ts sree-rama-navamiతిగుళ్ల అరుణకుమారి

సుపరిపాలనతో ప్రజల మనస్సులను దోచుకొన్న చక్రవర్తి శ్రీరాముడు. అటువంటి జనమనోభిరాముడైన శ్రీరామచంద్రుడు పుట్టినదినం శ్రీరామనవమి. పరమసాధ్వి అయిన సీతాదేవిని శ్రీరామచంద్రుడు పెండ్లాడిన సుదినంకూడా ఇదే. ఈ విధంగా రెండు లోకోత్తర ఘట్టాలకు నెలవైన చైత్రశుద్దనవమీ తిథి ఆస్తిక జనావళికి మహాపర్వదినం.

శ్రీరామజనన విశేషాన్ని భోజ మహారాజు తన చంపూరామాయణకావ్యంలో ఎంతో చక్కగా వర్ణించాడు.

ఉచ్చస్థే గ్రహ పంచ సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ

లగ్నే కర్కట పునర్వసుయుతే మేషం గతే పూషణి

నిర్దగ్ధుం నిఖలాః పలాశసమిధః మేధ్యాదయోధ్యారణేః

ఆవిర్భూతమభూత పూర్వముఖిలం యత్కించిదేకం మహాః!

జ్యోతిర్మండలంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. బృహస్పతి చంద్రునితో కలిసి ఉన్నాడు. కర్కాటక లగ్నం ఉంది. సూర్యుడు పునర్వసు నక్షత్రంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇంత గొప్ప సమయంలో అయోధ్యా నగరం అనే అరణి (యజ్ఞంకోసం అగ్నిని మథించే సాధనం) నుండి ఎన్నడూ చూడనంతటి గొప్ప తేజోరాశి జన్మించింది. ఆ తేజోమూర్తియే శ్రీరామచంద్రుడు అని పై శ్లోకానికి అర్థం. ఆ విధంగా అరణినుండి ఉద్భవించిన ఆ మహాగ్ని లోకకంటకులైన రాక్షసులనే సమిధలను కాల్చివేసి, విశ్వకల్యాణ మహాయాగాన్ని పూర్తి చేసిందని భోజరాజు అద్భుతంగా వర్ణించాడు.

రామాయణ మహాకావ్యాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమినాడే మిథిలా నగరంలో శివధనుర్భంగంచేసి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. లోకోత్తర చరిత్రలు గల ఈ ఇద్దరి కలయిక లోకానికి ఆనందదాయకం కావడంవలన శ్రీసీతారామ కల్యాణోత్సవం జగత్కల్యాణ కారకంగా మారింది.

వసంత ఋతువు ఆరంభంలో ఉగాది తరువాత వచ్చే ఈ తొలి పండుగ సకలజనులూ ఆనందదాయకం. ఇంటింటా మాత్రమే కాదు ప్రసిద్ధ దేవాలయాలలో, క్షేత్రాలలో, ఊరూవాడా అనే తేడా లేకుండా అంతటా శ్రీసీతారామకల్యాణాలను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి, కృతార్థులౌతారు. శ్రీరామనవమినాడు కల్యాణ వేదికలవద్ద చలువ పందిళ్లు వేయడం, వడపప్పు, పానకాలను మధుర నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రసాదరూపంలో స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమితో ప్రారంభమయ్యే నవరాత్రోత్సవాలు భక్తి, సంగీత, సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలతో రాత్రింబవళ్లూ భక్త జనులకు ఆనందాన్ని కలిగిస్తూ, శ్రీరాముని విశిష్టతను లోకానికి చాటిచెబుతాయి.

రాముడు మర్యాదా పురుషోత్తముడు. పుట్టుక మొదలు అవతారసమాప్తిదాక రాముని జీవితం లోకానికి ఆదర్శప్రాయం. ధర్మాన్ని నిలపడంకోసం, ప్రజల మెప్పు పొందడంకోసం అష్టకష్టాలను సైతం లెక్కజేయని ధర్మమూర్తిగా శ్రీరామునికి ప్రసిద్ధి ఉంది. తల్లికి తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడంకోసం రాజ్యాధికారాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి, అరణ్యాల బాటపట్టిన సత్యవాక్యపాలకుడు శ్రీరాముడు తల్లిదండ్రులపట్ల అపార వినయ విధేయతలతోబాటు ధర్మం తప్పని పవిత్రశీలం, ఎవరికీ అపకారం చేయని ఔదార్యం, ప్రజారంజకపాలనపట్లగల నిబద్ధత రాముని ప్రత్యేక గుణాలు. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనూ ధర్మాన్ని విడువని ఉత్తమగుణం శ్రీరామునికి వెన్నతోపెట్టిన విద్య. లోకకంటకులై, సాధుజీవనులైన మునులను, ఋషులను బాధించిన దుష్టరాక్షసులను దునుమాడిన అవక్రశౌర్యపరాక్రమాలకు రాముని జీవితం ఆదర్శప్రాయం. అధర్మంగా తన భార్య అయిన సీతను చెరబట్టిన రావణునిపై యుద్ధం ప్రకటించి, సకల వానర సహాయంతో లంకా నగరాన్ని జయించి, రావణుని వధించి లోకానికి ధర్మ విజయాన్ని ఉదాహరణగా చూపిన ఉత్తమ పరిపాలకుడు శ్రీరాముడు. రాముని పరిపాలనలో ధర్మం నాలుగు పాదాలతో విలసిల్లింది. అందు లోకమంతా రామరాజ్యం అని కీర్తించే ఉత్తమ పాలన వ్యవస్థను తీర్చిదిద్దిన చక్రవర్తి శ్రీరాముడే. ప్రజలను ఎలా పరిపాలించాలో లోకానికంతటికీ చాటిన చక్రవర్తి శ్రీరాముడు. అందు ఆయన పాలనలో నెలకు మూడు వానలు కురిసేవనీ, బంగారు పంటలు పండేవనీ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు రామరాజ్యంలో దొంగలభయం లేదనీ, ఒకరినొకరు మోసం చేయడం ఉండేది కాదనీ, ప్రజలంతా అన్నాదమ్ములవలె కలిసిమెలిసి జీవించే వారనీ, అకాల మరణాలు ఉండేవికాదనీ, మనుష్యులు వందలకొలది సంవత్సరాలు బ్రతివాేరనీ రామాయణ మహాకావ్యం వర్ణించింది. అందు రాముణ్ణి స్తుతించని సాహిత్య ప్రక్రియ లేదంటే అతిశయోక్తికాదు. ఆది కావ్యంగా లోకంలో అవతరించిన రామాయణంలో వాల్మీకి శ్రీరాముని గుణగణాలను, ఉదాత్త చరిత్రనూ మనోహరంగా వర్ణించి, చరితార్థుడైనాడు.

రామో విగ్రహవాన్‌ ధర్మః అనేది లోకంలో బహుళ ప్రచారంలోకి వచ్చిన నానుడి. అంటే శ్రీరాముడు ధర్మానికి పోతబోసిన విగ్రహం వంటివాడని అర్థం. ఈ విషయం రామకథను చదివితే స్పష్టంగా తెలుస్తుంది. అధర్మవర్తనలూ, అరాచకాలూ, విచ్చలవిడి ప్రవర్తనలూ పెచ్చరిల్లిపోతున్న నేటి సమాజానికి రాముని చరిత్ర పాఠ్యాంశం కావాలి. విభిన్నరంగాలలో పేరుకొనిపోతున్న అవినీతి కల్మషాలను కడిగివేయడానికి రాముని ప్రవర్తన విశేషాలు ఈ జీవనాంతం తోడ్పడుతాయి. సమాజంలో మనుష్యులు తల్లిదండ్రులను, గురువులను, అతిథులను, తోటివారిని ఎలా గౌరవించాలో రామాయణాన్ని చదివితే స్పష్టంగా తెలుస్తుంది. ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు ఎంతటివారినైనా లెక్కచేయరా దనీ, అధర్మ ప్రవర్తకులను తప్పక శిక్షించవలసిందేననీ రాముని చరిత్ర లోకానికి చాటుతోంది.

రాముని జీవితం మానవులకు ఆదర్శప్రాయం. రాముని పరిపాలన నేటి పాలకులకు ఆచరణీయమార్గం. రాముని సచ్ఛీలం యువతరానికి రాచబాట! కనుక రాముడు సమస్త ప్రపంచాని ఆరాధ్యదైవం!

ఏప్రిల్‌ 5న శ్రీరామనవమి

ప్రసిద్ధ దివ్యక్షేత్రం భద్రాచలంలో ఏప్రిల్‌ 5 ఉదయం 10.30 గంటలనుంచి 12.30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ఏప్రిల్‌ 6న ఉదయం మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

Other Updates