amrutavahiniఆధ్యాత్మికంగా, భారతదేశం ఎంతో సుసంపన్నమైన దేశం. సుమారు 5000 ఏళ్ల నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు అమృతవాహినివలె ప్రవహిస్తూ, జన కేదారాల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ సంస్కృతి సాంప్రదాయాల పరిమళం, వారసులమైన భారతీయుల్నే కాకుండా పాశ్చాత్యుల్ని కూడా సమ్మోహితుల్ని చేస్తున్నాయి.

అందరితో అనుబంధాలు, ఆప్యాయతలు పంచుకోవాలని, పెంచుకోవాలని ఆరాటపడే ‘మంజరి’ అనబడే ఒక ఉదాత్త యువతి చుట్టూ అల్లబడిన నవల ఇది. అవసరాల మేరకే నిలిచే బాంధవ్యాల యాంత్రిక యుగంలో ‘మంజరి’ ఒక అమృతవాహిని. ఎక్కడో కుగ్రామంలో, సామాన్య, మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. లేమివల్ల ఎదురయ్యే కష్టాల్నీ కడగళ్ళనీ, ధైర్యంతో ఎదుర్కొంటూ, కాల ప్రవాహంలో మట్టిిబెడ్డలా కరిగిపోకుండా, నిలద్రొక్కుకుంటుంది. కష్టాలెదురైతే, తన కన్న కొడుకే అవసరాలకు వాడుకుని అవససరం తీరాక తిరస్కరిస్తే ‘బేరు’మనకుండా, నిలిచి, విదేశంలో కూడా తన సత్తా చూపిన ఆదర్శమూర్తి మంజరి. అమెరికాలో రాజులా బ్రతికే అవకాశం ఉన్నా స్వదేశంమీది ప్రేమతో తిరిగి ఇండియాకు వచ్చి పదిమంది అనాధలకు అమ్మ అయి నిలుస్తుంది.

‘మన శాస్త్రాలూ, ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో, ఎంతో విజ్ఞానం ఉంది. వాటిని అనుసరిస్తే చాలు చక్కని బ్రతుకుకు బాటలు వేసుకోవచ్చు’ (పే155) అంటూ ‘ప్రతీ మలుపులోనూ క్రొత్త పాఠాలు నేర్చుకునేందుకు దొరుకుతాయి’ (పే158) అన్న జీవన తాత్త్వికతను ప్రభోదిస్తుంది రచయిత్రి)

ఇటు భారతీయ మధ్య తరగతి బ్రతుకుల్ని కళ్ళకు కట్టుతూనే, అటు అమెరికాలో మన ఎన్‌.ఆర్‌.ఐ.ల జీవన విధానాన్ని, కడుపు కట్టుకుని ఒక్కో డాలరు పోగేసుకోచూసే పొదుపరితనాన్ని, కాఠిన్యాన్ని, అక్కడ కూడా మరచిపోని ‘అమ్మ’తనాన్ని మనముందుంచిన తీరు గొప్పగా ఉంది.

రెండువందల పేజీల ఈ నవల నిండా భారతీయత ఉంది. ఎన్నో జీవన సత్యాలున్నాయి. ప్రతి మనిషి తనకు తాను సంస్కరించుకుంటే సమాజం దానంతట అదే సంస్కరించబడుతుంది (పే173).మానవ సంబంధాలు అవసరాన్నిబట్టీ అభిరుచినిబట్టీ మారుతాయ్‌ (పే 189). అవససం మనిషికి అన్నీ నేర్పుతుంది. జీవితంలో ముందుకు సాగాలంటే నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటూ పోవాలి (పే 177). దారి ఒక్కటే. దారిల్ని కొలిచే విధానం వేరు (పే 187). మరు జన్మలాంటి గొప్ప వాక్యాలు-మనల్ని ప్రభావిత పరుస్తాయి. మరుజన్మ అంటూ ఉంటే నీ తల్లిలాంటి తల్లి కడుపున పుట్టాలి (పే. 203) అని ఒక పాశ్చాత్యుడు మంజరి గురించి చెప్పటం ఎంతో గొప్పగా ఉంది.

ఏడు నవలలు, నలభై కథలు వ్రాసి, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఈ రచయిత్రికి నిశిత పరిశీలనాశక్తి, భాషా సారళ్యత గొప్పవరం. ఎకానమిక్స్‌, హిందుస్థానీ సంగీతం లాంటి రెండు భిన్నరంగాల్లో నిష్ణాతురాలు.

ప్రేమమయ జీవితాన్ని గడపాలని బోధించే ఈ నవల రచయిత, సినీ గేయరచయిత భువనచంద్రలాంటి ప్రముఖుడిచే ‘పాఠకుడి మనసుకు హత్తుకోవడమేకాక కలకాలం నిలిచిపోతుంది’ అనిపించుకుంది. శ్రీమతి మంధా భానుమతిగారి మాటలో ‘ఒక మంచి నవల చదివామన్న అనుభూతి కలిగించే పుస్తకం’ ఇది.

అమృతవాహిని నవల; రచన: అనూరాధ (సుజలగంటి);
వెల: రూ. 150; పేజీలు 200)
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో

Other Updates