pressరాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నది. వారి సంక్షేమానికి గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో జీవో నెంబరు 225ను అనుసరించి 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 2014 జూన్‌ 2 తరువాత మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు ప్రతినెల రూ. 3000 పెన్షన్‌ 5 సంవత్సరాల పాటు అందచేస్తారు. 10వ తరగతిలోపు చదువుతున్న ఇద్దరు పిల్లలకు నెలకు రూ. 1000 ట్యూషన్‌ఫీజు చెల్లించడం జరు గుతుంది. వర్కింగ్‌ జర్నలిస్టులు అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి రూ. 50వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందచేస్తున్నది. ఇదే కాకుండా రెండు పడక గదుల ఇళ్ళు, ఇంటి స్థలాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జర్నలిస్టుల సంక్షేమ నిధిపై ఏర్పాటు చేసిన కమిటీసమావేశం నవంబరు 30న అకాడమీ కార్యాలయంలో జరిగింది. ఆర్ధిక సహాయం కోసం అకాడమీకి అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం చిత్తశుద్ధితో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ మరణించిన వారికి ఆర్థిక సహాయం కోరుతూ వారి కుటుంబాల నుంచి 52 దరఖాస్తులు, అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న 9మంది జర్నలిస్టుల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని కమిటీ పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు బ్యాంకు ఖాతా ద్వారానే ఈ చెల్లింపులను చేపట్టడం జరుగుతుందని అల్లం నారాయణ తెలిపారు. సమావేశంలో ముందుగా కొలంబియా విమాన ప్రమాదంలో మరణించిన జర్నలిస్టులకు, ఫుట్‌బాల్‌ క్రీడాకా రులకు, విమాన సిబ్బందికి నివాళులు అర్పించారు. సమావేశంలో కమిటీ సభ్యులు,సమాచార, పౌరసంబంధాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Other Updates