కవన విజయ కవి రాజిత కమనీయ తెలంగాణము
సకల కళా చంద్రులకిది వికసించిన మాగాణము

పంపని పద్యాల జోరు సోమనాథ ద్విపద హోరు
విద్యానాథ మహోదయ కావ్యశాస్త్ర నిధుల సౌరు
పోతన భాగవతామృత పూర్ణపద్యములకు తేరు
అడుగడుగున నుడులబడుల వరసుమాలు జాలువారు ||కవన||

మల్లినాథసూరి మనో రంజిత వ్యాఖ్యా విలాస
ఉల్లము నిండే పాటల హృల్లసిత వికాసహాస
కాళోజీదాశరథుల కవితాక్షర చంద్రహాస
జానపదుల జ్ఞానపదుల వాగ్గేయ చిరత్నభూష ||కవన||

పేరిణి తాండవ నృత్య విహారనాగినీ భూషిత
ఒగ్గు చిందు శారదాది జనజీవన మృదుభాషిత
విశ్వకథావిలసన్నవ భావ మధూదయ రాజిత
విద్వత్కవితా బృంద వివేక జనోదయ పూజిత ||కవన||

పద్యగేయ వచన ఝరులు హృద్యగానకళాధరులు
అవధానులు పురాణాల సువిశాలకథాలహరులు
ఎన్నెన్నో నినదించే వెన్నెల నిండిన లోకం
తెలంగాణ లోకం మన తెలంగాణ నాకం ||కవన|

Other Updates