tsmagazine

హైదరాబాద్‌

సంస్థానంలో నిజాం పరిపాలనలో నలు దిశల అధికారం వ్యాపించి ఉన్న సమయంలో తెలుగు ప్రజలు తమ మాతృభాషలో విద్యాభ్యాసం చేయడానికి కూడా నోచుకోని రోజుల్లో, హైదరాబాద్‌ నగరంలో 1901 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన జరిగింది. రావిచెట్టు రంగారావు బంగాళాలోని ఒక భాగంలో గ్రంథాలయం పనిచేసేది. కొద్ది రోజుల తర్వాత ఒక అద్దె ఇంటిలోకి మార్చారు. ఈ సంస్థను స్థాపించిన, పెంచి పోషించిన రావిచెట్టు రంగారావు 1919లో ఆకస్మికంగా దివంగతులైనారు. వారి సతీమణి లక్ష్మీ నరసమ్మ భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనటానికి మూడువేల రూపాయలు విరా ళంగా యిచ్చారు. ఆ డబ్బుతోనే సుల్తాన్‌ బజారులో ఒక పెంకుటిల్లుకొని, అందులో గ్రంథాలయం కార్యక్రమాలు జరిపించారు. 1915లో మాడపాటి హనుమంతరావు పంతులు కృషి ఫలితంగా నూతన భవన నిర్మాణం జరిగింది. తెలుగు తల్లిని కనక కిరీటంతో అలంకరించాలని ఆకాంక్ష, నిరక్షరాస్యత నిర్మూలన, చరిత్ర పరిశోధన, నిజాం దమనరీతికి వ్యతిరేకంగా ఉద్యమం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలోనే ఉద్భవించా యనడం అతిశయోక్తికాదు.

తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతీ వికాసానికి, సాంస్కృతిక పునరుజ్జీవ నానికి కృషి చేసిన యీ సంస్థ తెలంగాణా ప్రాంతంలో వందలాది గ్రంథాలయాల స్థాపనకు చేయూతనిచ్చింది. 1908లో హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపన జరిగింది. ఈ గ్రంథాలయానికి మాడపాటి కార్యదర్శిగా ఉండేవారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో 1905లో ఆంధ్ర సంవర్థనీ గ్రంథాలయం, 1911లో ఎర్రుపాలెంలో మహబూబియా గ్రంథాలయం, 1917లో సూర్యాపేటలో ఆంధ్రవిజ్ఞాన ప్రకాశన గ్రంథాలయం, 1918లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయ స్థాపన జరిగింది.

ఈ గ్రంథాలయాలు పాఠకులకు పత్రికలు, పుస్తకాలు అందించడమేకాక, సభలకు, సమావేశాలకు, కవితా గోష్ఠులకు, వివిధ సంస్థల వార్షికోత్సవాలకు వేదిక కల్పించి ప్రజలను మేల్కొలిపాయి. గ్రంథాలయాలవలన రాజకీయ సాహిత్యం విరివిగా లభించింది. ఇవి ప్రజలలో విజ్ఞాన తృష్ణను పెంపొందించాయి. తెలంగాణలో కలిగిన జాతీయ చైతన్యానికి గ్రంథాలయాలే ముఖ్య కారణం. గ్రంథాలయాల ద్వారానే ఆంధ్రోద్యమం త్వరగా రాష్ట్రంలో వ్యాపించింది. తెలంగాణాలో ఆంధ్రోద్యమంకన్న గ్రంథాలయోద్యమమే పురాతనమైనది.

ఆ రోజులలో గ్రంథాలయాలు నడపడం అంత సులభమైన పనికాదు. ఆంధ్రోద్యమం మరొక సంవత్సరానికి మొదలుకానున్నదనగా సూర్యాపేటలో ఆంధ్ర ప్రకాశినీ గ్రంథాలయాన్ని అప్పటి కలెక్టరు పరిశీలించారు. ఆంధ్ర గ్రంథాలయాన్ని తాలూకా ప్రధాన కేంద్రంలో కేవలం ప్రజల సహకారంతో నడపడం ఆ అధికారికి ప్రభుత్వ ధిక్కార చర్యగా తోచింది. ఈ గ్రంథాలయం నడపడానికి ప్రభుత్వ అనుమతి పొందారా? అని కార్యకర్తలను ప్రశ్నించాడు. లేదని సమాధానం రాగానే గ్రంథాలయాన్ని మూసివేయించాడు. అంతట కార్యకర్తలు ఈ వార్తను హైదరాబాద్‌లో ఉన్న మాడపాటికి చేరవేశారు. పంతులు అప్పటి ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి సర్‌ అక్బర్‌ హైదరీకి లేఖ రాస్తూ, కలెక్టర్‌ జిల్లా లోకల్‌ ఫండ్‌ బోర్డుకు అధ్యక్షుడు. అట్టి అధ్యక్షుడినుంచి ప్రజా గ్రంథాలయాలకు ధన సహాయం అందుతుందని విన్నాం. కానీ ఏకంగా గ్రంథాలయాన్నే మూసివేస్తారని వినలేదు. ఈ విషయంలో మీరు న్యాయం చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్‌నుంచి సమాచారం తెప్పించుకున్న హోం కార్యదర్శి పంతులుకు సమాధానమిస్తూ ‘గ్రంథాలయాలను నడపడానికి ప్రభుత్వ అనుమతి పొందవలసిన అవసరం లేదని’ చెప్పారు. దీంతో గ్రంథాలయాన్ని తిరిగి తెరిచారు.

మడికొండ గ్రంథాలయానికి కూడా ఇలాంటి దురవస్థే పట్టింది. దీనికి ఒక సంవత్సరం వరకు అనుమతించలేదు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లా గ్రంథాలయాన్ని చూసిన అక్కడి తహశీల్దారు ‘సర్కారువారి దస్తరములలో వ్యవహారమంతా ఉర్దూ భాషలో ఉండగా, ఇక్కడ చచ్చిపోయిన తెలుగు భాషను గుంజవలసిన అవసరంలేద’ని అన్నాడు. ఆ రోజుల్లో తెలుగు భాషంటే నిజాం ప్రభుత్వానికి అంతటి ద్వేషం. పైగా తెలుగు భాష రాష్ట్రంలోని అధిక సంఖ్యాక ప్రజల భాష అని తెలిసి కూడా.

ఏ పనికైనా డబ్బు అవసరం. గ్రంథాలయాలకు విరాళాలివ్వడానికి, నెల చందాలు కట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. అట్టి పరిస్థితులలో గ్రామపెద్దలు, సంఘ శ్రేయోభిలాషులు డబ్బు సేకరించి అలమరాలు, పుస్తకాలు, వార్తా పత్రికలు, ఫర్నీచర్‌ కొనడానికి శ్రమించే వారు. కరీంనగర్‌ జిల్లా కోరుట్ల గ్రంథాలయ స్థాపనకు శతావధాని కృష్ణమాచార్యులు ఇంటింటికీ వెళ్లి బియ్యాన్ని పోగుచేసి, ఆ విధంగా సేకరించిన బియ్యాన్ని విక్రయించి వచ్చిన డబ్బుతో పుస్తకాలు, పత్రికలు కొనేవారు. గ్రంథాలయ కార్యదర్శులు సైకిళ్ళపై తిరిగి పుస్తకాలు పంపిణీ చేసి సంచార గ్రంథాలయం మాదిరిగా వినూత్న ప్రక్రియను చేపట్టారు.

తెలంగాణాలో అనేక కష్టనష్టాలని ఎదుర్కొని గ్రంథాలయోద్య మాన్ని ముందుకు తీసుకుపోయిన వారెందరో ఉన్నారు. ‘మహా గ్రంథాలయాల భవనాలకుగాని, ఆలయాలకుగానీ ప్రాముఖ్యం లేదు. ఒక కార్యకర్త ఉంటే చాలు’ అని ఆంధ్ర పితామహ ఒక సందర్భంలో అన్నారు. అనేక మంది యువకులు వార్షికోత్సవాలు జరిపి కారాగార శిక్షలను అనుభవించారు. పోలీసు నిర్భంధాన్ని లెక్కచెయ్యక సూర్యాపేట గ్రంథాలయ వార్షికోత్సవం చేయతలపెట్టారు కానీ జిల్లా కలెక్టర్‌ ఆటంకపెట్టాడు. పైగా అధ్యక్షోపన్యాసాన్ని, తదితరుల ఉపన్యాసాన్ని తనకు చూపించాలని షరతు పెట్టారు. కానీ, అవమానకరమైన ఈ షరతులను గ్రంథాలయ కార్యకర్తలు అంగీకరించలేదు. ప్రభుత్వానికి విన్నవించు కున్నారు. ఇంతలో ప్రభుత్వానికి సభలను ఆపే అధికారంలేదని హైకోర్టు తీర్పు వచ్చింది. తెలంగాణా గ్రంథాలయ చరిత్రలో ఇది స్వర్ణాక్షరాలతో రాయవలసిన ఘట్టం.

1939లో వెల్దుర్తి మాణిక్యాలరావు, గుండ వరపు హనుమంతరావు తోడ్పాటుతో కె.సి. గుప్తా అణా గ్రంథమాలను స్థాపించారు. అణాకొక గ్రంథంగా, వంద పుస్తకా లను కేవలం ఐదు రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించారు. గుప్తాఇల్లే అణా గ్రంథమాలకు కేంద్రంగా ఉండేది. హైదరాబాద్‌లోని గౌలీగూడా, సుల్తాన్‌బజార్‌లోని సుబ్బారావు హోటళ్ళ ముందు ఈ పుస్తకాలను విక్రయించేవారు. అణా గ్రంథమాల తొలి ప్రచురణగా ‘హైదరాబాద్‌ రాజ్యాంగ సంస్కరణలు’ అనే పుస్తకాన్ని 1939 నవంబరులో ప్రచురిం చారు. నాటి నిజాం ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలని ఉర్దూనుండి వెల్దుర్తి మాణిక్యరావు తెలుగులోనికి అనువాదం చేశారు. దీనికి మాడపాటి హనుమంత రావు ముప్ఫై పేజీల పీఠిక రాశారు. ఆ పుస్తకం రెండుమార్లు అచ్చువేసినా చాలలేదు. ఆ ఉత్సాహంతో వెల్దుర్తి మాణిక్యరావు ‘రైతు’ పేరుతో మరొక పుస్తకాన్ని వెలువరించారు. రైతులందరు బద్దకం వదిలి, కార్యదీక్షకు పూనాలని, ఉద్యమించాలని సూచిస్తూ రైతుల కడగండ్లను పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకంపై నిజాం ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. అణా గ్రంథమాల విడుదలచేసే పుస్తకాల్ని కనిపెట్టడానికి నిజాం ప్రభుత్వం రెండు హోటళ్లముందు పోలీసు నిఘా పెట్టిందంటే అణా గ్రంథమాల నిజాంని ఎంతగా వణికించిందో తెలుసుకోవచ్చు.

జగిత్యాల తాలూకా నెమలికొండ గ్రామంలో నెలకొన్న విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల ప్రసిద్ధ రచయితచేత గ్రామ వ్యవసాయం, వైద్యం, పరిశ్రమలు, చారిత్రక విషయాలపై రచనలు చేయించి అమూల్యమైన నాలుగు గ్రంథాలను ప్రచురించింది. నల్లగొండ జిల్లా చండూరులో భవళా శ్రీనివాసరావు, సిరిప్రగడ భార్గవరావుల కృషితో సాహితీమేఖల అనే సంస్థ ఏర్పడింది. దీనికి అంబడిపూడి వెంకటరత్నం పట్టుకొమ్మగా ఉండేవారు. 1932లో ఆచార్య రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షులుగా, ఆచార్య కురుగంటి సీతారామయ్య కార్యదర్శిగా హైదరాబాద్‌ సాహిత్య పరిషత్తు ఏర్పడింది. బూర్గుల రంగనాధరావు, నెల్లూరి కేశవస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు 1939లో సాధ్యసమితిని స్థాపించారు. 1941లో వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. ఈ గ్రంథమాల 1938-41, 1953-61 మధ్యకాలంలో ముప్ఫై పుస్తకాలను ఆయన ప్రచురించారు. వట్టికోట భుజానికి జోలెసంచి తగిలించుకుని పుస్తకాల్ని అమ్మడమేకాదు, 10 రూపాయలు మాత్రం తీసుకొని పదకొండు రూపాయల నాలుగు అణాల ధరగల పుస్తకాలను ఇచ్చేవారు. ఈ విధంగా వట్టికోట పుస్తక పఠనానికి, పుస్తక ప్రచురణకి ప్రేరణ కలిగించాడు. తెలుగు ప్రజల విజ్ఞానాభివృద్ధికి, చైతన్య స్ఫూర్తికి తోడ్పడే గ్రంథాలను ప్రచురించి ఆళ్వారు స్వామి తెలుగు సాహిత్యోద్యమానికీ, రాజకీయ చైతన్యం కలిగించారు.

ఖమ్మంలో విజ్ఞాన నికేతన గ్రంథాలయం కోదాటి నారాయణరావు నిర్విరామ కృషివల్ల ఏర్పడింది. ఆరోజులలో పరిశోధకులు ఎన్నో యిబ్బందులు ఎదుర్కొనేవారు.

దూపాటి వెంకటరమణాచార్యుల పరిస్థితి తెలంగాణాలో దాదాపు అదేవిధంగా ఉండేది. ఆయన వూరూర తిరిగి ఐదువేలకు పైగా తాళపత్ర గ్రంథాలు సేకరించారు. వెయ్యికిపైగా శాసనాలను వెలికితీశారు. ఆయన నెత్తిమీద తాటాకుల పుస్తకాలు పెట్టుకుని, అందరూ వదిలేసిన రాళ్ళూ, రప్పలూ తవ్వుతుంటే ఆయా వూళ్ళ వాళ్ళందరూ ఆయన చేతబడి చేయడానికి వచ్చాడేమో అనుకునేవారట. ‘బాబూ నీకో నమస్కారం. అందరం కలిసి చందా వేసుకొని నీకు డబ్బు ఇస్తాం. కానీ మా వూళ్ళో నీ విద్య ప్రయోగించకు’ అని బతిమిలాడుకునే వారట. రాత్రిపూటవచ్చి శిలా శాసనాలు తవ్వుకునేవారట. సుదీర్ఘమైన పరిశోధనలు జరిపి దూపాటివారు పోతన జన్మస్థలం వరంగల్లేనని నిర్ధారించి చెప్పారు.

తన జీవితాన్ని తైలంగా చేసుకుని కొడిగట్టిన తెలంగాణ చరిత్రను వెలిగించిన మహోదయుడు ఆదిరాజు వీరభద్రరావు. 1922లో ఆంధ్రా జన సంఘానికి అనుబంధంగా ఆయన ఆంధ్ర పరిశోధక మండలిని నెలకొల్పాడు. దానిని కొమర్రాజు వారి అస్తమయానంతరం లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఆదిరాజు కార్యదర్శకత్వంలో లక్ష్మణరాయ పరిశోధక మండలి చేసిన సేవ అసదృశ్యం. తెలంగాణా శాసనాల రెండు సంపుటాలను అది ప్రచురించింది.

1952లో వచ్చింది తెలంగాణా రచయితల సంఘం. ఇది పుట్టగానే తెలంగాణా అంతటా సాహిత్యం ఝంఝా మారుతం వీచింది. గ్రామగ్రామాన పల్లెపల్లెలో రచయితల సంఘాలు వెలిశాయి. అనేక సంవత్సరాలుగా అణగారిన తెలంగాణా గళాల వ్యక్తీకరణకు మార్గం లభించింది. కోటికాంతులు పలికాయి. దీన్ని స్థాపించిన వ్యక్తి దాశరథి. ఆచార్య లక్ష్మీరంజనం, సి. నారాయణరెడ్డి, కాళోజీ, వానమామలై, రామరాజు, పల్లా దుర్గయ్య, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, ఇరివెంటి కృష్ణమూర్తి, వి.పి. రాఘవాచార్యులు మొదలైన యువకులతో ఈ సంఘం పరిపుష్టినందుకున్నది.

తెలంగాణా స్వాతంత్య్రోద్యమంలో కవితోద్యమం కూడా విజృం భించింది. గ్రంథాలయాల వార్షిక సందర్భాలలో కవితా పఠనం ఉండవలసిందే. పాఠశాలల వార్షికోత్సవాలలో కావ్యగానం జరుగవల సిందే. పండుగనాడు కవుల గోష్ఠి ఏర్పాటు చేయవలసిందే. రాజకీయ మహాసభల్లో కవుల పద్యాలు మార్మోగవలసిందే. కవిత్వం వినరాని చోటు తెలంగాణాలో ఉండేదికాదు. గుడిలో, బందిఖానాలో, గుడిసెకొంపలో, గోపురాగ్రమున అంతటా

కవిత్వ ప్రతిధ్వానమే.

నాటి హైదరాబాద్‌ రాష్ట్ర పాలకులు ఆంధ్రహిత నోటికి తాళం వేసి పరభాష దాస్యం చేయించారు. ఆ దాస్యం ఇతర ప్రాంతాలలోకంటే చాల ఎక్కువ తెలంగాణాలోనే భరించవలసి వచ్చింది. ఒత్తిడి ఒకందుకు మేలే అయింది. రాజకీయంగా స్వాతంత్య్రం సంపాదించుకోవాలనే కాంక్ష భాష స్వాతంత్య్రానికి కూడా దారితీసింది. తెలంగాణాలో ఎవ్వరూ తెలుగు మాట్లాడరని తెలంగాణా వారంతా, ఉర్దూలోనే రాస్తారని, తెలంగాణాలో కవులే లేరని కొందరు అంటుండే వారు. ఇది సురవరం ప్రతాపరెడ్డికి బాధ కలిగించింది. ఆ బాధ పర్యవసానమే సురవరం తెలంగాణాలోని నలుమూలలో ఉన్న మూడు వందల యాభై నలుగురు కవుల రచనలను సంపుటీకరించి 1934లో గోలకొండ కవుల సంచిక ప్రచురించారు.
tsmagazine

ఆంధ్ర భారతికి శిరోభూషణాలైన గ్రంథాలు వెలసిన నెలవు తెలంగాణా. ఈ ప్రాంతంలో ఏనాడు ఆంధ్ర కవితా స్రవంతి ఎండిపోలేదు. ఇది జీవనది వలె తరతరాలుగా ప్రవహిస్తూనే ఉంది. అయితే భయంకర గ్రీష్మాలతాపం అప్పుడప్పుడు తప్పలేదు. పోతన, పాల్కురికి సోమనాథుడు, పిల్లలమర్రి పిన వీరభద్రుడు, వేములవాడ భీమకవి, మల్లినాథ సూరి, అనంతుడు, వించనాథుడు పుట్టి పెరిగిన మాగాణం తెలంగాణా.

1943లో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. తెలంగాణాలో. జాతీయ భావాలతో ప్రేరేపితమైన సాహిత్య సాంస్కృతిక సంస్థ ఇది. ఆంధ్ర సంస్కృతీ సారస్వత్‌ సర్వతోముఖ వికాసానికి ఈ సంస్థ కృషినిచ్చింది. ప్రజలలో నిరక్షరాస్యతని నిర్మూలించి, మాతృభాష ద్వారా విద్యావ్యాప్తి కావించింది. అందుకోసం సభలు, సమావేశాలు జరిగినవి. ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన విశేషాలని సేకరించి ప్రకటించింది. పారిభాషిక, మాండలిక కోశాలని సిద్ధం చేసింది. ఇతర సంస్థల తోడ్పాటుతో సాహిత్యాభివృద్ధికి కృషి చేసింది. తెలుగులో పరీక్షలు జరిపింది. రచయితలను ప్రోత్సహించింది. అనుబంధశాఖలని స్థాపించింది. ఉత్తమ గ్రంథాలను ప్రకటించింది. బూర్గుల, సురవరం, మాడపాటి, చెన్నారెడ్డి, పీవీ మొదలైన నాయకులందరూ పరిషత్తు ప్రాంగణంలో నిలిచినవారే. ఇది నాది అని ఎవరనలేదు. నాది కాదని కూడా ఎవరనలేదు. ఈ సంస్థ పోషణలో దేవులపల్లి రామానుజరావు సేవలు చాలా ప్రముఖమైనవి. మొక్కని పెంచి పోషించారు. సినారె దీని బాధ్యత వహించగానే భవన రూపంలో మార్పులు వచ్చాయి. కొత్త కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సినారె పరిషత్తుకు రెండు దశాబ్దాలుగా చేసిన సేవను సాహిత్యకులు మరువలేనిది. దీనికి ఒక అకాడమి స్థాయిని సినారె కలిగించారు.

జి. వెంకటరామారావు

Other Updates