ladiesటి. ఉడయవర్లు

ఆమెకు సాహిత్యంలో అభిరుచి ఉంది. సంగీతంలో మక్కువ ఉంది. చిత్రలేఖనమంటే ఇక ప్రాణమే.అందు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలనుంచి ”సితార్‌” వాద్య సంగీతంలో ”భూషణ్‌”లో ఉత్తీర్ణులయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాయంనుంచి చిత్రలేఖనంలో డిప్లొమా పూర్తి చేశారు.  

అంతేకాదు సంగీత, సాహిత్యాలలోని ఆమె పరిజ్ఞానాన్ని చిత్ర లేఖనంలో ప్రదర్శించారు. రాగాలను రంగులోకి తర్జుమా చేశారు. అంతలోనే తన మనస్సుపై ఎంతగానో ముద్రవేసిన ప్రకృతికి ప్రతికృతులను ఆమె రూపొందించారు. తనదైన బాణీలో వేస చిత్రాలకు ఆమె నాన్నగారు, సర్వకలాకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రశంసలు పొందారు. నిజానికి పి.వి. ప్రశంసలంటే మాటలా మరి? ఇంతకు ఆ చిత్రకారిణి పేరు సురభి వాణీదేవి. అందరిలాగే ప్రకృతే ఆమెకు ప్రథమ గురువు. కొండలు, కోనలు, చెట్లు, గుట్టలు, పూలు, నీలాలనింగి, ఎగిసిపడే సాగరకెరటాలు, గగనంలో దోబూచులాడే మబ్బులు, మిలమిల మెరిసే తారకలు, జాబిల్లి, ఎగిరేగువ్వలు, ఇతర పూజుకులు, సమస్త జంతుజాలం అవన్నీ మన మనసులదోచే మనోహర దృశ్యాలే. వీటితోపాటు శ్రామికజీవన సౌందర్యం ఆవిష్కరించే చిత్రాలు. వాణి చిన్నతనంలో వేసిన ఈ కోవకు చెందిన రేఖాచిత్రాలు వారి అమ్మ సత్యమ్మకు ఇష్టంలేకపోయినా వారి నాన్న పి.వి. నరసింహారావు వాటినిచూసి ఆమెను ప్రోత్సహించారు. చిత్రకళకు సంబంధించిన ప్రాథమికస్థాయిలో పుస్తకాలు, పెన్సిళ్లు, రంగులు, కుంచెలు కొనిచ్చేవారట. సుప్రసిద్ద చిత్రకారుడు, వారికి మిత్రుడైన కొండపల్లి శేషగిరిరావును ఒకసారి ఆహ్వానించి, వాణి వేసిన బొమ్మలు చూపారు. వారు ఆ బొమ్మలు గీసిన తీరుతెన్నులను మెచ్చుకుని, తగిన శిక్షణ ఇస్తే, మంచి చిత్రకారిణి అవుతందనడంతో ఆ దిశలో కృషిచేసి, మరో ప్రముఖ చిత్రకారుడు నరేంద్రరాయ్‌వద్ద చిత్రకళలో శిక్షణ ఇప్పించారు.

ఈ నేపథ్యంలో నాన్నగారి ప్రశంసలకోసమే అహోరాత్రులు శ్రమించి భావస్ఫోరకమైన అనేక చిత్రాలు ఆమె గీసేవారు. కాలక్రమేణా చిత్రాలు గీయకుండా ఉండలేని మనస్థితి ఏర్పడింది. ఒక వంక సంసారం, పిల్లలను చూసుకుంటూనే, మరోవంక సభ్యసమాజానికి అద్దంపట్టే చిత్రాలను ఆమె వేశారు. కొంతకాలం కమనీయమైన కుడ్య చిత్రాలు వేయడంలో గడిపారు. మరి కొంతకాలం హ్రాఫిక్ ప్రక్రియను పట్టుకుని పదనుపెట్టారు. తాను చిత్రకళ అభ్యసించిన కళాశాలలోనే 1987నుంచి అధ్యాపకులయ్యారు. అయినా ఆమెలోని తృష్ణ చల్లారలేదు. తాను నేర్చిన చిత్రకళ విద్యను పెద్ద ఎత్తున కొత్త తరానికి నేర్పించాలనే దుగ్ధతో 1991లో శ్రీ వెంకటేశ్వర లలిత కళాశాలను సురభి విద్యాసంస్థ పక్షాన స్థాపించారు. ఈ విద్యాసంస్థ స్థాపకురాలుూ కూడా ఆమె. ఈ కళాశాలకు ఇందులో వివిధ హోదాలలో వాణిదేవి పనిచేస్తూ 2008నుంచి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. గత మూడున్నర దశాబ్దాలకాలంలో నాణ్యమైన చిత్రకళా బోధనను కళాశాలద్వారా అందించి దాదాపు మూడువేలమంది యువ చిత్రకారులను తయారుచేశారు. ప్రస్తుతం మూడునాలుగు వందల మంది తయారవుతున్నారు. ఇంకా వీరి విద్యాసంస్థ ఫార్మసీ కళాశాల, వాస్తుశిల్పం కళాశాలను కూడా నిర్వహిస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలోని ముల్కనూరులోఉన్న శ్రీరామానందతీర్థ జూనియర్‌ కళాశాలకు ఈమె అధ్యక్షురాలు.

కళాశాల పాలనా వ్యవహారాల్లో ఆమె ఎంత తల మునకలై ఉన్నా, తనలోని భావాలను క్యాన్వాస్‌పైకి ఎక్కిస్తే ఎంతో భారం తగ్గుతుందని, మనసు ఆహ్లాదంగా ఉంటుందని ఆమె అంటుంది. ఆమె ఎక్కువగా జలవర్ణ చిత్రాలు గీయడమంటేనే ఇష్టపడతారు. హిందూ దేవతలంటే అత్యంతభక్తి ప్రపత్తులుగల వాణీదేవి దేవతల చిత్రాలకంటే ఎక్కువ సంఖ్యలో ప్రకృతి చిత్రాలను గీయడం విశేషం. చిత్రకలది  విశ్వభాష. అందుకే ఆమె చిత్రకళా ప్రదర్శనలు దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాదు అమెరికాలోని వాషింగ్టన్‌ డి.సి. లాంటి చోట్ల ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులు వెల్లడించిన స్పందన మరుపురానిదంటారామె. ”సారే జహాసే అచ్ఛా” శీర్షికన ఆమె వర్ణచిత్రాల ప్రదర్శన గ్రామీణ వాతావరణంపట్ల ఆమె ప్రేమ, గ్రామీణ జీవితం, సంప్రదాయాలు ఆచార, వ్యవహారాల్లో ఆమె అభినివేశం వ్యక్తం చేస్తుంది. చిత్రాలు గీయడంలో ఆమెదొక ప్రత్యేక శైలి. ఒ మాధ్యమాన్ని తన చిత్ర రచనకు ఉపయోగించడం ఆమెకు ఇష్టముండదు. ఒకసారి కత్తితో వేస్తె, మరోసారి కలంతో గీస్తారు. ఒకసారి నిలువెత్తు చిత్రాలు చిత్రాలు రూపుదిద్దితే, మరోసారి లఘు చిత్రాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇట్లా విభిన్న పోకడలు పోవడానికి ప్రేరణ వారి నాన్నగారే అంటుంది ఆమె. ప్రధానిగా పీవీ నరసింహారావు వెంట ఆమె నలభై ఎనిమిది దేశాల్లో గౌరవ అతిథిగా వెళ్ళి వచ్చారు. ఆయా దేశాల్లో కళల పరిస్థితులు, కళాకారుల ధోరణులను ఆమె తెలుసుకున్నారు.

ఆ మధ్య ”శివుణ్ణి” వస్తువుగా తీసుకుని చిత్రాలు వేశారు. ఈ అత్యాధునిక యుగంలో పౌరాణక వస్తువులు ఏమిటని ప్రశ్నిస్తే – ”అది అసలు సిసలు భారతీయమైందనీ, దాని తాలూకు పరిజ్ఞానం, అనుభూతి, భక్తి ప్రపత్తులు మన జాతి రక్తంలోనే జీర్ణించి ఉన్నాయన్నారు. ఈ వస్తువు తీసుకుంటే విదేశీయు లెవ్వరూ బహుశా దీనికి న్యాయం చేయలేరన్నారు. మన ఇది ప్రత్యేకమైందన్నారు.

అయితే చిత్రలేఖనానికి సంబంధించిన పరిజ్ఞానంలో మాత్రం మనం విదేశాలవారికన్నా సంకేతికంగా వెనకబడి ఉన్నామన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలతో పోలిస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నామన్నారు. జనసామాన్యంలో ఇప్పుడిప్పడే చిత్రకళకు సంబంధించిన చైతన్యం పెంపొందుతున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగానూ, విశ్వవిద్యాలయాల పరంగానూ ప్రోత్సాహం అవసరం. లోగడ కొంతవరకు చిత్రకళకు సేవచేసిన అకాడమి ఇవ్వాళ లేకుండా పోయింది. ఈ అకాడమిని పునర్వ్యవ్యవస్థీకరించాలి. చిత్రకళారంగంలో కృషి చేసేవారికి కర్నాటక ప్రభుత్వంచేయూతనిస్తున్నది. కర్నాటక చిత్రకళా పరిషత్‌ ఆవిర్భావం ఇందుకు ఒక మచ్చుతునక, ఇదే పద్ధతిలో మన రాష్ట్రంలోని ప్రభుత్వం చిత్రకారులను గుర్తించాలి.

పైవేట్‌రంగంలో చిత్రకళా కళాశాలలు పెట్టడానికి ఎందరో మహానుభావులు ముందుకు వచ్చే పరీస్థితులకు ప్రభుత్వం దోహదం చేయాలి. పాఠశాలస్థాయిలోనే డ్రాయింగ్‌ (చిత్రకళను) తప్పనిసరి బోధించి నేర్పించే అంశంగా ప్రవేశపెడితే మంచిది. చిత్రకళాభ్యాసం విద్యార్ధి మనస్సు ఒ అంశంపై కేంద్రీకృతంచేసే అలవాటును పెంచుతుంది. చిత్రకారుడి పనితనానికి రేఖాచిత్రాలు తొలి నిదర్శనం. విరాపు వంటి కళాకారుల చిత్రాల్లో రేఖా చిత్రాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలియనిదికాదు. కళారూపం ఏదైనా ఇవన్నీ కూడా గీతలమీద ఆధారపడి సాగుతాయి. అందు మా శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చదువుతున్న తొలి సంవత్సరం విద్యార్థులనుంచి చివరి సంవత్సరం విద్యార్థులదాకా అందరిచేత ప్రతిరోజు రేఖాచిత్రాలు గీయడం అభ్యాసం చేయిస్తుంటాము . ఒక్కొక్క విద్యార్ధి తన కోర్సు పూర్తయ్యేనాటికి కొన్నివేల రేఖాచిత్రాలు వేసి తీరాలి. రేఖాచిత్రాలు రోజూవేసే విద్యార్ధినీ విద్యార్థులు అనంతరకాలంలో పరిణతిగల కళాకారులైపోతారు. భావస్వాతంత్ర్యం గల కళాకారుడు ఆలోచన, అవగాహనలస్థాయిలో ఎప్పటికీ ఒకతరంముందే ఉంటాడు.

నూతన ధోరణులగురించి ప్రస్తావించినప్పుడు కళలన్ని కాలక్రమేణా అవసరాన్నిబట్టి, అవకాశాలను అనుసరించి పరిణామం పొందుతున్నాయి. చిత్రకళలో రియలిజం, రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, క్యూబిజం, డాడాయిజం, ఎక్స్‌ప్రెషనిజం, సర్రియలిజంనుంచి ఈనాటి ఆబ్‌స్ట్రాక్ట్‌ అంటే నైరూప్యకళ వరకు అనేక మజిలీలున్నాయి. వస్తువు బాహ్యరూపాన్నే కాకుండా అంతర్గతరూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ నైరూప్య కళ. అయితే ఏ చిత్రం గొప్పదనమైనా రేఖానైపుణ్యం, వర్ణ సమ్మేళనంతో పాటు అందులోని భావసంపదపై ఆధారపడి ఉంటుంది. ఈ నైరూప్యకళ అనేక ఇజాలనుంచి నిగ్గుతేలి ఆవిర్భవించిన అత్యాధునిక ప్రక్రియ అని ఆమె వివరించారు.

”మీ భవిష్య పణాళికలేమి”టని ప్రశ్నిస్తే- శ్రీ వెంకటేశ్వర కళాశాలను గొప్ప కళాక్షేత్రంగా తీర్చిదిద్దాలి. ఇది యాత్రీకులను సైతం ఆకర్షించే కేంద్రం కావాలని కలలుకంటున్నాను. ఇవ్వాళ పెయింటింగ్‌, ఆప్లయిడ్‌ ఆర్ట్స్‌లో స్నాతకోత్తరస్థాయి (ఎమ్ఎఫ్‌ఏ) తరగతులు, ఫొటో, వీడియో, టీవీ టెక్నాలజీలు డిగ్రీ (బిఎఫ్‌ఏ) తరగతులున్న మా కళాశాలలో చిత్రలేఖనంకు సంబంధించిన అన్ని విభాగాలు ప్రారంభించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. దీనికి ప్రభుత్వం చెయూతనివ్వాలి అన్నారు. వారి కళాశాల వార్షికోత్స వాల సందర్భంగా చిత్రకళా ప్రదర్శనలేకాకుండా అప్లైడ్‌ ఆర్టోటీచర్‌ పాత్ర, డిజైన్‌ కార్పొరేట్‌ అనే అంశాలపై అఖిలభారతస్థాయి విద్యార్ధి చిత్రకారుల శిబిరాలు ఏర్పాటు చేశారు. పెయింటింగలో నలభైరోజుల వర్క్‌ షాపను సాలారజంగ్లో మ్యుజియంలో, యు .జి. విద్యార్ధిలకు పదిహేను రోజులపాటు టెర్రకోట వర్క్‌షాపు వాణీదేవి చొరవతో జరిగాయి.

స్వామి రామానందతీర్థ స్మారక కమిటీకి ఆమె ప్రధాన కార్యదర్శిగాను, స్వామి రామానందతీర్థ ప్రాంతీయ పరిశోధన కేంద్ర సభ్యులుగాను ఆమె చురుకుగా పనిచేస్తున్నారు.

ఇంత తీరికలేకుండా ఉన్నాకూడా ఆమె దక్కన్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌వారు హైదరాబాదులో ఏర్పాటుచేసిన ‘బతుకమ్మ’ చిత్రకళా శిబిరంలో కోనసీమ చిత్రకళా పరిషత్‌ ఏర్పాటు చేసిన చిత్రకారుల శిబిరంలో ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన చిత్రకళా శిబిరంలో, ఆంధ్రపదేశ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ చిత్రకళా శిబిరంలో, శిల్పకళా రామంలో కేంద్ర రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖలు నిర్వహించిన చిత్రకళా శిబిరంలో శిల్పారామం, దక్షిణప్రాంత సాంస్కృతికం కేంద్రం నిర్వహించిన అఖిలభారత సంప్రదాయ చిత్రకారుల శిబిరంలో, అమెరికాకు చెందిన పాల్‌ లింగిన్‌ ఏర్పాటుచేసిన గ్రాఫిక్‌ శిబిరంలో, కుడ్య చిత్రకళా శిబిరం తదితరాల్లో ఆమె పాల్గొన్నారు. చిత్ర రచన చేశారు. వ్యష్ఠి చిత్రకళా ప్రదర్శనలేకాకుండా హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమష్టి చిత్రకళాప్రదర్శన లాంటి ఎన్నో సామూహిక చిత్రకళా ప్రదర్శనల్లోనూ వారి చిత్రాలకు మంచి స్పందన వచ్చింది.

ఇంతటి చిత్రకారిణిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతిభావంతులైన మహిళలకు ప్రదానంచేసే పురస్కారం వాణీదేవికి ఇచ్చారు. అంతకుముందు ఆమె హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ, మద్రాసు తెలుగు అకాడమి, భారతీయ విద్యాపీఠ్‌ లలిత కళల కళాశాల (పుణె) ఆర్ట్స్‌ అకాడమి, చిత్రకళాపరిషత్‌ (మచిలీపట్నం), నవరంగ్‌ చిత్రకళా పరిషత్‌, వైజేకి సామూహిక సంస్థలు, రాజమండ్రిలోని చిత్రకళా నికేతనం ప్రదానంచేసిన కూలడే స్మారక అవార్డు కూడా అందుకున్నారు. వారి చిత్రాల అమ్మకాలవల్ల లభించే సొమ్ము బాలికల విద్యకోసం లేదా అనాథల సంక్షేమంకోసమే ఆమె వెచ్చిస్తున్నారు.

Other Updates