jogaraman

జలం మనిషికి జీవనాధారం. జలం లేకుంటే మనిషి మనుగడ ప్రశ్నార్థకమవు తుంది. అలాంటి జలాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో తెలియచెప్పేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసి జల సిరిని ఒడిసి పట్టేందుకు జల సంరక్షణ వేదిక నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్రాన్ని జల సమృద్ధిగల రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రమంతటా వాటర్‌ వారియర్స్‌ (నీటి సంరక్షణ నిపుణులు)ను ఏర్పాటు చేసి ప్రజలకు నీటి పొదుపు విషయంలో పూర్తిగా అవగాహన కల్పించడానికి ముందడుగు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సు జూన్‌ 5న హైదరాబాద్‌లో జరిగింది. వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.ప్రకాష్‌, దక్కన్‌ వాటర్‌ హార్‌వెస్టింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, చేవెళ్ళ ఎం.పి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి తదితరులు హాజరై తమ పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయని వెల్లడించారు.

సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన వాటర్‌ డాక్టర్‌, వాటర్‌ గాంధీ, నీటి రంగ నిపుణులు అయ్యప్ప మసగే మాట్లాడుతూ, వర్షపాతం తక్కువైతే నీటి ఎద్దడి వస్తుందనుకోవడం తప్పని, కురిసిన వర్షాన్ని వడిసి పట్టుకోలేక పోవడం, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోలేక పోవడం వల్లనే నీటి ఎద్దడి వస్తున్నదని స్పష్టం చేశారు. నీటి పొదుపు విషయంలో తాను చేపట్టిన ప్రణాళికలు, తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. మన నిత్య అవసరాల కోసం వాడుతున్న ప్రతి నీటి చుక్కకూడా వృధాగా రోడ్లపై పడి పోకుండా మన ఇంటి ఆవరణలో, మన వ్యవసాయ పొలంలో ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తాను 80 ఎకరాలు కొని అందులో నీటి పొదుపు ప్రణాళికలు అమలు పరిచి భూమినంతటినీ సాగులోకి తెచ్చానన్నారు. వట్టిపోయిన ఎన్నో బోరుబావులలో తిరిగి నీరు పెల్లుబికేలా చేసినట్లు పేర్కొన్నారు. 2020 సంవత్సరం వరకు దేశాన్ని నీటి ఎద్దడి లేని దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నీటిని సంరక్షించుకోగలిగితే మనకు ప్రతిరోజు పండగే అన్నారు. కురుస్తున్న వర్షపాతంలో 30శాతం నీటిని వడిసిపట్టుకోగలిగినా నీటి ఎద్దడి మన దరిదాపుల్లోకి రాదన్నారు. తాను దేశమంతా తిరిగి ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ జల సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వి.ప్రకాష్‌ మాట్లాడుతూ, అయ్యప్ప మసగే 2020 నాటికి దేశమంతటా నీటి ఎద్దడి లేకుండా చేస్తానంటున్నారని, అయితే మన తెలంగాణలో నీటి ఎద్దడి లేకుండా చేయాలని ముందు మన రాష్ట్రానికే తీసుకొచ్చానని తెలిపారు. అయ్యప్ప మసగే ఆధ్వర్యంలో నాట్కో లాంటి కొన్ని ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులకు నీటి సంరక్షణ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మంతటా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వ సంస్థల తోడ్పాటును ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎందరో గొప్ప గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు కూడా తమకు సహకరించ డానికి ముందుకు వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇతర దేశాలలో కోట్లాది రూపా యల ఆదాయాన్ని వదులుకుని తెలంగాణ జలసంరక్షణ సమితిలో భాగస్వాములైన తమ డైరెక్టర్లను ఆయన సభాముఖంగా పరిచయం చేశారు.

మంత్రులు జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు తమ తమ ప్రసంగాలలో ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహాకారాలను అందిస్తామని తెలిపారు. నీటి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. భగీరథ ప్రయత్నంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేసి నీటి పంపింగ్‌ ద్వారా గోదావరి, కృష్ణలను బీళ్ళకు మళ్ళించాలని రేయింబవళ్ళు కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడితే ప్రజలకు ఎంతో మేలు జరగడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా ఎంతో భారం తప్పుతుందన్నారు. భూమిపై పడ్డ నీరు ఎక్కువభాగం వృధాగా సముద్రంలో కలిసిపోతుందని, దీన్ని ప్రజల అవసరాలకు వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వి.ప్రకాష్‌ చేపట్టిన ఈ ప్రణాళిక విజయవంతం కావాలని ఆకాక్షించారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వి.ప్రకాష్‌ రూపొందించిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయన్నారు. వారు చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు అందచేస్తే దాన్ని బోర్డు మీటింగ్‌లో పెట్టి ప్రణాళిక అమలుకు ప్రయత్నిస్తామన్నారు. నీటి సంరక్షణ అనేది విధానపరమైన అంశంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. అలాగే నీటి పొదుపు పై ప్రజల్లో అవగాహన వస్తే ఇక తెలంగాణలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తవన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, టిఎస్‌పీఎస్‌సీ సభ్యులు విఠల్‌, ఎం.పీ. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ మాసపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ అష్టకాల రామ్మోహన్‌ తదితరులు ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో అతిథులకు సాంప్రదాయబద్దంగా బొకేలు అందించకుండా మొక్కలను అందించడం విశేషం.

Other Updates