సర్వతంత్ర స్వతంత్రులు అక్షతల సుబ్బశాస్త్రి (క్రీ.శ. 1806-1871)

దక్షిణాపథంలో ప్రముఖ ప్రాంతమైన తెలంగాణకు చెందిన మెదకు సీమ వాస్తవ్యుడైన కోలా చలమల్లినాథసూరి ప్రామాణికమైన సంస్కృత కావ్య వ్యాఖ్యాతగా, శాస్త్ర గ్రంథకర్తగా జగద్విఖ్యాతుడు.ఆ పండిత ప్రవరుని వ్యాఖ్యానాల గద్యలో ‘పదవాక్య ప్రమాణ పారా వార పారీణుడనే సార్థక బిరుదనామం కనిపిస్తుంది. ఇందలి ‘పద వాక్య ప్రమాణ’ మన్న సమాసంలో పదం, వాక్యం, ప్రమాణం అనే మూడు పదాలున్నవి. ఆ మూడు పదాలు క్రమంగా వ్యాకరణ శాస్త్రం, పూర్వమీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం అనే మూడు దర్శనాలకు ప్రతీకలు.

ప్రకృతి ప్రత్యయాలను విశ్లేషించి పదం రూప సిధ్యాదులను వివరించేది కనుక వ్యాకరణానికి ‘పద శాస్త్ర’మని పేరు వచ్చింది. ఉపక్రమోపసంహరాదుల ఆధారంగా విధి వాక్యాలను వివేచించే శాస్త్రం కనుక పూర్వమీమాంసకు వాక్యశాస్త్రమని ప్రసిద్ధి కలిగింది. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అనే నాలుగు ప్రమాణాలద్వారా విషయాన్ని పరీక్షించేది కావున న్యాయశాస్త్రానికి ప్రమాణశాస్త్రమనే అన్వర్థనామం సిద్ధించింది. ఈ మూడు శాస్త్రాలు ఎవరికి కరతలామలకమో వారికి సర్వశాస్త్రాలు సులభంగా స్వాయత్తమవుతవి. ఇటువంటి సర్వశాస్త్రవేత్తలకే సర్వతంత్ర స్వతంత్రులని ప్రసిద్ధి.

ఇటువంటి సర్వతంత్ర స్వతంత్రులు, పదవాక్య ప్రమాణజ్ఞులు ఈ ప్రదేశంలో జన్మించి, తమ విద్యా వైదుష్యంచేత అనేక శాస్త్ర గ్రంథాలు రచించి విశ్వవిఖ్యాతులైనారు. వారిలో ప్రముఖంగా పేర్కొనదగినవారు అక్షతల సుబ్బశాస్త్రి.

నేటి నాగర్‌ర్నూలు జిల్లాలోని జటప్రోలు సమీపానగల అయ్యవారిపల్లి సుబ్బశాస్త్రి జన్మస్థానం. వీరి తల్లిదండ్రులు నరసమ్మ సింగరశాస్త్రిలు, ఋగ్వేదులు, కౌశికగోత్రులు. పధ్నాలుగు తరాలనుండి వీరిది పండితవంశం. సింగరశాస్త్రి ఆనాటి సంస్థానాలలోని సభలలో ఉత్తమోత్తమ సత్కారాలను అందుకొన్నవారు. సుబ్బ శాస్త్రి పితృపాదులవద్దనే బాల్యంలో కావ్యనాటకాలంకారాదులను అభ్యసించి, న్యాయ సిద్ధాంతముక్తావళిని చదువడం ప్రారంభించారు. అప్పుడే తండ్రి పరమపదించారు. పితృమరణానంతరం సుబ్బశాస్త్రి గద్వాల సంస్థానపండిత సభకు వెళ్లి, మా తండ్రి గారి సంభావన మాకివ్వండి అని అడిగినారట! మీరు మీ తండ్రి అంతటి పండితులైనపుడు మీకు సత్కారం జరుగుతుందని గద్వాల ప్రభువులు సెలవిచ్చారు. అభిమానధనులైన శాస్త్రి ఇల్లు చేరుకొని, నాటి రాత్రే కుటుంబాన్నంతా వదలి, ఎవరికి చెప్పక సర్వవిద్యలకు నిలయమైన కాశీనగరాన్ని చేరుకొన్నారు. అక్కడ ఉద్దండ పండితులైన చంద్రనారాయణ భట్టాచార్యులవద్ద విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వదేశ విద్యార్థులతో కలిసి వారు ఎక్కడో మూలకు కూర్చోవడంతో గురువుగారి దృష్టికి రాలేదు. ఆ విధంగా ఒక నెల గడిచింది. అప్పుడు శిష్యునిపై గురువుగారి చూపు వాలింది. గురువు పలుకరించినంతనే శాస్త్రి నెలరోజుల పాఠాలు గడగడ అప్పగించారు. పుస్తకం లేకుండానే విన్నంతమాత్రంలో జ్ఞాపకం పెట్టుకోగలిగిన అతని అవధాన సామర్థ్యాన్ని చూచి గురువు ఆశ్చర్యపడి, నాటినుండి వీరిని ముఖ్య శిష్యులుగా గ్రహించి, తర్క, వ్యాకరణ, పూర్వోత్తర మీమాంసాది శాస్త్రాలను ఉపదేశించారు. శాస్త్రి ఎనిమిదేండ్లలో సర్వశాస్త్రాల పారం ముట్టినారు ఏకసంథాగ్రాహిత్వంచేత, శాస్త్ర పాండిత్యంచేత ఆయన కాశిలో ఏ సభకు వెళ్ళినా విజయదుందుభిని మ్రోగించేవారు.

విద్యాభ్యాసానంతరం స్వదేశం చేరుకొనేందుకు సెలవివ్వండని గురువును అభ్యర్థించారు. తమ కుమారులను శాస్త్రాల్లో సుశిక్షితులను చేయనిదే నీవు స్వస్థానం చేరుకొనే వీలులేదని భట్టాచార్యులవారు ఆదేశించారు. అపుడు పయనం మానుకొని, నాలుగేండ్లలో గురుపుత్రులను సకల విద్యలలో నిష్ణాతులగావించి, వారిని కాశీవిద్వత్సభలలో గెలిపింపజేసినారు. దీనికి భట్టాచార్యులు సంతసించి, శాస్త్రి స్వదేశం చేరుకొనేందుకు అనుమతించారు. ఇది వీరి విద్యార్థి జీవితంలో ఒక అపూర్వ సన్నివేశం

సుబ్బశాస్త్రి కాశీనుండి చక్కగా గద్వాల సభకే విచ్చేశారు. అపుడు మైసూరు ఆస్థాన విద్వన్మణియైన రామశాస్త్రుల ముఖ్య శిష్యుడు ప్రతివాదిభయంకర అనంతాచార్యులవారు గద్వాల సభకు వచ్చిఉన్నారు. శాస్త్రి మూడుదినాలు ఆచార్యులవారితో శాస్త్రవాదాలు చేసి, విజయం సాధించారు. అంత ప్రతివాదిభయంకరాచార్యులు ‘నేను వనపర్తి సభలో పండిత మండలిని జయించినాను, ఇచట మీరు నన్ను జయించారని ప్రశంసిస్తూ, లేచి శాస్త్రికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరిం చారు. అది చూచి గద్వాల ప్రభువులు అబ్బురపడి, చంద్రహారాలు, జోడు శాలువలు, నూటపదహార్లు సమర్పించి, ‘మా సంస్థానానికి కీర్తి సంపాదించి పెట్టినారు కనుక మావద్దనే ఆస్థాన విద్వాంసులుగా ఉండండి’ అని అభ్యర్థించి, బోరవెల్లిలో ఇరవై ఎకరాల రేగడిని ఇనాముగా ఇచ్చి సుబ్బశాస్త్రిని సత్కరించారు.

అక్షతల వారొకసారి మైసూరు విద్వత్సభలకు వెళ్ళగా, మైసూరు మహారాజు వీరి అద్భుత వాదపటిమనుగాంచి, వీరిని అపరగౌతములుగా ప్రశంసించి, ‘అపూర్వ సన్మానం కావించారు. ఇల్లు చేరిన తర్వాత శాస్త్రి జటప్రోలు, ఆత్మకూరు మొదలైన సంస్థానాలలోగల విద్వత్సభలలో అగ్రతాంబూలం అందుకొంటూ, తమ ఇంటిలో 30మంది విద్యార్థులకు వసతి కల్పించి, విద్యాదానం చేస్తుండేవారు.

ఒకసారి వనపర్తి మహారాణి శంకరమ్మ మైసూరు రాజసభకు వెళ్ళగా, అక్కడ రాజావారు, పండిత ప్రవరులు శంకరమ్మతో ‘మహాపండితులు అక్షతల సుబ్బశాస్త్రి మీ ప్రాంతం వారేనా? వారు కుశలంగా ఉన్నారా?’ అని ప్రశంసించారట! దానికి శంకరమ్మ దొరసాని తమ ప్రాంతంలో ఇంత గొప్ప పండితులున్నారా! అని ఆశ్చర్యపడి, వారు తమ ఆస్థానపండితులే అని సభలో తెలియజేసి, వనపర్తికి తిరిగి వచ్చిన తర్వాత సుబ్బశాస్త్రిని సగౌరవంగా పిలిపించి, పన్నెండు ఎకరాల సుక్షేత్రాన్ని వారికి సమర్పించి, తమ ఆస్థాన విద్వాంసుడుగా ఉండవలెనని ప్రార్థించారు.

ఈ విధంగా తెలంగాణలోగల సంస్థానాధీశులు వేదశాస్త్రాది విద్యలను గౌరవిస్తూ, పండితమండలిని సత్కరించడంలో పోటీపడుతుండేవారు. దీనివల్ల భారతీయ విద్యలను, కళలను అభ్యసించేవారికి ఎంతో ప్రోత్సాహం లభించేది.

అక్షతల సుబ్బశాస్త్రి ప్రసిద్ధ రచన భాష్యార్థరత్నమాల. బాదరాయణకృతమైన బ్రహ్మసూత్రాలకు శంకరభగవత్పాదులు అద్వైత సిద్ధాంత ప్రతిపాదకమైన శారీరక మీమాంస భాష్యాన్ని రచించినారు. గణనీయమైన శాస్త్ర సిద్ధాంతాలకు, వాదాలకు నెలవైనదీ గ్రంథం. దీనిని సుబోధం చేసేందుకు శాస్త్రి ఆర్యావృత్తాలలో వైదుష్యం ఉట్టిపడేటట్టు సులభ సుందరశైలిలో భాష్యార్థరత్నమాలను రచించి శారదాదేవికి సమర్పించారు.

సర్వతంత్ర స్వతంత్రులు, పదవాక్య ప్రమాణజ్ఞులూ అయిన ఈ విద్వత్సార్వభౌముని కీర్తి కౌముది ఈ గ్రంథంవలన దిగంతాలకు వ్యాపించింది. ఇది ఆ కాలంలోనే ముద్రించబడింది. ఆంధ్రదేశంలో అంతటా ప్రసిద్ధిగాంచిన సుబ్బాత్రయంలో వీరొకరు. తక్కినవారు తనిఘళ్ళ సుబ్బాశాస్త్రి, సువర్ణ సుబ్బాశాస్త్రిగారలు.

డా|| గంగాపురం హరిహరనాథ్‌

Other Updates