magaతెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వరదకాలువ వద్ద పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం స్వయంగా మట్టి తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం పోచంపాడ్‌ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్సారెస్పీ నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి ఆయకట్టుకు నీటిని అందించిన దాఖలాలు లేవన్నారు. ఈ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించి తీరుతామన్నారు. వచ్చే ఏడాదికే పూర్తిచేసి కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్‌ నింపుతామని ప్రకటించారు. ఆరునూరైనా 45 లక్షల ఆయకట్టుకు సాగునీరందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించ ముందు ఈ కట్టపై కూర్చుని తాను పడ్డ ఆవేదనే రాష్ట్రసాధన ఉద్యమానికి దారితీసిందన్నారు. నేడు సొంత రాష్ట్రంలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం శంకుస్థాపనతో నా జన్మధన్యమైందన్నారు. ఎస్సారెస్పీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పిన సీఎం ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరిగేలా ఎస్సారెస్పీని తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టు నుంచి బాసరకు లాంచీ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రెండు, మూడు నెలలు అటుఇటుగా వచ్చే ఏడాది ఎస్సారెస్పీని కాళేశ్వరం నీళ్లతోటి నింపడం ఖాయమని ప్రకటించారు. 40- 45 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. ఒక్కసారి ఎస్సారెస్పీ నింపుకొన్నమంటె ఇటు నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల అటు జగిత్యాల రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అదృష్టం వస్తదన్నారు. ప్రజల ఆశీర్వాదం, అండదండలు ఉన్నంతకాలం బ్రహ్మాండంగా ముందుకు పోతామన్నారు.

తెలంగాణతోటే పునర్నిర్మాణం

2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జల సాధన ఉద్యమం చేసినం. అందులో నేను మాట్లాడిన క్యాసెట్‌లో ఇచ్చంపల్లి ఇచ్చగానిపల్లి పాల్జేసినారు.. నిజాంసాగర్‌ ఒట్టిపోయింది.. మెదక్‌ జిల్లా ఘనపురం నాశనమైంది.. అప్పర్‌ మానేరు అడుగంటింది.. డిండిలో బండలు తేలినయి.. కోయిల్‌సాగర్‌ను కొంగలెత్తుకుపోయినయి.. చెరువులన్నీ తాంబాళాలై నాశనమై పోయినవి అని చెప్పిన. పదిహే నేండ్ల సుదీర్ఘ పోరాటంలో అనేక బలిదానాలు, జైళ్లు, లాఠీలు, తూటాలు, కేసులు అనేక ఇబ్బం దుల తర్వాత తెలంగాణ సాధిం చుకున్నం. తెలంగాణ వచ్చే నాటికి పరిస్థితి చూస్తే.. తెలం గాణకు ఇచ్చినం, తెలంగాణకు చేస్తం అని చెప్పినవన్నీ కూడా మోసపూరిత ప్రాజెక్టులు. మనకు నీళ్లు వచ్చేవి కావు, తెచ్చేవి కావు. నీళ్లిచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కావు. దానికోసం మొదటి దశలో చెరువులన్నీ బాగు చేసుకుందామని సంకల్పించాం. సులభంగా చేసుకునేది, డిజైన్లు అవసరంలేనిది కాబట్టి మిషన్‌ కాకతీయ రూపంలో ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రారంభం చేసుకున్నం. ఒక ఆర్నెల్లు, ఎనిమిది నెలలు అవిరళమైన కృషిచేసి, రాత్రింబవళ్లు కష్టపడి, గోదావరి, కృష్ణా నదులనుంచి ఏ రకంగా నీళ్లు తీసుకోవాల్నో ఆలోచన చేసినమని సీఎం పేర్కొన్నారు.

ఆంధ్రావాళ్లు ఎన్నడూ మనకు నీళ్లియ్యాలని ఏ ప్రాజెక్టు పెట్టలె. ఎస్సారెస్పీదీ అదే పరిస్థితి. శ్రీరాంసాగర్‌ 14 లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని చెప్తే ఎన్నడూ ఐదున్నర లక్షలు దాటలె. కొస కాల్వలకు పోనేలేదు. అక్కడ చెట్లు మొలిచినయి. నల్లగొండ జిల్లాలో కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయినరు. కానీ అక్కడికి నీళ్లు పోలె, నీళ్లు కండ్ల చూడలె. పోయినేడాది మనం కష్టపడి కొంతమేర నీళ్లు తీసుకుపోగలిగినం. ఎస్సారెస్పీ ఆయకట్టు బ్రహ్మాండంగా బాగుపడాలె. లక్ష్మీకాల్వ, సరస్వతికాల్వ బ్రహ్మాండంగా బాగుపడాలని పథకం రూపకల్పన చేశాం.

ఎస్సారెస్పీలో ఇప్పుడు ఎనిమిది టీఎంసీలు ఉన్నయి. ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్లు రాలె. ఇదే పరిస్థితి ఉంటె మన గతి ఏం కావాలి? దానికోసం ఆలోచించి బ్రహ్మాండంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసినం. అతితక్కువ కాలంలో అంటే సంవత్సరం కాలంలో నీళ్లు తెచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నం. ఇక్కడ ఉన్నది గోదావరే.. కాళేశ్వరం దగ్గర ఉన్నది కూడా గోదావరే. అందుకే కాళేశ్వరం దాటిన తర్వాత మేడిగడ్డ వద్ద ఒక బరాజ్‌ కట్టుకొని, దాని తర్వాత అనేక బరాజ్‌లద్వారా వరద కాల్వలో నీళ్లు పోసుకొని శ్రీరాంసాగర్‌ నింపుకొనే కార్యక్రమాన్ని చేపడుతున్నం. ఎస్సారెస్పీలో ఎనిమిది టీఎంసీలు గతంలోనివే ఉంటే ఈ సంవత్సరం ఒక్క టీఎంసీ రాలేదు. కానీ కాళేశ్వరం మేడిగడ్డ వద్ద జూన్‌లో వర్షాకాలం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 250 టీఎంసీల నీళ్లు గంగలో కలిసిపోయినయి.. సముద్రానికి పోయినయి. అదే.. సిస్టం తయారై ఉంటే మనం శ్రీరాంసాగర్‌ నింపుకొనేవాళ్లం. మొగులుకు ముఖం చూసేవాళ్లం కాదు. మొట్టమొదట నేను నిజామాబాద్‌ వచ్చినప్పుడు నన్ను మొగ్గ తొడిగి ఇచ్చింది మోతె. వాళ్లిచ్చిన ధైర్యంతోనే పోయినం. ఆనాడు మోతెలో మట్టి ముడుపుగట్టుకోని పోయి, మళ్లీ తెలంగాణ సాధించి, అదే మోతె మట్టిని మళ్లీ తీసుకెళ్లి గ్రామస్థులకు అప్పగించిన. అట్ల జరిగిన ఉద్యమంలో ఇయ్యాల బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నం. వచ్చే సంవత్సరంనాటికి రెండు మూడు నెలలు అటూఇటూ కావచ్చు.. కానీ.. ఎస్సారెస్పీని కాళేశ్వరం నీటితో నింపడం ఖాయం. మీ బిడ్డగా నేను ఆ పని చేసి చూపిస్త. ఒక్కసారి ఎస్సారెస్పీని నింపుకొన్నమంటే ఇటు నిజామాబాద్‌ జిల్లాగానీ, నిర్మల్‌ జిల్లాగానీ, కిందికి మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అదృష్టం వస్తది. బ్రహ్మాండంగా పంటలు పండిచుకొని ముందుకు పోతమని ముఖ్యమంత్రి రైతులకు తెలిపారు.

అన్యాయాన్ని సరిచేస్తున్నం..

ఎస్సారెస్పీకి జవహర్‌లాల్‌ నెహ్రూ పునాది రాయి వేసి 54 ఏండ్లు గడిచి పోయింది. నాగార్జునసాగర్‌ మొదలుపెట్టంగనే 12 ఏండ్లలో పూర్తిచేసినరు. నెహ్రూ శంకుస్థాపనచేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించినరు. కానీ 54 ఏండ్ల తర్వాతకూడా ఎస్సారెస్పీ స్టేజ్‌-1, 2 కంప్లీట్‌ కాదు. స్టేజ్‌-3కి పోయే పరిస్థితి లేదు. వరద కాల్వ దుస్థితి అట్లనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నం. వీటన్నింటినీ ఆఘమేఘాల మీద పూర్తిచేసి నీళ్లియ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నం. శ్రీరాంసాగర్‌ నింపే పరిస్థితి.. చాలామందికి దానిపై అవగాహన లేదు. ఎప్పుడో జూన్‌లోనో జూలైలోనో నింపుకోవడం కాదు.. రాబోయే రోజుల్లో ఒక్కసారి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు పూర్తయితే ఎస్సారెస్పీని మే నెలకు ముందే.. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పూర్తిస్థాయిలో 90 టీఎంసీలు నింపి పెట్టుకుంటం. మొగులుకు మనం ముఖం పెట్టి చూసే అవసరం ఉండదు. అందరూ లాభపడతరు. బాల్కొండ, మెట్‌పల్లి, వేములవాడ, కొంత మానకొండూరు నియోజకవర్గాల నుంచి పోయే వరద కాల్వ 110 కిలోమీటర్ల దూరం 365 రోజులూ నిండుగా ఉంటది. దాని ద్వారా అద్భుతమైన చేపలు పెరుగతయి.. చెట్లు, గడ్డి పెరుగుతుంది. నేలలో తేమశాతం పెరుగుతది. ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూడబోతున్నాం. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తం. ఎస్సారెస్పీ ద్వారా 40-45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మడమ తిప్పకుండా ప్రయత్నం చేస్తం.

1 జలధార
హైదరాబాద్‌ నుంచి ఉత్తరం వైపు నిలబడి ఉత్తర తెలంగాణ చూస్తే ఏం తెలంగాణ తయారుకాబోతున్నదో తెలుస్తది. హైదరాబాద్‌ నుంచి ఉత్తరంవైపు చూస్తే ఆదిలాబాద్‌ జిల్లా కనబడుతది. కాశ్మీర్‌లాగ ఉండే పాత ఆదిలాబాద్‌ ఇప్పుడు నాలుగు జిల్లాలైంది. ఆ జిల్లాలో భగవంతుడు ఇచ్చిన 12 ఇంచుల వర్షపాతం ఉంది. సుద్దవాగు, స్వర్ణవాగు, మట్టివాగు, గొల్లవాగు, నీల్వాయి వాగు వంటివి అనేకం ఉన్నయి. లోయర్‌ పెనుగంగ ఉంది. అంతకుముందు లోయర్‌ పెనుగంగ ఇగ వచ్చె, అగ వచ్చె అని మోసం చేసినరు. 35 ఏండ్లు ఓట్లు అడిగినరు.. తప్ప చేయలె. కానీ ఈరోజు ఆదిలాబాద్‌ మీడియం ఇరిగేషన్‌ వ్యవస్థను బాగుచేస్తున్నం. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎత్తిపోసి నిర్మల్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తం. మంచిర్యాల జిల్లాకు కూడా నీళ్లస్తయి. అట్ల ఎత్తిపోతలు, వర్షపాతం, వాగులద్వారా ఆదిలాబాద్‌ జిల్లా ఒక జీవధారగా కనిపిస్తది.

2 జలధార

గోదావరి నది మీద తుపాకులగూడెం, మేడిగడ్డ, అన్నా రం, సుందిల్ల, సదర్‌మాట్‌ వద్ద బరాజ్‌లు కట్టుకుంటున్నం. గోదావరి నదిలోనే దాదాపు 70-80 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవునా నిండి ఉంటయి. 200 కిలోమీటర్ల గోదావరి ఎల్లపుడూ నీటితో నిండి ఉంటది. గోదావరి నది తనకు తానుగా ఒక జీవధారగా ఉంటది.

3 జలధార

గోదావరిదాటి ముందుకొస్తే వరద కాల్వ. దీనితోటి శ్రీరాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ద్వారా నిజామాబాద్‌, నిర్మల్‌, కాకతీయ కాల్వ, లోయర్‌, మిడ్‌ మానేరు డ్యాంలు.. ఇలా వరంగల్‌, మహబూబాబాద్‌ దాటి సూర్యాపేట, తుంగతుర్తి దాకా ఒక జీవధారగా ఉంటది.

4 జలధార

మిడ్‌ మానేరు నుంచి పంప్‌ చేసిన తర్వాత మధ్యలో అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌.. ఆపైకి నింపుకొనే సింగూరు, నిజాంసాగర్‌, బస్వాపూర్‌, గంధంమల్ల, హైదరాబాద్‌ను దాదాపు ఆనుకొని నాలుగో జీవధార తయారైతది ఇలా నాలుగు జీవధారలతో తెలంగాణ భూములు తడిసి ముద్దవుతాయన్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా తయాయవుతున్నదని ప్రజలు గొప్ప భవిష్యత్తును చూడబోతున్నారని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Other Updates