tsmagazine
ప్రాచీనమైనది తెలంగాణ,
ఆర్వాచీనమైనది మన తెలంగాణ, ప్రాచీన చరిత్రను గొప్పగా వివరించే ఎన్నో విలువైన చరిత్రకు సంబంధించిన శాసనాలు కూడా మన తెలంగాణ మాగాణం (మహాసామ్రాజ్యం)లో ఉన్నాయి. తెరియ- తయిర (ట్రైబల్‌ జాతి) తెలంగాణం-తెలంగాణం- తెలియగాణ (తెలుగు ఆంగణం) తెంగాంగణం- తెలంగాణాగా పరిణామం చెందినదని కాశీపీఠ పండితులు, శాసనచరిత్రకారులు కూడా నిర్ధారించారు. తెలంగాణ (త్రిలింగ-తెనుంగు) అనేది తెనుంగు నుంచి తెలంగాణగా మారిందని ఈ ప్రాంతానికి ఎంతటి ఘన చరిత్ర ఉందో సమగ్రంగా పరిశీలిస్తే అర్థమవుతుంది మనకు.

ఖమ్మం మెట్టు (భద్రాచలం) మొదలు విదర్భ (ఒకప్పటి బెడదంకోట)నేటి బీదర్‌ వరకు విస్తరించిన తెలంగాణకు చాలా చరిత్రే ఉందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం
tsmagazine

మనకు తెల్లాపూర్‌ (తెలుంగుపురం, తెనుగాణపురము) శాసనమేగాకుండా తెలంగాణ ప్రాచీన (పాత) శాసన పరిష్కర్తలుగా చెప్పుకోదగ్గవారు దూపాటి వేంకట రమణాచార్యులు శేషా(ద్రి)చార్యులు, బి.యన్‌. శాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి మొదలగువారు ఎన్నో శాసనాలను తెలంగాణా ప్రాంతంలో సేకరించి పరిష్కరించి వెలువరించినారు.

మెదక్‌ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) మల్లిఖార్జునపల్లిలోని రాష్ట్ర కూటుల (అమోఘవర్షుని) కాలంనాటి తెలంగాణ శాసనం కూడా గొప్పదే. ఆ శాసనం, సంస్కృత-తెలుగు-కన్నడ లిపులలో విరాజిల్లు తోంది. నా పరిశోధనలో జహీరాబాద్‌-పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని శాసనాలను, ఉమ్మడి పురావస్తుశాఖ, తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కనుగొని సేకరించి పరిష్కరించినాను. అయితే మనకు ఇప్పటివరకు ఎన్నో శాసనాలు లభ్య మైనప్పటికినీ, ఎక్కువగా మన తెలంగాణను ”గోండె (గోండ) రాజులు, శాతవాహనులు, విష్ణుకుండి నులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, పద్మనాయకులు, ఆసఫ్‌జాహీలు, ఉస్మాన్‌పాషాలు, అందోలు రాజులు (కేవలం మెదక్‌ జిల్లాని) గోనె రాజులు ఇలా ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి.

ఝరాసంగం-ఢాకూర్‌-మిట్టపల్లి-టేక్మాల్‌ (టేకుమాలు) మల్లిఖార్జున పల్లి -పట్లూరు-కోహీర్‌-ఇంద్రకరణ్‌-పుల్లూరు ఇలా ఎన్నెన్నో శాసనాలు, శిలా, తామ్ర, రాగి మరియు తాళపత్ర చరిత్ర గ్రంథాల ద్వారా మన తెలంగాణ ప్రఖ్యాతిగాంచుతోంది. గొప్పగొప్ప శాసనాలు మరికొన్ని (1) మెదక్‌ (2) కరీంనగర్‌ (3) వరంగల్‌ (4) మహబూబ్‌నగర్‌ (5)ఆది లాబాద్‌ (6) ఖమ్మం (7) నిజామాబాద్‌ (8) నల్గొండ (9) రంగారెడ్డి (10) హైదరాబాద్‌ అన్ని జిల్లాలలోనూ ఎన్నో శాసనాలు లేకపోలేదు.. దీనికి ప్రజలు, ప్రభుత్వాల తోడ్పాటు ఎంతో అవసరము.

మనకు కరీంనగర్‌ జిల్లా కుర్త్యాల గ్రామంలోని క్రీ.శ. 945 జినవల్లభుని పూర్తి శాసనం, శాసన పద్య పాఠము గొప్పదని ఎంతోమంది శాసనకర్తలు చెప్పియున్నారు. అయితే వరంగల్‌ జిల్లా మానుకోట (ప్రస్తుతం మహబూబాబాద్‌) తాలూకా కొరవి (కొఱవి) శాసనం తెలంగాణ చరిత్రలో గొప్పదే క్రీ.శ. 935 నాటిదని తెలుపుతున్నది.

ఈ రాతి శాసనములు చిన్నరాళ్లు శాసనపాఠములు. పెద్దరాయి మొదటివైపు 2, 3, 4, వైపులా దాన శాసన పాఠము కలదు. ఇది కూడా గొప్ప శాసనమే క్రీ.శ. 935 సం||నాటిదగుటచే ఇంచుమించు నన్నయ్య కాలంకంటే ఒక శతాబ్దము ముందుంది అని ఖచ్చితంగా బి.యన్‌. శాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి పేర్కొన్నారు.

అలాగే ఇక్కడి ప్రాంతంలో తాళపత్రగ్రంథం ఒకటి నేను 1996 సం||లో సేకరించాను. గూడూరు జనగామ తాలూకాలోగల క్రీ.శ. 1076-1127 చాళుక్య చక్రవర్తి ఆరవ విక్రమాదిత్యుని శాసనం చరిత్రలో గొప్పది. ఇది నన్నయ్య తర్వాత 100 సం||నాటిది. తెలంగాణా చరిత్రలో చెప్పుకోదగ్గ శాసనం కరీంనగర్‌ జిల్లా ఉప్పర్‌పల్లి శివాలయంలోని 1157-1235 సం|| మధ్య వ్రాయబడిన శాసనం ఇది. కంద, ఉత్పలమాల పద్యాల వరుసక్రమము మన యావత్‌ తెలంగాణ (తెలుగునకు)కే ఒక మణిపూసగా చెప్పవచ్చు.
tsmagazine
మెదక్‌జిల్లాలో రామాయంపేట, ప్రజంపూర్‌, శివనూరు, శంకరంపేట, గుడికందుల (భైరవేశ్వరాలయం) వెంకటరావుపేట, కొడిపాక మొదలగు శిలా శాసనాలు కూడా తెలంగాణ చరిత్రలో ఎంతో గొప్పవి. వెండికోలు, కల్పగూరు, నందికంది శాసనాలను మరికొన్ని ప్రాచీన తామ్ర-రాగి శాసనాలను సేకరించి పరిష్కరించడం జరిగింది. ఇటీవల విష్ణుకుండినుల రాజులు, గోవిందవర్మ మాధవవర్మ శిలా శాసనాలలో జంట నందులు, సింహాకృతిగల శిలా శాసనాలు లభ్యమయ్యాయి. శనిగరం రాగిదోనెల ప్రాంత శాసనాలు కూడా తెలంగాణ చరిత్రలో చెప్పుకోదగ్గవి.

ఝరాసంగం, మర్పడగ (నాటి మరకత మణిపురం) ఇతర ప్రాంతాలలో కళ్యాణి చాళుక్య రాజు రెండవ అహవమల్ల వేయించిన శిలా శాసనం కూడా నా పరిశోధనలో బయటపడినది. పాపన్నపేట మండలం నాగసానిపల్లి శివారులోని కొడిపాక శిలాశాసనం దౌల్తాబాద్‌ మండలం సిరిపురం గ్రామ నట్టనడుమ ఆంజనేయస్వామి దేవస్థానంలోని శిలాశాసనం కూడా ఎంతో ప్రాచీనమైనది.

తెలంగాణ శాసనాలలో ఇటీవల ధ్వంసమైన వాసాలమర్రిలోని గొప్ప శిలా శాసనాన్ని కాపాడడానికి మన తెలంగాణ ప్రభుత్వం సహకరించింది కానీ శిథిలమైపోతున్న ఇలాంటి గొప్ప శాసన సంపదను కాపాడే విషయంలో మన తెలంగాణ ప్రజల బాధ్యత కూడా ఎంతో ఉన్నది.
ప్రాకృత (బ్రాహ్మీ) సంస్కృతం, తెలుగు, కన్నడ, వెలూడి (మరాఠీ), తమిళ భాషలలో వ్రాసిన తెలంగాణ శాసనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన బంగారు తెలంగాణలో గుప్తంగా, గోప్యంగా దాగి ఉన్న మరెన్నో శాసనాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి పరిష్కరించి వెలుగులోకి తేవాల్సి ఉన్నది. కావున మనతెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఆదరించవలెనని నా ప్రార్థన.

డా|| కావూరి శ్రీనివాస్‌

Other Updates