తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం

క్రీస్తుపూర్వం నుండే తన ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషా సాహిత్యాలు ూడా రాజుల ప్రోత్సాహంతో సమాంతరంగా వృద్ధి చెందినవి. ప్రాచీనకాలం నుండి నేటివరకు వందల సంఖ్యలో కవులు, రచయితలు, పండితులు తమ రచనల ద్వారా తెలంగాణాలో సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. వారి రచనలు సమాజానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. పద్యం, గేయం, వచనం.. అనేక ప్రక్రియల్లో రచనలు చేసి తమ ఉనికిని చాటుకున్నారు. ఈ సాహితీ ప్రస్థానంలో ప్రముఖులై, తెలంగాణా సాహితీ తేజో మూర్తులుగా నిలిచిన ప్రాచీనులైన కొందరు కవులను పరిచయం చేయడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

గుణాఢ్యుడు
హాల శాతవాహనచక్రవర్తి సమకాలికుడైన గుణాఢ్యుడు బృహత్కథ అనే ప్రాచీన కథాకావ్యాన్ని పైశాచీ ప్రాకృతంలో వ్రాసిన కవి. సంస్కృత ప్రాకృతాలతో పాటు దేశీభాషను కూడా త్యజించి తన బృహత్కథను పైశాచీ భాషలో గుణాఢ్యుడు వ్రాసినాడని ఐతిహ్యం.

జినవల్లభుడు
పంపని తమ్ముడైన జినవల్లభుడు కరీంనగర ప్రాంత తొలి తెలుగు కవి. ఈతను తెలంగాణ మాత్రమే కాక తెలుగువారికి తొలి తెలుగు కవి. తొలి తెలుగు కంద పద్య రచయిత. కుర్క్యాల గ్రామంలోని బొమ్మలగుట్టపై వేయించిన శాసనంలో సంస్కృత కన్నడ తెలుగు కవిత్వం రాసినాడు. ఇతను వాగ్వధూవల్లభుడనని, సకల కళా ప్రవీణుడనని, భవ్య రత్నాకరుడనని, గుణ పక్షపాతినని, చతుర కవిత్వ రచనా సిద్ధుడ నని, బహుకావ్య నిర్మాతనని, కవితాతత్త్వ శోధకుడనని, శ్రావ్య గాయకుడనని, సంగీత శాన్త్రజ్ఞుడ నని చెప్పుకున్నాడు. ఈతనికి వాచకా భరణుడనే బిరుదున్నట్లు మల్లియ రేచన చెప్పినాడు. జినవల్లభుని మరో సంస్కృతరచన ‘మహావీరస్వామి స్తోత్రం’.

tsmagazineపంప మహాకవి
పంప మహాకవి కరీంనగర ప్రాంత తొలి కన్నడ భాషా మహాకావ్య నిర్మాత. ఈతడు కన్నడిగులకు ఆదికవి. ఇతడు రాసిన విక్రమార్జున విజయం వేములవాడను పాలించిన చాళుక్య చక్రవర్తి ఇమ్మడి అరిసేరి (క్రీ.శ.930-935)కి అంకితమిచ్చాడు. ఈ మహాకావ్య నిర్మాణ ఫలితంగా పంపమహాకవికి అరిసేరి ప్రభువు ధర్మపుర గ్రామాన్ని ధారాదత్తం చేసినాడు. ఈ విషయం కుర్క్యాల గ్రామంలో పంపని తమ్ముడు జినవల్లభుడు వేయించిన కొండమీది శిలాశాసనంలో పేర్కొనబడింది. పంపమహాకవి క్రీ.శ. 941లో ఆదిపురాణం రాసినాడు. విక్రమార్జున విజయం (పంపభారతం) వేములవాడలో క్రీ.శ.945లో రాసినాడు. ఈ పంపకవికి పద్మకవి అనే మరో పేరు ఉన్నది. ఈతని తెలుగు కృతి జినేంద్ర పురాణము.

మల్లియ రేచన
జినవల్లభుని కాలం వాడైన తొలి ఛందః కర్త మల్లియ రేచన కరీంనగర్‌ ప్రాంతం వాడు. జినవల్లభ కవి తనకు ప్రాణ సమాన మిత్రుడైన కవిజనాశ్రయమనే పేరుగల ఛందోగ్రంథానికి సహాయంగా నిలిచాడని మల్లియ రేచన చెప్పుకొన్నాడు. ఇతనికి శ్రావకాభరణుడనే బిరుదు
ఉంది. తాను వణిగ్వంశజుడనని మల్లియ రేచన చెప్పుకొన్నాడు. మల్లియ రేచన కంద పద్యాలతోనే కవిజనాశ్రయం మొత్తం రాశాడు. ఇతడు కలమే కాదు, కత్తి పట్టిన వాడు. ఇతని బిరుదులను బట్టి ఏదైనా సైన్యాధ్యక్ష పదవిని అలంకరించిన వాడు కావచ్చు.

tsmagazineవేములవాడ భీమకవి
వేములవాడ భీమకవి సాహితీ లోకంలో మహాకవి. నివాస స్థానం వేములవాడ. తాటాకు గ్రంథాలలో కాక చాటువుల ద్వారా బ్రతికిన కవి. వేములవాడ భీమకవిని స్పృశించని తర్వాతి కవులెవ్వరు లేరు. ఆతని ఉద్దండ లీలా కవితా విహారము తెలుగు కవులందరికీ ఇష్టమైనదే. నృసింహపురాణము, ఆంధ్రప్రయోగ రత్నాకరము, రాఘవపాండవీయము, శతకంఠ రామాయణము, హరవిలాసము, బసవ పురాణము (కన్నడము) ఒక జ్యోతిశ్శాస్త్ర గ్రంథం ఇతని కృతులుగా పేర్కొనబడుతున్నాయి.

మల్లికార్జున పండితారాధ్యులు
వీరు క్రీ.శ. 1163 ప్రాంతం వారు. వీరు 44 గ్రంథాలు రాసినట్లు తెలుస్తున్నా ‘శివతత్త్వసారము’ మాత్రమే లభిస్తుంది. వీరశైవమ తాన్ని ఆచరించిన వీరు వేదవేదాంగ పండితుడు. తొలిశతకంగా గుర్తింపు పొందిన శతకమిది. శ్రీపతి పండితుడు, శివలెంక మంచన పండితులు, మల్లికార్జున పండితుడు పండిత త్రయంగా ప్రసిద్ధి పొందినారు.

శివదేవయ్య
గణపతి దేవ చక్రవర్తికి దీక్షాగురువైన శివ దేవయ్య క్రీ.శ. 1260 కాలానికి చెందినవాడు. ఇతడు పురుషార్థ సారము, శివధీమణి శతకము, పరతత్త్వ రసాయనము అనే రచనలు చేసి సంస్కృతాంధ్ర కవితా పితామహుడుగా బిరుదు పొందినాడు. నీతిశాస్త్ర గ్రంథమైన పురుషార్థ సారాన్ని అనుసరిస్తూ తర్వాత చాలామంది కవులు రచనలు చేసినారు.

యథావాక్కుల అన్నమయ్య
శతక రచన ప్రక్రియలో మకుట నియమం పాటించబడిన మొదటి రచన యథావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకం. క్రీ.శ. 1292 లో రచన చేసినట్లు తెలుపుకున్న ఈ కవి కాకతి దేవునికి సమకాలికుడు. సాత్త్వికుడైన అన్నమయ్య అర్థంలేని తర్కాలను, ఆడంబ రాలను వ్యతిరేకించినాడు.

జాయపపేనాని
గణపతి దేవుని సైన్యంలో గజసాహిణిగా ఉన్న జాయప సేనాని సంగీత, నాట్య సాహిత్య రంగాల్లో కృషి చేసినాడు. ఇతడు రచించిన ‘నృత్త రత్నావళి’ లక్షణ గ్రంథం ఆధారంగానే శిల్పకళకు నిలయమైన రామప్ప దేవాలయంలో నృత్యభంగిమలు ఏర్పరచబడినాయని చారిత్రకుల అభిప్రాయం. ఇందులో మార్గ, దేశి వృత్తాలు వివరించబడినాయి. ఇందలి దేశి వృత్తాలలో పేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, దండరాసకం, శివప్రియం, బిందుకందుకం, ఖాండికం, ఘంటిసణి, చరణము, బహురూపము, కోలాటము ముఖ్యమైనవి.

మారన
పురాణాన్ని తొలిసారిగా అనువాదం చేసిన మహాకవి మారన. క్రీ.శ. 1289 -1323 ప్రాంతంలోని వాడు. మార్కండేయ పురాణాన్ని అనువదించి ప్రతాపరుద్రుని సేనాని గన్నయ నాయకునికి అంకిత మిచ్చినాడు. తిక్కనను తన గురువుగా చెప్పు కున్నాడు.

విద్యానాథుడు
సంస్కృతంలో అలంకార గ్రంథాలు రచించిన తెలుగువారిలో మొదటివాడు విద్యానాథుడు. ఇతడు ప్రతాపరుద్రుని ఆస్థానకవి. సుప్రసిద్ధ లాక్షణికుడు. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ ఇతని లక్షణ గ్రంథం. ఈ గ్రంథంలోని ఉదాహరణలన్నింటిలోనూ కాకతీయ ప్రతాపరుద్రుని ‘యశోగానం’ కన్పిస్తుంది.

పాల్కురికి సోమనాథుడు
13వ శతాబ్దిలో (1295-1323) దేశికవితలో తొలిరచనలు చేసిన పాల్కురికి సోమనాథుడు, రెండవ ప్రతాపరుద్రుని కాలంలో వరంగల్‌ జిల్లా పాలకుర్తి గ్రామంలో ఉన్నవాడు. తాను నమ్మిన వీరశైవ మతాన్ని రచనల ద్వారా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేసినాడు. ఇతని రచనల్లో బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, వృషాధిప శతకము, చెన్నమల్లు సీసములు, చతుర్వేద సారము, అనుభవ సారము అనేవి తెలుగు రచనలు. సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం మరికొన్ని చిన్న రచనలు సంస్కృత సంబంధాలు.

గోన బుద్ధారెడ్డి
తెలుగులో మొట్టమొదటి ద్విపద రామాయణమైన ‘రంగనాథ రామాయణం’ రచించిన వారు గోన బుద్ధారెడ్డి. విఠలరెడ్డి కుమారుడు, గోన గన్నారెడ్డి దత్త పుత్రుడు అయిన గోన బుద్ధారెడ్డి తన తండ్రి కోరిక మేర – అతని పేర అంటే విఠలరెడ్డికి అంకితంగా 1294-1300 మధ్య ద్విపద రామాయణం రచించాడు. బుద్ధారెడ్డి కుమారులైన కాచరెడ్డి, విఠలరెడ్డి తండ్రి కోరిక మీదనే అతనికి అంకితంగా ద్విపదలో ఉత్తర రామాయణం రచించి తొలి తెలుగు జంటకవులుగా ప్రశస్తి గడించారు.

మడికి సింగన
కరీంనగర్‌ జిల్లాలోని ప్రాచీన కవులలో సుప్రసిద్ధుడు మడికి సింగన. ఈతడు కందనామాత్యునిచే పోషింపబడినాడు. రామగిరి నివాసి. ఈతని కాలం క్రీ.శ.1350 ప్రాంతం. తిక్కన సోమయాజి మనుమడు ఐన గుంటూరి కొమ్మనగారి ూతురు చిట్టాంబికను పెండ్లాడిన అల్లాడమంత్రి పౌత్రుడు మడికి సింగన. తెలుగులో తొలి వేదాంత కృతి ‘జ్ఞానవాసిష్ఠ రామాయణము’ రాసినాడు. పోతన్నకన్నా ముందే భాగవతం దశమస్కంధాన్ని ‘ద్విపద భాగవత దశమస్కంధం’ రాసినాడు. తెలుగులో తొలి సంకలన గ్రంథం ‘సకలనీతి సమ్మతం’ సంకలనం చేసినాడు. ‘పద్మపురాణోత్తర ఖండం’ పురాణానువాదంగా రాశిలో వాసిలో శ్రేష్ఠమైన కావ్యం. 6 ప్రకరణాలు, 5 ఆశ్వాసాలతో జ్ఞానవాసిష్ఠం అనే గ్రంథాన్ని వ్రాసినాడు. తొలిసారిగా వేదాంత గ్రంథ అనువాదం, తొలిసారిగా సంకలన గ్రంథం వ్రాసిన మహాకవి మడికి సింగన తాను నివసించిన మధ్య యుగాల సబ్బినాడు రామగిరి పట్టణానికి, కరీంనగర్‌ ప్రాంతానికి వన్నె తెచ్చిన కవి.

గౌరన
రాచకొండ వారి గౌరన క్రీ.శ. 1380 – 1450 కాలం వాడు. గౌరన పెదతండ్రి పోతరాజు రాచకొండ రాజు సింగయ మాధవుని మంత్రి. ఈ కవి సంస్కృతంలో లక్షణదీపిక అనే ఛందో గ్రంథాన్ని, తెలుగులో నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే కావ్యాలను రచించాడు. గౌరన శ్రీనాథుడు సమకాలికులు. గౌరనకు సరస సాహిత్య లక్షణ విచక్షణుడు అనే బిరుదు ఉంది. గౌరన సోమనను అనుసరించి రెండు మహాకావ్యాలను ద్విపదలో రాసినాడు.

సర్వజ్ఞ సింగభూపాలుడు (2వ) :
క్రీ.శ. 1384 – 1399 ప్రాంతంలో జీవించిన రాచకొండ రాజైన ఒకటవ అనపోత నాయకుని కొడుకు ఇతను. బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత నాట్య మర్మజ్ఞుడు, కవి, నాటక కారుడు. అనేకమంది కవి పండితులను పోషించినవాడు. ఒకవైపు రాచకొండ పరిపాలన మరోవైపు సాహిత్య పాలన గావించినవాడు. ప్రముఖ లాక్షణికుడు విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయాచార్య, నాగనాథుడు, శాకల్య మల్లభట్లు, శాకల్య అయ్యలార్యుడు ఇతని ఆస్థానంలోని వారే. వీరు సంస్కృతంలో రసార్ణవ సుధాకరం అనే అలంకార శాన్త్రం, సంగీత సుధాకరం అనే నాట్య గ్రంథం, కందర్ప సంభవం అనే భాణం, కువలయావళి (రత్న పాంచాలిక) అనే నాటిక వ్రాసినాడు. ఇతని గురించి అనేక చాటు పద్యాలున్నాయి.

రావిపాటి త్రిపురాంతకుడు
14వ శతాబ్దం పూర్వార్ధానికి చెందిన ఈ కవిని శ్రీనాథుడంతటి వాడు నుతించినాడు. ఈయన సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామాన్ని అనుసరించే వినుకొండ వల్లభరాయల ‘క్రీడాభిరామం’ వచ్చింది. ఈయన రాసిన ‘త్రిపురాంతకోదాహరణం’ మనకు దొరి ఉదాహరణ కావ్యాల్లో ద్వితీయమే కాని, కావ్య శ్రేష్ఠతలో అద్వితీయం. ఈ రెండే కాక ఈయన మదన విజయం (అముద్రితం), చంద్ర తారావళి, అంబికాశతకం (అముద్రితం) అనే గ్రంథాలు రచించినాడు.

పిల్లలమర్రి పినవీరభద్రుడు
తెలుగు సాహిత్యచరిత్రలో కావ్యయుగ నాయకుడైన శ్రీనాథుని రచనా విధానానికి, ప్రబంధ యుగ ప్రవర్తకుడైన అల్లసాని పెద్దన కావ్యకళా విధానానికి మధ్య కవితలల్లినవాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ‘వాణి నా రాణి’ అని పేర్కొని అవతార దర్పణము, నారదీయ మహా పురాణము, మాఘ మాహాత్మ్యము, మానసోల్లాస సారము, శృంగార శాకుంతలము, జైమినీ భారతము అనే కావ్యాలను రాసినాడు. ఇతడు పదిహేనవ శతాబ్ది ఉత్తరార్థంలో సాళువ నరసింహరాయల కాలంవాడని చెప్పవచ్చు.

tsmagazineబమ్మెర పోతన
పాలకుర్తి మండలము నందలి బమ్మెర నివాసి. ఇతడు 1400 – 1480 ప్రాంతంలోని వాడు. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన భోగినీ దండకము, వీరభద్ర విజయం, నారాయణ శతకాదులను రచించినాడు. సులభమైన భాషలో రచించి తెలుగు ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచిపోయిన సహజ కవి ఇతడు. ద్వాదశ స్కంధాలుగా సాగిన భాగవ తంలో బహుళ ప్రచారాన్ని పొందిన సన్నివేశాలుఎన్నోఉన్నాయి.

వెలిగందల నారయ :
పోతన రాసిన భాగవతంలోని చివరి రెండు స్కంధాలు రాసిన వెలిగందల నారయ శ్రీమదాంధ్ర మహాభాగవత రచయితగా పోతన్న సరసన చేరిన ధన్యుడు. ఈతడు కరీంనగర్‌ ప్రాంతానికి జిల్లా ంద్రంగా, నాటి పరిపాలనా స్థానంగా, రాజధానిగా విలసిల్లిన వెలిగందల నివాసి. ఈతడు పోతన్నకు ప్రియశిష్యుడు. ‘పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణాఖ్య విరచితంబైన’ అని చెప్పుకోవడాన్ని బట్టి పోతనకు సమకాలికుడుగా క్రీ.శ.1420-80 ప్రాంతం వానిగా భావించవచ్చు.

హరిభట్టు
హరిభట్టు చేత ఖమ్మం మెట్టు, ఖమ్మం మెట్టును వర్ణించడం చేత హరిభట్టు పేరు ప్రఖ్యాతులను పొందే అవకాశం కలిగింది. ఇతడు క్రీ.శ. 1475-1533 మధ్య జీవించినవాడు. హరిభట్టు తాను వ్రాసిన వరాహ పురాణాన్ని కొలిపాక ఎర్రయ్యకు అంకితమిచ్చినాడు. ఇతడు రతి రహస్యము, వరాహ పురాణము, మత్స్యపురాణము, నృసింహ పురాణ ఉత్తరభాగం వంటి రచనలు చేసిన తెలంగాణ కవి.

కొఱవి గోపరాజు
‘సింహాసన ద్వాత్రింశిక’ అనే కథాకావ్యాన్ని రాసిన కొఱవి గోపరాజు మెట్‌పల్లి మండలం వేముగల్లు నేలిన రాణా మల్ల నరేంద్రుని ఆస్థానంలోని వాడు. ఈ కావ్యం విజ్ఞాన సర్వస్వం లాంటిది. ప్రాచీన తెలంగాణ భాష నిక్షిప్తమైన గ్రంథం. ఈ గ్రంథంలో ప్రాంతీయా భిమానంతో ధర్మపురి, వేములవాడ వంటి క్షేత్రాలను వర్ణించినాడు. వీరి తాత కొరవి సత్యనారణ ‘ఆంధ్ర కవితా పితామహ’ బిరుదు పొందినవాడు. ఈతడు రామాయణాన్ని వ్రాసినాడు. ప్రస్తుతం ఇది అలభ్యం.

tsmagazineమల్లినాథ సూరి
సంస్కృత కావ్య వ్యాఖ్యాన సంప్రదాయానికి ప్రయోగదీపిక వంటి పండితులు వీరు. మెదకు జిల్లాలోని కోలాచలం అనే గ్రామంలో జన్మించారు. వీరు 14 వ శతాబ్ది చివరలో లేదా 15వ శతాబ్ది ఆరంభంలో మల్లినాథ సూరి జీవించి ఉండవచ్చు. కాళిదాసు కావ్యాలైన రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశాలకు మల్లినాథుడు వ్యాఖ్యలు రచించాడు. భారవి కుమారసంభవ కావ్యానికి మల్లినాథుని ఘంటాపథ వ్యాఖ్య ఉత్తమమైనది. శిశుపాల వధ (మాఘకావ్యం) కావ్యానికి ఉన్న వ్యాఖ్యలలో మల్లినాథుని సర్వంకష వ్యాఖ్య శ్రేష్ఠమైనది. భట్టి కావ్యానికి ‘సర్వపథినా’ వ్యాఖ్య, హర్షనైషధానికి ‘జీవాతు’ వ్యాఖ్య ప్రశస్తమైనవి. ఇవే కాక తంత్రవార్తిక (సిద్ధాంజనము), స్వరమంజరి (పరిమళము), తార్కిక రక్ష (జ్యోతిష గ్రంథం – నిష్కంటిక వ్యాఖ్య) లను మల్లినాథుడు రచించినాడు.

కాకునూరు అప్పకవి
పాలమూరు జిల్లా శేంపేట మండలంలోని కాకునూరు గ్రామ నివాసి. వీరు ఆంధ్ర శబ్ద చింతామణికి వివరణాత్మకమైన లక్షణ గ్రంథం ‘అప్పకవీయం’. ఇది క్రీ.శ.1556లో రచించ బడింది. దీనికి ఆధార గ్రంథమైంది ఎలూచి బాలసరస్వతి ఆంధ్రశబ్ద చింతామణికి ూర్చిన శబ్దానుశాసన టీక.

సారంగు తమ్మయ
క్రీ.శ.1580 ప్రాంతం వాడైన సారంగు తమ్మయ గోల్కొండకు కరణంగా ఉండి ‘వైజయంతీ విలాసం’ అనే ప్రబంధం వ్రాసినాడు. హరిభక్తి సుధోదయము అనే గ్రంథానికి ‘భక్తి సంజీవిని’ అనే పేరుతో సంస్కృతంలో ఒక వ్యాఖ్యాన గ్రంథం రచించినాడు. భాగీరథి పట్టణమునకు (గోలకొండ) తాను మంత్రినని చెప్పుకున్నాడు.

మరింగంటి సింగరాచార్యులు
దశరథ రాజ నందన చరిత్ర, శుద్ధాంధ్ర నిర్యోష్ఠ్య సీతా కళ్యాణం, తారక బ్రహ్మ రామ శతకం ఇతని ప్రసిద్ధ గ్రంథాలు. ఇవి కాక దాదాపు ఇరవై అముద్రితాలున్నట్లు తెలుస్తుంది. వీరికి ఆశుకవి, శారదాప్రశ వివరణ అనే బిరుదులున్నాయి. వీరు మల్కిభరాముని కృపకు పాత్రులై హుజూర్‌నగర్‌ నందలి యాతావాకిళ్ళ, వాడపల్లి గ్రామాలను అగ్రహారాలుగా పొందినట్లు తెలుస్తుంది. ఎనిమిది మంది సోదరులు వీరు. మల్కిభరాముని ఆశ్రితులు. నల్లగొండ జిల్లావారు.

కందుూరి రుద్రకవి
కందుూరి రుద్రకవి నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలోని జనార్దన కందుూరి గ్రామవాసి. ఇతని కవితా పాండిత్యాలకు మెచ్చి ఇబ్రహీం కుతుబ్‌ షా రెంటచింతల గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇతడు నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్దనాష్టకం అనే కావ్యాలను రాసినాడు. సుగ్రీవ విజయం తెలుగులో మొదటి యక్షగానంగా చెప్పబడుతుంది.

చరిగొండ ధర్మన్న కవి
చిత్రభారతమనే బహువిచిత్రమైన కథాకావ్యం రాసిన చరిగొండ ధర్మన ధర్మపురి వాడు. ఈతడు 1460-1530 మధ్య కాలం వాడు. శతావధాని. ‘శతలేఖిన్యవధాన సురత్రాణ’ బిరుదమున్నట్లు తన గ్రంథంలో చెప్పుకున్నాడు. ఓరుగంటి పాలకుడైన షితాబ్‌ఖాన్‌ (సీతాపతిరాజు)కు మంత్రిగా ఉన్న ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ఈ కవికి ఆశ్రయమిచ్చినాడు. చిత్రభారత కథ కృష్ణార్జునుల యుద్ధగాథ. గయోపాఖ్యాన కథ. ఈ చిత్రమైన భారత గాథ అమూలకము.

అద్దంకి గంగాధర కవి
ఈతడు గోల్కొండ ఆస్థానకవిగా ప్రసిద్ధి. క్రీ.శ. 16వ శతాబ్దికి చెందినవాడు. వీరి రచన తపతీ సంవరణోపాఖ్యానము. దీనిని ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం చేసినాడు. ఈ కవి బాల్యంలో గోలకొండ సంస్థానానికి వలస వచ్చినట్లు ప్రతీతి. గోలకొండ వెనుక ఉన్న ‘హైదార్షా కోఠె’ గ్రామంలో ఉన్నట్లు తెలుస్తుంది.

పొన్నిగంటి తెలగన్న
ఈతడు కూడా గోల్కొండ ఆస్థానకవి. వీరికి తానీషా కొంత భూమిని ఇచ్చి ఉండెనట. వీరి నివాసము గోల్కొండ సమీపంలోని ‘నార్సింగి’ ప్రాంతం అని తెలుస్తుంది. ఈ కవి రచించిన ‘యయాతి చరిత్ర’ మీర్‌ జుమ్లా అమీన్‌ ఖాన్‌ అనునతనికి అంకితం ఇచ్చాడు. ఇది అచ్చతెలుగు కావ్యం.

నేతి కృష్ణయామాత్యుడు
రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండ క్రింది ప్రాంతంలో ఉన్న గ్రామం సిద్ధలూరు నివాసి నేతి కృష్ణయామాత్యుడు. క్రీ.శ. 16వ శతాబ్దానికి చెందిన కవి. వీరు రచించిన గ్రంథాలు. 1. సకల నీతి కథా సంగ్రహము 2. రాజనీతి శాన్త్రము 3. అనంతగిరి మాహాత్మ్యము. అనంతగిరి మాహాత్మ్యములో విష్ణువు అనంతగిరి కొండమీదికి రావడం, కొండమీద ‘ముచుకుంద’ మహాముని పేరు మీద నదిని (ప్రస్తుత మూసీ నది) ప్రవహింపజేయడం ఇతివృత్తం.

నేబతి కృష్ణయామాత్యుడు
పంచతంత్రాన్ని రాజనీతి రత్నాకరమనే పేరుతో 6 ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. వీరి తండ్రి మల్కిభరాముని మెప్పును పొంది పానుగంటికి అధ్యక్షుడై ప్రజలను పోషించినట్లు ప్రశంసించబడింది.

సోమనాథ కవి
17వ శతాబ్ది వాడైన సోమనాథ కవి వేములవాడ వాసి. ఈతడు వసుచరిత్రకు విద్వన్మనోరంజనీ వ్యాఖ్యానం చేసినాడు. ఇంకా ఈతడు చతుర్భుజాభిషేకము, ధ్రువచరిత్రము, మరుత్సందేశము, ముద్రాలాభము, గంగాగౌరీ సంవాదము అనే కృతులు రాసినాడు. వేములవాడ గ్రామనామం ప్రాచీన, మధ్యయుగాల్లో లేములవాడగా వ్యవహరింపబడేదని ఈతని యతి స్థలాలలో వాడిన పద్యం వల్ల తెలుస్తుంది. సిద్ధేశ్వర మంత్రి తండ్రిపేరు. శ్రీమత్పార్వతీ రాజరాజేశ్వర ప్రసాదము వలన విద్యా విశారదుడనైనాడని చెప్పుకొన్నాడు.

పరశురామపంతుల లింగమూర్తి
సీతారామాంజనేయ సంవాదం అనే వేదాంత గ్రంథం రచించిన ఈ లింగమూర్తి కవి కరీంనగర ప్రాంతం వాడు. శనిగరంలో పుట్టి ఈదులవాయిలో పెరిగినాడు. మంథనిలో మహాదేవ గురునికి కుసుమ నారాయణుని వద్ద శుశ్రూష చేసి తారకమంత్రోపదేశం పొందినాడు. పెద్దపల్లి తాలూకాలోని రామగిరి దుర్గంలో మంత్రసాధన చేసినాడు. చరమాంకంలో వీరు ఓరుగల్లు నగరంలో సమాధి పొంది దేహత్యాగం చేసి ఉండవచ్చు. వయస్సులో ఉన్నప్పుడు రతీమన్మథ విలాసం వంటి కావ్యాలు వ్రాసిన వీరు వేదాంత విషయంగా 10 గ్రంథాలు రాసినాడు.

శేషప్ప కవి
‘భూషణ వికాస శ్రీధర్మపురి నివాస! దుష్ట సంహార నరసింహ దురితదూర!’ అనే మకుటంతో నరసింహ శతకాన్ని రాసిన శేషప్పకవి ధర్మపురి వాడు. స్థానికదైవం లక్ష్మీనారసింహుని మీద మూడు శతకాలు నరసింహ, నరహరి, నృసేరి మకుటాలతో రాసినాడు. అవనిజ చరిత్రం మరో రచన. ఈ కవి 1735 – 1825 కాలం మధ్య వాడు. ధర్మపురి రామాయణం అనేది వీరి యక్షగానం రచన.

చందాల శేవదాసు
‘మీరజాల గలడా నా యానతి….’ ‘భలే మంచి చౌక బేరము …’ అనే ప్రసిద్ధమైన పాటలు (శ్రీకృష్ణ తులాభారం సినిమా) వ్రాసిన వారు చందాల శేవదాసు. వీరు ఖమ్మం జిల్లా జ్కపల్లి గ్రామంలో 1876లో జన్మించారు. వీరిలో రామభక్తుడు, మహాకవి, అష్టావధాని, నాటక కర్త, సినీరచయిత కనిపిస్తారు. రామభక్తి విషయంలో, రామాలయ నిర్మాణ విషయంలో వీరు అపర రామదాసు. వీరు శేవ శతకం, సీతారామస్తవం అనే రెండు ఛందోబద్ధమైన రచనలు చేశారు. వీరరాఘవ శతకం అలభ్యం. నాగదాసనే అచలయోగి చరిత్రను హరికథగా వ్రాసినారు. శ్రీరామదండకము, పంచముఖాంజనేయ దండకము, మేలుకొలుపులు, మంగళ హారతులు, జోలపాటలు, హెచ్చరికలు మొదలైనవానిని వ్రాసినారు. కనకతార, బలి బంధనము, లంకాదహనము మొదలైన నాటకాలు ముద్రితాలు. రుక్మాంగద, సీతాకళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, భక్త అంబరీష మొదలైన నాటకాలు వ్రాసినట్లుగా తెలుస్తుంది. అవి అలభ్యాలు.

రామదాసు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ నివాసి అయిన కంచర్ల గోపన్న క్రీ.శ.1620-1687 కాలములోని వాడు. కామాంబ, లింగనమంత్రి దంపతుల పుత్రుడు. రఘునాథ భట్టరు వారి శిష్యుడు. గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన అబుల్‌హసన్‌ తానీషా కొలువులో ఉన్న అక్కన్న, మాదన్నల మేనల్లుడు. భద్రాచలం పరగణాకు తహసీల్దారుగా పనిచేసి సీతారామచంద్ర స్వామికి ఆలయాన్ని కట్టించి, ఆభరణాలను చేయించి అలంకరించిన పరమ భక్తుడు. ఇతని రచనలు 1. శ్రీమద్రామాయణ కథా చూర్ణిక 2. దాశరథి శతకం 3. కీర్తనలు.

రాకమచర్ల వేంకటదాసు
ఈ భక్తకవి 500 కీర్తనలకు పైగా రచించినారు. క్రీ.శ. 18వ శతాబ్దం వాడు. ఇతడు పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా పెద్దాపురం నివాసి. క్షేత్ర పర్యటనలో భాగంగా ముచుకుంద క్షేత్రమైన రాకమచర్లకు చేరుకున్నాడు. ఇది పరిగి తాలూకాలోనిది. ఈ కవి విష్ణుమూర్తి వరకవితా వాక్పటిమతో, మధురమైన భక్తి రస పూరితమైన కీర్తనలు రచించి తరించిన ఘనుడు. ఇంకా తెలంగాణంలో చాలామంది ప్రాచీన కవులు, సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన తేజోమూర్తులు ఎందరో ఉన్నారు. తెలంగాణా సాహిత్యం మరుగున పడిపోకుండా ఈ కవుల కావ్యాలన్నీ వెలుగులోకి వేస్తే భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

డా|| సాగి కమలాకర శర్మ
tsmagazine

Other Updates