indian-road-congressఏ ప్రదేశమైనా అభివృద్ధి సాధించాలంటే, అందుకు అనుగుణంగా తగిన మౌలిక వసతులు వుండాలి. మౌలిక వసతులన్నీ సమకూరాలంటే అన్నిటికన్నా ముందు, రవాణా సౌకర్యం వుండాలి. ఇందుకోసం కావలసింది రహదారి. ఈ రహదారులు కూడా చక్కగా నిర్మితమైవుంటే, ప్రయాణ సమయం, ఇంధన ఖర్చు తగ్గుతుంది. అంటే సరైన రహదారుల అవసరం ఏపాటిదో అర్థమవుతుంది. రహదారుల నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ. కొత్తవాటిని నిర్మాణం చేయడం, పాడైపోయిన వాటిని ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేయడం ఎప్పుడూ కొనసాగుతూనే వుంటాయి. అయితే వీటన్నింటినీ పరిశీలించడం, తగిన పరిశోధనలు చేయడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంవంటి విధివిధానాల కోసం ఏర్పాటు చేయబడిందే ‘ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌’.

‘ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌’ 77వ జాతీయ సదస్సు హైదరాబాద్‌ హైటెక్స్‌లో డిసెంబర్‌ 17న జరిగింది. తెలంగాణ రహదారుల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశ వ్యాప్తంగా వున్న రహదారులన్నీ కలిపి 52 లక్షల కిలోమీటర్లు, ఇందులో జాతీయ రహదారులు 96వేల కిలోమీటర్లే… అంటే 40శాతం ట్రాఫిక్‌ 2 శాతం రహదారులపైనే ప్రయాణం సాగిస్తోందని పేర్కొన్నారు. అందుకే జాతీయ రహదారులను 2 లక్షల కిలోమీటర్లకు పెంచే పనిని చేపట్టాం, ఇది వేగంగా కొనసాగుతున్నదని తెలిపారు. రోడ్ల నిర్మాణాలలో వ్యర్థాలను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను, మైనింగ్‌, కర్బన వ్యర్థాలను విరివిగా ఉపయోగించుకోవాలని ఇందుకోసం అవసరమైతే ఐఐటీవంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ఆస్ట్రేలియాలో చమురు తెట్టుతో ఎయిర్‌స్ట్రిప్‌నే నిర్మించారు. కాబట్టి అన్ని స్థాయిలలో ప్రయోగాలకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వేసవి కాలం ప్రారంభంనుండే చాలా రాష్ట్రాలలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తున్నది. ఇందుకోసం వంతెనల నిర్మాణ సమయంలో నీటి నిల్వలకు వీలు కల్పించేవిధంగా, చెక్‌డ్యాంలను అనుసంధానించి నిర్మిస్తే, అటువంటి నిర్మాణాల ఖర్చు కేంద్రం భరిస్తుందని తెలిపారు. రహదారుల వెంబడి 1300 రకాల వ్యాపారాలకు అవకాశం వున్నట్లు అధ్యయనంలో తేలింది. అటువంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా నిర్మాణం, భూసేకరణ వ్యయాలను తగ్గించుకోవచ్చని గడ్కరీ వివరించారు.

రహదారుల నిర్మాణంలో పచ్చదనం, సుందరీకరణలను పొందుపరిచి ఒప్పందాలను రచించాలని కోరారు. కాంట్ట్రార్లు కూడా తమ పనుల అంచనా విలువలో ఒకశాతం నిధులను పచ్చదనం, సుందరీకరణలకోసం ఖర్చు చేయాలని అన్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి 8వేల కోట్ల వ్యయంతో 460 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

జాతీయ రహదారుల విస్తరణకోసం అధ్యయన నివేదిక నిపుణులు దార్శనికతతో వ్యవహరించడంలేదని అన్నారు. జాతీయ రహదారుల వెంబడి గ్రామాలున్నచోట, అంచనా వ్యయాన్ని తగ్గించడంకోసం అండర్‌పాసులు, ఫ్లైఓవర్లను ఎత్తివేస్తున్నారు.

ఫలితంగా ఆయా రహదారులలో ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు చనిపోతున్నారు. ప్రతియేటా 5 లక్షలమంది ప్రాణాలను కోల్పోతుంటే, 2.50లక్షలమంది వికలాంగులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఆ భారాన్ని ఎక్స్‌గ్రేషియా రూపంలో ప్రభుత్వాలే భరిస్తున్నాయి. ఖర్చులను భరించడానికి ప్రభుత్వాలున్నప్పుడు నిపుణులే అంచనా వ్యయాలను తగ్గిస్తూ కోతలకు పాల్పడడం మంచిది కాదని మంత్రి గడ్కరీ అన్నారు.

అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇదివరకు రాష్ట్రంలోవున్న పది జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. కాబట్టి కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో జాతీయ రహదారుల కనెక్టివిటీ అయిదు జిల్లాలకు మాత్రమే లేదని వాటికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్రం అడిగినవి అన్నీ ఇచ్చినందుకు కేంద్రమంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరో ఏడు రహదారుల ప్రాజెక్టు ప్రతిపాదనలకు అనుమతినిస్తూ 4,513 కోట్ల రూపాయల నిధులందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, ఐఆర్సీ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ పోల్వార్‌, సెక్రటరీ జనరల్‌ సహార్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీలు భిక్షపతి, రవీందర్‌రావు, గణపతిరెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి, ఎంపీలు బీబీపాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates