magaధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనంత పంట ఈసారి పండిందని, దాని ఫలితంగా సివిల్‌ సప్లయిస్‌ కొనుగోలు కేంద్రాలకు రికార్డు స్తాయిలో ధాన్యం వస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. అయినప్పటికీ, ఎంత ధాన్యమైనా సేకరించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం రైతులకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రస్తాయిలో నిధుల విడుదల జరిగినా, రైతులకు చేరే వరకు కొంత సమయం పడుతున్నదని, ఈ జాప్యం నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పౌర సరఫరాల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది 9 లక్షల టన్నులు సేకరించామని, ఈసారి ఇప్పటికే 37 లక్షల టన్నులు సేకరించామని, మరో రెండు లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 2013-14 సంవత్సరంలో గరిష్టంగా 17 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈసారి దానికి రెండున్నర రెట్లు అదనంగా ధాన్యం సేకరించాల్సి వచ్చిందని వివరించారు. ఇప్పటివరకు 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, దీనికి మొత్తం రూ. 5300 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉండగా రూ.4వేల కోట్లు చెల్లించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మరో వెయ్యి కోట్ల రూపాయలు కూడా తక్షణం చెల్లించాలసి సీఎం ఆదేశించారు. ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చేదాకా ఎదురు చూడకుండానే వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. దీనికోసం ప్రభుత్వం తరఫున బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఖరీఫ్‌ పెట్టుబడులకు రైతులకు డబ్బులు అత్యవసరంకాబట్టి, అధికారులు రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. చెల్లింపులపై రాష్ట్రస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించా లని, వెంటవెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు.

Other Updates