో ఎం.పి. సురవరం సుధాకరరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ను ఈ ప్రాజెక్టును నిర్మించాలని కోరగా 7.7.2007న జీవోనెం. 159ను సర్వేకోసం జారీ చేసినారు. 2010లో సర్వే సంస్థ ప్రాజెక్టు నివేదికను అప్పటి సీఎం రోశయ్యకు సమర్పించగా పరిపాలనా అనుమతులు మంజూరు చేయవలసిన ప్రభుత్వం కాలయాపనకోసం ‘సాంకేతిక పరిశీలన’ సాకుతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చాలాకాలం తర్వాత సమాశం జరిపి మరిన్ని వివరాలు కోరుతూ నివేదిక వెనక్కి పంపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నివేదికను పరిశీలించి రీ-డిజైన్‌ చేయాలని భావించింది. ఫలితంగా ఈ పథకంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

శ్రీశైలం జలాశయంనుండి 60 రోజులపాటు రోజుకు 0.50 టి.ఎం.సి.ల నీటిని ప్రస్తుత అప్పర్‌ డిండి జలాశయానికి ఎత్తిపోసి 30 టి.ఎం.సి.ల నీటిని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించారు. అప్పర్‌ డిండి జలాశయం నుండి 3 ఆన్‌లైన్‌, 2 ఆఫ్‌లైన్‌ జలాశయాలకు ప్రవాహ కాల్వలద్వారా సుమారు 20 టి.ఎం.సి.ల నీటిని మళ్ళిస్తారు. ఈ ప్రాజెక్టు క్రింద కేవలం 7 గ్రామాల్లో 10,729 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నాయి. నల్లగొండ జిల్లా ప్రజల దశాబ్దాల ఫ్లోరైడ్‌ పీడను డిండి ఎత్తిపోతల పథకంతో శాశ్వతంగా వదిలించుకోగలం.

రీ-డిజైన్‌ చేసిన ప్రాజెక్టులలో ఖమ్మం జిల్లాకుచెందిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులు కూడా వున్నాయి. రికార్డు సమయంలో (10 నెలల్లో) సీతారామ ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించింది.

దశాబ్దకాలంగా నత్తనడక నడుస్తున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా 2016-17లో మొదటిసారి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించారు.

దేవాదుల రీ-డిజైన్‌:

చంద్రబాబు ప్రభు త్వం 18 నెలల్లో పూర్తి చేస్తామని (టీఆర్‌ఎస్‌ విమర్శలకు సమాధా నంగా) 2001లో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు 2014 నాటికి అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఈ ప్రాజెక్టును కూడా రీ డిజైన్‌ చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. గోదావరినదిలో ఎలాంటి బ్యారేజీ లేకుండా నేరుగా నదినుండే 35 టి.ఎం.సి.ల నీటిని ఎత్తి పోసుకోవాలని చంద్రబాబు, వైఎస్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయంటే ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే ఉద్దేశ్యం ఆ ప్రభుత్వాలకు లేదని స్పష్టమవుతున్నది. 2009 ఎన్నికల ముందు, కంతనపల్లి బ్యారేజీకి వైఎస్‌ శంకుస్థాపన చేసినా 2014 జూన్‌ వరకు నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం దేవాదులకు నీరు అందుబాటులో వుంచడానికి తుపాకులగూడెంవద్ద బ్యారేజీని, అదనంగా మల్కాపూర్‌లో 10 టి.ఎం.సి.ల రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నది. గత ప్రభుత్వాలు 35 టి.ఎం.సి.లతో సుమారు 6 లక్షల ఎకరాలను (ఒక టి.ఎం.సి.తో 15వేల ఎకరాలు) సాగు చేసుకోవాలని ప్రతిపాదించగా కేసీఆర్‌ ప్రభుత్వం ఒక టి.ఎం.సి.తో పదివేల ఎకరాల సాగుకు రీ-డిజైన్‌ చేస్తూ దేవాదులకు 60 టి.ఎం.సి.లను కేటాయించింది. రామప్ప చెరువు (పాలంపేట-భూపాలపల్లి జయశంకర్‌జిల్లా)ను దేవాదులకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చి పాకాల, లక్నవరం, గణపురం చెరువులకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్ళించి ఆ జలాశయాల క్రింద వేలాది ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలని నిర్ణయించింది. 25.5.2017న రామప్ప-పాకాల ఎత్తిపోతలకు పరిపాలనా అనుమతినిచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వం.

ఉద్యమ నిర్మాణంలో భాగంగా కేసీఆర్‌ తెలంగాణలోని వేలాది గ్రామాలు సందర్శించారు. లక్షలాదిమంది రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి దుస్థితిని తెలుసుకున్నారు. ఎన్నోసార్లు హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని, ఎండిన చెరువులను, బావులను, ఎడారిని తలపించే పంట భూములను గమనించారు. ఈ దుస్థితి ఆయనలో రాష్ట్రం సాధించాలన్న పట్టుదలను మరింత పెంచింది. అనుకున్నది సాధించడం కేసీఆర్‌ ప్రత్యేకత. రాష్ట్ర సాధన, దేశంలోనే తెలంగాణను ఆర్థిక వృద్దిలో తొలిస్థానంలో నిలిపిన కేసీఆర్‌కు కోటి ఎకరాలకు సాగునీరివ్వడం అసాధ్యం కాదు.

Other Updates