magaతెలంగాణ జనపదాలలో ‘పెద్ద ఏకాదశి’గా ప్రసిద్ధమైన చేగోళ్ల పండుగ ‘తొలి ఏకాదశి’ ప్రతియేటా ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశినాడు సంభవించే ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగానూ, సాంస్కృతికంగానూ, సామాజికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది.

కాలమానాన్ని అనుసరించి దక్షిణాయాన ప్రవేశానికి ముఖద్వారంలా ఈ పండుగ కనబడుతుంది. ఈ పవిత్రదినాన మహావిష్ణువు వైకుంఠంలో పాలకడలిపై శేషతల్పంపై యోగనిద్రలోకి జారుకొంటాడని పారంపరిక విశ్వాసం.

సంవత్సరంలో రెండు అయనాలు సంభవించడం అందరికీ తెలిసిందే. ఒకటి ఉత్తరాయణం. రెండవది దక్షిణాయనం. సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు వాలుతూ ప్రయాణించినంతకాలం ఉత్తరాయణంగానూ, దక్షిణార్థగోళంవైపు వాలుతూ ప్రయాణించినంతకాలం దక్షిణాయానంగానూ కాలాన్ని పరిగణిస్తారు. ఉత్తరాయణ కాలంలో దేవతలు మేల్కొని ఉంటారనీ, దక్షిణాయనకాలంలో నిద్రిస్తారనీ పురాణాలు చెబుతున్నాయి. అంటే దేవతలకు ఉత్తరాయణం పగలు వంటిది. దక్షిణాయనం రాత్రివంటిది. మనుష్యులు దేవతల అనుగ్రహంమీద ఆధారపడి ఉంటారు. తమ జీవితాలలో సంభవించే మంచి చెడులకూ, ఉత్థానపతనాలకూ, కష్టసుఖాలకూ దేవతల నిగ్రహానుగ్రహాలే కారణాలని నమ్ముతుంటారు. ఇది సత్యమే అన్నట్లు ఖగోళంలోని గ్రహాలూ, నక్షత్రాలూ, తమ ప్రభావాన్ని భూగోళంపై వివిధ రూపాలలో చూపుతూ ఉండడం తెలిసిందే. పూర్ణిమ, అమావాస్యలలో చంద్రుని ప్రభావం సముద్రాలమీద విశేషంగా కనబడడం ప్రత్యక్ష నిదర్శనమే. పంచభూతాలు మానవాళిపై అమిత ప్రభావాన్ని చూపే దివ్యశక్తులే. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే ఈ పంచభూతాలు మానవుని శరీరంలోనూ, ప్రపంచంలోనూ వ్యాపించి ఉన్నాయి. వాటి ప్రభావాలకు మానవాళి తలవంచుతూనే ఉంది. పంచభూతాలు ప్రకోపిస్తే ఏం జరుగుతుందో భూకంపాలూ, వరదలూ, సునామీలూ, అగ్నిపర్వతాల, పేలుళ్లూ, టోర్నడోలవంటి ప్రభంజనాలూ, ఉల్కాపాతాలవంటివి అనుభవపూర్వకంగా తెలుపుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరాయణ, దక్షిణాయనాల ప్రభావం భూమిపై అమితంగా ఉంది. దక్షిణాయనం ప్రారంభం కాగానే రుతుపవనాల బలీయ ప్రభావంతో విరివిగా వానలు పడుతాయి. అప్పటిదాకా ప్రచండంగా కాచిన ఎండల వేడిమి ఒక్కసారిగా చల్లబడి తేమతో నిండిన శీతల వాతావరణం ప్రకృతిలో చోటు చేసుకొంటుంది. ప్రకృతిలో మార్పు వచ్చినంత వేగంగా మనిషి శరీరంలో మార్పురాదు. కనుక బాహ్య ప్రకృతికీ, మానవ శరీర ప్రకృతికీ మధ్య ఈ అయన ప్రారంభంలో ఘర్షణ ఏర్పడుతుంది. ప్రకృతిశక్తి ముందు మానవశరీర శక్తి అల్పమే కనుక, మానవ శరీరాలు అస్వస్థతకు గురౌతుంటాయి. సహజంగానూ సూర్యరశ్మి తగ్గడంవలన జఠరాగ్ని మందగిస్తుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. కనుక దక్షిణాయన ప్రారంభదినమైన తొలి ఏకాదశినాడు శారీరక రక్షణకై ఉపవాసం చేయడం, జాగరణ చేయడం పరిపాటి.

ఆషాఢశుక్ల ఏకాదశి మొదలుకొని కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల నాలుగు నెలలను పవిత్ర ‘చాతుర్మాస్యాలు’ అని పిలుస్తారు. చాతుర్మాస్యం అంటే పవిత్రమైన నాలుగు నెలల సముదాయం. ఈ నాలుగు నెలలపాటు మానవాళి తమ నిత్య జీవితంలో అర్చనలతోనూ, వ్రతాలతోనూ, తపస్సులతోనూ, ధ్యానాలతోనూ, మౌన వ్రతాలతోనూ, ఉపవాస దీక్షలతోనూ గడపాలని సంప్రదాయం చెబుతోంది. ముఖ్యంగా యోగులూ, సన్న్యాసులూ, ఈ నాలుగు నెలలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ పుణ్యమాసాలలో ఏ పుణ్యకార్యం చేసినా, అది విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

ఏడాదిలో అధికంగా పండుగలు దక్షిణాయనంలో వస్తాయి. కనుక పర్వదినాలకు ఆరంభం వంటిది తొలి ఏకాదశి. అందుకే దీనిని తెలంగాణ రాష్ట్రంలో ‘పెద్ద ఏకాదశి’ అని పిలుస్తారు. పెద్ద అనే పదం మహత్వానికి సంకేతం. అధిక సంఖ్యకు సంకేతం. వృద్ధిని సూచించే సంఖ్యగా ‘ఏకాదశి’కి సంఖ్యా శాస్త్రంలోనూ విశిష్టత ఉంది. పెరుగుదలను సూచించే పదకొండు సంఖ్యతో కూడిన ‘ఏకాదశి’నాడు ఏ మంచి పని చేసినా తిరుగులేని అభివృద్ధిని సూచిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ప్రతి నెలలోని ఏకాదశినాడు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీ. వర్షాకాలంలో ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, వీలైతే రాత్రివేళ తినడంమాని వేయాలనీ వైద్యులు సైతం చెబుతుంటారు. జీర్ణకోశంలో ఏర్పడే మాంద్యంవల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువ. మాంద్యంగా ఉన్నప్పుడు అధికంగా ఆహారం తీసుకుంటే అజీర్ణం కలగడం, దానివలన వ్యాధులు ముదరడం క్రమంగా సంభవిస్తుంది. కనుక ప్రాచీన సంస్కృతి పర్వదినాల రూపంలో మానవుల ఆరోగ్య పరిరక్షణకోసం ఉపవాస దీక్షలను ప్రబోధించింది. ఉపవాస దీక్షా సమయంలో మనస్సు చంచలం కాకుండా ఉండేందుకు ధ్యానాన్నీ, ఏకాగ్రతనూ, మౌనాన్నీ ఆచరించాలని ప్రబోధించడం కనబడుతుంది.

ఈ పర్వదినాన తెలంగాణ జనపదాలలో వరిపిండితో కూడిన వంటకాలు చేసుకోవడం పరిపాటి. ‘చేగోళ్లు’ వంటి పిండి వంటలను ప్రతి యింటిలోనూ చేసుకొని తినడం కనబడుతుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశిని తెలంగాణలో ‘చేగోళ్ల పండుగ’ గానే పిలుస్తారు. సాధారణంగా ఏ పర్వదినంనాడైనా ఉష:కాలంలోనే మేల్కొనడం, పవిత్ర జలాలతో మంగళ స్నానాలను ఆచరించడం, ఇష్ట దేవతలను అర్చించడం, మధుర పదార్థాలను దేవతలకు నివేదించడం, దేవాలయాలను సందర్శించడం, విశేష పూజలను ఆచరించడం, ప్రసాదాలను స్వీకరించడం, దానధర్మాలను చేయడం పుణ్యకారకమని భావిస్తారు. మహావిష్ణువుతోబాటు దేవతలందరూ యోగ నిద్రలోకి జారుకొనే ఈ దినాన ప్రపంచాన్ని చల్లగా చూడుమని కోరుతూ చేసే ప్రార్థనలు అంతటా కనబడుతాయి. తిరిగి ఉత్తరాయణ ప్రవేశపుణ్యదినమైన ‘సంక్రాంతి’నాడు దేవతలకు మేలుకొలుపులు పలికే అర్చనలూ ఉంటాయి.

దేవతల నిద్ర యోగనిద్ర మాత్రమే. అంటే వారు నిద్రించే సమయంలోనూ సమస్త ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకొంటూ ఉంటారు. అంటే దేవతలు సచేతన నిద్రలోనే ఉంటారని తాత్పర్యం. మానవులు అలా కాకుండా నిద్రా సమయంలో ప్రపంచంలో జరిగే ఏ విషయాన్నీ తెలుసుకోలేరు. మానవులది మొద్దునిద్ర. ప్రమత్త నిద్ర.

అంతేకాకుండా మానవులు మేల్కొని ఉన్నా తప్పులు చేస్తారు. నిద్రలో ఉన్నా తప్పులు చేస్తారు. దేవతలు నిద్రలోనూ, జాగరణలోనూ అప్రమత్తంగా ఉంటారు. మనుష్యుల శరీరాలు పాంచభౌతికాలు. దేవతల శరీరాలు దివ్యశరీరాలు. తేజోమయ శరీరాలు కనుక దేవతలు మనుష్యులకంటే ఎన్నో రెట్లు గొప్పవారు కనుకనే వారిని ఆరాధించడం, వారినుండి ఆ దివ్యశక్తులను కోరడం సంప్రదాయంగా మారింది. అలాంటి ప్రయత్నంలోని భాగమే ‘తొలి ఏకాదశి’ పండుగ.

పండుగలు ఏవైనా, అవి మానవ జీవన పరమార్థానికే దారిచూపుతాయి. ఎప్పుడూ అజ్ఞానాంధకారంలోనే మ్రగ్గిపోయే మనిషికి జ్ఞానాన్ని కలిగించే దీపాలు పండుగలు. వీటిని ఆచరించడం ద్వారా శరీరమూ, మనస్సూ, వచస్సూ నిర్మలమై జీవితాన్ని ఆనందదాయకం చేస్తాయి. ఇదే ‘తొలి ఏకాదశి’లోని విశేషం.

 

డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ

Other Updates