telanag– నాగబాల సురేష్‌ కుమార్‌

ఖమ్మం జిల్లా అనగానే అపారమైన ఖనిజ సంపదకు అమూల్యమైన సహజసంపదకు నిలయంగా నిలిచిన ప్రాంతమని మనందరికీ తెలుసు. అలాంటి గొప్ప సంపద కలిగిన ఖమ్మం జిల్లాలో ఈ అద్భుత రాతి కట్టడం మనకు దర్శనమిస్తుంది. ఖమ్మం పట్టణం నడిబొడ్డున పురాతన చిహ్నంగా నాటి చరిత్రకు ఆనవాలుగా కనిపిస్తుంటుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు రాజదర్పం ప్రదర్శించి ఎందరో పాలకులకు నిలయంగా, మరెందరికో నీడలా నిలిచిన ఈ అద్భుత రాతి కట్టడానికి దాదాపు వెయ్యి సంవత్సరాల ఘన చరిత్ర వుంది. 4 చదరపు కి.మీ. వైశాల్యంలో నిర్మాణమై వున్న ఈ ఖిల్లా చుట్టూ 12 బురుజులు మరియు 10 రాతి దర్వాజాలు ఉన్నాయి. ప్రతి కట్టడం ఒక రాజదర్పంలా అద్భుతంగా నిర్మితమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అసలీ అద్భుత నిర్మాణాన్ని ఒకసారి పరికించి చూసినప్పుడు ఆ కాలంలో ఈ అద్భుత రాతి నిర్మాణం నాటి పాలకులు, శిల్పులు ఎలా నిర్మించగలిగారనే అనుమానం మనందరికీ కలుగుతుంది. ముందుగా మట్టి కోటగా నిర్మాణం ప్రారంభమైన ఈ కోట కొంత కాలంపాటు రెడ్డి రాజుల పాలనలో ఉండి అనంతరకాలంలో శ్రీకృష్ణ దేవరాయల చేతికి, ఆ తరువాత, ఒరిస్సా గజపతి రాజుల పాలనలో కొంతకాలం కొనసాగి, చివరికి ఎక్కువ కాలం పాటు నిజాం రాజుల పాలనలో కొనసాగింది.

ఖమ్మం ఖిల్లా ఎంత పెద్దదో దాని చరిత్ర కూడా అంతే పెద్దది. మట్టి కోటగా నిర్మాణం ప్రారంభమైన ఈ ఖిల్లా నిర్మాణం వెయ్యేళ్ళ క్రితమే ప్రారంబించబడింది. ఎంతో దృడంగా కోట నిర్మాణం గావించబడింది. ఠీవిగా కనిపించే ఖమ్మం ఖిల్లాను సందర్శించే క్రమంలో ముందుగా మనకు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం కనిపిస్తుంది. 16వ శతాబ్ధంలో దశ, దిశలా తన విజయనగర సామ్రాజ్య విస్తరణ చేసిన శ్రీకృష్ణదేవరాయల ఎలుబడిలో కొన్నాళ్ళు ఈ కోట ఉండటం వల్ల కోట కొత్త హంగులతో రూపుదిద్దుకోబడింది. కాకతీయుల పాలనా కాలంలో అంటే క్రీ.శ. 950 లో ఖమ్మం ఖిల్లాకు పునాది రాయి పడింది. 1006వ సంవత్సరం నాటికి అంటే 56 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కోట నిర్మాణం పూర్తయిందని అంచనా.

ఆ తరువాత సుమారు 300 ఏళ్ళ పాటు రెడ్డి రాజుల పాలనలో ఉండి తన ఘనతను ఘనంగా చాటింది. ఆ తరువాత వెలమ రాజుల పాలనలో కొంతకాలం ఉండి అనంతరం ఒరిస్సా గజపతి రాజులు, నందపానులు, గుడ్లూరు, కాళ్ళూరు వంశస్తుల చేతుల్లోకి ఈ ఖిల్లా వెళ్ళింది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటపై తన జెండాను ఎగురవేసాడు. ఆ తరువాత కుతుబ్‌ షాహీల ఏలుబడిలోకి ఈ ఖిల్లా వెళ్ళింది. వీరి పాలనలో కోట మరింత అందంగా రూపుదిద్దుకుంది. అసఫ్‌ జాహీలు ఈ కోటను తమ సొంతం చేసుకున్నాక కోట పూర్తిస్థాయి రాతి కట్టడంగా మారింది. 17వ శతాబ్ధం తరువాత ఖమ్మం కోట శత్రుదుర్భేద్యమైన కోటగా రూపుదిద్దుకోవడంలో అసఫ్‌జాహీలు చాలా కీలక పాత్ర పోషించారు. ఈ కోట అంతా గ్రానైట్‌ రాయితో చెక్కించబడింది. అలాగే అసఫ్‌జాహీల కాలంలోనే కోట రక్షణ కోసం కోట చుట్టూ 60 మర ఫిరంగుల ఏర్పాటు జరిగిందని చారిత్రక కథనం.

కోట సింహద్వారం దాటి కొంచెం ముందుకు వెళితే అసలు దుర్గం మనకు కనిపిస్తుంది. కాకతీయుల రాజధాని పట్టణం ఓరుగల్లు నుండి ఖమ్మం ఖిల్లా వరకు నేరుగా సొరంగ మార్గం వుంది. దానిగుండా నాటి వేగుల రహస్య రాకపోకలు వుండేవని చరిత్రకారుల కథనం. మారువేషంలో ఎవరైనా కోటలోకి ప్రవేశిస్తే వారి రాకను గ్రహించి బంధించే విధంగా కొన్ని నిర్మాణాల్ని కూడా చేపట్టి నాటి పాలకులు విజయవంతమయ్యారంటే వారి తెలివి ఎంత ఘనమైందో మనం ఊహించవచ్చు. ఖమ్మం ఖిల్లా నుండి చాలా కాలం పాటు పాలన సాగించిన అసఫ్‌జాహీలదే ఈ ఆలోచన. కోటలోని ఏ ప్రాంతం నుండి చిన్న శబ్ధం చేసినా కోటలోని ముఖ్య ప్రాంతమంతా ప్రతిధ్వనించేలా ఇక్కడ ప్రత్యేక రాతి నిర్మాణాలు వున్నాయి. ఖమ్మం ఖిల్లాలో మనం చెప్పుకోదగ్గ నిర్మాణం ఏంటంటే వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణం. ఈ కోటలోని కొండలో ఏ ఒక్క నీటి బొట్టు వృధాగా పోకుండా నిర్మాణాలు చేపట్టారు. జలమే జీవనాధారం అన్నది నాటి పాలకుల ప్రగాఢ విశ్వాసం. ఈ కోటలో ఎన్నో అద్భుత వింతలు, విశేషాలు వున్నాయి.

కోట పూర్తిగా ఎక్కితే కోట పై భాగం నుండి ఖమ్మం చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలన్నీ మనకు కనిపిస్తాయి. ఈ కోట పెద్ద కొండపై నిర్మించబడింది. ఖమ్మం జిల్లాకు కీర్తికవచం ఖమ్మం ఖిల్లా…. ఆనాటి రాజులకు రక్షణా కవచం. ఊహకు అందని నిర్మాణ కౌశలంతో నిర్మించబడిన ఈ కోట మనందరినీ అబ్బురపరుస్తుంది. ఆనాటి కాలంలో ఈ కోట సైనికుల ప్రధాన రక్షణ కేంద్రంగా, ముఖ్య ఆయుధ భాండాగారంగా వుండేది. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ కోట చరిత్రను మనం రక్షించాల్సివుంది. నాటి శిల్పులు అద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలిచిన కోట రాతి గోడలు ఇప్పుడు బీటలువారుతున్నాయి. ఒక్కోరాయి కిందపడుతూ కోట క్రమంగా శిథిలావస్థకు చేరుతోంది. ఎందరో రాజుల చేతుల్లోకి వెళ్ళిన ఈ కోట కాకతీయ రాజుల సామంతులు అయిన సీతాపతి రాజు, కాపయనాయుడు, షోలనాయుడు చేతుల్లో కూడా కొంత కాలం వెళ్ళిందని మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో గోల్కొండ సుల్తానులు దీనిపై దండయాత్ర చేసి తమవశం చేసుకున్నారు. ఒక్కో వంశస్తుల కాలంలో ఒక్కో రకమైన వైభవాన్ని, ప్రాభవాన్ని చవిచూసిన ఈ కోట ఒక్కో మెట్టు పైకెక్కుతూ నిజాం రాజుల హయాంలో శత్రుదుర్భేద్యమైన కోటగా రూపుదిద్దుకోబడింది.

కొంతమంది హిందూ రాజుల పాలనా కాలంలో ఈ కోట చుట్టూ అష్ట దిగ్భంధనం పేరుతో ఎనిమిది ఆంజనేయ మందిరాలు నిర్మించారు. ఖమ్మం ఖిల్లా 4 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి వుంది. ఖిల్లాకు 12 దర్వాజాలు వున్నాయి. శత్రు మూకలను పట్టుకోవడానికి ఖిల్లాపై 4 బురుజులు వున్నాయి. మొత్తంగా కోటలో 10 బురుజులు వున్నాయి. ఈ కోట తీరుతెన్నులను ఫ్రెంచ్‌ ఆర్కిటెక్చర్స్‌ రూపొందించినట్లు చరిత్ర కథనం. ఖిల్లాకు వెళ్ళే దారిలో మనకు రెండు దారులు ఎదురవుతాయి. ఆ తరువాత మనకు మూడు మలుపుల్లో ఈ దారులు వుంటాయి. శత్రువులు రెండు ముఖ ద్వారాలను దాటి ముందుకు వచ్చినా వారిని నిలువరించే క్రమంలో నిర్మించిన కొన్ని ఇరుకు సందుల నిర్మాణం మనకు అబ్బురంగా తోస్తుంది. ఆ తరువాత కోట పైకి ఎక్కుతున్న క్రమంలో మనకు మరో ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఇలా మొత్తంగా 12 దర్వాజాల నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ప్రతి ద్వారంలోకి వెళుతున్న క్రమంలో నాలుగైదు మలుపులు ఎదురవుతాయి. ఈ మలుపులన్నీ శత్రువులను విస్మయానికి గురి చేయడానికి నిలువరించడానికి మాత్రమే నిర్మించబడ్డాయి.

ఖిల్లా చుట్టూ కట్టిన ఎత్తయిన రాతి కోట ఖిల్లాకు గొప్ప రక్షణ కవచంగా వుంటుది. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా వుందంటే దాని తీరుతెన్నులు ఎంత పటిష్టమో మనం ఊహించవచ్చు. కోట చుట్టూ వున్న గోడలకు వున్న రంధ్రాల ద్వారా సైనికులు నిరంతర నిఘా నిర్వహించేవారు. ఖిల్లాలో పడే ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా ఇక్కడ బావి నిర్మాణాలను చేపట్టారు. ఈ బావినే ‘జఫర్‌ బౌలి’ బావి అని కూడా అంటారు. ఈ బావులన్నిటిలోకెల్లా ఇది ప్రత్యేక నిర్మాణం. ఎందుకంటే కోట పరిసరప్రాంతాల వారికి మంచి నీటి అవసరాలను ఈ బావి తీర్చేది. ఈ నిర్మాణాన్నిబట్టి చూస్తే వారు నీటికిచ్చిన ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమవుతుంది. అలాగే ఖిల్లాకు మధ్య భాగంలో ఒక పెద్ద భావి వుంది. ఇక్కడ ఎల్లప్పుడూ నీరు నిల్వ వుంటుంది. ఈ నీరు ఈ కోటలో వుండే వారి దాహార్తిని తీర్చేదట. అలాగే ఈ నీటిని బయటకు వదలడానికి రెండు ప్రత్యేక దారులను కూడా ఉపయోగించారు. వీటి ద్వారా వచ్చే నీరును చెరువులలోకి వెళ్ళే విధంగా కూడా నిర్మాణాలను చేపట్టారు. బావిలోని నీరేకాకుండా కోటచుట్టుప్రక్కల పడే నీటిని ఒడిసి పట్టుకునేలా ఇక్కడ నిర్మాణాల్ని చేపట్టారు. 1971లో ఇక్కడి స్థానిక ప్రజలు ఈ బావులనే పునర్‌వ్యవస్థీకరణ చేసి ఉపయోగించుకున్నారు కూడా. తరువాతి కాలంలో ఈ బావులు సరైన పోషణ లేక మరుగున పడిపోయాయి. ఇక్కడ నీటితోనే నాడు మంచి మంచి మిఠాయిలు తయారీ చేసేవారని కథనాలు చెబుతున్నాయి. అలాగే ఈ కోటను మిలటరీ అవుట్‌పోస్ట్‌గా కూడా కొంతకాలం పాటు వాడినట్లు చారిత్రక సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖిల్లా చుట్టూ ఎన్నో ఇళ్ళ నిర్మాణాలు వుండడం వల్ల కోటకు ముప్పు వాటిల్లే అవకాశమూ లేకపోలేదు. కోటలో ఒక గొప్ప కోనేరు నిర్మించబడింది. వాతావరణంలో వేడి 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనా కూడా కోనేరులో ఒక చుక్క నీరు కూడా ఎండిపోని పరిస్థితి మనకు ఈ కోనేరులో కనిపిస్తుంది. కాకతీయ, రెడ్డి రాజులు, షాలువ వంశీయులు, విజయనగర రాజులు, బహుమనీ సుల్తానులు, అసఫ్‌ జాహీలు దశల వారీగా ఏలిన ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ళ చరిత్రకు నిలువుటద్దం. ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఈ శుభ తరుణంలో వెయ్యేళ్ళ ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోటకు కొత్త హంగులు సమ కూర్చి టూరిస్టులకోసం కనీస వసతి సౌక ర్యాలు సమకూరిస్తే గొప్ప టూరిస్ట్‌ కేంద్రంగా ఈ కోట విరాజి ల్లుతుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది..

Other Updates