శివపూజకు

వేళాయంటూ

అడవిఅంతటా పూసిన

గోగుపూల అరుణకాంతులు

ఉషాకిరణాల సమ్మిళితమై

మిరుమిట్లు గొలుపుచుండగా

మలయమారుత

శిశిర శీతలములకు

ఆకురాలిన తరువులు

క్రొత్త చిగురులు తొడుగగా

జలతరంగమై

రైతురాజు వడికిన

ఆకుపచ్చని చీరకట్టిన

ప్రకతి కాంత

పంచవన్నెల రామచిలుక

కనువిందు ఆవిష్కరణ

ఒక అపురూప దగ్విషయం

సప్తవర్ణ సొబగులద్దుకున్న

లతాంతికలు

గాలి అలలుగా

పారిజాత సుగంధ

పరిమళాలు వెదజల్లగా

చిటారుకొమ్మలుగా

పక్షుల కిలకిలారావములై

మావి చిగురుతిన్న మత్తకోకిల

తీయని గానమాలపించగా

తెలుగు నేలగా

అలరారిన కోవెలలుగా

సుప్రభాతసేవ ఘంటానాదములై

వీనులవిందవగా

కాలచక్రం విలంబికి

వినమ్ర వీడ్కోలు పల్కుతు

ఉగాది ఉషస్సులుగా

వేపపూల సుగంధ

పరిమళాలు వెదజల్లుతూ

చైత్ర చైతన్యము-వికారిని

స్వాగతించే శుభసంకల్పమై..

కలిమి లేములై

ఆరు రుచుల సంగమాల

ఉగాది పచ్చడిగా ఆస్వాదించిన

తెలుగు లోగిళ్లు నడయాడె

పంచాంగశ్రవణం జీవనగమనమై!!

– మడిపల్లి హరిహరనాథ్‌

Other Updates