Digitalతెలంగాణ యువతకు ఐటీ, ఎలెక్ట్రానిక్స్‌ రంగాల్లో నైపుణ్యాభివద్ధి నిమిత్తం ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతులమీదుగా రూపు దిద్దుకున్న తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ ఎండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) మరో బహత్తర కార్యక్రమం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అనేకమంది యువతీ యువకులకు హెల్త్కేర్‌ రంగంలో శిక్షణా కార్యక్రమాలను ఇటీవలే టాస్క్‌ సంస్థ మొదలుపెట్టింది.

టాస్క్‌ సంస్థలో శిక్షణ పొంది ప్రఖ్యాత హెల్త్కేర్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన తొలి బ్యాచ్‌ యువతీయువకులకు ఫిబ్రవరి 10న జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు తమ అనుభవాలను పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న తమకు పేరుమోసిన కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ఒక అద్భుతమని, తమకు అన్నివిధాలా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేసిన టాస్క్‌ సంస్థకు, మంత్రి కేటీఆర్‌ కు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు అన్నారు.

రీసెర్చ్‌ ఎండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) ఏర్పాటు

ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు కనుగొనే కొత్త ఉత్పత్తులను మార్కెట్‌ లోకి తీసుకురావడంలో సహాయం చేసేందుకు, పరిశోధనా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య ఒక వారధిగా నిలిచేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన సంస్థను ఏర్పాటు చేసింది.

రీసెర్చ్‌ ఎండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) పేరిట ఏర్పాటు చేసిన ఈ సంస్థను ఫిబ్రవరి 24న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజన చౌదరి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్‌ రఘునాధ్‌ మషేల్కర్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

తార్నాకలోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసించారు. ”రిచ్‌” ఏర్పాటు ఒక పెద్ద ముందడుగు అని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మార్గదర్శిలా నిలిచిందని ఆయన అన్నారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో అనేక ప్రఖ్యాత పరిశోధనాలయాలు ఉన్నాయని, వీటిల్లో ప్రజలకు ఉపయుక్తమైన ఎన్నో ఉత్పత్తులను శాస్త్రవేత్తలు కనుగొంటున్నా, అవి వెలుగులోకి రావడం లేదన్నారు. ”రిచ్‌” సంస్థ ఈ పరిశోధనలను మార్కెట్లోకి ఉత్పత్తులుగా తెచ్చేందుకు సహకరిస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు సతీశ్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, పలు సంస్థల అధిపతులు పాల్గొన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మాజీ డీన్‌ అజిత్‌ రంగ్నేకర్‌ ఈ ”రిచ్‌” సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించనున్నారు.

కొణతం దిలీప్‌

Other Updates