తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు, పోరాట రూపాలది ప్రధాన పాత్ర. విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు, సబ్బండ వర్ణాలు, సకల జనులు ఈ పోరాటాల్ని నడిపించిండ్రు. ఆత్మత్యాగాలుచేసిండ్రు. జైలుకెళ్ళిండ్రు. దీక్షలు చేసిండ్రు. వంటావార్పు అన్నరు. రోజూ రోడ్డు మీద కూసున్నరు. ధర్నాలు చేసిండ్రు. తీరొక్క రీతుల కొట్లాడిండ్రు. అయితే వీరందరినీ ఏక తాటిపైకి తెచ్చిందీ, వారికి దిశా నిర్దేశం చేసిందీ, విషయ విశ్లేషణ చేసి అర్థమయ్యేలా చెప్పిందీ, పోరాటాన్ని సిద్ధాంతీకరించిందీ, భావజాల వ్యాప్తికి అక్షర రహదారుల్ని నిర్మించిందీ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలు, కళారూపాలు. వీటి నిర్మాణంలోనూ, ఆచరణలోనూ క్రియాశీలకంగా పనిచేసింది కవులు, రచయితలు, వ్యాసకర్తలు (జర్నలిస్టులు), మేధావులు, పరిశోధకులు, వాగ్గేయకారులు, కళాకారులు.

ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని ఉద్యమంలోకి ఒంపిందీ సాహిత్య, సాంస్కృతిక స్ఫూర్తి. తమ పాటలు, కవిత్వం, రచనల ద్వారా సృజనకారులు – రచయితలూ, గళంతో వాగ్గేయకారులు, కళా రూపాలతో కళాకారులు, తెలంగాణ తల్లిని వలసవాదుల సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విరామ మెరుగక కృషి చేసిండ్రు. అయితే ఇదంతా భిన్న భావజాలాలు గల సాహిత్య, సాంస్కృతికసంఘాల వాళ్ళు, దాని నిర్వాహకులు తమ సొంత ఆర్థిక వనరులతో, వలసాధిపత్యంపై కసితో చేసిండ్రు. వీళ్లు వేల సంఖ్యలో పుస్తకాలు అచ్చేసిండ్రు. ఇందులో సృజనాత్మక సాహిత్యమూ ఉంది. విశ్లేషణాత్మక వ్యాసాలు, సిద్ధ్దాంతీకరణలూ ఉన్నాయి. వలసాంధ్రులపై ఎదురుదాడులు, ఉద్యమానికి ఊపిరిపోసే వ్యాసాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఊరి నుంచి పాటగాళ్ళు తయారైండ్రు. క్యాసెట్లు, సీడీలు చేసి వాటిని ఇంటింటికీ ప్రచారం చేసిండ్రు. ధూమ్‌ధామ్‌లు, సభలు, సమావేశాలు, ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు, సదస్సులు, నిరసన ర్యాలీలు అన్నీ సాంస్కృతిక రూపాల్లో ప్రతిఫలించాయి. అంటే ఎవరికి వారు తమకు తోచిన రీతిలో, తమకు సాధ్యమైన పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిండ్రు.

ఇప్పుడా పనిని ప్రభుత్వం తరపున సాంస్కృతిక శాఖ చేస్తోంది. మన ఘనతను విశ్వవ్యాప్తం చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మనం నడిచొచ్చిన తొవ్వను ఒక్కసారి యాద్జేసుకుందాం! తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం జేయడమే గాకుండా తెలుగు భాషకు 1500ల ఏండ్ల చరిత్ర ఉన్నదని కోర్టుల్లో సైతం నిరూపించుకున్నాం. ఒక్క భాషకు మాత్రమే పట్టం కట్టడం కాదు సాహిత్యానికి ముఖ్యంగా కవిత్వానికి విశిష్ట గౌరవాన్ని కల్పించింది తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్క ృతిక శాఖ. నిజానికి తెలంగాణ రాష్ట్రం రాకముందు ‘తెలుగు భాష ఉత్సవాల’ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లో తెలంగాణ వారికి సరైన గౌరవం దక్కలేదని సాహితీ మిత్రులం ధర్నాలు చేసినం.

ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మన రాష్ట్రం మనం సాధించుకున్నం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆయన సూచనలు, సలహాల మేరకు తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ దేశ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నది.

2016 మార్చి 17న అసోం రాజధాని గువహటిలో కేంద్ర సాహిత్య అకాడమీ నేతృత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సాహిత్య అకాడమీల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల నుంచి ఎంతోమంది అధికారులు, పండితులు దీనికి హాజరయిండ్రు. వారు తమ రాష్ట్రాల్లో చేస్తున్న కృషిని చెప్పుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఈ సమావేశంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని అందరి మనసుల్లో నాటుకునే విధంగా చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కాళోజి, దాశరథిల సాహిత్య అవార్డులు, ప్రచురించిన పుస్తకాల గురించి ఈ వేదికపై నుంచి వివరించిండు. వెంటనే సాహిత్య అకాడమీ అధ్యక్షులు నారాయణ ప్రసాద్‌ తివారీ స్పందిస్తూ అత్యంత చిన్నవయసున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ తొవ్వ చూపిస్తోందనీ, మిగతా రాష్ట్రాలు ఈ కార్యకలాపాలను చేపట్టాలని సూచించిండు. ఇది అరుదైన గౌరవం, గుర్తింపు.

తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఇప్పటి వరకు ఐదు కవితా సంకలనాలు వెలువరించింది. జూన్‌ 2017నాటి అవతరణ దినోత్సవంలో ‘పద్య తెలంగాణం’ పుస్తకం కూడా ఆవిష్కరణ కానున్నది.

అయితే ఈ సంకలనాల గురించి ఇప్పటి వరకూ తెలంగాణతోపాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రచురించే పత్రికలు, ప్రభావశీలమైన మీడియా అంతగా పట్టించుకోలేదు. వీటి మంచి చెడ్డల్ని ఎంచి చెబితే తప్పటడుగుల్ని సరిదిద్దుకునేందుకు అవకాశముంది. అయితే ఈ పుస్తకాలు ప్రభుత్వ శాఖ తరపున వెలువడ్డందున వీటి గురించి పత్రికలు పట్టించుకోలేదేమో అని అనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తసాలు, తంగేడువనం, తొలిపొద్దు, మట్టిముద్ర, ఆకుపచ్చ పొద్దుపొడుపు పేరిట ఐదు కవితా సంకలనాలను మామిడి హరికృష్ణ తన సంపాదకత్వంలో వెలువరించాడు. పువ్వుల మీద చెట్ల మీద కవితా సంకలనం వెలువరించడమనేది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సామాజిక సమస్యల మీద కవిత్వం రాయడం సునాయాసమైన పని. తెలంగాణలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగ. తంగేడు ప్రతి ఊరిలోనూ ఫ్రీగా లభించే పూలు. తెలంగాణ ఉద్యమమే నీళ్ళు, నిధులు, నియామకాల కోసం జరిగింది. ఇందులో చెరువులు, చెట్లు రెండూ విడదీయరాని విషయాలు. ఆకుపచ్చని పొద్దుపొడుపు పేరిట చెట్ల మీద కూడా సంకలనాన్ని తీసుకొచ్చిండ్రు. ఉద్యమ సమయంలో ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట హోరెత్తించింది. ఇప్పుడు ‘పొద్దు’లు నిండి కవిత్వానికి పురుడు పోస్తున్నది. ఇవి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి రూపాలు.

తెలంగాణ ఒరవడి: కొత్తసాలు

తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చి నవమా సాలు నిండిన తర్వాత పండంటి బిడ్డకు పేరు పెట్టే పండుగలాగా సాగింది మన్మథ నామ ఉగాది కవి సమ్మేళనం. ప్రపంచ కవితా దినోత్సవం కూడా ఇదే రోజు జరిగింది. ఈ ఉత్సవాలు 2015 మార్చి 21న రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగాయి. దీనికి సీనియర్లు, జూనియర్లు, వచనం, పద్యం, పాట అనే తేడా లేకుండా తెలంగాణకు చెందిన 60 మంది కవులతో (తెలుగులో 60 యేండ్లకు వివిధ పేర్లున్నాయి) కవి సమ్మేళనం జరిగింది. ఈ ఎంపిక జేసిన కవులు భిన్న అంశాలపై కవిత్వాన్ని వినిపించారు. చేర్యాల నకాషీ వైకుంఠం పెయింటింగ్‌ ముఖ చిత్రంగా, 170 పేజీల్లో, ఫోటోలతో సహా ఈ పుస్తకం వెలువడింది. ఇందులో ఎనిమిది కవితల్ని మహిళలు రాసిండ్రు. ఈ సంకలనంలోని కవితల్లో తెలంగాణ చరిత్ర, సంస్క ృతి, ఘనత, యోధులు, పండుగలు, పల్లె అందాలు, పురా జ్ఞాపకాలు, నోస్తాల్జియా, ఉగాది, విశ్వ కవిత్వం తదితర అంశాలపైన విలువైన కవితలున్నాయి. సిరిసిల్లలో ఆకలి చావుల్ని దగ్గర్నుంచి చూసిన ఆడెపు లక్ష్మణ్‌

”బాకీ వడ్డీల లెక్కల్ని ఏ రూపేణా చెల్లించాలో బేరీజు వేసుకుంటాడు

అర్ధరాతిరి లేచిందగ్గర్నుంచి” అంటూ ‘సామాన్యుడు’ చనిపోకుండా బతికుండడానికి పడుతున్న వేదనను రికార్డ్‌ చేసిండు. అట్లాగే అన్నవరం దేవేందర్‌ కవిత్వానికి ఇలా నిర్వచనమిచ్చిండు. ఇవి గుండెలోతుల్లోంచి దూసుకొచ్చిన అక్షరాలు.

”మనసు ఎప్పుడైనా

ఒరుసుక పోయి నెత్తురు కారినప్పుడు కవిత్వం రేకులు నల్లారం ఆకులు దంచి పసరు పూస్తా” అంటూ కవిత్వానికున్న శక్తిని చెప్పిండు. దేశపతి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ గంగా-జమున తెహజీబ్‌ని గురించి రాసిండు. హైదరాబాద్‌ సాంస్కృతిక అక్షర రూపమిచ్చిండు.

”మల్లేశ్‌ మస్తాన్‌ భాయీ భాయీ ఏక్‌ మె దో పియా ఇరాని ఛాయి తెలంగాణోంక పసీన హై హైదరాబాద్‌ ఎక్‌ హసీన హై’ అంటూ ఈ నగరం ‘సిర్ఫ్‌ హమారా’ అని నినదించిండు.

సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన హరికృష్ణ తన ఊరి జ్ఞాపకాలను రికార్డు చేసిండు. ఇవి ఒక్క హరికృష్ణవి మాత్రమే కాదు. హైదరాబాద్‌లో ఆగమయిన ప్రతి ఒక్కరి ఆత్మఘోష. ఈయన పల్లె తల్లి ఎదలోన దాగిన తీపిని రుచి చూపించిండు. నగరంలో కషాయ, కాలుష్యాన్ని పీలుస్తున్న నాలుకలకు కుడి చేతి చూపుడు వేలుతో తీసి, తీపిని మందుగా ‘రాసిండు’. ”ఊరికి పోవడం అంటే ఊరికే’ పోవడం కాదు- ఊపిరి కోసం పోవడం తప్పనిసరై తప్పక పోవడం కాదు-

గతితప్పకుండా ఉండడం కోసం పోవడం నగరం నదిలోని తెప్పదారి తప్పకుండా చూడడం కోసం పోవడం” అని చెప్పిండు. అట్లనే ఊర్లో ఉండే సబ్బండ వర్ణాల వారిని, కుల వృత్తుల్నీ స్మరించుకునే విధంగా కండ్లముందట ఉంచిండు. ‘ఆదికవి- హైదరాబాద్‌’ పేరిట సామిడి జగన్‌రెడ్డి రాసిన కవితలో హైదరాబాద్‌ లోతుపాతుల్ని, గుట్లనీ, తెరమరుగైన ఘనతను రికార్డు చేసిండు.

తెలంగాణ మట్టి పరిమళం తంగేడు వనం

తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ‘తంగేడు’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా దీనికి కావ్య గౌరవం కల్పించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో చదివిన 185 కవితల్లోంచి మొత్తం 166 కవితల్ని ఎంపిక జేసి సంకలనంగా వెలువరించారు. ఇందులో 32 మంది మహిళల కవితలున్నాయి. 1966లో బతుకమ్మ పండుగ సందర్భంగా కాళోజి రాసిన ‘బతుకమ్మ’ గేయాన్ని కవిత్వారంభంలో ప్రచురించి గౌరవించుకున్నరు. అలాగే ఎన్‌.గోపి నాలుగు దశాబ్దాల క్రితమే తంగేడు పూలు పేరిట కవితా సంకలనం వెలువరించిండు. ఆయన కవిత కూడా ఇందులో చోటు చేసుకుంది. ఈ బతుకమ్మ పండుగ నాడే ఆరుదశాబ్దాల క్రితం రక్కసి మూకల చేతిలో తన అక్కను కోల్పోయిన గోపి

‘తంగెడుపూలు అంటే ఒప్పుకోను బంగరు పూలు పొంగిన విచారాన్ని దిగమింగిన పూలు

వెలగలిగిన గులాబీల కన్న వెల వెల బోయే మల్లెలకన్న వెలలేని ఈ పూలు మేలు’ అని తీర్పిచ్చిండు. అలాగే పసునూరి దళిత చైతన్యంతో తంగెడు చెక్క – తోలుని శుద్ధిపరిచే పరికరంగా పేర్కొన్నడు. ఇంకా ఈ సంకలనంలో బతుకమ్మ మీదఉయ్యాల పాటలు, పాటలున్నాయి.

సంగిశెట్టి శ్రీనివాస్

Other Updates