magaవ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాది కల్పించే టెక్స్‌ టైల్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అత్యంత్య ప్రాధాన్యత రంగంగా టెక్స్‌ టైల్‌ను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం , వరంగల్‌ లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తుందన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ , మహాత్మానగర్‌ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన టెక్స్‌టైల్‌ ఇండియా సమిట్‌ లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక పాలసీని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంవల్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందని, త్వరలోనే టెక్స్‌ టైల్‌ పాలసీని కూడా తెస్తామని కె.టి.ఆర్‌. తెలిపారు. పారిశ్రామిక విధానంలానే ఈ పాలసీ కూడా విప్లవాత్మకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. టెక్స్‌ టైల్‌ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే వరంగల్‌ లో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ను నిర్మిస్తామని, ఫైబర్‌ టూ ఫ్యాషన్‌ పద్ధతిలో ముడి సరుకు నుంచి తుది ఉత్పత్తి దాకా అన్నీ ఈ పార్క్‌ లోనే జరుగుతాయన్నారు. దేశీయ అవసరాల నుంచి మొదలుకుని అంతర్జాతీయ ఫ్యాషన్‌ వరకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు ఈ పార్క్‌ నుంచి వచ్చేలా చూస్తామన్నారు. ఈ టెక్స్‌ టైల్‌ పార్క్‌ లో పనిచేసే కార్మికులకు అక్కడే నివాసాలు ఏర్పాటుచేస్తున్నామని, వారి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కోయంబత్తూర్‌ సంస్థతో కలిసి ఒక ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుచేస్తామని కేటీఆర్‌ చెప్పారు.

టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్న మంత్రి, ఇక్కడ పండించే పత్తి అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని గుర్తుచేశారు. నాణ్యతతో పాటు పెద్ద ఎత్తున జరిగే పత్తి ఉత్పత్తిని ఉపయోగించుకోవడాన్ని ఒక అవకాశంగా చూడాలని ఇన్వెస్టర్లను మంత్రి కోరారు. అత్యుత్తుమ ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, మౌలిక వసతులు, సరుకు రవాణా పరంగా దేశానికి సెంటర్‌ పాయింట్‌ లో ఉండడం….ఇవన్నీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల అంశాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రపంచంలో ఎవరైనా ఆఫర్‌ చేసే ప్యాకేజీ, ప్రోత్సాహకాలకు సరితూగేటట్టు లేదా అంతకుమించి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

ఇక ఇదే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, టెక్స్‌ టైల్‌ రంగంపై మంత్రి కేటీఆర్‌ కు ఉన్న మక్కువ, ప్రభుత్వ విధానాలను వివరించిన తీరును ప్రశంసించారు. తెలంగాణ గురించి అత్యుత్తమంగా ప్రజెంట్‌ చేశారన్న స్మృతి, కేటీఆర్‌ ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయన్నారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ సీఈఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిని అభివృద్ధిపరచడం ద్వారా ఏర్పాటు చేసిన ‘సబర్మతి రివర్‌ డెవెలప్‌మెంట్‌ ప్రంట్‌’ను మంత్రి కెటిరామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఇతర అధికారులు సందర్శించారు. మూసీ అభివృద్ధి, సుందరీకరణపైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో సబర్మతి నది అభివృద్ధి నమూనాను అధ్యయనం చేశారు. ఇందుకోసం రివర్‌ ప్రంట్‌ అధికారులు మంత్రి బృందానికి వివరాలు అందజేశారు. సుందరీకణ కోసం ఎదురైన సమస్యలు, నది ఒడ్డున అప్పటి దాకా ఉన్న జనావాసాల తరలింపు, మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విజన్‌, ప్రజల సహకారంతోనే ఈ ప్రాజెక్టు విజయం సాధించిందని తెలిపారు. ఈ రివర్‌ ఫ్రంట్‌ అహ్మదాబాద్‌ పట్టణానికి ఒక తలమానికంగా నిలిచిందని, ఇదే స్థాయిలో మూసినదిని అభివృద్ధి చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని మంత్రి కె.టి.ఆర్‌. తెలిపారు. సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్‌, వాక్‌ వేలు, పార్కులు, రోడ్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్శన అనుభవం ఖచ్చితంగా మూసి నదీ సుందరీకరణకు ఉపయోగపడుతుందన్నారు.

సబర్మతి అశ్రమాన్ని సందర్శించిన మంత్రి కె.టి.ఆర్‌

‘టెక్స్‌ టైల్స్‌ ఇండియా 2017’ సమావేశాలకోసం గుజరాత్‌లో పర్యటించిన మంత్రి కెటి రామారావు రెండు రోజులపాటు బిజి బిజీగా గడిపారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ జీవించిన సబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. సబర్మతి అశ్రమ ట్రస్టీలు స్వయంగా మంత్రి వెంట ఉండి అశ్రమం గురించి వివరించారు. అశ్రమంలో సుమారు గంటసేపు గడిపిన మంత్రి, అక్కడి మహాత్ముడి ఇల్లు, అశ్రమంలోని పాఠశాలను సందర్శించారు. గాంధీ ఉపయోగించిన వస్తువులను, లేఖలను పరిశీలించారు. అశ్రమానికి వచ్చిన మంత్రికి అక్కడి విద్యార్దులు ఒక చరఖాను బహుకరించారు. గాంధీ మహాత్ముడి జీవన విధానం అందరికి ఆదర్శమన్న మంత్రి, ఆశ్రమ సందర్శన ఒక అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆశ్రమాన్ని సందర్శించడం ద్వారా మహాత్ముడు గడిపిన అతి సాధారణ జీవితం అర్థం అవుతుందని కె.టి.ఆర్‌. తెలిపారు. మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నమన్న మంత్రి, తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యం గ్రామ స్వరాజ్య స్థాపనే అన్నారు.

Other Updates