double-bedroomనిరుపేదలకు నిలువెత్తు గౌరవం దక్కింది..! సొంతింటి సుస్వప్నం సాకారమైంది.! సమైక్య పాలనలో దగాపడ్డ తెలంగాణ బిడ్డ ఆత్మాభిమానం సగర్వంగా తలెత్తుకున్నది..! పేదోడి ఇళ్లు.. పెద్దోడి భవంతిలా మారిన రోజు కళ్లముందు సాక్షాత్కరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానసపుత్రిక ‘రెండు పడకల గదుల ఇళ్లు’-నిర్మాణాన్ని ఎర్రవల్లి, నర్సన్నపేటలు రెండు చేతులా ఎత్తుకున్నాయి. ఏకకాలంలో 580 ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించి యావత్‌ ప్రపంచం మరోసారి తెలంగాణ వైపు చూసేలా ‘డబుల్‌’ సంబరాలు జరిగాయి.

– యం. రాము

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు ఎర్రవల్లిలో 380 ఇళ్లు నిర్మిస్తే, నర్సన్నపేటలో 200 ఇల్లు నిర్మించారు. పొడుస్తున్న పొద్దులా అప్పుడే.. సూర్యుడు కాస్త పైకొచ్చినా.. చలికాలం కావడంతో మంచు బిందువులు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చల్లని, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంలో ప్రతి ఇంట్లో నుంచి వేదఘోష..! మంత్ర జపాలు వినిపిస్తున్నాయి…! డిసెంబర్‌ 23వ తేదీ శుక్రవారం ఉదయం సరిగ్గా 7.13 గంటలకు అన్ని ఇళ్లలోనూ పుణ్యాహ వాచనం..! ఆ వెంటనే గణపతి పూజ…! సరిగ్గా 7.53 గంటలకు రెండు గ్రామాల్లోని 580 ఇళ్లల్లో ఏకకాలంలో గృహ ప్రవేశాలు..! ఆద్యంతం కన్నుల పండుగగా ఆధ్యాత్మిక వాతావరణంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శ్రీకారం చుట్టిన సందర్భమది..! 600 మంది వేద పండితులు 580 ఇళ్లలో ఏకకాలంలో జరిపిన గణపతి, వాస్తు హోమాలు, సత్యనారాయణస్వామి వ్రతాలతో దత్తత గ్రామాల్లోని డబుల్‌ ఇళ్ల గృహ ప్రవేశ సంబురాలు మార్మోగాయి. అయితే హిందువులు, హిందూ సంప్రదాయ ప్రకారం, ముస్లింలు, క్రైస్తవులు ప్రార్థనలు చేసి వారి సంప్రదాయాల ప్రకారం కేక్‌ కట్‌చేసి గృహ ప్రవేశాలు చేశారు. దీనికి కావల్సిన పూజా సామగ్రిని కూడా ప్రభుత్వమే అందజేసింది.

నూతన గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతున్నది. సీఎం కేసీఆర్‌ స్వయానా గృహ ప్రవేశానికి రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదంటూ జనం ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు మనసారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఏడాది కిందట వర్షం కురిస్తే.. తమ ఇల్లంతా నీళ్లయ్యేవి. రాత్రి వాన కురిసిన సందర్భాల్లో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. ఎక్కడ కురుస్తుందో.. ఎక్కడెక్క నీళ్లు వస్తున్నాయో.. చూసుకునే పరిస్తితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి భిన్నమైంది. సీఎం కేసీఆర్‌ సహకారంతో పేదవాడి సొంతింటి కల నెరవేరి.. గ్రామాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు వచ్చాయి. ఒక్కసారిగా ఎర్రవల్లి ‘డబుల్‌ వల్లి’గా మారింది. గతేడాది ఎర్రవల్లిలో నాలుగువందలకుపైగా ఇళ్లు ఉండగా 350 వరకు కుటుంబాలు మాత్రమే గ్రామంలో నివాసముండేవారు. మిగిలిన వారంతా బతుకుదెరువుకోసం వలసలు వెళ్లి ఖాళీ అవడం, చాలాకాలంగా వాడకం లేకపోవడంతో ఇళ్లు కూలిపోయే దశలో కొన్ని మొండిగోడలతో దర్శనమిచ్చేవి. ఇదే క్రమంలో గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించాలని నిశ్చయించారు. ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పురాతన ఇళ్లను తీసేసి వాటిస్థానంలో 380 డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించారు. దీంతో తాము బతికుండగా ఇళ్లు కట్టుకుంటామో లేదో.. అన్న మీమాంసలో ఉన్న పేదల కల నెరవేరిందని.. ఆయా గ్రామాల్లోని సొంతింటి లబ్ధిదారుల కళ్లలో ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు గ్రామాల్లో డబుల్‌ పండుగ సంబురాలు

కలలో కూడా ఊహించని రీతిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సొంతమవడంతో సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉన్నది. ఏడాదిలోనే 580 ఇళ్లు పూర్తి కావడం గృహ ప్రవేశాలు సైతం జరుపడంతో లబ్ధిదారుల్లో ఆనందం రెండింతలైంది. డబుల్‌ ఇళ్లను చూసి ఆ గ్రామాలకు వచ్చిన వారి బంధుగణం ముచ్చట్లలో పడ్డారు. రెండు గ్రామాలను అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం.. గృహ ప్రవేశాలకు వచ్చిన బంధువులంతా సీఎం ఉదారగుణంపై ముచ్చటించు కున్నారు. కొత్త ఇంటి సంబురాల్లో ఇంటికి వచ్చిన ఆడపడుచులు కొత్త ఇళ్లకు పూజ చేసి కడపలు కడిగారు. ‘అక్కా.. ఈ ఊర్లు.. చూస్నివా..! ఎంత బాగున్నాయో! మనకు కూడా కట్టిస్తే బాగుండునే’ అంటూ వచ్చిన బంధుగణం కొత్త ఇల్లంతా కలియతిరుగుతూ ముచ్చటపడ్డారు.

గిట్ల చేసే ఏ గవర్నమెంటోళ్లను సూడలే..!

తాతలకాలం సంది.. మాది గూనపెంకల ఇళ్లు.. వానపడ్డప్పుడల్లా ఉర్సేది. ఇయ్యాల మన కేసీఆర్‌ సారూ.. మాలాంటి పేదల కోసం మంచి చేసిండు. అంతేకాదు.. మాకు ఉపాధి కోసమని పాడి గేదెను ఇప్పించిండు. దీంతో పాల వ్యాపారం చేసుకుంటున్నా. నాకు 6 ఎకరాల దాక పొలం ఉంది. ఎవుసం చేసుకుంటున్నా. ఇప్పుడు సోయాబీన్‌ పెట్టుకున్న.. దానికి సుతం.. ఇత్తనాలు, మందులు ఇప్పించిండు. గింత మంచిగ ఇళ్లు కట్టించి పాడిగేదెలు, ఎవుసం చేస్తే ఇత్తనాలు, మందులు ఇచ్చుడు నా జీవితంలో కనపడలే. గిట్ల చేసే ఏ గవర్నమెంటోళ్లను నేనైతే.. సూడలే. నా ఇల్లు పూర్తి కానికి ఇంకొంచెమన్ని రోజులైతయట. నా భార్య, తల్లి లచ్చమ్మ, కొడుకు మహిపాల్‌లతో కలిసి ఇప్పుడైతే.. చింతల చెట్టు కాడ పూరి గుడిసెల ఉంటున్నాం.

-కాసుగంటి కిష్టమ్మ-వీరారెడ్డి (నర్సన్నపేట)

కేసీఆర్‌ దేవుడని దీపం పెడుతున్నా

మాకు రోడ్డుకే పెంకుటిళ్లు ఉండే. అది వానొచ్చి వంటశాల కూలింది. ఇళ్లు సదిరించుకుందామంటే… కూలీ కైకిల్లు చేసుకుని.. పొట్టగడుపుడే కష్టమాయే. ఇంకా యాడికేలి ఇళ్లు సదరించాలే. అగో గప్పుడే మాలాంటి గరీబోళ్లను గుర్తించిండేమో. కేసీఆర్‌ మంచిగ సౌలత్‌ చేసిండు. ఇయ్యాలట్సంది. ఆయన మాకు దేవుడి లెక్క పొద్దున లేవంగానే దండం పెట్టుకుంటున్నాం. ఇంకా నీల్లకు తిప్పలు మస్తుగుండే.. రోజూ నల్లా వత్తుంది.. మొన్న ఇండ్లలకు పోతున్నమని నా కొడుకులిద్దరూ ఇళ్ల పండుగకు వచ్చి పది రోజులున్నరు. ఇప్పుడు బతుకు దెరువుకోసం ఊర్లపంట పోయిండ్రు. ఇగ నేను ఈ కొత్త ఇంట్ల పత్తి తీసుకుంట మా ఇంట్ల కేసీఆర్‌ దేవుడని దీపం పెడుతున్నా.

– రంగ సుగుణమ్మ-బాలయ్య గౌడ్‌ (నర్సన్నపేట)

ఎంత కష్టపడ్డ కానీ గిట్ల ఇళ్లు కట్టేవాళ్లం కాదు

ఎంత కష్టపడ్డగానీ గిట్ల అయితే ఇళ్లు కట్టేటోళ్లం కాదు. కొన్నేండ్ల సంది ఒక్క రూమే కట్టుడు చాతకాలేదు. కానీ మేం మొక్కకుండానే సీఎం సారు వరమిచ్చిండు. మంచి ఇళ్లు కట్టించిండు. మేం బతికున్నంతకాలం మాకు కేసీఆర్‌ సారే.. సీఎంగా

ఉండాలే. గట్లయితేనే మాలాంటి పేదోళ్ల కష్టాలు తీరుతయ్‌. ఇళ్లు కట్టిచ్చుడే కాదు.. ఇంకా కోల్లు సుతం ఇప్పించిండు. ఇప్పుడు మా పల్లెకు ఓ అందమొచ్చినట్లు అయ్యింది.

– ఊడెం అండమ్మ-మల్లారెడ్డి (నర్సన్నపేట)

బంగారంలాంటి ఇల్లు వొచ్చింది.. మా బతుకులు బాగుపడ్డాయి:

నా కొడుకుపేరు బాలచందర్‌, కోడలు చంద్రకళ, నాకు ముగ్గురు మనుమరాండ్రు కూలీ పని చేసుకుని బతికోటోళ్లం. ఇల్లు కడుదామని మొదలు పెట్టిన. ఏండ్ల సంది ఒక్క రూం సుతాం.. కట్టలేకపోయినా.. ఏం పైసలు లేక అస్తర్‌కార్‌ కాడనే ఆగిపోయింది. కానీ మేం అడక్కుండానే కేసీఆర్‌ మంచి ఇళ్లు కట్టించిండు. బతికున్నంతకాలం నా కొడుకులు, మనుమరాండ్రు సల్లంగా ఉండేలా కేసీఆర్‌సార్‌ మంచి చేసిండని కొత్తింట్లో సాయంత్రం పూట రొట్టెలు చేసుకుంటూ.. గిల్కల ఎల్లవ్వ కొత్తింటి సంబుర ముచ్చట చెప్పింది.

– గిల్కల ఎల్లవ్వ (నర్సన్నపేట)

ఇగ మాకు మూడు తంతెల దాక ఇల్లు నడుస్తది:

మాకు ఇంతకుముందు రేకుల ఇళ్లు ఉండేది. అదే ఇంట్ల మా అమ్మ లింగవ్వ, బాపు లక్ష్మయ్య, తమ్ముడు మహేష్‌ ఇప్పుడు పదో తరగతి సదువుతుండు. ఎండా కాలమైతే.. కష్టంగా ఉండేది. రేకుల ఇంట్లనే చిన్నగ ఓ వంటశాల పెట్టుకుందామని రెండు మూడేండ్ల సంది తండ్లాడిన. అట్టాంటిది… ఇప్పుడు అంతా మారిపోయింది. బంగారం లాంటి ఇల్లు వచ్చింది. ఇగ మా బతుకులు బాగుపడ్డాయి. మా ఇంటిల్లిపాది అందరం సంబురంగా ఉన్నం. గిట్ల ఇల్లు కట్టుడు మా నాయనతోటి కాలే, నాతోటి కూడా కాదు. అట్లాంటిది.. ఇప్పుడు నా కొడుకేకాదు.. కొడుక్కు మనుమనికి సుతాం పనికొస్తది. గిట్లనే మూడుతంతెల దాకా నడుస్తది. ఇగ మా బతుకుదెరువంతా… ఎవుసం మీదనే. మొన్న కాలం మంచిగైంది. పంటలు మంచిగ పండినయ్‌.. గవర్నమెంట్‌ నుంచి సోయాలు ఇచ్చిండ్రు. ఇప్పుడైతే నాకున్న ఎకరం పొలంల చిక్కుడు కాయ పెట్టిన.

రెడ్డిబోయిన కవిత-సత్యనారాయణ (నర్సన్నపేట)

మొక్కకుండానే కేసీఆర్‌ దేవునోలే వరమిచ్చిండు:

నాకు ఓ బిడ్డ మాధవి డిగ్రీ సదువుతంది. కొడుకు సందీప్‌ 8వ తరగతి సదువుతుండు. ఇంతకుముందు మాకు పెంకుటిళ్లు ఉండేది. అది తాతల సంది వస్తున్న ఇళ్లు పాత డోలతో ఇంతకుముందు మా పాత ఇంట్ల వానపడితే.. ఊర్సేది. ఇళ్లు చుట్టుపక్కలంతా పాములు, పురుగుబూసులతో మస్తుగ ఇబ్బందులు పడ్డం. కానీ ఇట్ల అయితదని అనుకోలేదు. అనుకున్నదానికంటే.. డబుల్‌ అయ్యింది. మేం మొక్కకుండానే కేసీఆర్‌ సారూ దేవునోలే వరమిచ్చిండు. నాకు ఓ 3 ఎకరాల పొలం ఉంది. మొక్కజొన్న పెట్టి సాగు చేస్తున్నా. ఈ ఎవుసం చేస్కుంటా.. నా జీవితం అయితే గింత మంచిగ ఇల్లు కట్టకపోతుండి. గిట్ల అయితదని నా కలల కూడా ఊహించలేదు. ఇప్పుడా మా ఇంటిల్లిపాది సంబురంగా ఉన్నాం. మా ఇంటికొచ్చిన సుట్టాలు సూతం.. మాకు కూడా గిట్ల కట్టిస్తే బాగుండని మమ్మల్నే అడుగుతుండ్రు.

గీసు రేణుకా మల్లేశం (ఎస్సీ) (ఎర్రవల్లి)

మా జీవితంలో కట్టకపోదుం..

మేం కూలీ నాలీ చేసుకుని బతికేటోళ్లం. నాకు ఓ కూతురు. జెస్సీకా పెట్టి ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది. కొడుకు సాక్షిత్‌ చిన్నోడు. గింట్లాటి ఇల్లును నేనైతే.. నా జీవితంలో కట్టకపోదుం. కూలీనాలీ చేస్కోని బతికేటోళ్లం. అట్లాంటిది మకు మంచి ఇల్లు కట్టించిండు. ఇంతకుముందు ఉన్న ఇల్లు మా తాతల సంది వచ్చింది. అందులో మా ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో ఉండే వాళ్లం. ఆ ఇంట్లో పరదాలు కట్టుకుని ఉండేటోళ్లం. కానీ ఇయ్యాల ఎవరిది వాళ్లకు స్వంత ఇల్లు కట్టించి మాలాంటి పేదోళ్లకు ఆదుకునేందుకు నిజంగా దేవుడిగా వచ్చి ఆదుకున్నారు.

పొట్టోల భాగ్య, దాసు (ఎస్సీ) (ఎర్రవల్లి)

Other Updates