hudcoదేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) వారు తమ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు పురస్కారాలను అందజేశారు. ఇందులో మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను ఏప్రిల్‌ 25న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన వేడుకలో సంబంధిత అధికారులకు అందజేశారు.

తెలంగాణ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)కి, మిషన్‌ భగీరథకు, పట్టణాల్లో బలహీనవర్గాలకు గృహనిర్మాణంలో గ్రామీణ బ్యాంకు చేసిన సేవలకుగాను గ్రామీణ బ్యాంకుకు పురస్కారాలు లభించాయి. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలోని ‘నిమ్జ్‌’ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ & మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌), ఫార్మా సిటీలకు హడ్కోనుంచి రుణాలు లభించాయి. మిషన్‌ భగీరథకు కూడా హడ్కో రుణం లభించింది. హడ్కో రుణాలతో జరుగుతున్న పనులన్నీ నిర్ణీత కాల వ్యవధితో సంతృప్తికరంగా సాగుతున్నందున, రెండు సంస్థలకు ‘హడ్కో’ అవార్డులను ప్రకటించింది. దీంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పట్టణ)ను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు ఒక పురస్కారాన్ని అందజేశారు.

ఈ అవార్డులతోపాటు, హైదరాబాద్‌లోని హడ్కో ప్రాంతీయ కార్యాలయానికి కూడా రెండు అవార్డులను అందజేశారు. వీటిని ప్రాంతీయ కార్యాలయ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా అందుకున్నారు. ఇక మిషన్‌ భగీరథకు లభించిన అవార్డును తెలంగాణ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేందర్‌రెడ్డి తీసుకోగా, టీఎస్‌ఐఐసీ తరఫున ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తెలంగాణ ప్రభుత్వం 12500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఫార్మాసిటీ, 14వేల ఎకరాల్లో నిర్మిస్తున్న నిమ్జ్‌లకు ఇటు దేశ చరిత్రలోగాని, అటు హడ్కో చరిత్రలోగాని ఎన్నడూలేని విధంగా ఆర్థిక సహాయం అందుతున్నదని, వీటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తున్నామని అన్నారు.

Other Updates