villageపట్టణీకరణకు దూరంగా ఈనాటికీ తెలంగాణ మారుమూలల్లోని పల్లెపట్టు లలో బతికున్న గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలను ఇష్టంగా, విశిష్టంగా చిత్రిస్తున్న వర్థమాన చిత్రకారుడు పోలోజు శ్రీనివాసాచారి. ఆయన చిత్రంలో గాఢమైన రంగురంగుల చీరలు, రవికలు ధరించే మహిళలు కన్పిస్తారు. వారి ముక్కున ముక్కుపోగులు, కాళ్ళకు కడియాలు, మోచేతి కడియాలు, వారి కట్టూ బొట్టూ చూపరులను ఇట్టే ఆకర్శిస్తాయి. వారితోపాటు నెత్తిన రుమాలు, భుజాన గొంగడి, చేతిలో కర్ర, ఒక్కోసారి నోట్లో చుట్టతో దర్శనమిచ్చే పురుషులు నగరాల వాసన ఏ మాత్రం సోకని అసలు సిసలు పక్కా గ్రామీణులు. వారి వృత్తులు ప్రవృత్తులకు దర్పణం పట్టే నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలను వాడుతూ తనకంటూ ఒకానొక ప్రత్యేకమైన శైలిని శ్రీనివాసాచారి ప్రదర్శించాడు.

ఈ యువ చిత్రకారుడు ఎక్కువగా ఒక్కో చిత్రంలో ఎవరో ఒకరిని తీసుకునివేశాడు. కొన్ని సందర్భాలలో ఇరువురు స్త్రీలు లేదా స్త్రీపురుషులను వేశారు. వీరికొన్ని చిత్రాల్లో గుంపులు కూడా తమ తమ ప్రత్యేకతలతో చూపరులను ఆకర్షిస్తారు.

మెదక్‌జిల్లా సిద్ధిపేట సమీపంలోని ఖానాపూర్‌కు చెందిన పోలోజు చంద్రయ్య చారి- సరస్వతి దంపతులకు నాలుగు దశాబ్దాల క్రితం జన్మించిన శ్రీనివాసా చారిలోవారి తాత-తండ్రులలో గల శిల్పకళానైపుణ్యం, చిత్రకళరంగంలో వికాసానికి దోహదం చేసింది. ఎలాగో స్కూల్‌ ఫైనల్‌ దాకా వచ్చాక అందులో కొనసాగక చిత్రకళావైపు మొగ్గేట్టు చేసింది. పగలు రాత్రి అని లేకుండా నిరంతరం మూర్తి చిత్రీకరణలోనే గడపడం ప్రారంభించాడు. అప్పట్లో ప్రజాదరణ పొందిన పత్రికలకు తన చిత్రాలను పంపడం అలవాటైపోయింది. ముఖ్యంగా ఏ అంశాలన్నైనా విమర్శనాత్మకంగా చూడడం, తేలికగా తీసుకునే మనస్తత్వం వల్ల కార్టూన్లు వేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా ఆయన కార్టూన్లు పత్రికలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రచురించారు. ఇట్లా కార్టూన్లు వేయడంలో చేయి తిరగడంతో మెల్లగా తైలవర్ణ చిత్రాలు వేశాడు. ఆ తర్వాత అక్రాలిక్‌ చిత్రాలు గీయడం ప్రారంభించాడు. వేలం చిత్రకళ స్వంతంగా అభ్యసించడం కాకుండా హైదరాబాద్‌ నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో చేరి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాడు. అనంతరం కలర్‌ చిప్స్‌లో చేరి 2డి యానిమేషన్‌ నేర్చుకున్నాడు. అడోబ్‌ ఫోటోషాప్‌, పేజ్‌ మేకర్‌, ష్లాష్‌ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించాడు.

ఒక ప్రణాళిక అంటూలేకుండా గాలి ఎటువీస్తే అటు అన్నట్టుగా శ్రీనివాసాచారి వృత్తి జీవితం సాగింది. తొలిరోజులలో రేఖాచిత్రాలు, ఆ తర్వాత కథా చిత్రాలో గీయడంతో మొదలు పెట్టి, డిజైన్‌ల రూపకల్పన చేయడంలో, యానిమేషన్‌ చేయడంలో చేయి తిరిగినవాడనిపించుకున్నాడు.

తెలుగులో కథలకు సంబంధించిన మొట్టమొదటి ఇ-బుక్‌ నిెగె డాట్‌కావ్‌ులో ప్రధాన చిత్రకారుడుగా, దాని డిజైన్‌ కూడా శ్రీనివాసాచారే చేశాడు. ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు చెందిన మాస పత్రికలో సీనియర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో కథలకు, కవితలకు, ఇతర శీర్షికలకు అర్థవంతమైన బొమ్మలు గీసి పాఠకుల మెప్పుపొందాడు. అనేక పర్యాయాలు దాని ముఖ చిత్రాలు కూడా వేశాడు. అట్లాగే మరో ప్రజాదరణ పొందిన దినపత్రికలో, దాని టెలివిజన్‌ జోనల్‌లో యానిమేటర్‌గా, క్యారెక్టర్‌ డిజైనర్‌గా పని చేశాడు. మరో ఒకటి రెండు ప్రధాన పత్రికలతోనూ పనిచేసి కార్టూన్‌ ఫీచర్లు కూడా నడిపాడు. అడ్వర్టయిజ్‌మెంట్‌ శిబిరాలకు డిజైన్లు వేశాడు, బొమ్మలు గీశాడు.

జీ ఆర్‌ఇ టోఫెల్‌ వ్రాసే విద్యార్థుల కోసం ఆయా పదాలను అర్థం చేసుకోవడానికి వీలుగా దాదాపు మూడు వేల చిత్రాలు వేశాడు. పదాలను, భావాలను అవగాహన చేసుకోవడానికి కార్టూన్లు వేశాడు. ప్రభుత్వానికి, జాతీయ, అంతర్జాతీయ ఎన్‌జిఓలైన్‌- అలయన్స్‌, ఆక్స్‌ఫామ్, అకాడమీ ఆఫ్‌ గాంధీయన్‌ స్టడీస్‌, హెచ్‌ఎల్‌ఎఫ్‌పిపిటి, యూనిసెఫ్‌, ఆగాఖాన్‌ పౌండేషన్‌, హెచ్‌ఎంఆర్‌ఐ తదితర సంస్థలకు ఫ్రీలాన్స్‌ చిత్రకారుడుగా ఎన్నో బొమ్మలు వేసిచ్చాడు. ఇటీవలే కృష్ణపట్నం పోర్ట్‌ వారు రూపొందిస్తున్న కాఫీటేబుల్‌ బుక్‌ కోసం ఇరవై చక్కని డ్రాయింగ్స్‌ రూపకల్పన చేసిచ్చారు.

ఇంతటి కళాత్మక దృష్టిగల శ్రీనివాసాచారికి గత యేడాది తెలంగాణ సాంస్కృతిక శాఖవారు నిర్వహించిన అఖిలభారత చిత్రకళా పోటీలలో సృజనాత్మక చిత్రానికిచ్చే అవార్డు వచ్చింది.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ నగరంలో అక్రాలిక్స్‌తో తాజాగా చిత్రించిన బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు.

లోగడ ఆయన 2008లో హైదరాబాద్‌ నగరంలోని సృష్టి ఆర్ట్‌ గ్యాలరీలో, 2016లో ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీలో, వ్యష్టి చిత్రకళాప్రదర్శనలు చేశారు.

అంతేకాదు 2006-08లో స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో, 2008లో బెంగుళూరు చిత్రకళా పరిషత్‌, కోల్‌కతాలోని జి.సి.లహ సెంటినరీ ఫైన్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో, జోద్‌పూర్‌లోని పాలెటీ సింఫనీ ఆఫ్‌ ఆర్ట్‌ గ్యాలరీలో, 2009లో గోవాలోని కళా అకాడమీలో, జైపూర్‌లోని జవహర్‌ కళాంద్రంలో, రేళలో, బెంగుళూరు హెబ్బా ఉత్సవంలో, 2011లో తిరిగి బెంగుళూరు హెబ్బా ఉత్సవంలో, 2013లో హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో, 2014లో హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో, 2015లో హైదరాబాద్‌లోని మ్యూజ్‌ ఆర్ట్‌ గ్యాలరీలో, 2016లో హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో సమష్టి చిత్ర కళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

సాలార్‌జంగ్‌ మ్యూజియం 2007లో పిల్లల కోసం నిర్వహించిన వేసవి చిత్రకళా శిబిరంలో ఈయన చురుకైన పాత్ర నిర్వహించాడు.

2009లో నల్లగొండ ఆర్ట్‌ సొసైటీ, 2010, 2011, 2014లలో హైదరాబాద్‌ ప్రెస్‌క్టబ్‌, 2015లో మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లలోనూ శ్రీనివాసాచారి పాల్గొన్నాడు.

ఇప్పటికీ ఆలోచన వచ్చిందంటే అలవోకగా కార్టూన్లు గీస్తూనే, కళాహృదయుల మనస్సులను దోచుకునే విధంగా కాగితంపైనో లేదా క్యాన్వాస్‌పైనో ఆక్రాలిక్‌తో అపురూపమైన చిత్రాలు వేయడం ఆయన అలవాటు. ఈ అలవాటును ఎలాంటి పరిస్థితులలోను తన జీవితాంతం కొనసాగించడమే తన లక్ష్యమని శ్రీనివాసాచారి సూటిగా చెబుతాడు.

Other Updates