పి. శ్రీనివాస్‌

magaగ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే రైతులు, కుల వృత్తులు బాగు పడాలని.. తెలంగాణ యాదవులు నా దృష్టిలో గొప్ప సంపద అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ డోలు వాయించి అర్హులైన గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఒక్కో యూనిట్‌లో 21 జీవాలుంటాయి. ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉన్నాయి. సభా వేదిక వద్దకు చేరుకునే ముందు సీఎం కేసీఆర్‌ ఆప్యాయంగా గొల్లకురుమలను పలకరించారు. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొర్రెల స్టాళ్లను పరిశీలించారు సీఎం. పలు స్టాళ్ల వద్ద గొల్లకురుమలతో కలిసి సీఎం కేసీఆర్‌ ఫోటోలు దిగారు. వేదికపైకి చేరుకున్న సీఎం ప్రజలకు అభివాదం చేశారు. సభా వేదిక పైకి సీఎం చేరుకున్నాక గొల్ల కురుమల సంప్రదాయ పద్ధతిలో తలకట్టు, గొంగడితో యాదవ సంఘ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ ను ఘనంగా సన్మానించారు.

గొల్లకురుమలు ధరించే రుమాలు, గొంగడి ధరించిన సీఎం కురుమల డోలు వాయించారు. రుమాలు, గొంగడి ధరించిన సీఎం గొల్లకురుమలకు ప్రతీకగా దర్శనమిచ్చారు. ఈ మేరకు ముగ్గురు లబ్ధిదారులకు బందారం గ్రామానికి చెందిన బట్ట యాదగిరి, కోలుపుర ఐలయ్య, చింతం బాలమల్లులకు గొర్రెల పంపిణీలో భాగంగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించిన బీమా పత్రాలను సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకురుమలకు 1కోటి 50 లక్షలు గొర్రెలు అందజేసేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణి నిమిత్తం 7 లక్షల 61 వేల దరఖాస్తులు వచ్చాయని, 7 లక్షల 18 వేల యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ యేడు రూ. 4వేల కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 100 నియోజక వర్గాల్లో గొర్రెల పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతమైన గొల్లకురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్లకు రుమలు సృష్టించబోతున్నారని చెప్పారు. 1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని నాడు వేల ఉద్యమ సభల్లో చెప్పానని గుర్తు చేశారు. ఈ యేడు అదనంగా అన్ని జిల్లాలను కలిపి పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నామని తెలిపారు. నాడు తాను చెప్పిందే.. ఇవాళ నిజమైందని సీఎం కేసిఆర్‌ చెప్పుకొచ్చారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని స్పష్టం చేశారు. గ్రామసీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయన్నారు. మానవ సంపదను కాపాడినప్పుడే నిజమైన అభివద్ధి జరుగుతుందన్నారు. 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని సీఎం ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

ప్రపంచ రైతాంగానికి తెలంగాణ రైతాంగం ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. గ్రామీణ తెలంగాణ ధనవంతమైతేనే తెలంగాణ ధనవంతమైతదని పేర్కొన్నారు. పంటల సాగుకు అవసరమైన విద్యుత్‌, సాగునీరు, పెట్టుబడి రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. పంట పెట్టుబడి కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. హైదరాబాద్‌ నుంచే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ప్రస్తుతం రైతుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మే 15 వరకు తొలి విడత పంటల పెట్టుబడి రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామ రైతు సంఘాలు నిజాయితీగా వ్యవహరించి.. పథకాల్లో అవకతవకలు లేకుండా చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా.. వారి బాధలను తమతో పంచుకోవాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి తీరుతామని ఉద్ఘాటించారు. ఎవరెన్ని అడ్డంకులు చేసినా బంగారు తెలంగాణ అయి తీరుతుందన్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను అడ్డుకునే వాళ్లను రైతులు నిలదీయాలని సూచించారు. అవిశ్రాంత పోరాటంతో రాష్ట్రం సాధించినట్లే.. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. పారిశ్రామిక, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

కొండపాక గ్రామ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు

గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక గ్రామాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నజరానా ప్రకటించారు. కొండపాక గ్రామాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయిస్తూ బుధవారం జీవో విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. కొండపాకలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. కొండపాక గ్రామ నేతలు, ప్రజల కోరిక మేరకు రూ. 10 కోట్లు కేటాయిస్తున్నానని సీఎం చెప్పారు. ఈ నిధులతో గ్రామంలో అభివద్ధి పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు.

1962 గొర్రెల ఎమర్జెన్సీ నెంబర్‌

గొల్లకురుమల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. గొర్రెలకు వైద్య సహాయం కోసం చేయాల్సిన నంబర్‌ 1962ను ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. 1962 నంబర్‌కు కాల్‌ చేస్తే మంద వద్దకే వైద్యులు మందులు తీసుకువస్తారని తెలిపారు. ఇప్పటికే సంచార పశువైద్యశాలలకు ఆర్డర్స్‌ ఇచ్చామని.. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. సంచార వైద్యశాలల ద్వారా మంద వద్దకే మందులు వస్తాయన్నారు. ఏడాదికి 3 సార్లు క్రమం తప్పకుండా నట్టల మందు, టీకాలు వేయనున్నారు. ప్రతీ జిల్లాలో 4 టన్నుల స్టైలో గడ్డి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశానికే ఒక గొప్ప దిక్సూచి

రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దేశానికే ఒక గొప్ప దిక్సూచి కాబోతున్నదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొండపాకలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.

ఇవాళ కొండపాకలో బీరప్ప పండుగ వాతావరణం నెలకొన్నదని మంత్రి పేర్కొన్నారు. గొల్ల కురుమలకు కొండపాకలో గొర్రెలు పంపిణీ చేయడం చాలా సంతోషం అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కొండపాక ప్రజలు చాలా అదృష్టవంతులు అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అభివృద్ధి అంటే పట్టణాలు, పరిశ్రమలే కాదు.. గ్రామాలను ఆర్థిక పరిపుష్టి బాట పట్టించేలా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివద్ధి జరుగుతున్నదని చెప్పారు. గ్రామాల్లో కులవృత్తులను గుర్తించి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంలో పల్లె కన్నీరు పెడుతోంది అనేట్లు ఉండే గ్రామాల పరిస్థితి.. ఇవాళ చాలా పల్లెలలో పల్లె పన్నీరు చల్లుతోందన్న.. స్థాయికి చేరుకున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పల్లెల్లో రెప్పపాటు కరెంట్‌ పోకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువుల్లోకి నీరు రావడంతో చెరువులు కళకళలాడుతున్నా యన్నారు. రబీలో లక్షా 84 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 277 కోట్ల విలువ గల ధాన్యం కొనుగోలు చేసి 268 కోట్లు రైతులకు చెల్లింపులు చేశామని, మరో 8 కోట్లు పెండింగ్‌ లో ఉన్నాయని, వాటిని త్వరలోనే వారం రోజుల్లో రైతులకు అందజేస్తామని, ఇంత వేగవంతంగా ధాన్యం సేకరించడం.. చెల్లింపులు చేయడం.. సీఎం కేసీఆర్‌ గారి ప్రత్యేక చొరవతో ఇంత చేయగలిగామని మంత్రి చెప్పారు. ఈ రోజు సిద్ధిపేట జిల్లాలో 8 వేల 500 గొర్రెల పంపిణి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర సాంస్క తిక శాఖ ఛైర్మన్‌, మాన కొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కార్పోరేషన ఛైర్మన్లు గృహ నిర్మాణ కార్పోరేషన్‌ భూం రెడ్డి, రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ తుంకుంట నర్సారెడ్డి, ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ సుభాష్‌ రెడ్డి, బివేరేజేస్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దేవిశ్రీ ప్రసాద్‌, జెడ్పీ ఛైర్మన్‌ రాజమణి యాదవ్‌, డిసిసిబి ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర గొల్ల కుర్మ సొసైటీ ఛైర్మన్‌ రాజయ్య యాదవ్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, మడలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి, విప్‌ వెంకటేశ్వరర్లు, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌ హుస్సేన్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు రామ లింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎంపీలు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Other Updates