ktrరాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ఉదాత్తమైన ప్రక్రియకు తెరలేపింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు సాగునీటితోపాటు పలు రంగాల్లో చర్చలు, సహకారం అందించడం ద్వారా ముందుకు తీసుకు వెళుతున్న ప్రభుత్వం మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో అగ్రపథానికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో, తాజాగా ఐటీ రంగ అభివృద్ధి కోసం గోవా రాష్ట్రానికి సహకారం అందించే దిశగా ఒక ఒప్పందం చేసుకున్నది.

ఈ ఒప్పందం చేసుకునేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు,గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీ కాంత్‌ పర్సెకర్‌ తో గోవాలో సెప్టెంబరు 16న సమావేశం అయ్యారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రభుత్వం, గోవా రాష్ట్రానికి పలు అంశాల్లో సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఐటి రంగంలో తెలంగాణ చేపట్టిన టి హబ్‌, టాస్క్‌ వంటి వినూత్న కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత గోవా ప్రభుత్వం, తమ రాష్ట్రంలోనూ ఐటీి పరిశ్రమ అభివృద్ధి, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌, ఇన్నోవేషన్‌ రంగాల్లో తెలంగాణ సహకారం కోరింది. తెలంగాణ ప్రభుత్వంతో గోవా చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి రూపొందించాల్సిన ప్రభుత్వ పాలసీల తయారీలో తెలంగాణ ఐటీ శాఖ సహకరిస్తుందని తెలంగాణఐటీ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఇప్పటికే ఒవరాల్‌ ఐటీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ తోపాటు, అనుబంధ పాలసీలను విడుదల చేసిన ఏకైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ పాలసీలకు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, గోవా రాష్ట్రంతో తమ అనుభవాన్ని పంచుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య పోటీతత్వం కాదని, సమన్వయం ఉండాలని, తాము నమ్ముతామన్నారు. ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రం తమ ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలను, అనుభవాలను పంచుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న విశాల భావన ఆధారంగా తాము పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా అసలైన సమాఖ్య స్ఫూర్తిని చాటాలన్నదే తమ అభిమతమని, రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే ఇండియా మరింత ముందుకు పోతుందన్నది తమ నమ్మకమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణ రెండు సంవత్సరాల వ్యవధిలోనే అనేక అత్యుత్తమ పాలసీలను రూపొందించిందని గోవా ముఖ్యమంత్రి అభినందించారు. ముఖ్యంగా ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్‌ పాలసీల తయారీ అనుభవాన్ని తాము పంచుకోనున్నట్లు తెలిపారు. ఐటీ, ఇన్నోవేషన్‌ రంగంలో తెలంగాణ, గోవా పరస్పర సహకారానికి ఈ ఒప్పందం సహకరిస్తుందన్నారు.

ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో చేపట్టిన పలు కార్యక్రమాల స్ఫూర్తితో గోవా రాష్ట్రానికి సహకారం అందించనున్నారు. ముఖ్యంగా ఇన్నోవేషన్‌ రంగంలో టి హబ్‌ ఏర్పాటుతో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, గోవాలోనూ ఒక టి హబ్‌ అవుట్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేయనున్నది. గోవాకి వచ్చే స్టార్ట్‌అప్స్‌ చాలవరకు ఇంక్యూబేషన్‌ స్ధాయిలో ఉన్న నేపథ్యంలో,వాటికి టి హబ్‌ సహకారంతో స్కేల్‌ అప్‌ చేసే అవకాశం కలుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఇంక్యూబేట్‌ ఇన్‌ గోవా, ఇన్‌ కార్పొరేట్‌ ఇన్‌ తెలంగాణ (గోవా స్టార్ట్‌ అప్స్‌ పరిశ్రమల స్ధాయికి చేర్చేలా) టిహబ్‌ సహకారం అందించనున్నది. ఇక గోవాలో ఐటీ పరిశ్రమ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించనున్నది. పాలసీ పరంగా తాము తీసుకున్న పలు ఆదర్శవంతమైన విధానాలను గోవాకు తెలుపనున్నది. దీంతోపాటు టాస్క్‌ వంటి సంస్ధ ఏర్పాటు ద్వారా, గోవాలో శిక్షణ, నిపుణుల తయారీ వంటి రంగాల్లో సహకారం అందించనున్నారు.

ఈ సమావేశంలో మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

Other Updates