kcr-kitప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, నవజాత శిశువులకు బహుకరించే ‘కేసీఆర్‌ కిట్స్‌’ తల్లీ బిడ్డలకు మంచి ఆరోగ్య అలవాట్లను అందిచాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో ప్రసవ మరణాలు సున్నా శాతానికి పడిపోవాలని, భావితరం ఆరోగ్యంగా ఎదగాలని సిఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకిచ్చే రూ.12వేల ఆర్థిక సాయం, పిల్లలకిచ్చే కేసీఆర్‌ కిట్‌ పథకాల అమలు ఏ విధంగా ఉండాలనే విషయంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఏప్రిల్‌ 6న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, సీనియర్‌ అధికారులు శాంత కుమారి, వాకాటి కరుణ, స్మితా సభర్వాల్‌, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు ‘కేసీఆర్‌ కిట్‌’ ద్వారా అందించే వస్తువులను సిఎం పరిశీలించారు. దోమ తెర, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లు తదితర వస్తువులను చూశారు. ఇప్పటికే కిట్స్‌ కోసం టెండర్లు పిలిచామని, మే నెల నుంచి కిట్స్‌ అందిస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్‌ వాకాటి కరుణ చెప్పారు. రూ.12వేల సాయం, కేసిఆర్‌ కిట్స్‌, అమ్మఒడి కార్యక్రమాల అమలుకు సంబంధించి కార్యాచరణను రూపొందించేందుకు మహిళా అధికారులతో కూడిన కమిటీని సిఎం నియమించారు. శాంత కుమారి, వాకాటి కరుణ, స్మిత సభర్వాల్‌, యోగితారాణా, ప్రియాంక వర్గీస్‌ సభ్యులుగా ఉంటారు.

”నెలలు నిండిన తర్వాత కూడా పేద మహిళలు కుటుంబం గడవడం కోసం పనులు చేస్తూనే ఉన్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, పుట్టే పిల్లలపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే నెలలు నిండిన తర్వాత నుంచి శిశువుకు రెండు మూడు నెలల వయస్సు వచ్చే వరకు కూలీ పనులకు పోకుండానే కుటుంబ అవసరాలు తీరాలనే ఉద్దేశ్యంతో ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన పేద మహిళలందరికీ రూ.12వేల చొప్పున అందిస్తాం. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తాం. అయితే, ఈ సహాయం ఎన్ని విడతల్లో అందించాలి. గర్భిణీ స్త్రీలకు ఏ నెల నుంచి ఇవ్వడం ప్రారంభించాలి అనే విషయం అధికారులు తేల్చాలి. అలాగే గర్భిణీ స్త్రీల పేర్లను నమోదు చేయించాలి. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. వారికి అవసరమైన మందులు అందించాలి. గ్రామాల్లో ఎఎన్‌ఎంలు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లున్నారు. ఈ పనుల కోసం ఎవరిని ఉపయోగించుకుంటే బాగుంటుందో నిర్ణయించాలి. రూ.12 వేల పథకం కూడా పకడ్బందీగా అమలు చేయాలి. పేద గర్భిణీలు ఖచ్చితంగా ఆసుపత్రుల్లోనే ప్రసవం కావడానికి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నాం. దీనివల్ల వారికి మంచి ఆరోగ్య అలవాట్లు అలవడుతాయి. పిల్లలకు కూడా కేసీఆర్‌ కిట్‌ వల్ల ఆరోగ్య వంతమైన సంరక్షణ ప్రారంభమవతుంది. తల్లీ బిడ్డలకు ఆరోగ్య క్రమశిక్షణ వస్తుంది. ప్రసవ మరణాలు తగ్గుతాయి. తల్లీ బిడ్డలు క్రమం తప్పకుండా ఆసుపత్రులకు రావడం వల్ల ఎప్పటికప్పుడు టీకాలు, మందులు అంది ఆరోగ్యంగా ఉంటారు” అని సిఎం చెప్పారు.

”ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భతి అందించాలని నిర్ణయించాం. ఒంటరి మహిళలను గుర్తించాలి. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం అందడం వల్ల వారికే కాకుండా వారి పోషణ బాధ్యత చూస్తున్న వారికి కూడా ఊరట లభిస్తుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Other Updates